22, ఆగస్టు 2011, సోమవారం

చెలీ....

పిలుపు వెన్నెల పరవళ్లని తెలుపు
కొత్త ఆశల వేదికలను..
సరికొత్త బావాల మేలవింపును..
కలిపి నీ మనోఫలకం ముందుంచాను..
నా కన్నులు చెపుతున్న కావ్యాలు నువు చదువాలని
నీ మనసు వెనకాలున్న బావాలు నే చూడాలని.
నువు పిలిచే పిలుపుకై
నాలో రేగుతున్న సుడులెన్నో.
ఒకసారి నీ పరవశం నను చేరిందో..
ఇక తిరుగన్నదే లేని విజయాలను నే చేరనా....
గాలికి లేని కులమతాలు
నీకు నాకు వద్దు
భూమికి అంటని మకిలీలు
మన గమనానికి కలిగించోద్దు ఆటంకాలు
కమలానికి దాసోహమైన రవికన్నా
కలువకి చిక్కిన చంద్రునికన్నా
నీవలపుకి నే దాసోహమైనా చెలీ....
విడదీసే బందమేదైనా
అది చావుతోనే నిన్ను నన్ను చేరును.

పోరుబాట

ఇటు ఒక మట... అటు ఒక ఆవేదన
మాట మాట కలిసి పోరుబాటలవుతున్నాయి
బొట్టు బొట్టు కలిసి రక్తదారలు పారుతున్నాయి
నీటి కోసం కన్నీటి ప్రవాహాలు పొంగుతున్నాయి
భూమి కోసం భువణాంతరాలు దద్దరిల్లుతున్నాయి
చ...1
చేష్టలుడిగి కూర్చుండడానికే ఐతే..
సమాజాన్నేలే రాచరికమెందుకు?
ఏమీ తోచని అయోమయమే ఉంటే..
అందలాన్నెక్కే ఆరాటమెందుకు
మాటల గారడీలతో.. మాయల మోసాలతో
మాన్యున్ని మరిపించాలని చూస్తే..
అసమాన్యుడై గర్జిస్తాడు.. హక్కుల సాధనకై ఉద్యమిస్తాడు

చ..2
నియంతలని అసహాయులుగా చేసి...
ప్రపంచగతులని మార్చిన నిష్ఠూర సత్యాలివి
ఇకనైనా కల్లు తెరవండి..
చెవులారా వినండి... చరిత్రలో మిగలండి

ప్రేమ.........

చిరునవ్వుల వెన్నెల్లో చెలికిలకిలరావాలు
పరువాల హొయలతో పలకరించే తెమ్మెరలు

చ..1
నీ చూపు తాకిన ప్రతి చోటు.. సూర్య చంద్రులకు ఇలవేల్పు
నీ శ్వాస నిండిన ఈ పవనం .. నిండు మల్లెల సమ్మేళనం
నీ అడుగు మోసిన ఈ భువనం.. అందమైన నందనవనం
చ..2
వేకువ విసిగిస్తుంది.. కనురెప్పల మాటున నీ రూపును విరిచేస్తుందని..
మౌనం మరిపిస్తుంది .. నీ గలగల కిలకిలలతో నా చెవులే నిండాయని..
ప్రాణం పరితపిస్తుంది.. ఉచ్ఛ్వాసం, నిచ్ఛ్వాసం నీ తలపున చేరాయని

చ..3
అమ్మతో నిండిన ప్రేమ ఆకలెట్లా మరిచిందో...
నీ ప్రేమతో నిండాక అమరజీవినయ్యానని..
స్వచ్ఛమైన, అందమైన ప్రేమ..
మా మనసులను ముడివేసి ఒక్కటిగా చేసేసి
ఆత్మని, పరమాత్మని పంచభూతాలను, సప్తవర్ణాలను
పలికించు.. నిలిపించు.. నీ ప్రేమతో బతికించు

ప్రేమంటే.....

ప్రేమంటే ఇలా ఉంటుందా? (2)... ఎలా?
(1) బంగారపు సింగారం.. చినుకులైన అనురాగము
విచ్చుకునే పసిమొలక.. పొత్తిళ్లలో వెచ్చదనం
ఆడుకునే పాలబుగ్గల అందాల నందనవనం
నీకై నేనున్నాననే అజరామర అనుబంధం
ఇదేనా.. ఇంకా ఏమైనా?
(2) ఆహా.. అలాగా... జీవనమెలాగా?
(1) కష్టించిన కాయంలో పుట్టిన చిరు చెమటలా
వయసొచ్చిన పరువంలో దాగున్న అందాల్లా
అరుణారున వెలుగుల్లో అరుదెంచిన ప్రకృతిలా
వసంతపు తొలికాంతిలో కుహూ అన్న కోయిలలా..
ఓ చిలకా.. పలుకే బంగారు మొలక
(2) ఓహో.. అంతా అందమేనా?
ప్రేమంటే గంధమేనా?
(1) ఆటుపోటు అలలల్లే వచ్చేను కలలు
అసాధ్యాల ఆశలతో మిగిలేను వలలు
ఈగో నిష్ఠూరాలతో అహమన్నది చెదురు
మెరుపుల పై విరుపులతో మిగిలేను బెదురు
ఈ అన్నీ దాటేసిన వలపే నీ మనసును కలుపు
అన్నింటినీ ఆమోదించే మనసే ప్రేమను తెలుపు
ఏంటీ కాదంటావా? నే చెప్పేది నమ్ముతావా?
(2) నిజమైన ప్రేమకి నీ రూపు నిలువుటద్దం
నిర్మలమైన మన మనసుల కలయిక ఇక తథ్యం

తెలంగాణ రథచక్రాలు

కళ్లనీళ్ల కెరటాలతో సంద్రముప్పొంగుతుంటే...
దారల జలదారలన్ని కన్నీళ్లనే మింగుతుంటే..
కష్టాల దేవిరింపులు.. చీత్కారాల సత్కారాలు...
చాలు చాలు చాలంటూ... పిడికిళ్లు బిగిస్తున్నాయ్
పదపదపదమంటూ అడుగులు కదులుతున్నాయ్

చ..1
పోరాటం సాగుతున్నా... బలిదానం జరుగుతున్నా...
నిస్తేజమైన నీ చేతన ఇంకెన్నాళ్లు...
అన్యాయం జరుగుతున్నా... ఆక్రందన మిన్నంటుతున్నా...
పిచ్చిపట్టి రెచ్చగొట్టే ప్రేలాపన ఇంకెన్నాళ్లు

చ..2
ఇంతేలే అనుకోకు ఇంతటి ఈ మహోద్యమాన్ని...
అణచాలని ఆశపడకు.. అలాయిబలాయి సంఘటితాన్ని
నాజీల ఘోరీలు.. బాద్షాల భంగపాటులు
నియంతల నివ్వెరపాటులు...
చూడు చూడు చూడు... తెలంగాణ రథచక్రాలు
హక్కులకై సాగుతున్న అంతిమ పదఘట్టాల్

విధ్యార్థి

విచ్చుకున్న మల్లె మొగ్గవి... దారి చూపే కాంతి రేఖవి
కలలకిచ్చిన నిండురూపువి... విద్యా సుగంధాలతో విరబూసిన చదువుల మల్లివి

చ..1
అజ్జాన అంధకారాలను పారద్రోలుతూ...
మహా ప్రపంచపు సర్వస్వాన్ని సూక్ష్మ అరలలో పొందుపర్చుతూ ...
విరామమెరుగని నీ ప్రయాణం... జాబిల్లిని కూడా మరుమల్లిగా అందిస్తే
భాషాబేధం... సంస్ర్కతి అర్థం... సమస్త తత్వపుల్నేకం చేసిన ఓ విద్యార్థి

చ..2
ఆధునికం మాటున విషపు తీగలో చిక్కుకుపోతూ...
మోహపు వ్యామోహంలో పడి తల్లికీ, చెల్లికీ తేడా మరుస్తూ..
ముసిరిన చీకట్లలో మూలుగుతున్నావ్..
విలువైన భవితనే చెరుపుకుంటున్నావ్

చ..3
ఆశల అలజడినాపి.. నీ మేధకు పదునుపెట్టు
విద్యార్థంటే విషం కాదని... నవశకానికి నాంది.. యువతనీ
లోకం కళ్లు తెరుపించూ.. నీ ప్రగతికి అవధులు చెదరగొట్టు.

ఆడపిల్ల గోడు

ఆటబొమ్మ కాదు.. ఓ ఆడపిల్ల చూడు..
పుడ్తూనే ఏడ్వడం పిల్లల నైజం
చనిపోయే వరకూ ఆడదాన్ని ఏడ్పించడం సమాజపు నైజం

చ..
ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా మెట్టినింటికెళ్తావని
చిన్ననాడే చిన్నచూపు ఓ చిట్టితల్లీ
పదిమందిలో పరువంటూ, పున్నామ నరకం తప్పిస్తాడంటూ
కొడుకునే ఆదరించే కన్నవాళ్లు తల్లీ, నీకు కడుపుకోత చెల్లీ
పాలుగారే బుగ్గలలో, పెరిగిన నీ పరువంలో
విషపు కళ్లతో చిదులేసే మగాడి క్రౌర్యం, ఓ మొగుడి కిరాతకం
కన్నది ఓ తల్లేనని, ప్రతి తల్లి ఒకటేనన్న సత్యముందా?
కరకు బ్రతకు డెక్కల చప్పుడు నిజమింటుందా?

చ..2
ఆకాశంలో సగమంటూ... అవకాశాలిమ్మంటే
ఆదరిస్తారా? నిన్ను అణచకుండా ఉంటారా?
తప్పెవరిది అని ప్రశ్నిస్తే..
నిను కన్న తల్లీ, చరిత్రలో మిగిలిన వదిన చేసిందేమిటే చిట్టితల్లీ
చితిమంటకు నిన్నిచ్చి, కష్టాలతో కాష్టం పేర్చి
చితి ముట్టించే అర్హత కూడా లేకుందే తల్లీ... నా చిట్టి చెల్లీ