3, డిసెంబర్ 2019, మంగళవారం

సమ్మే (velugu 22.12.2019)



https://epaper.v6velugu.com/m5/2474525/Darwaza-Sunday-Magazine/22-12-19#page/24/1

"ఏమైందే దనన్నా మంచి ఊపుమీదున్నవ్, ఏడికో పొద్దుగాల్లనే భయల్దేరినవ్, వరికోతకి అచ్చిందాయో, చూస్తంటే ఫాంటేసినవ్ గదా పొలంకాడికి గాదనుకుంటా.... మళ్ల ఆటోగూడ ఇంటెనుకనే పెట్టి బండి తీయవడ్తివి ఏడికి బోతున్నవ్ గింత పొద్దుగాల.." అని గ్యాప్ లేకుండా తనే ప్రశ్న తనే సమాదానం చెపుతూ మాట్లాడుతనే ఉన్నాడు వెంకటేశు, బండి స్టార్ట్ చేస్తూనే సమాదనం చెప్పిండు దనుంజయ్, "ఏం లేదురా నిన్నటి సంది మన ఆర్టీసోల్లు సమ్మే జేస్తుండ్రు గదా టెంపర్ వరీ డ్రైవర్లు గావాల్నంటా.. పోతన్నా.. గప్పట్ల లారీ నడిపిన లైసెన్స్ ఉంది నా దగ్గర రోజుకి పదిగేనువందలు ఇత్తరట, వరికోతకచ్చింది చేతుల పైసలు లేవు ఇంట్ల గూడ చిన్న చిన్న అవసరాలున్నయ్, కూలీ చేద్దామంటెనేమో ఇప్పుడు పనులు లెవ్వాయో ఉన్నా పదిగేనువందలు రావుకదా గందుకే సిరిసిల్ల డిపోకు నిన్నపోయి అప్లికేషన్ ఇచ్చచ్చిన రేపు ఎల్లుండి బతుకమ్మ, దసర పండుగలు గదా జర ఎక్కువ సేపుండాల్నంటా జల్ది రమ్మన్నరు గందుకే పొద్దుగాల్లనే పోతన్న, జర పొలందిక్కు పోతే నా చేను చూసిరా... నీళ్లు బంజేసిన గనీ గట్లే పక్కోల్లు ఇంక తడి పెడ్తాండ్రు దాంట్లకేంచి వత్తయోమో కనిపెట్టు" అనుకుంటనే బండి స్టార్ట్ చేసి వెల్లిపోయిండు. ఆవునూర్నించి సిరిసిల్ల బోయేసరికి ఆరున్నరయింది, డిపో మేనేజర్, ట్రాఫిక్ సూపర్వైజర్తో పాటు చాలా మంది పోలీసుల్లున్నరు, ఓ ముప్పై నలబై మంది సివిలోల్లున్నరు, అందరూ టెంపరరీ డ్రైవర్, కండక్టర్లు గావచ్చు  లోపలికిపోబోతుంటే దనుంజయ్ని ఆపేసిండ్రు. "సర్ నేను పాత సమ్మే డ్రైవర్ని కాదు టెంపరరీ డ్రైవర్ని నిన్ననే రమ్మన్నరు పండగ బస్సులు తియ్యాల్నట" అని సమాదానం చెపుతున్నప్పుడే లోపల్నుండి సూపర్ వైజరొచ్చి దనుంజయ్ కొత్త డ్రైవర్ అని పోలీసోల్లకి చెప్పి తీసుకొని పోయిండు, ఓరిజనల్ లైసెన్స్ తీసుకొని 'బస్సుల ముందుగాళ్ల నిండ మందిని ఎక్కించుకోండ్రి, జర బాగా స్పీడుగ పోకుండ్రి, నీ బండ్ల పోసిన డీజిల్ ఎంత అత్తదో మాకు తెలుసు మల్ల నువ్వు గీడికొచ్చినంకనే డీజిల్ పోసుకోవాల, ఎక్కడికి పోవాల్నో కండక్టర్ చెప్తడు, అన్నింటి కంటె ముఖ్యం దసరా పండగ తెల్లారి దాక అంటే ఈ నాలుగు రోజులు కంటిన్యూగా తప్పకుండా రావాలే నీకు రోజుకు పదమూడు పద్నాలుగు గంటలు డ్యూటీ ఉంటది, ఉంటా అంటే ఈడ్నే షెడ్ల పడుకో లేకుంటే ఇంటికి పోయిరా కని టైంకు రావాలే సమజైందా' అని సుద్దులు చెప్పి బస్సు తాళం ఇచ్చిండు కంట్రోలర్, 'సరే సర్ అన్ని జెప్పినవ్ గాని నాకిచ్చే పదిహేనువందలు ఎప్పుడిత్తరో చెప్పకపోతిరి' అని అడిగిండు దనుంజయ్, 'ఏ రోజుకారోజు నువు డిపోకి తిరిగి రాంగనే ఇత్తం, నీ పైసలు ఏడికి పోవు జర కండక్టర్ని ఓ కంట కనిపెడుతుండు, మా స్క్వాడ్ టీంలు ఆడ ఆడ ఉంటయ్ గని ఎంత మంది ఎక్కిండ్రో నువ్వే లెక్క జెప్పాలే' అని పంపించిండు,  తాళం తీసుకొని బస్సు దగ్గరికి పోయిండు దనుంజయ్, ఎక్స్ ప్రెస్ బస్సు అంటే ఎటో దూరం ఏసినట్టున్నరు అనుకున్నడు, బండి చుట్టూత తిరిగి టైర్ల గాలి చెక్ చేసుకొని డ్రైవర్ సీట్ల కూర్చున్నడు. మనసుల ఇష్ట దైవం ఎములాడ రాజన్నని మెక్కుకొని బండి స్టార్ట్ చేసిండు గురు గురు మనుకుంటనే మెదటి సారికే స్టార్టయింది, అంటే డిపోల కండిషన్ల ఉన్న బస్సుల్నే ఇస్తున్నరని అర్థమయింది గేరు వేసి కొంచెం ముందుకు కదిలించి బ్రేకులు చెక్ చేసుకున్నడు అన్ని మంచిగనే ఉన్నయ్ అని ఇంజిన్ ఆఫ్ చేద్దామనుకునే లోపల, 'అన్నా నమస్తేనే నాపేరు క్యారం శీను' అని బస్సు బోర్డు పట్టుకొని బానెట్ల పెట్టుకుంట పరిచయం చేసుకున్నడు కండక్టర్, ఏ ఊరే మీది అనంగనే  కొండాపూర్ అన్నా అంటూనే  మీది అన్నడు మాది ఆవునూర్ అగో ఎన్నడు ఇటేంకల కనిపియ్యలే ఏం జేత్తవే అని అడిగిండు, హైదరాబాద్ల వెల్డింగ్ షాపుల చేత్త అన్న పండుగని అచ్చిన, కానీ రోజుకు వెయ్యి రూపాయలనేసరికి దేనికన్న అయితయి గదా.. అని వచ్చినన్నా..చూద్దాం ఎట్లుంటదో కొత్త పని పోదామాయే ఇగ అన్నడు, సరే సరే ఎటుపోవాల్నే ఇంతకీ అన్నడు, ముందుగాళ కరీంనగర్ రెండు ట్రిప్పులెయ్యాలే అటెన్కా హైదరాబాద్ పోవాల్నో, కామారెడ్డి పోవాల్నో చెపుతరంట అన్నడు, సరే తియ్యని బండి స్టార్ట్ చేసి కొత్త బస్టాండ్ కొచ్చిండ్రు, అక్కడో నలుగురైదుగురు పాసింజర్లు వచ్చి ఎక్కిండ్రు ఒక ఐదునిమిషాలు అక్కడ ఆగి పాత బస్టాండ్ పోయేసరికి హలీడే కావడం వల్ల ఎక్కువ మంది లేరు, ఓ పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత మెత్తం మీద సగం కంటె ఎక్కువ నిండిన్రు, ఇంకొంచెం సేపు ఆపుదామనుకునే లోపల, లోపలున్న పాసింజర్లు ఒకటే గోల పోదాం పండ్రి మెత్తం నిండేదాక ఉంటరా ఏంది, గింతపొద్దుగాల్ల పనున్నోల్లే అత్తరు జల్ది పోవాలే తియ్యుండ్రి అంటూ సతాయిస్తున్నరు ఇంతల బస్టాండ్ కంట్రోలరొచ్చి ఇంకో బస్సు అత్తది ఇగ మీరు తియ్యుండ్రి అనంగనే బండి స్టార్ట్ చేసి పోతున్నడు దనుంజయ్, కొత్త పని, కొత్త మనుషులు, కొత్త అనుభూతి అన్నింటికన్నా ముఖ్యంగా నాలుగురోజులల్ల నాలుగువేల ఐదువందలొత్తయి అనేదే ఎక్కువ హుషారిస్తున్నది, మంచి జోష్లో బస్సునడపుతున్నడు, వెములాడల బస్సు పుల్లయిపోయింది, అనుకున్న టైం వరకి కరీంనగర్ చేరిండ్రు, టిఫన్ టైం అవడంతో, గతంలో ఆర్టీసీవాల్లు టిఫిన్ సెంటర్ల సెపరేట్గా పైసలు లేకుండా తినేది గుర్తొచ్చి, కండక్టర్ క్యారం శ్రీనివాస్ని తీస్కొని బస్టాండ్ల టిఫిన్ సెంటర్కెల్లి స్టాఫ్ అని చెప్పాడు, వాడు కొంత అనుమానంగా చూసే సరికి, అరే శీనన్నా జర నీ కాష్ బాగ్ చూపియ్యే మనం టెంపరరీ స్టాపనే ముచ్చట ఎరుకయితది ఈయనకి అంటుండగానే. కాష్ బాగ్ తీసి చూపించిండు కండక్టర్, అండ్ల అడ్డదిడ్డంగా ఉన్న చిల్లర పైసలు, మాసిపోయిన నోట్లు చూసి నిర్దారించుకొని టిఫన్ టోకన్ ఇచ్చిండు హోటల్ వ్యక్తి, అలా టిఫిన్ చేస్తూనే మూడురోజుల కింద  జరిగింది యాజ్జేసుకుంటుండు దనుంజయ్,
దనుంజయ్ ఒక మోస్తరు రైతే గతంలో లారీ డ్రైవర్గా పనిచేసిండు, ఆరోగ్యం పాడవడం, తెలంగాణా రావడం ఒకేసారి జరిగి ఏదైతే గదయితది ఊర్ల వ్యవసాయం చేస్కుంట బతుకుత అని వచ్చిండు, మోత్తానికి వానలు మంచిగ పడుడు, రైతుకి సాయం అందుడు సురువు అవుడుతోని లాగోడికి అప్పుల మెఖం చూడకపోయేసరికి ఉన్న మూడెకరాలల్ల యవసాయం చేసుకుంట, ఉన్నదాంట్ల ఉగాదికి బిడ్డ పెళ్లిచేసిండు, కొడుకుని సిద్దిపేట్ల డిగ్రీ చదివిత్తండు, అయితే గత యాడాదినుండి చేతికి రావాల్సిన పైసలు సరిగ రాక, బిడ్డ పెళ్లి అప్పులు పెరిగి, చిన్న చిన్నవాటికి కూడా అప్పులు అడుగుడు మెదలయింది, ఐదారేళ్లకిందటి లెక్కనే మల్ల బతుకు గాయి గాయి అయితదనే భయం పట్టుకుంది, ఇంకొక ఐదారేండ్లు గట్టిగ కష్టపడితే కొడుకు చేతికందుతడు, బిడ్డ గూడ కుదురుకుంటది అనుకొని అప్పులు చెయ్యకుండా ఉన్నంతల సగపెట్టుకుందామని నిర్ణయించుకున్నరు మెగుడు పెండ్లాం, అయితే కొత్తల్లున్ని దీపావళికి పిలవాలే, కొడుకు పరీక్షలకి డబ్బులు కట్టాలే, వరికోతకి కూలీలు గావాలే గివ్వన్ని కలిసి మల్లో పదిగేను ఇరవైవేల ఖర్చయితాంది, ఈ సారి పంట బాగానే ఉన్న సరైన సాయాలు అందక తెచ్చిన అప్పులు పెరిగిపోయి అవి కట్టడానికి పోను మల్ల పెట్టుబడికే సరిపోయేటట్టున్నది, ఇప్పటికి రంది లేకున్నా రాబోయే దినాలమీదైతే బెంగ మెదలయింది, గీ కష్టాలన్నీ చూసిండేమో దేవుడు సమ్మె సైరన్ ఊదిండు, దనుంజయ్ మల్ల డ్రైవింగ్ జేత్తా అంటే మెదట వద్దని అన్నది అతని భార్య, అయితే ఎంతలేదన్నా వారం రోజులు సమ్మే నడుస్తది ఓ పది పన్నెండు వేయిలత్తయి, ముందు అళ్లుని మర్యాదలు, పొలం కోత ఖర్చులు కలిసొత్తయి అని సముదాయించడంతో పాణం బాగలేకున్నా..డ్రైవింగ్ అంటే బుగులు అయితున్నా.. జాగ్రత్తలు చెప్పి సాగనంపింది దనుంజయ్ పెండ్లాం, దీర్ఘంగా ఆలోచిస్తున్న దనుంజయ్ని అన్నా ఏందే ఆలోచిత్తున్నవ్ అని శ్రీనివాస్ పిలవడంతో ఈ లోకంలోకొచ్చిండు, అప్పటికే కొంత చనువు ఏర్పడడంతో ఏంలేదు తమ్మి, ఏవో ఇంటి ముచ్చట్లు యాదికచ్చినయ్ అన్నడు, దానికి నవ్వుతూ శ్రీనివాస్ అవ్ అన్నా నేను గుడ దుబాయ్ల గిట్లే ఇంటిని యాజ్జేసుకుంట బతికేటోల్లం, అయినా అందరివీ గవే కథలు, అన్నీ అత్యవసరాలు అందుకే గదనే అందరు దసరా పండుగు జేసుకుంటుంటే మనం నౌకర్ చేయవడ్తిమి అని కొంత కలుపుగోలుగా మాట్లాడిండు.
  మెత్తానికి తొలిరోజు రెండు సార్ల కరీంనగర్, ఒకసారి హైదరాబాద్ పోయొచ్చే సరికి చాలా పోద్దుపోయింది, రాత్రి పదకొండు గంటలకి డిపోలో బస్సు పెడ్తూనే అకౌంటింగ్ సెక్షన్ దగ్గరికి వెల్లారు డ్రైవర్ కండక్టర్ ఇద్దరు, అప్పటికే అక్కడ ఒకరిద్దరు ఉండి కొంచెం ఏదో వాగ్వాదం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది, దనుంజయ్ అక్కడికి వెళ్తూనే ఏంటీ సంగతి అని అడుగుతే పట్టించుకోకుండానే  అంతా దొంగ లెక్కలు దొంగ నాయాల్లు అని గుణుగుతూ వెల్లిపోతున్నాడు టెంపరరీ లేబర్, ఆ బస్ నెంబర్ చెప్పుండ్రి, లెక్కలు చెప్పుండ్రి అని ఇవరాలు రాసుకొని డ్రైవర్కి వెయ్యి రూపాయలు, కండక్టర్కి ఏడువందల యాబై ఇచ్చిండు, అదేంటి పదిగేనువందలని, వెయ్యిత్తాండ్రు అని అడిగాడు దనుంజయ్, గదంతా మాకు తెల్వదు గియ్యల్టి లెక్కైతే గింతే ఇయ్యమన్నరు పెద్దసార్లు అనే సరికి మరి మిగతా పైసలు ఎప్పుడిత్తరు, గవన్నీ మాకు తెల్వయి అన్నడు అకౌంటెంట్, తీసుకునేటప్పుడు పదిగేనువందలని చెప్పుడేంది మల్ల ఐదువందలు మీరు నొక్కుడేంది గిదంత గలీజు దంద లెక్కుంది అని కోపంతో మాట్లాడుతుంటే, అకౌంటెంట్ గొడవకి దిగిండు గివ్వన్ని మాకు తెల్వదు, గీడ గిట్లనే ఉంటదిగని నోర్మూసుకొని పోండ్రి, అయినా కండక్టర్తోని కలిసి మీరు దొబ్బలేదా.. మాకు అప్పజెప్పన లెక్కలకెయి ఎంత నొక్కిండ్రో తెల్వదా మాకు నిన్నటి లెక్కలకి ఇయ్యాల్టికీ ఐదారువేలు తేడత్తోంది, మేమన్న అడిగినమా, మేమిచ్చింది ఏ మూలకు పోతది గదే మత్తుగుండే నడువుండ్రి, ఏదన్నుంటే రేపు మేనేజర్తో మాట్లాడుండ్రి అని దబాయించే సరికి, దనుంజయ్, శీను ఇద్దరు ఒకలి మెకాలొకలు చూసుకుండ్రు, ఓ వంద రూపాయల చిరుతిండ్లు తప్ప ఒక్క రూపాయి ముట్టకుంట తెచ్చి మోసపోయినమన్నా మనం గూడ గట్లనే చెయ్యాలే, ఈడ నియతున్నోనికి బతుకు లేదు అనుకుంట ఇంటి మెఖం పట్టిండ్రు, రేపట్నుంచి ఒకటే బండిమీద అద్దాం అన్నా కొండాపూర్ల కేయి ఆవునూర్ల నిన్నెక్కిచ్చుకుంట అత్తా అన్నడు సరే తియి అని ఇద్దరూ ఇంటికి భయల్దేరిండ్రు,
          రాత్రి ఇంట్లోకి వెల్లేసరికి కూతురొచ్చింది అని చెప్పింది భార్య, తిందువురా ఆమెని లేపుతా అనేసరికి గిప్పుడేం లేపుతవ్ గనీ వద్దు, రేపు మాట్లాడుతా, బస్సు ట్రిప్పులనే తిన్నా జర పాణం అంతా అలిసిపోయినట్లైంది నేను పడుకుంట పొద్దున్నే పోవాల మల్ల అనుకుంటా పడుకున్నడు దనుంజయ్, తెల్లారగట్లనే రెడీ అవుతున్న నాన్న దగ్గరికొచ్చిన బిడ్డ నిండార కౌగిలించుకొని గిప్పుడు బస్సు నడుపుడెందుకు బాపు వద్దు, అసలే నీ పాణం బాగలేదు, మల్ల పెద్ద పండగపూట నువు ఇంట్ల లేకుంటే ఎట్లనో ఉన్నది, అయినా నేనాయనకి చెప్త తియి మా బాపు గీ దీపావలికి ఏం పెట్టడు అని కళ్లనీళ్లు పెట్టుకుంది, దనుంజయ్కి దు:ఖం ఆగలేదు, గట్టిగా వాటేసుకొని నువ్వు ఏడవకు నాకు బుగులైతది, నాకేం కాదు బిడ్డా మస్తురోజులైంది గదా నాకే పెద్ద బండి నడుపబుద్దైంది గందుకే పొయిన, మీకు పెట్టుపోతల కోసం కాదుబిడ్డా..అని ఓదార్చిండు, నువు పో మెఖం కడుక్కపో అప్పడికి మాట్లాడుకుందాం, అంటూనే అల్లుడు ఎప్పుడొత్తడటా బిడ్డా అని అడిగిండు, వెల్లిపోబోతున్న కూతురు నాన్న వంక చూసి దసరా తెల్లారి తోలుకపోనీకి అత్త అన్నడు అనుకుంటూ వెల్లిపోయింది, భయటకు వెళ్తూ పెండ్లాంతో గీ ముచ్చట్లన్ని బిడ్డకెందుకు చెప్పినవ్, అదెంట్ల బాదవడుతుందో చూడు అని కోపగించుగుండు, నేను చెప్పకపోతే దానికి తెల్వదా ఇయ్యాల కొడుకత్తుండు వానికి గూడా నేను చెప్పకున్నా తెలుత్తది గని జర నువు జాగ్రత్త, మెల్లగ నడుపు అసలే యాక్సిడెంట్లు ఎక్కువయితున్నయని టీవీల్ల చెపుతుండ్రు అని జాగ్రత్తలు చెపుతుంది, నీ మెఖం తియి వాల్లని గట్లనే చెప్తరు ఏన్నో ఓటి రోజు అయ్యేటియే ఇప్పుడు సమ్మే కదా జర ఎక్కువ చెప్తరు గంతే అని భయటకి రాంగనే శ్రీనివాస్ బండేసుకొని ఇంటిముంగటికొచ్చిండు, అయన్ని చూస్తూనే చాయ్ తాగి పోదాం దా అంటే ఏ ఎందుకన్నా అప్పడికి టిఫిన్ చేసినంక తాగుదాం తియి, అసలే ఇయ్యాల బతుకమ్మ పండగ నడువ్ జనం ఫుల్లుగుంటరు తొందరగా పోదాం అని వెల్లిపోయారు,
          నిజంగానే జనం పొద్దుగాల్లట్నుంచే ఫుల్లుగున్నరు, టిఫన్ చేయనీకి కూడా టైం దొరకలే, ఇయ్యల్ల రేపు రెండ్రోజులు హైదరాబాద్కి వేములాడోల్లే నడుపుతరంటా మనం కామారెడ్డి, కరీంనగర్ ట్రిప్పులే అని బండి స్టార్ట్ చేసిండ్రు, సాయంత్రం పూట ప్రతీ ఊర్ల బతుకమ్మలాటల మద్యలకేల్చి బస్సుపోతంటే, ఇద్దరికీ పాణం కొట్టుకుంది, అట్నో ఇట్నో రాత్రి ఎనిమిదింటి వరకి డిపోల బస్సు పెట్టిండ్రు, ఇయ్యాల పదిగేనువందలియ్యిమని కొంచెం గట్టిగనే అడుగుతాండ్రు, ఇద్దరూ బండి స్టార్టు చేసుకొని ఇంటికొచ్చేటప్పుడు యమా ఉషారుగా ఉన్నరు, వాల్లిచ్చిన వెయ్యికి ఇంకో రెండు వేయిలు తోడవడంతో పోతూ పోతూ పండక్కి ఇంట్లో వాల్లకిద్దామని చెరో బాటిల్ కొనుక్కొని పోయిండ్రు, ఊర్లో అంతా దసరా సంబరాల్లో మునిగి తేలుతున్నది చూసి కొంచెం బాద అనిపించినా అవసరాలు తీరుతున్నాయనే ఆశ వారిలో ఆ నిరాశని దూరం చేసింది, మెత్తం మీద ఆ సెలవుల్లో బస్సులు తిప్పి ఎంత అలసి పోయారో వారం రోజుల్లో వాల్ల అవసరాలకి సరిపడా మెత్తం చేతికందడంతో సంతోషంగా ఉన్నారు, అయితే పండగ సెలవులు అయిపోవడం, ఇంకా కొత్త కొత్త ప్రైవేటు స్కూలు డ్రైవర్లు అందుబాటులోకి రావడం, టిక్కెట్లు మెదలుపెట్టడంతో పాటు ఒప్పుకున్న పదిహేనువందలు ఇస్తుండడం కూడా మెదలయింది, కానీ డిపోల్లోకి వెళ్తుంటే అక్కడే టెంట్లు వేసుకొని కూర్చున్న ఆర్టీసీ కార్మికులని చూస్తే జాలేస్తుంది దనుంజయ్కి, పండుగ ఎట్ల గడుస్తదో అనే నా ఇంటి బుగులు వాల్లిండ్లకు పోయింది అన్నాడు దనుంజయ్ అవునన్నా రోజుకొకరు ఎక్కడో ఒక చోట చనిపోతున్నారు అనే వార్తలు ఇంటుంటే మస్తు నారాజుగుంది అంటూ గొంతు కలిపాడు శ్రీనివాస్, మనలాంటోల్లు బసు నడుపకపోతే గవర్నమెంట్ దిగిరాకపోవునా... పాపం వాల్ల అవసరాలు తీరక పోవునా అన్నాడు దనుంజయ్, అయినా మనం గాక పోతే ఇంకొక్కడు, వాడు గాకపోతే ఎవడో ఒకడు నడిపేటోల్లు, గదంతా కాదు పండగున్న ముణ్నాలుగు రోజులు తప్ప మా బస్సులు రాకపోతే ఎంతమంది ఆగమాగం అయిండ్రు, ఎవని బండ్లు వానికున్నయి, ఎవని తొవ్వ వాడు పోతాండు గదన్నా అన్నడు శ్రీనివాస్,  అదీ నిజమే పాపం ఎటొచ్చీ ఎర్రబస్సే దిక్కయ్యే బక్కచచ్చిన జనం మాత్రం కొంచెం ఇబ్బందులు పడ్డరు, చేతి చమురు ఎక్కువే వదిలించుకున్నరు, అంతా గమ్మత్తుగా అన్పించింది దనుంజయ్కి, మద్యమద్యల పాతోల్లందరు డిస్మిస్ అయిండ్రు అని తెలిసినప్పుడల్లా అయ్యే అని బాద, అంతల్నే ఈ ఉద్యోగం పర్మినెంట్ అయితదేమో అనే ఆశ ఇద్దరిదీ, నెలరోజులకే నాకిట్ల అన్పిస్తే పాపం ఎన్నెండ్ల సందు చేత్తుండ్రో వాళ్లకెంత బాదనో అని శ్రీనివాస్తో అంటుంటే ఏమో అన్న ఈ లొల్లి మనకు ఆశ పెరగకముందే జల్దిన తెగుతె మంచిగుండు అన్నడు శ్రీనివాస్, బస్సులో రోజు ఎక్కే ఒక్కొక్కరిదీ ఒక్కో కథ, ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ, ఎవ్వన్నీ తప్పు పట్టనీకి లేదు, అరకొర జీతాలందుకునే కార్మికుల సమస్య ఒకటైతే.. ఏడ్నుంచి ఇయ్యాలే అనే ప్రభుత్వ సమస్య మరొకటి, ఎవన్ది ఒప్పో ఎవన్ది తప్పో మనకెందుకులే అనే ప్రజల గమ్మత్తు అసలు సమస్య. అలా రోజులు గడుస్తున్నాయ్ బస్సు రోడ్డుమీద తిరిగేదానికన్నా ఎక్కువ మలుపులే తిరుగుతుంది సమ్మే, దీపావళి పండగ అల్లుడచ్చిన రెండురోజులు ఇంట్లనే ఉండి ఘనంగా చేసిండు దనుంజయ్, మిగతా రోజులన్నీ బస్సులు నడుపుకుంటనే ఉన్నడు, అప్పుడప్పుడు రోడ్డు మీద కొన్ని ప్రమాదాలు జరిగినా దేవుడి దయ వల్ల భయటపడ్డడు, సమ్మే ముగించామని ప్రకటించిన రోజు చాలా బాదేసింది దనుంజయ్కి ఇన్ని రోజులు ప్రభుత్వోద్యోగిలాగా ఠంచనుగా ఇంట్లోంచి పోయి పనిచేసుకోవడం అలవాటైన దనుంజయ్, ఆ రోజు డిపోల దగ్గర వాతావరణం చూసి భయపడ్డాడు, పాపం డ్యూటీల్లోకి తీసుకొమ్మని  కాళ్లా వేళ్లా మెక్కుతున్నకార్మికులని చూసి కరిగిపోయాడు, ఎట్లనన్న వాళ్ల ఉద్యోగాలు పోకుండా చూడు సామీ అని ఎములాడ రాజన్నకి మెక్కుకున్నాడు, మెత్తానికి యాబై మూడు రోజుల తర్వాత సమ్మే ముగిసింది. దనుంజయ్కి ఉద్యోగం ఊడింది, చివరిరోజు శ్రీనివాస్తో పాత ఆర్టీసీ ఉద్యోగులతో సరదాగా కలిసి మెలిసి ఉన్నడు. డిపో మెనేజరు దగ్గర వీడ్కోలు తీసుకొని ఇంటికి పోయిండు, భార్య కూడా సంతోషంగా ఉంది, డబ్బులేమో కానీ పొద్దున పోయి రాత్రి వచ్చేంత వరకీ ఏ ప్రమాదం వినాల్సి వస్తుందో అనే భాద రేపట్నుంచి ఉండదని మురిసిపోతుంది. ఓ ఐదారు రోజుల తర్వాత మల్ల పాత పనిలో పడిపోయిండు, పొద్దున్నే మంచి కల్లు తాగుదాం రాయే దనన్నా అని శ్రీనివాస్ పిలవడంతో కొండాపూర్ తాళ్లల్లకి పోయిండు, ఇద్దరు మంచి కులాసాగా కల్లుతాగుతూనే.. మెత్తానికి ఆర్టీసీ వాల్లకి అన్యాయం జరగలేదు, దేవుడున్నాడు అన్నాడు శ్రీనివాస్, మనకీ ఎంతో కొంత లాబం చేకూరింది, కానీ మనలాంటోల్ల బతుకులు మారాలే శీనా.. యవసాయం ఇంకా లాబసాటిగ మారాలే, అప్పటికప్పుడు అచ్చేటియి కాదు ఏం జేత్తే రైతన్న దేనికి ఎదురు చూడరో గదే చెయ్యాలే అన్నడు దనుంజయ్, నిజమన్నా అదే జరిగితే ఒకరి పొట్ట ఎండుతుంటే పదిమంది నింపనీకొత్తరు, లేకుంటే ఇగో మెన్నటి లెక్కనే ఉంటది, అయినా గిన్ని రోజులు అవసరాల్లల్ల ఉపయోగ పడ్డం మనల్ని గుర్తిస్తే మంచిగుండు, ఏమియ్యకపోని డిపోలకి పిలిచి బోజనాలు పెట్టి ఓ శాలువా కప్పుతే మనం చేసిన సేవకి గుర్తింపుండేది, అయినా అవసరాలైతే తిరినయిగని శీను ఇంకేదో చెప్పబోతుంటే... శీనా ఆశకి అంతుడది కొడకా అనే సరికి ఇద్దరూ ఒకేసారి హాయిగా పెద్దగా నవ్వుకున్నరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి