9, ఆగస్టు 2012, గురువారం
28, జులై 2012, శనివారం
valasalu - srisri 1st prize winning story
వలసలు
‘యాడికి
బోతున్నవ్ మల్లన్న గింత పొద్దుగూకినంక’ అన్న మాటలిన్పిచ్చిన పెద్దతోవ చివరి వంక
జూచి చేను కాడికి పోతన్న త్రీ ఫేస్
లైనచ్చింది గదా మోటర్ పెట్టత్తమల్ల తెల్లారితే నీళ్లు యాదిగాని వంతుకు పోతయ్
అనుకుంటనే పెద్దతొవ్వ సంది మలిగి చీకట్ల కలిసిండు మల్లయ్య ఏ రోజు జూచిన గిదే గొడవ
రాత్రి పదింటికో, పదకొండింటికో కరెంటిత్తరు మల్ల తెల్లారుజామున మూడింటికి
తీసెత్తరు. గ పొద్దుందాక కరెంటుండదు మన్నుండదు ఉన్న ముత్తంత సేపట్లనే చుక్కచుక్క
ఆసరోలే నీళ్లని గాపాడుకోవాలే లేకుంటే పొలం పండది కడుపు నిండది అని గునుక్కుంటనే
తలికి తులాల జుట్టి పైపులు సగవెడుతుండు మల్లన్న రాత్రి కరెంటు పోంగనే అక్కన్నే
పడుకొని తెల్లారుజామున యాపపుల్ల నములుకుంట ఊళ్లకు బయలుదేరిండు నడి ఊళ్లకు రాంగనే
కసీరు దగ్గర బాగా మంది పోగై ఉంటే విషయమేందో తెలుసుకుందామని రాయిచెట్టు చుట్టు కట్టిన
గద్దెమీద కూర్చున్న పెద్దిరెడ్డి పక్కకొచ్చి ఏమైంది పెద్దన్న గిప్పుడు కలిసిండ్రడు
ఏమన్న పంచాయితీ గిట్ల ఉన్నదయే అని చనువుగా అడిగాడు మల్లన్న వాళ్లిద్దరూ ఒకే ఈడువాళ్లు
చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిండ్రు మల్లన్న ఎరుకలి కులానికి చెందినవాడైనా వాళ్ల
మధ్య స్నేహం కులాల గోడలిన చెరిపేసింది అందుకే అంత చనువుగా అడిగాడు. ఆ ఏంలేదురా గా
పెద్ద గద్దెల ఎల్లారెడ్డిది, చిన్ననర్సిగానిది ఇద్దరి పొత్తుల బాయి లేదు దాని
పంపకాల ఇషయంలో ఇద్దరికి లొల్లైందట ఇయ్యల్ల పంచాయితీ పెట్టుకున్నరు అని నిష్టూరంగా
చెప్పి అక్కన్నుంచి లేచిండు పెద్దిరెడ్డి గదెందె లెవ్వవడితివి పంచాయితీ
సురువుగాకముందే ఏమైద్దో ఉందాం ఆగు అని వెళ్లపోతున్న పెద్దిరెడ్డి వంక చూసి ఆడిగిండు
మల్లన్న ఏ... దా... పోదాంరా గా పంచాయితీ గియ్యల్లేడ తెగుద్దిరా చిన్న నర్సిగాని
దగ్గర దడువతి పెట్టడానికి పైసల్లెవ్వని ఆడు తిరుగుతుండి సర్పంచ్ సాబేమో ఏదో
టెడరెయ్యాల్నని జెప్పి సిరిసిల్ల పోయిండు ఇగ పంచాయితీ ఏమయ్యేటట్టుంది అంటూ ఇంటి
ముఖం పట్టారు ఇద్దరు మల్లయ్య ఇంట్లోకి అడుగు పెడుతూనే ముక్కుపుటాలదిరేలా
గుప్పుమనవి చాపల పులుసు వాసనస్తుంది అప్పుడే పొలం దగ్గరి నుంచి వస్తున్న ఎల్లవ్వ
ఏమోయ్ వాసన గుప్పుమనిపిస్తున్నవ్ మా చెల్లె చాపలారబెట్టిందా ఏంది? నడుస్తూనే
అడిగింది ఎల్లవ్వ మల్లయ్యకు ఊళ్ల వరుసలెక్క వదిన అయితది అందుకే అలా అడిగింది ఏమో
వదినే నేనిప్పుడే పొలంకికెయ్యోచ్చిన అంటూ లోపలికెళ్లూనే ఏందే చాపల పులుసు
జేసినట్టున్నవ్ ఎవలన్నా అచ్చిండ్రాయే ఇళ్లంత కలియజూశాడు మల్లయ్య అవును మరి గంజినీళ్లనే
అన్నంల వంపుకొని తాగేది చాపల పులుసు జేసిండ్రంటే ఎవలన్నా చుట్టాలస్తనే అదీ ఇంట్లో
పైసలుంటేనే చేసేది అదే అనుమానంతో అలా అడిగాడు మల్లయ్య ఏంలేదయ్యా చిన్నోడు నిన్న
రాత్రి గాలాలేసోచ్చిండు పొద్దగల్ల బోయి రెండు మొట్టలు పడ్డయని పట్టుకొచ్చిండు
గవిట్నె పులుసెట్టినగని పొలం బారాందా అన్ని మడ్లల్ల నీళ్లు నిండినయో అంటూ పొలంకాడి
సంగతి అడిగింది మల్లయ్య భార్య మల్లమ్మ ఏంబారుడో ఏంపాడో పో పెద్దమడి సగం బట్టింది
గంతే లైనుబోయింది మల్ల మూడ్రోజులుదాకా నీళ్లు రావుగదాయే. అనుకుంటనే మొఖం
కడుక్కోవడానికి పాక ముందుకొచ్చండు మల్లయ్య జాలాట్ల గచ్చుమీద తెల్లగా ముచ్చంలా
మెరిపోతున్న సుద్దముక్కలాంటిదాన్ని చేతిలోకి తీసుకుంటనే జారికిందపడ్డది
గప్పుడప్పుడు పట్నంకేయి కొడుకచ్చినప్పుడు గనపడే సబ్బు ముక్కలాగ కనిపించేసరికి
చేతిల పట్టుకొని ఏమో పెద్దోడు గిట్న నేను బోయనంక నిన్న రాత్రి పట్నంకేయి వచ్చిండా
ఏంది అక్కన్నంచే అడిగాడు మల్లమ్మని రాలేదుదగయ్యా అయినాగని గిప్పడు గాడెందుకొత్తడు
గట్లడుగుతున్నవ్ ఎనుకకు పడ్డ ఎంటుకలను సికముడి వెసుకుంటు బయటకొచ్చి నిలబడ్డది
మరిగీ సబ్బు ముక్కనెవలుదెచ్చిండ్రె... అడగడం పూర్తిగాకముందే మల్లమ్మ దగా మన
రేణవ్వనే కొనుక్కందయ్యా ఏదో టీవిలా జూపుతుండ్రట గదా అండ్ల జూచి దాని బీడీల పైసలు
పెట్టింకొనక్కున్నది అని తినడానికి కంచాలు గడుగుడు మొదలు పెట్టింది టీవీలో ఏంపాడో
పోరగాండ్లను ఆళ్ల మానాన ఆళ్లను బతుకనిత్తలేవుగదాయే సరేగాని చాయిజేసినవా ఇటు
దీసుకరాపో గొంత పానమన్న ఎచ్చవడ్తది అనుకుంటనే అరుగు మీద తువాల వరిచి గుసున్నడు
మల్లయ్య గీ అంబటాల్ల
చాయేందయ్యా
బుక్కడంత చల్లబడుదువురా అని కుసురుకుంటనే చెప్పి లోనికెళ్లింది మల్లమ్మ
తినేటప్పుడే ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఈయేడు వర్షాలే
లేకపాయే మొగులు తరువాయి జూత్తుంటే ఇగ వర్షపు నీళ్లను జుత్తమో లేదో ఇంక యవసాయమేం
నడిచటట్టేం, తడకలల్లితే కొనెటోల్లె లేకపాయే గంపలు, చాట్లన్ని మూలకు పడవట్టె గందుకే
వరికోతలు గాంగనే ఔటఫ్ బోదామనకుంటున్న గిదే ఇషయమ్మీద రేపన్న ఎల్లుండన్న పట్నంబోయి
పాసుపోర్టు దీసుకొచ్చుకుంటనే అన్నం తినడం ముగించి లేచిండు మల్లయ్య ఎన్నో
రోజుల్నుంచి ఇంట్లో అనుకుంటునే ఉన్నారు అందుకే మల్లమ్మ మౌనంగా అలాగే
కూర్చుండిపోయింది మల్లన్న... ఓ... మల్లన్నా.... ఇంట్ల ఉన్నవా లేదా ఎవలో
పిలుస్లుంటే బయటకొచ్చి నిల్చుండు మల్లయ్య ఓ.... నారన్న కుసుందుదాయే ఏం పనిమీద
అచ్చనవే ఏం లేదు మల్లన్న గా నారాయణ రెడ్డి పటేల్ ఏదో పనుందని చెప్పి నిన్నురమ్మన్నడే
అని అక్కన్నుంచి వెళ్లిపోయిండు నారయ్య ఏమో నేను గీ నారాయణరెడ్డి పటేలింటిదాకా పోయొత్త
అనుకుంటనే రోడ్డుమీదకొచ్చి గడీలను దాటుకుంట పోతుండగా పెద్దపెద్ద రాళ్ళతో కట్టిన
ప్రహారి గోడ లోపలింట్లో నుంచి ఓరే మల్లిగా ఇటు రారా అని వామనరావు దొర పిలువంగనే బాగున్నార
దొర ఏమన్న పని వడ్డదా దొర పిల్చిండ్రు అని దొరకెదురంగా పోయి నిలబడ్డడు మల్లయ్య ఏం
లేదురా మా మామిండ్లు కోత కచ్చినయ్ రా రేపట్నుంచి రెండ్రోజులత్తవురా కైకిలి
తీసుకుందవుగని అడిగిండు సరే దొరా ఇంకెవలన్న వత్తుండ్రా నేనొక్కన్నే రావల్న అని
అడిగాడు మల్లయ్య మా జీతగాడు, నువ్వు ఇద్దరు కలిసితెంపుతే రెండ్రోజులల్ల ఒడుత్తయిరా
రేపు పొద్దుగల్ల సద్దిగట్టుకొని తోటకాడికే సక్కగ రారా అని చెప్పి
ఇంట్లోకెళ్లిపోయాడు వామనరావు దొర అట్లాగే అక్కన్నుంచి నారాయణరెడ్డి
పటేలింటికిపోయిండు మల్లయ్యని చూస్తూనే నారాయణ రెడిడ బయటకు వచ్చి కుర్చీల కూర్చుండి
ఏంద్రా మల్లిగా కన్పిత్తలేవు ఊళ్లేలెవ్వారా అని అడిగిండు అక్కన్నే కింద గచ్చుమీద
తువాల పరుచుకొని కూసుండి ఏం లేదు పటేలా పొలం అంకల్నే ఉండుడయింతుంది గందుకే
గిటుదిక్కత్తలేను ఏదో పలిచిండ్రంటా ఏం విషయం పటేలా అని అడిగిండు మల్లయ్య
నారాయణరెడ్డికి అరవయ్యేండ్ల పైననే ఉంటాయి. ఆ ఊళ్లో మోతుబరి రైతు చాలా మంచోడు
వర్షాలు పడ్డప్పుడు మంచిగనే బతికి ఆల్లకు ఈల్లకు అప్పులు గూడ ఇచ్చిండు గని ఇప్పుడు
వర్షాలు లేక కరువు ఆయనను కూడా పట్టింది అందుకే జర దిగులు పడ్డట్టయ్యిండు మనిషి
ఉన్న ఇద్దరు కొడుకులు ఒకడు టీచరు నౌకరు జేసుకుంటూ పెద్దూర్ లోనే ఉంటాడు. చిన్నోడు
ఇంకా ఏమో చదువాల్నని పట్నంలో ఉంటుండు ఇంటిదగ్గర ఇద్దరు పెద్ద మనుషులు
మిగిలిపోయిండ్రు ఏంలేదురా ఇద పొలం జేసుడు నావ్లయ్యేటట్టు లేదురా గందుకే నువు
కౌలుకు గిట్ల జేత్తవేమో అడుగుదామని పిలిపిచ్చిన అసలు సంగతి చెప్పేసిండు
నారాయణరెడ్డి ఆమాట ఈమాట మాట్లాడకున్నంక రెండుమూడ్రోజులయినంక విచారించుకొని చెపుతా
పటేలా మల్ల గిప్పుడే అవుటాఫ్ పోదామనుకుంటున్నా ఇంకా ఏ విషయం తేల్చుకోలే అని అక్కన్నుంచి
లేచిండు మల్లయ్య.
గదేంది వీసా గిట్లచ్చిందారా గిప్పడు
పోతునంటున్నవ్ జరా గా బాకీ పైసలు ఇరువైవెయ్యిల ఇయ్యిరా చిన్నోనికి చదువుల
తక్కువపడ్డాయట అని మాటలల్ల మాటలెక్క అన్నాడు పటేలు. గిప్పుడెక్కడియి పటేలా ఒక్క
యాడాది గు పటేలా మిత్తిగిత్తి అన్ని కలిపి ఒక్కసారిత్త. ఐనా నువ్వే గిట్లంటే ఎట్ల
పటేలా మాకున్న పెద్దదిక్కు మీరేనాయే అని నిలబడే మాట్లాడుతుండు మల్లయ్య నాక్కూడా
గిప్పుడు పైసలు అడుగుడు మంచిగనిపిత్తలేదురా కానీ ఏంజేయాలే పంటలు లేకపాయే వాని
చదువు ఒడవకపోవట్టే గందుకే అడిగినా ఐనా గిప్పుడేం ఆగం గాకుగని జర తొందరగయ్యేటట్టు
జూడు ఏడాదిదాకంటే కష్టమైతదిరా మధ్యలో అనికేమన్నా అవసరమత్తే చెతులుండాలేగదా గందుకే
అడిగినా జర ఇంకొక యాడాది ఆగుండ్రి పటేలా నీకు పుణ్యముంటుంది అని బతిమాలుకుంటనే
అక్కన్నుంచి బయలుదేరి ఇంట్లకచ్చిండు మల్లయ్య వస్తూనే దిగాలుగా ఉన్న భర్తను చూసి
ఏమైంది గట్లున్నవ్ పక్కకొచ్చి కూర్చుంది మల్లమ్మ కరువు కరువులెక్క పటేలుకు పైసలవసరమున్నయట
బాకీ పైసలు ఇయ్యమన్నాడు. గిప్పుడేడికేలితెత్తం ఏంజెప్పినవ్ యాడాదాగుమన్నా. ఏమన్నడు
సరేఅని అన్నడే పొడిపొడిగా మాట్లాడుతుండ్రిద్దరు. ఒస్... భారంగా నిట్టూర్పిడిచి
నేను పొలంకాడికోయి గడ్డికోసుకత్త గా బర్లుగిట్లత్తే కట్టేయి అనుకుంటనే కొడవలి
తీసుకుని బయల్దేరింది మల్లమ్మ.
పట్నంకేయి కొడుకొచ్చి రెండ్రోజులయ్యింది
ఒరేయ్ మయోసు ఎప్పుడూవోతవురా మల్లా పైసలెమన్న అవసరమన్నయిరా గిప్పుడేజెప్పు
ఎవల్దగ్గర్నన్న అడుక్కత్తా గట్లనే ఇయ్యల్లోక్కరోజు ఈతమట్టలు కొనుకరానుపోదాంరా
తడుకలల్లాలే మైబెల్లి నిన్ననే జెప్పిండు రెండు పొనుగు తడకలుగావల్నని కొడుకుతో
చెప్పిండు మల్లయ్య సరే బాపు పోదాంతియ్యి అన్నం తిన్నవా నేను ఊళ్లేదాకా పోయ్యత్త
చెప్పుకుంటనే బయటకెళ్లిండు మహేష్ హైదరాబాద్లో డిగ్రీ ఫైనలియర్ చదువుతుండు మహేష్
చాలా తెలివిగల విద్యార్థి కావడం చేత ఐదో తరగతి నుండే నవోదయ పాఠశాలలో ఇప్పుడు APRDC కళాశాలలో చదువుతూ తన వల్ల ఇంటికి భారం
కాకుండా చూసుకుంటున్నాడు.
అలా ఊళ్లోకెల్లి మిత్రులతో
కలిసి చిన్ననాటి సంగతులు నెమరేసుకుంటున్నాడు ఏదో వెలితిగా అనిపిస్తుంది తనకి
క్రితం రోజులు గుర్తుకొస్తుంటే... తను రాగానే పొలాలెమ్మటి పచ్చటి బయళ్లలో
నడుచుకుంటూ విరబూసిన పొద్దు తిరుగుడు పువ్వులతో నేలంత ఆకుపచ్చ చీరపై పసుపురంగు
అద్దినట్టు అందంగా కనిపిస్తుంటే దూరంగా కొండలనుంచి చల్లని గాలి మెల్లమెల్లగా
వీస్తుంటే మొక్కజొన్న తోట దగ్గర కాల్చుకు తిన్నవెచ్చని కంకులతో పాటు మామిడికాలకు
మసాల నంజుకు తింటుంటే పట్నంలో కోల్పోయిన రుచులన్నీ మెల్లమెల్లగా నాలుకకి
తిరుగచ్చినట్టనిపించింది అందరూ ఒకరికొకరు సాయపడుతూ అరకలెత్తి నాగళ్లు నడుస్తుంటే
చీమలు బారుల్లా కనిపించేవి, పొలాల్లోంచి వచ్చిన తర్వాత ఒక్కరొక్కరుగా వచ్చి కసీరు
దగ్గర కూర్చొని వెన్నెల్లో చిన్నపిల్లలు ఏవో అటలాడుకుంటూ ఉంటే పెద్దోల్లంతా సరదా
కబుర్లలో మునిగి ఊరంతా సందడి సందడిగా రోజు క పండగ వాతావరణంలా అన్పించేది అటువంటిది
ఇప్పటి పరిస్థతి పూర్తిగా మారిపోయింది మా ఊరొక్కటే కాదు మొత్తం ఊర్లన్ని ఇదే పరిస్థతి
ఎక్కడ చూసిన కరువే, అందరి ముఖాలు బాధలతో పాలిపోయాయి ఎవరని కదిలించిన దుఃఖం పొంగుకొస్తుంది
మెల్లిగా వలసలు ఊపందుకుంటున్నాయి గొడ్డూ, గోదా పొలం పుట్రా అన్ని అమ్ముకుని ముసలి
తల్లిదండ్రుల్ని ఇంటిదగ్గర వదిలి పేద, బీద తేడాలేకుండా పోతున్న వలసల్ని చూసి
పల్లెటూర్లు మౌనంగా బావురుమంటున్నాయి. ఒకవైపు కరువు తన కోరలతో జనాల రక్తం
తీల్చుకుంటుంటే మరోవైపు ప్రభుత్వం నిర్భంద వసూళ్లతో బొక్కల్ని సైతం పిప్పి చేస్తుంది
తన ఆవేదనంతా తోటివాళ్లతో పంచుకున్న వరుణుడు కరుణించకపోతే ఎవరు మాత్రం చేసేందేంటి
ఆవేదన నిండిన హృదయంతో ఇంటికెళ్లాడు మహేష్. ఇంట్లోకెలుతూనే మల్లమ్మ అరేయ్ అయ్య
రమ్మన్నాడ్రా నడువు పొలంకాడికి పొయ్యిండు అని చెప్పి సద్ది తీసుకొచ్చి
చెయ్యికిచ్చింది మల్లమ్మ. సాయంత్రి వరకు ఇద్దరు కలిసి మట్లు కొట్టిండ్రు సాయంకాలం
కాగానే మయేసు నువ్వు మట్టలు తీసుకుపోరా నేను గొంతు తడుపుకచ్చుకుంటా అని చెప్పి
సైకిలుకు మట్టలు కట్టిచ్చిండు మల్లయ్య తెల్లారితేనే ఇద్దరు కలిసి పట్నం పోవడానికి
తయారయ్యిండ్రు రాత్రే విషయం మొత్తం చెప్పిండు మల్లయ్య అందుకే మౌనంగానే తంరడిని
అనుసరించాడు మహేష్. పాస్ పోర్టుకు అప్లై చేసుకుని మిగిలిన కార్యక్రమాలన్ని ముగించుకొని
కొడుక్కి చెప్పి ఇంటికొచ్చాడు మల్లయ్య రాగానే రేణమ్మ, చిన్నోడు ఇద్దరు
పరిగెత్తుకొచ్చారు తండ్రి తినడానికేమన్నా తెచ్చాడేమోనని జేబులో డబ్బులే లేకపోయే
ఇంగ పిల్లలకేమి తెచ్చేది. రెన్నెల్ల తర్వాత వరికోతకొచ్చింది రేపు మొదలెడితే మంచిది
లేకపోతే మొగులెటో కమ్ముకొత్తంది నోట్లోకిచ్చిన గింజలు నేలపాలైతయి రేపు కోత
మొదలెడదామని మల్లమ్మ చెప్పినమాటకి సర్లేవే ఈ పాడుమబ్బులోటి వాన పడేదేలేదు మల్ల
గదేందో కాలంగాని కాలంల మబ్బులు రావట్లే మొత్తం కాలికాలం మాయ అనుకుంటనే
కొడుళ్లు సరిపిచ్చుక రావడానికి కమ్మరి కలిమికెళ్లిండు మల్లయ్య ఏమిరా
మల్లిగా నువ్వు గూడ అత్తున్నవట గదరా అవుటఫ్కి అని పలుకరించిండు ఎల్లయ్య గదేందే
నువుగూడ అనవడితివి నువ్వుగిట్న అత్తున్నవా ఏంది అయ్యె ఏమిరా తెల్వనట్టేజెయ్యవడితివి
మనూళ్లకెయి 20 మందిదాకా రావట్టే ఏంది 20 మందత్తురా మరీ విసాలు గిట్ల అచ్చినాయో
దుమాల రాయనర్సు లేడు వాడే మా అందరికి వీసాలు ఇప్పిత్తుండు మరీ నిన్నెవ్వలు దోలుతుండ్రా
అని అడిగాడు ఎల్లయ్య నేను కూడా గాందగ్గరికే బోయినా 60 వెయిలు ఇయ్యమన్నడు ఒక్క పైసగుడ
తగ్గుతలేడు కొత్తబస్టాండ్ అవతల ఏదో రూం తీసుకుండుగదా మా బామ్మర్ది చెప్పిండు
గాడెనాయే అని రుజువు జేసుకుందామని అడిగిండు మల్లయ్య ఆ గాడేరా మేం మనిషికి 30 వెయిలు గట్టినం ఇంకా
30 వెయిలు వీసా అచ్చినంక ఇయ్యిమన్నడు అది సరేగని పాస్ పోర్టచ్చినాదిరా ఆ వచ్చిందే
15 రోజులాయే మొదుగలా ఎవలో పోలీసాయనొచ్చి 200 తీసుకపోయిండు ఎన్కసిరికి పాస్ పోర్ట్
బట్వాడా ఆయనొచ్చి ఇచ్చిండు. ఇంతలో మల్లయ్య కొడళ్లు తళక్కు మనిమెరుస్తూ గడ్డి పీచమనచడానికి
సిద్దమవడంతో సరే నేను పోయత్తనే అని జెప్పి అక్కన్నుంచి బయలుదేరిండు మల్లయ్య.
కరువుకాలం మాయో కలికాలం మాయో అన్నింటి ధరలు రెండింతలవుతున్న వడ్ల ధరలు మాత్రం
పెరగడం లేదు మొత్తం పంటలో తినడానికి ఉంచుకోంగా అమ్మిన 20 కింటాల్లకు అచ్చిన పైసలు
పెట్టుబడి పోంగా మల్ల పెట్టబడికి సరిపోయేటన్నే అచ్చనయి ఆ రోజు రాత్రి మల్లయ్య
మల్లమ్మ ఇద్దరు కూర్చొని బాగా విచారించుకొన్న తర్వాత పంటమ్మగా వచ్చిన పదివేల రూపాయలకి
ఇంకో 20 వెయిలు అప్పు తీసుకొనొచ్చినా పొలమమ్మకపోతే అవుటాఫ్ కు పైసలు సగవడేటట్టు
లేవు గందుకే పొలమ్మడానికే నిశ్చయించుకున్నారిద్దరు. తెల్లారితేనే మల్లమ్మ వాళ్ల
తమ్ముని దగ్గరికి దూమాలకెల్లింది. ఇంకా ఆదారిలో బస్సులు సరిగా నడవకపోవడంతో రెండు కిలోమీటర్లు
నడుచుకుంటూనే పోయింది ఊరికి అవతల విసిరేసినట్లుంటుంది వాళ్ల తమ్ముని ఇల్లు అందుకే
చీకట్లో కిరోసిన్ దీపం ఒక్కటే మిణుకుమిణుకుమంటూ మెరుస్తుంది. అందరి బోజనాలయ్యాక
మెల్లిగా అసలు విషయం చెప్పింది మల్లమ్మ. సరే అక్క చానా రోజుల తర్వాత అడిగినవు నా
దగ్గర ఉన్నయ్ వాళ్ళ దగ్గర వీళ్లదగ్గర అచ్చెటియి మొత్తం కలిపితే 20 వెయిల దాకా
అయితయి ఈసారెట్లయవసం బంజేద్దామనుకున్నా ఇగ మొత్తం పైసలు ప్లేను ఎక్కేటప్పుడు అచ్చి
తీసుకపోమ్మనిచెప్పే బావకు అని చెప్పి నిద్రపోయాడతను తెల్లారి తమ్మునికి మల్లోకసారి
చెప్పి అమ్మ దగ్గర, నాయిన దగ్గర సెలవు తీసుకుని ఇంటికి పయనమయింది మల్లమ్మ. అవుటాఫ్
పోవడానికి అన్ని సిద్దం చేసుకుండు మల్లయ్య ఊళ్లో పోవడానికి సిద్దమైన వాళ్లంతా
కలిసి బ్రోకర్ రాయనర్సు దగ్గరికి పోయిండ్రు గప్పుడే మల్లయ్య చేతులున్న పదివేలు
కట్టేసిండు మిగిలినోళ్లంతా ఇంతకుముందు గట్టిన 30 వేలక ఇంకో పదివేలు గిలిపిండ్రు,
పైసలు గట్టి చాలా రోజులు గడిచిపోయినయి అయినా వీసాలు గ అత్తున్నయి పైసలు రడి చేసుకొండ్రి ఇంకా పదిగేను రోజులల్ల ఎక్కుడే అని
చెప్పుతున్నాడే గాని వీసాలు మాత్రం తీసుకత్తలేడు, ఈ ప్రయత్నంలోనే పొలమును
గిట్లుబాటుగాకున్న ముప్పై వేలకే అమ్మేసిండు మల్లయ్య. ఎదేట్లనన్న గాని నా
కొడుకులన్న సుఖంగా బతుకుతరు. గీ పొలాలల్ల పొద్దంత కష్టపడ్డా తిందామంటే కడుపే
నిండకపాయే అని తనని తాను సముదాయించుకుంటున్నడు. గింతలో పట్నంకేయి కొడుకు
లేటరేసిండు. బాపు ఇక్కడ నేను ఇంకా చదవాలంటే ఫీజు కట్టాలే ఐదు వేలదాకా ఖర్చయితయి.
ఇప్పుడింటికాడ పైసలు లేవని దెలుసు. గందుకే ఈ సంవత్సరంతో చదువు ఆపుదామనుకుంటున్న
అట్లనే ఈన్నే ఏదన్న పని జూసుకుంట. నువు, అమ్మ గిట్ల మంచిగుండుర్రి అవ్ టాఫ్
పోదామనకున్నావు గదా వీసా సంగతేమయ్యింది. ఐనా ఇప్పుడక్కడ యుద్దమైతుంది. గీటైమ్ల
అక్కడికిపోనిదే మంచిది. బ్రోకరుకైతే మొత్తం పైసలియ్యకు. నువ్వాడికి పోకుంటేనే
మంచిదనుకుంటున్న నాగురించి బెంగ పెట్టుకోకుండ్రి అని రాసిండు. ఏం చేస్తం కనీసం
కొడుకుని కూడా చదివించలేకపోతున్న అని బాధపడ్తూనే ఆ ఊరి కరణం దగ్గరికి పోయ్యడిగిండు
అవ్ టాఫ్ ల యుద్దమైతుందా అని అవునురా మల్లిగా నీకు తెల్వదా అమెరికోళ్లు ఇరాకోళ్ల
మీద యుద్దం జేత్తుంరడా మీరు పొదమనుకున్నారు జూడు కువైట్ దాని దగ్గర్నే ఉంటది ఇరాక్
అని చెప్పిండు కరణం. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు యుద్దం వల్ల అవ్ టాఫ్
పోదామనుకున్నోళ్లంతా భయపడ్తున్నరు కొందరైతే పోవడమే మానేద్దామనుకుంటున్నరు. అంతా
కలిసి ఒ రోజు బ్రోకర్ రాయనర్సు దగ్గరికి పోయిండ్రు వారం కల్ల మీ వీసాలిప్పియ్యిలేకపోతే
మా పైసలు మాకిచ్చేయ్ అని గొడవ పెట్టుకున్నారు. లాగొలా పదిహేను రోజులల్ల వీసాలన్న, పైసలన్న
ఇత్త అని చెప్పగానే అందరూ ఊరుకున్నారు. పదిహేను రోజులయిన వీసాలు రాలే పైసలు
ఈయ్యలే. ఒ దిక్కు ఎండలు మండిపోతున్నయ్ రోజు బ్రోకర్ రాయనర్సు దగ్గరికి, ఇంటికి
తిరిగేసరికి బస్సు కిరాయిలకే వెయ్యి రూపాయలొడిసినయి. చెప్పులు అరుగుతున్నయ్ కాని
ఫలితం మాత్రం లేదు మల్లయ్య ఇగ అసలు చాలిచ్చుకున్నడు కాని ఇప్పడేంజేయ్యాల్నొ
అర్థమయితలేదు ఇన్ని రోజులు నీడనిచ్చిన పొలం గూడ అవ్ టాఫ్ జేయ్యపట్టి అమ్ముకుంటి
ఇంక ఈ ఊళ్లో జేయడానికి ఏం మిగులలే మల్లమ్మ రోజు బాధపడ్తూనే ఉంది. ఒ రోజు
పొద్దుగల్లనే ఎల్లయ్య చచ్చిపోయిండని తెల్వంగనే పరుగున ఉరికిండు మల్లయ్య. ఎల్లయ్య
పెండ్లాము శవాన్ని పట్టుకుని ఏడుస్తొంది. ఇగ నాకు దిక్కేవరురో... నేను కూడా నీతోటే
అత్తనే... ఎల్లయ్య ముఖం పాలిపోయింది మొఖంలా బాధకొట్టేచ్చినట్టు కనిపిస్తుంది. బాధ
నిండిన స్వరంతో ఏమైందిరా అని అడిగాడు పక్కనున్న తనతో బ్రోకర్ రాయనర్సు ఎక్కడికి
పారిపొయ్యిండట అంతే పురుగుల మందు తాగి ఒక్కసారిగా కుప్పకూలిపోయిండు. కాళ్లు
చల్లబడిపోయాయి గుండెలో ఎవరో పొడుస్తున్నట్లుగా ఒకటే బాధ పది రోజులు గడిచాయి దూరంగా
చావుడప్పులు వినిపిస్తున్నాయి. అప్పుల బాధ తట్టుకోలేక ఎవరో ఉరేసుకున్నరట ఈ బాధల్లో
నుంచి తేరుకోలేక పోతుండు మల్లయ్య. తనని చూసి మల్లమ్మ కూడా చాలా బాధపడ్తుంది.
కొడుకుని పట్నం నుంచి రమ్మని చెప్పింది. పదివేల పంట పండలేనుకుందం పోతే పొనితీయ్యి
ఎంజేత్తం కొడుకుని రమ్మన్నా రేపొత్తడు గావొచుచ నువ్వు ధైర్యంగుండు అని ధైర్యం
పెస్తుంది మల్లమ్మ. మెల్లమెల్లగా కోలుకుండు మల్లయ్య ఇద బతుకాలంటే పట్నం వలసపోక
తప్పదని తెలిసింది. మల్లమ్మని తమ్మునికి పైసలు అవసరం లేదని జెప్పమని పంపిండు పొలమమ్మగా
వచ్చిన పైసల కేల్లిపట్నం బస్సు చార్జీలు మిగిల్చుకొని మిగిలినయి నారాయణరెడ్డి
పటేలు అప్పు తీర్చడానికి తీస్కపోయిండు. గదేందిరా లెవ్వంటివిగదరా అని తీసుకుండు పటేలు.
ఇగ పత్నంబోతున్న పటేలా అన్నే ఏదో కూలిపనిజేస్కుంటూ, ఈ ఊళ్లో ఇంకనాకు ఏమున్నదని
ముక్తసరిగా చెప్పి బయలుదేరిండు మల్లయ్య.
తెల్లారితేనే ప్రయాణం అందరి
ముఖాలలోను ఒకటే బాధ కన్న తల్లిలాంటి ఊరునొదిలిపోవడానికి మనసొప్పుతలేదు.
తల్లికిజెప్పిండు పిల్లలు బీరిగిట్ల పయిలంగుండుర్రని కొడుకును, బడ్డను పక్కనే
పడుకోబెట్టుకుండు అయినా నిదురావడం లేదు లేచి బయటకొచ్చిండు వెన్నెల దగదగ
మెరిసిపోతుంగి. తువాల భుజం మీదేసుకొని బయలుదేరిండు ముందుపొలంకాడికిబోయిండు ఒళ్లంతా
పర్రెలతో ఏడుస్తూ వీడ్కోలు చెప్తున్నట్టుందది మెల్లిగా అక్కన్నుంచి ఐరంతా చీకట్లనే
తీరుగుతుండి డొక్కలెండని కుక్కలు కూడా మొరగడం మాని నీళ్లు నిండిన కండ్లతో వీడ్కోలిత్తున్నయి.
టికొచ్చేసరికి తెల్లతెల్లరుతుంది మల్లమ్మకు కూడా నిద్రరావడం లేదుకావచ్చు
గుడ్డిదీపం కింద దూలంకు తలాన్చి శూన్యంలో చూస్తుంది ఎప్పడో తెల్లారుజామున
పడుకోవడంతో లేచేసరికి అంబటాల్లయ్యింది. అంత తానాలు జేసీ రడి అయిండ్రు బస్సు
యాల్లయిందని కొడుకు తొందర పెడుతున్నా నిర్లప్తంగానే తయారయ్యిండ్రిద్దరు రేణని, చిన్నోన్ని
దగ్గరికి తీసుకొని నుదుటి మీది ముద్దిచ్చి పది రూపాలయలు చేతిలో పెట్టి ముసలోల్ల
కాళ్లు మొక్కి బస్టాండ్లకచ్చిండ్రు ముగ్గురు ఆపాటికే వలసలు రావడానికి కట్టబట్టలతో
రడిగా ఇంకొందరున్నారు. అందరిముఖాల్లోనూ దిగులు ఎవరికి కన్నతల్లి పేగు
తెంపుకోవడానికి మనసొప్పడం లేదు ఇవేమి పట్టనట్టుగా కరువు సైరన్ మోక్కుంటూ బస్సోచ్చి
ఆగింది ఎక్కడో ఎనకాల సీటు దొరికితే పొయి కూర్చున్నారు మల్లమ్మ, మల్లయ్య, మహేష్
బస్సు దుమ్ము రేపుకుంటూ పోతుంది అవునూర్ బోర్డు ఇంకా దూరమైపోతుంది వలసలకి
తావుచ్చిన కరువుకి జాలిలేదేమో పేదల జీవితాలతోనే అటలాడుకుంటుంది.
o gelupu jnapakam
ఓ గెలుపు జ్ఞాపకం
ఏం చేయాలో అర్థం కావడం లేదు... కానీ సమస్య పరిష్కారం అవకపోతుందా అనే
చిన్న ఆశ మాత్రం మనసును వదలడం లేదు... ఎంత ఆలోచించినా
చేసేదేమీ లేదు కనుక ఒంటరిగానే క్యాంటీన్ ఆవల చేట్టుకిందనున్న బండరాయి పై
కూర్చున్నాను... అసలు సమస్యేమిటంటే ఆరోజే కాలేజీ ఎక్జామ్ ఫీజు
కట్టడానికి చివరి రోజు, నాన్న పంపిస్తానన్న
డబ్బులు అందకపోవడం వల్ల ఫీజు ఎలా కట్టాలన్న ఆలోచనే వేదిస్తుంది. అంతకు ముందు
పనిచేసిన వాళ్ల దగ్గరికెళ్లి అడిగి చూశాను. అయినా లాభం
లేదు... తెలిసిన వాళ్లని అడగడానికి మొహమాటం అడ్డొచ్చి అడగలేకపోయాను. కానీ ఫీజు కట్టకపోతే పరీక్ష రాయనివ్వరు. అంటే
సంవత్సరం నష్టమన్నమాట. మళ్లీ డిగ్రీ సెంకండియర్లోనే ఉండల్సి
వస్తుంది, ఆలోచనలు ఇలా ఒకదాని వెనుక ఒకటి సుడులు తిరుగుతున్నాయి. నేను కన్న కలలు, ఆశయాలు తనమీద అమ్మా, నాన్నాలు పెట్టుకున్న ఆశలు ఒకటేమిటి ఒక్కొక్కటిగా మసక
మసకగా అన్ని మస్తిష్కంలో సుడులు రేపుతున్నాయి, ఎంత చిన్నదీ... సమస్య ఎదుటివారికి చెప్తె నవ్వచ్చు, కానీ నా మటుకది పెద్ద సమస్యే. ‘ఏరా సుధాకర్ అలా పరధ్యానంగా ఉన్నావేంట్రా ఏదైనా ప్రాబ్లమా’ అంటూ క్యాంటీన్ లోకి వెళ్తున్న రంజిత్ నన్ను చూసి అడిగాడు, ఏం చెప్పను వాడికి నిర్వికారమైన నవ్వు నొకదానిని మాత్రం విసిరాను
వాడికేసి... ఏమనుకున్నాడో... మరి మారుమాట్లాడకుండా క్యాంటీన్ లోకి వెళ్లాడు, వాడివెనకాలే వచ్చాడు రాజు, గత సంవత్సరంగా
రాజు నా రూమ్మేట్ గానే వున్నాడు. మా పక్క ఊరే అతనిది వాళ్ల నాన్న రమ్మని లెటర్ రాస్తే ఇంటికెళ్లాడు. కానీ ఎప్పుడొచ్చాడో వస్తూనే
కాలేజి కొచ్చినట్టున్నాడు నన్ను చూస్తూనే ‘ఏరా ఈ రోజు కాలేజ్ బాయ్ కాట్ అంట కదా రూమ్ కు రాలేదు’ అన్నాడు. వాన్ని చూడగానే ఏదో ఆశ చటుక్కున అడిగేసాను ‘ఒరే డబ్బులున్నాయా’ అని ఏమనుకుంటాడో అన్న ఆలోచనే రాదు, ఎందుకంటే చిన్నప్పట్నుంచి అరమరికలు లేని స్నేహం మాది, వెంటనే ‘ఎందుకురా’ అని అడిగాడు. ‘ఈ రోజు పరీక్ష ఫీజు కట్టడానికి చివరి రోజు’ అని చెప్పేశాను. ‘అదేంటి వారం రోజులయిందిగా పరీక్ష ఫీజు కట్టడానికి
డేటిచ్చి ఇంకా కట్టలేదా’ అన్నాడు వాడు, ఏమని చెప్పాలి నాన్న డబ్బులు పంపలేదని చెప్పాలా, అయినా అన్నీ వాడికి తెలిసుంటాయి కదా అనుకొని, డబ్బుల్లెవని మాత్రం అనేశాను. సరే ఎంతా అని అడిగాడు వాడు ... 300 లు అని చెప్పాను... సరే నాకు మళ్లీ 4, 5 రోజుల్లో ఇవ్వు అని అప్పుడే ఇచ్చేశాడు. ప్రపంచాన్ని జయించినంత ఆనందం కల్గింది. కానీ దాని వెనుకే ఏదో
నిరాశ ఏంటో అర్థం కానట్టు నిరాశక్తత, బహుశా అది నామీద నాకే జాలి కావచ్చు... నా చేతకాని తనానికి పేదరికం అని పేరు పెట్టినందుకు కావచ్చు, లేకపోతే పరిస్థితులకు లొంగక తప్పదనే నిజం తెలిసినందుకు కావచ్చు,
దేనికైతేనేం ఈ ఆలోచన ఇప్పటిదా.. ఎప్పటిదో. ఇప్పుడు తేలేది కూడా కాదు అని అనుకుంటూ ఆలోచనని కట్టేసి అక్కడ్నుంచి లేచాం ఇద్దరం. ఆపాటికే ఎక్జామ్ ఫీ అప్లికేషన్ను ఫోటోలతో సహా నింపి పెట్టాను డైరెక్ట్గా ఎక్జామ్ ఫీ డైరెక్టర్ దగ్గరి క్యూలో
నిలబడ్డాను. పక్కనే రాజు గోడపై కూర్చున్నాడు, పాపం నాలాగా చదువుబండిని లాగిస్తున్న ఎంతో మంది కూడా ఈ రోజే ఫీజు కడుతుండడంతో లైను పెద్దగానే ఉంది. ఎలాగోలా
మధ్యాహ్నం రెండున్నర లోపు ఫీజు కట్టేసి భయటపడ్డాం. రోడ్డెమ్మట నడుస్తూ ఒక్కటొక్కటి
అడుగుతున్నాను రాజును. ఇంటి దగ్గరి పరిస్థతిల గురించి, ఏం చెప్తాడు ముందే తెలిసినవిగా ఏదేశ చరిత్ర చూచినా అన్న శ్రీ శ్రీ కవిత గుర్తొచ్చింది, మద్య తరగతి వాడి ప్రతి నిమిషానికి
అన్వయించుకోవచ్చు దాన్ని. రూం దగ్గరికొస్తుందనగా రాజుతో చెప్పా చెల్లాయికి పెళ్లి కుదిరిందని, మంచి
సంబందం, కానీ కట్నం కొంచెం ఎక్కువగానే అడుగుతున్నారని, మళ్లీ ఆలోచనల్లో పడ్డా అప్పు ఎంతైనా ఈ సంబంధం
కుదుర్చుకోవాల్సిందే, అప్పు ఉన్నదేగా... దానికి మరికొంత చేరుద్దాం... రేపైనా చెల్లెలు
సుఖంగా ఉంటుందిగా అన్న ఆశతో ఆలోచిస్తున్నాడు. కానీ ఈ కరువు పరిస్థితుల్లో అప్పు పుట్టడం కష్టమే అయినా తప్పదు కదా... బ్రతుకు బండిని ఒడ్డుకి
ఈదడానికి భారనైన్నా మౌనంగానే మోయాలి... లేదంటే మద్యతరగతి చిత్రం అసంపూర్ణంగానే
ఆగిపోతుంది. రూంలోకి వచ్చాం వాడు మామూలైపోయాడు
పొద్దున ఎప్పడు తిన్నాడో, కడుపులో కలకలం రేగుతుందేమో అన్నం వండడానికి
సిద్దమైతున్నాడు, కానీ ఏడతెగని ఆలోచనలు మాత్రం నన్ను వదలడం లేదు. ఒకప్పడు మామూలుగానే అంటే మద్యతరగతి
కొటే కొంచెం ఎత్తులో ఉన్నవాళ్లమేనట, కానీ తాతలు తవ్విన బావులు లేవు. ఇత్తడితో
చేసిన మోటలు లేవు, కాలం కక్ష కట్టిందేమో. సాగు నీరేమో కానీ తాగునీరే లేదు. పంచెకట్టే రోజులు పోయి పాత లుంగీలతో కాలం ఎల్లదీస్తుర్రు. పటేల్లని పిలిపించుకున్నోల్లే పాలేర్లవటానికి
మనసొప్పడంలేదు, ముందేమో నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుంది ఈ పల్లెటూర్ల
బ్రతుకు, అధికారం పోయిన, ఆదర్పం పోయినా, పెద్దరికంను చంపబుద్దైతలేదు పండింది,
పండనిది, తిన్నది, తిననిది పైనోనికేరుక కాని బిడ్ల
పెళ్లిళ్లు మాత్రం ఘనంగా చేయ్యాలే, లేదంటే లోకులు కాకులచ్చి
పొడిసినట్టు పొడిచేసిపోతారు. ఐనా బరిద్దామన్నా తక్కువ కట్నాలకు లగ్గం చేసుకొనేటోల్లేవ్వరు. తినడానికి తిండి లేకున్నా కట్నం తక్కువ తీసుకుంటే ఊరోళ్లందరికి చిన్న చూపే అందుకే అన్నిటి రేట్లు పెరిగినట్టు వరుళ్ల రేట్లు
కూడా పెరుగుతున్నాయి. అందుకే కృత నిశ్చయానికొచ్చి తిండిలేకున్నా ఎలాగోలా
బ్రతుకుదాం కానీ కట్నం మాత్రం తీసుకోవద్దు, వాళ్లు కూడా
మాలాంటి బక్కొళ్లే కదా అని. ఇంతలో ‘ఒరే సుధాకర్ ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావ్ ఐనా ఈ మద్య నీలో ఏదో తేడా కన్పిస్తుంది, ఇంటికెళ్లక ముందు నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఏమైందిరా...
కొంపదీసీ ఎవరినైనా ప్రేమించావా, ఏంటి’ అన్నాడు వాడు.
నవ్వొచ్చింది. పీకల్లోతు బాధల్లో ఇరుక్కొని గత జ్ఞాపకాలు ముళ్లో పూలో అర్థం కాక నేనుంటే
ప్రేమంటా... అసలు అమ్మాయిలతో పరిచయాలే పెద్దగా లేవు అనుకొంటూ ‘ఏం లేదురా’ అని కూరగాయలు
కోయడానికి లేచాను. కాలేజీ నడుస్తుంది జీవితం కూడా ప్రయాణిస్తుంది, ఎక్కడ ఎదుగు
బొదుగులున్నాయో తెలియకుండా ఇన్ని రోజుల్లో నాలో నిశ్శబ్ద తుఫానులెన్నో రేగాయి. ప్రశాంత తీరాలు ముంగిట
వాలయి అన్ని అర్థిక సమస్యలపైనే, ఎందుకంత ఆలోచన, ఇంకా జీవిత భారం నాపై పడనేలేదు ఇప్పడే ఇన్నీ ఆలోచనలా..? ఆరోజు కాలేజీ కెళ్తుంటే ప్రాక్టీస్ టైమ్ టేబుల్ వేశారని శీను వచ్చి చెప్పాడు. వెళ్లి
నోటీసు బోర్డు దగ్గర నిలబడి ప్రాక్టికల్ టైమ్స్ నోట్ చేసుకుంటున్నాను. ఎప్పుడొచ్చిదో
పక్కనే నిల్చుని రాసుకుంటు ‘కెమిస్ట్రీ టైం సరిగా కనబడడం లేదు ఎప్పుడో
చెప్పవా’ అని అడిగింది అనుపమ. ఆమె నా క్లాస్మెట్ నాకు తెలిసిన
ఒకరిద్దరు అమ్మాయిల్లో మాట్లడగలిగే చనువున్నావిడ ఈమె ఒక్కతే, మంగళ, గురు శని వారాల్లో సాయంత్రం 4:30 కి అని చెప్పాను. థ్యాంక్స్ చెప్తూ ఈ రోజు నుంచి నాలుగు రోజులు
క్లాస్ కి రావట్లేదు. నోట్స్ జాగ్రత్తగా రాయవా నాకు అవసరం ఉంటాయని చెప్పి ఇంకొక మాటకు తావియ్యకుండా వెళ్లిపోయింది. వెళ్లి క్లాసులో కూర్చున్నాను. ఒకదాని వెనుకొకటి మూడు క్లాసులు పోయాయి. తర్వాత
కాలేజి అయిపోయింది. ఇంతవరకు నాకు తెలిసి అన్ని క్లాసులు జరిగిన రోజు కాలేజీ
చర్రతిలోనే లేదనుకుంటా... ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ కదా, చెప్పినా చెప్పకున్నా
అడిగే నాథుడే ఉండడు. రూం కెళ్లాను మళ్లీ ఏముంది. చదవడం, వండుకోవడం, ఆరున్నరకి
ట్యూషన్ చెప్పడం అక్కడ్నుంచి వచ్చి పడుకోవడం రోజు ఉండేవేగా. కానీ ఎందుకో ఈరోజు ట్యూషన్ కి పోవాలనిపించట్లేదు కానీ
తప్పదుగా డబ్బులిచ్చే వాళ్లు కదా కారణాలు చెప్పాల్సి ఉంటుంది. పిల్లలు ఇద్దరే కానీ
ఓ 20 మందికి చెప్పాల్సినంత చెప్పాలి ఐనా రోజూ సాయంత్రం ఇదో వ్యవసనమైపోయింది.
ఒంటరిని కాకుండా వాళ్లతో పాఠాల్ని
పంచుకుంటున్నాను, ఆరోజుల్లో జీవిత పాఠాలు నేర్పలేను కదా. పోస్టుమాన్ వచ్చి లెటరిచ్చి
వెళ్లాడు నాకు... ఇంటి దగ్గరి నుండి నాన్న రాశాడు, ఇంటి దగ్గర క్షేమమని రాశాడు, ఏం క్షేమం మొత్తం ఊరంతా క్షామం పరచుకుంటే ఏదో రాసే అలవాటు కదా అలాగే
రాశాడు. మాఘమాసానికి రమ్మని చెప్పి, అమ్మ, చెల్లాయి చూడానుకుంటున్నారట, చెల్లాయి
ఒకటే గోల చేస్తుందని రాశాడు. చెల్లాయిది గోల చేసే వయస్సు కాదు.. నాకంటే మూడేళ్లు చిన్నది. కానీ నాకది ఎప్పటికీ
చిన్నదే. ఒరే అన్నయ్య ఏనుగును ఎప్పడు తెస్తావ్, చందమామ దగ్గరికి తీసుకెళ్లావా,
లేదా అనిగోరుముద్దలు తీనే పసిపాపే. ఎదురెదురుగా ఉన్నంత సేపు తిట్టుకోవడం, కొట్టుకోవడం,
దూరమైనాక బాదపడడం ఇది మనిషి నైజం కావచ్చు. పుట్టకతో వచ్చిన ధర్మం అది.
ఒక్కసారిగా తెరలు
తెరలుగా జ్ఞాపకాల మంచు తెరలు పరచిన దుప్పటి కింద వెచ్చని వేకువ ఝామును గుర్తు చేస్తున్నట్లు
అలుముకుంటున్నాయి జ్ఞాపకాలు. మా ఊరు ఆవూనూరని చిన్న
గ్రామం. నడుమనే గుడి, దానికావల కోనేరు, ఇంకొంచెం దూరమెళ్లితే చెరువు కట్ట, దానిని
ఆనుకునే రాముల వారి గుట్ట , గట్టపైన కూర్చుంటే ఒకవైపు పచ్చని పంట పొలాలు, ఇంకో వైపు
తామర మొగ్గలతో నిండిన పెద్ద చెరువు. వెనుక గుట్టలతో కట్టిన ఆకాశపు వంతెన,
కట్టమీద కూర్చొని గాలాలు వేసి పట్టిన చేపలను కాల్చుకుని ఇంటి దగ్గర నుంచి
తెచ్చుకున్న ఉప్పు కారంను జేబులోంచి తీసుకుని నంజుకుని, ఎవరైనా చూస్తరేమోనని భయం
భయంగా తింటుంటే ఉండే మజానే వేరు, అయితే చెరువు దగ్గరకి
వెల్లొద్దని నాన్న గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఎవరైనా నాన్నకు చూసి చెప్తారనే భయం
కూడా చిన్నది కాదు, ఓసారి చూడనే చూసిండు, చూసిన వాడు ఊరుకోవచ్చుగా తిన్నగా వెళ్లి మా
నాన్నకు చెప్పాడు. వాడెవ్వడో కాదు మా పాలేరే. చాలా మంచోడు నాన్నంటే గౌరవం వానికి
అందుకే చెప్పాడు, కానీ ఆరోజు సంగ్రామం నుంచి అమ్మా, చెల్లి ఇద్దరు నన్ను కాపాడారు.
ఒక రోజేంటి, ప్రతి రోజూ అందమైనదే. నరిగాని హోటల్, రామయ్య సార్ దుకాణం, రాములోరి గుడి, ఒక్కొక్కటి ఒక అద్భుతమై
ప్రదేశం.. ఇలా చెప్పుకుపోతే ఒకటేంటి అన్నీ ఆనంద తీరాలే... ఒంటరి తనంలో తోడుండే నేస్తాలే ఏకాంతంలో
స్ఫూర్తినింపే అనురాగాలే ఈ జ్ఞాపకాలు... ఏం కాదంటారా. మా ఊరి చెరువు
కట్టపై కూర్చుని రాసిన కవిత్వాలెన్నో అందులో కొన్ని పేపర్లలో అడపాదడపా కనిపించాయి కూడా... ఒరేయ్ అని రాజు పలిచిన పిలుపుతో ఈ లోకంలోకొచ్చాను. లెటర్ వాడి
చేతుల్లోకి వెళ్లింది. అంతా చదివినట్లున్నాడు వెదవ. నాన్న రమ్మన్నాడు కదరా వెళ్లవా
అన్నాడు ఇంకా మాఘమాసానికి పది రోజులుందిగా వెళ్దాంలే. అంటూ లేచి మొఖం కడుక్కొని ట్యూషన్ కి వెళ్దామని బయలుదేరాను..
మాఘమాసానికి వెళ్లి
ఇంటి నుంచి తిరిగి వచ్చాను, అయినా అవే జ్ఞాపకాలు, అమ్మా, చెల్లి, నాన్న ముఖ్యంగా ఫ్రెండ్స్ మాఘమాసం నాడు జాతరయి
పోయాక బలవంతంగా అందరూ కలిసి తాగించిన బీరు ఒక్కొక్కడూ వాళ్ల జీవిత కథలు
చెప్పినట్టుగా చెప్పారు. గిరిగాడైతే చాలా బాధపడ్డాడు. ఎందుకంటే వాడికి మా ఊళ్లో
కౌసల్య అంటే చాలా ఇష్టం. కానీ ఉగాది లగ్గాళ్లాల్ల ఆమె పెళ్లి నిశ్చయమైంది. అందుకే
వాడికి బాధ... ఏం చేస్తాం మరీ సినిమాలల్లా హీరోలం కాదు కదా. ఎదురించి లేచిపోవడానికి, గొర్లను కాస్తూ తియ్యని కళగా నెమరేయాలి కానీ పచ్చిక ఉందని అడవిలో
ఉండలేం కదా... చేసేది కూడా అంతే. మళ్లీ జ్ఞాపకాలే ముసురుకుంటున్నాయి.. వాటిలోంచి
భయటపడడం కష్టమే. ఏకాంతంలోకి వస్తున్నాయో లేక ఒంటరితనాన్ని చూపిస్తున్నాయో నాకైతే అర్థమవ్వడం లేదు. కాలేజీకి వెళ్దాం అని
రాజుగాడు అనడంతో పుస్తకాలు పట్టుకుని భయలు దేరాం. ప్రాక్టికల్స్ అయిపోయాయి, ఎగ్జామ్ డేట్స్ కూడా చెప్పేశారు. అనుపమకు కెమిస్ట్రీలో కొన్ని అర్థమవ్వలేదంటా అందుకే రికార్డ్స్ రాయలేదని చెప్పింది. రికార్డ్స్ లేకపోతే
ఎగ్జామ్స్ రాయనివ్వరూ అందుకే నేను పోగానే నా కోసమే చూస్తుందేమో నాదగ్గరికొచ్చింది, ఏంటి అని అడిగాను అలాగే నడుచుకుంటూ వెళ్లి
చెట్టు కొంద నిలబడ్డాము రికార్డ్స్ రాయాలి రోజు సాయంత్రం మా ఇంటికి
రావా అని చెప్పింది. సరే ట్యూషన్ అయిపోయాక వస్తానని చెప్పి వెళ్లి క్లాస్ లో
కూర్చున్నాము, మరునాడు నుంచి రెండు రోజులుగా వాళ్లింటికి
వెళుతున్నాను. వాళ్లమ్మ, నాన్న బాగా పరిచయం అయ్యారు, కానీ అనుపమ పక్కనుంటే ఏదో
ఫీలింగ్ కలుగుతుంది, భయమేస్తుంది ఇది ఏ పరిస్థితులకు దారి
తీస్తుందోనని, ఇంతవరకు బయటి స్ర్తీలతో అంత చనువుగా ఉండకపోవడం వల్ల
కలిగిన ఫీలింగ్ కావచ్చు అలాగే అనిపించినా ఈ రోజు మాత్రం భయంగానే ఉంది వెళ్లాలంటే
కానీ వెళ్లకుంటే ఏమన్నా అనుకుంటుందేమోనని అనిపించి వెళ్లడానికే నిశ్చయించుకున్నాను, రోజులాగే వాళ్లింట్లోకి వెల్లాను కానీ ఇదివరకటిలా
ఉండలేకపోయాను ఆమే మాత్రం మాములుగానే ఉంటుంది, అప్పుడే తలార స్నానం చేసిందేమో చల్లని పిల్లగాలికి వెంట్రుకలు ముందుకు జారీ నా మోముపై నాట్యం చేస్తుంటే నా మనసు ఆనందంగా విచ్చుకుంటున్న
మాయూరమే అయింది, ఆ స్పర్శ రోజూ ఉండేదే అయినా ఈ రోజెందుకో కొత్తగా అనిపిస్తుంది ఎంతగా తప్పుకుందామన్న
నా మనసు నా మాట వినడం లేదు, ఇదేంటి 19 ఏళ్లలో నాకు తెలియని కొత్త మనిషిలా
దాగున్నాడిన్ని రోజులు ఏమయినా వశం తప్పనీయకుండా ఉండాలని వేరే బుక్ తీస్తున్న నెపంతో దూరంగా జరిగాను. తనకి అర్థమై ఉంటుందని
అనుకున్నా కానీ గమనించలేదు, కాసేపటికి ఏంటి అలా ఉన్నావు జ్వరం వచ్చిందా అంటూ
అప్యాయంగా మెడకింద చెయ్యెట్టి చూసింది అరె కాలుతుంది ఏంటి అంటూ లోపలికి వెళ్లి పాలు, పండ్లు తెచ్చింది. అదేంటి నాకు జ్వరమేంటి, ఏమో నిజంగానే వచ్చిందేమో. అలాగే నాలుగు
రోజులు గడిచాయి మరో పది రోజుల తర్వాత తను కూడా అదోలాగా మాట్లాడుతుంది నా మటుకు
మాత్రం ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ట్యూషన్ కూడ సరిగా వెళ్లడం లేదు, తినడం లేదు కాలేజికి మాత్రం రోజు అరగంట ముందుగానే వెళుతున్నాను. రాజు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు కానీ, వాడికి నేనంతకు
ముందు పడే బాధకన్నా ఇప్పుడున్న సంతోషానికి సంబరపడుతున్నాడు కావచ్చు ఓ రోజు మాటల్లో
పడి మొత్తం చెప్పేశాను దానికి వాడు మెల్లిగా వచ్చి పక్కన కూర్చొని ‘దీనికి బాధ పడుతావేంట్రా నువ్వు అనుపమని ప్రేమిస్తున్నావు దానికి భయం
ఎందుకు దైర్యంగా చెప్పేసెయ్’ అన్నాడు వాడు. ‘మన పరిస్థితి తెలుసు కదరా ప్రేమలు మనకు సరిపడేవి కావురా ఒకప్పుడు
ప్రేమలో పడ్డవాళ్లను చూసి పిచ్చివాళ్లనుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే నిజం
తెలుస్తుంది వాళ్ల ప్రపంచంలో వాళ్లెంత రారాజులో ప్రేమను గెల్చుకున్నవాడు నిజంగా
రాజేరా కానీ, మనం రాజులం కాలేం కదా రాజీ పడడం తప్ప జీవితం మనకు నేర్పేదేముండదు.
ఐనా ఈ ఊరి కొనగుట్టకి మా ఊరి రాములోరి గుట్టకి ఎంత అనుబంధం ఉందిరా కానీ, ఏనాడైనా
కలువడానికి చూశాయా లేదు ఎందుకంటే వాటి దూరం వాటికెరుకె గనుక నేను కూడా అంతే. తను ఒక
అందమైన అమ్మాయి తనతో గడిపిని ప్రతి క్షణం ఈ రోజుకు ఒక అందమైన అనుబంధం రేపటికి ఒక
తీయని జ్ఞాపకం అంతే’ అని చెప్పి అక్కన్నించి లేచి వెళ్లిపోయాను. ఈ
మధ్య కవితలు రాయడం మరీ ఎక్కువైంది, అంతేకాక కథలు కూడా రాస్తున్నాను ప్రేమ ఇచ్చే స్ఫూర్తి ఏంటో ఇప్పుడిప్పుడే
అనుభవానికి వస్తుంది. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి మిగతా స్నేహితులందరికన్నా అనుపమనే ఎక్కువగా కలుస్తున్నాను, ఫ్రెండ్సంతా చెవులు కొరుక్కుంటున్నట్టు తెలుస్తుంది అనుకోని ఎవరేమనుకుంటే మాకేంటి మేమేం తప్పు చేయనప్పుడు
భయపడడం దేనికి ఎగ్జామ్స్ కు కలిసే చదువుతున్నాం కానీ ఇంతకు ముందున్నా భయం తగ్గింది
చనువు బాగా పెరిగింది కొట్టుకుంటున్నాం కూడా వాళ్లమ్మ, నాన్న
వచ్చినప్పుడు మాత్రం బుద్దిగా గప్ చుప్ గా చదువుకుంటున్నాం మునుపున్న భయం చాలా
వరకు తగ్గింది పైగా తను చెప్పిన మాటలతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. తనకు ఎంఎస్సీ
కెమిస్ర్టీ క్యాంపస్ లో చేయలనేదే ఆశయం అట ఒకటేమిటి తనకు నచ్చేవి
నచ్చనివి, నాలో తనకు నచ్చేవి నచ్చనివి అన్నింటిని
చెప్పేస్తుంది. అరమరికలు లేకుండా. ఆ రోజే ఏగ్జామ్స్
మొదలయ్యాయి మొదట ఇంగ్లీషు పేపర్ రాసాము, ఎలాగైనా ఈ రోజు
తనకు నా ప్రేమ విషయం చెప్పేద్దామనుకున్నా కానీ, ఒకవేళ తనకు నచ్చకపోతేనో అపార్థం
చేసుకుంటేనో అందమైన స్నేహం పోతుంది ఎగ్జామ్స్ కూడా సరిగా రాయలేము ముఖ్యంగా నేను
మాత్రం అసలు తట్టుకోలేను అందుకే చెప్పకూడదని నిర్ణయించుకున్నాను, ఎగ్జామ్స్
అయిపోయాయి అందరం బాగానే రాశాము. వేసవి సెలవులకు ఫ్రెండ్సంతా ఎవరింటికి వారు
వెళ్లిపోయారు. రాజు కూడా నిన్ననే వెళ్లిపోయాడు నేను ఇంటికెళితే తనని చూడలేనేమోనని
వాయిదా వేసుకుంటా వస్తున్నాను నిజంగా ఎంత మార్పు అనుని ప్రేమించక ముందు
ఎప్పుడెప్పుడె సెలవులు వస్తాయా, ఎప్పుడు ఊరెళ్లాలా అమ్మని, చెల్లిని మా ఊరి
సెలయేరిని, రాముని గుట్టని, నరిగాన్ని ఎప్పుడు చూడాలా అంటూ తొందర పెట్టే మనసు ఇప్పుడేంటి ఇలా తయారైంది, తర్కించిన కొద్ది వాళ్లందరి ప్రేమను నేను పొందాను ఇప్పుడు అనుపమ ప్రేమను
పొందాలి కాబట్టి ఇలా ఉండాలని అనిపిస్తుంది అనిపించింది కూడా. కానీ ఇదోరకంగా నాకు నేనే చెప్పుకునే ఓదార్పనిపిస్తుంది... ఏదైతేనేం సాయంత్రం
అను వాళ్లింటికెళ్లాను, రేపు ఇంటికెళ్తున్నానని చెప్పాను ఏం మాట్లాడలేదు. కాసేపు ఇద్దరం మౌనంగానే ఉన్నాం నేను
వెళ్తానని చెప్పాను, లోపలికి రా అని పిలిచి మేడమీదికి తీసుకెళ్లింది
చాలా సేపు వసంత సంధ్యను చూస్తునే కూర్చున్నాం, ఎప్పుడూ గోదారి గలగలలా మాట్లాడే తనేంటి గంభీర ముద్రను దాల్చింది ఏదో
అనుమానం, మనస్సు వసం తప్పుతున్నట్టు అనిపించింది, ప్రేమిస్తున్నానని చెప్పేద్దామనుకున్నాను కానీ ఆమె ముఖంలో ఏ భావం
కనిపించడం లేదు నిగ్రహించుకుని లేచి నిలబడ్డాను వెళ్తునాన్నట్టుగా, తను కూడా
లేచింది ఇద్దరం కలిసి కిందికి దిగాం మళ్లీ ఒకసారి చెప్పాను రేపే ఇంటికి
వెళ్తున్నానని మౌనంగానే అన్నది సరేనంటూ. రూంకెళ్లి పడుకున్నానన్నమాటే కానీ నిద్రపట్టడం లేదు. ఏవో ఆలోచనలు, మళ్లీ
సంద్రంలోని సుడుల్లా పాత కాలంలోకి నెట్టేసినట్టు భయం వేసింది. ఆ భయంలోనే మగత నిద్రలోకి
జారుకున్నాను. ఎప్పుడు తెల్లరిందో ఏమో కిటికిలోంచి వస్తున్న ఎండ తగిలి కళ్లు
విచ్చుకున్నాయి లేచాను, స్నానం చేస్తున్నాను కానీ ఆ స్ప్రూహే లేదు...
తొమ్మిదింటికి బట్టలు సర్థుకుంటుండగా వచ్చింది అను, నిజంగా అద్భుతం
ఏంటీ ఇప్పుడు తన నా రూంకి రావడం, ఆశ్చర్యంలోంచి తేరుకుంటూనే లోపలికి రమ్మన్నాను, రెడీ అయినట్టున్నావుకదా వెళ్తూ మట్లాడు కుందాం రా అంది.. రూం కి తాళం
వేసి భయటపడ్డాం.. మళ్లీ ఎప్పుడస్తావ్ అంది అదో రకంగా, జూన్ లో అన్నాను అంతే మళ్లీ మాటల్లేవ్, ఒకప్పుడు కొట్టింది, తిట్టింది, పర్సు దాచిపెట్టి ఏడిపించింది తనేనా? ఏంటీ మా ఇద్దరి మద్య నైరాశ్యం.. నామట్టుకి ఏదోదో మాట్లాడుదామనిపించింది, ఏదో చెప్పుతున్నాననిపించింది, కానీ ఏమీ లేదు
మళ్లీ నిశ్శబ్దమే... ఎప్పుడైన ఇంటికెళ్తుంటే బస్సు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చేసే వాడిని పావుగంట ముందు వచ్చిన బస్సునైనా ఇంకో అరగంట ముందు వస్తే దీని సొమ్మేం పోయిందని తిట్టుకుంటూ ఎక్కేవాడిని,
కానీ ఇప్పుడు మాత్రం బస్సు రావాలనీలేదు, వద్దనీ లేదు.. ఏదో నాకే అర్థం కానీ నాతత్వం
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. బస్టాండ్ దగ్గరకు రాగానే చేతిలో గిఫ్టు ప్యాకెట్ పెట్టి తొందరగా రావా
అని చెప్పి సూటిగా కళ్లల్లోకి చూస్తూ వెళ్లిపోయింది... అదేంటి కళ్లల్లో నీళ్లు అని
ఆశ్చర్యపోయేలోపే బస్సు హారన్ వినిపించింది, బస్సు దగ్గరగా రానే వచ్చింది. తను చాలా దూరం
వెళ్లింది అంత స్పీడేమిటో అనుకుని బస్సు ఎక్కాను, బస్సు కొంచెం
లేటైతే ఆమె వెనకే పరుగెత్తే వాడి నేమో అంత బాధ ధ్వనిస్తుంది హృదయంలో బస్సు వేగం పుంజుకుంది
కానీ అంత కన్నా వేగంగా నా ఆలోచనలు పరుగెత్తుతున్నాయి, బస్సు కుదుపులకు ఈ లోకంలోకి
వచ్చన నాకు చేతిలో ప్యాకెట్ కనిపించింది. నెమ్మదిగా విప్పి చూశాను ఒక వాచీ, ఒక
పెన్ను, పేపరుపై నన్ను మరవవుగా అని రాసింది. నా నుంచి వెల్ల కూడదనుకుందో ఏమో వాచీలా పట్టుకుంది మళ్లీ
మధురమైన ఊహ కవిత రాద్దామని పేపరును తీసిరాశా అందమైన నా మనస్సులోని భావాలకి
సిరాక్షరాలై తను బయటకొస్తుంది. ఇంటి దగ్గరనున్నాననే ధ్యాసే కానీ మనస్సు మాత్రం
అను దగ్గరే ఉంది. రెండు మూడు రోజులుగా అమ్మ, చెల్లి గమనిస్తూనే ఉన్నారు, అయినా వాళ్లు గమనిస్తున్నారన్న ధ్యాసే లేదు, ఓ రోజు అమ్మ అననే
అన్నది ఏమైంద్రా ఒంట్లో బాగా లేదా అని, అదేం లేదమ్మా అని చెప్పాను, చెల్లి మెల్లిగా వచ్చి మెడకింద చెయ్యెట్టి చూసింది అదే స్పర్శ, అదే ప్రేమ, ఎవరైతేనేం చెల్లైతేనేం, ప్రేయసైతేనేం ప్రేమ, అవును మరి ప్రేమ చాలా
గొప్పది మనల్ని బతికించేది అదే, శాసించేది అదే అమ్మ మల్లీ అంది రేపటి నుంచి వరి కోత మొదలెడుతున్నాము నువ్వు వస్తావా
అని, ఇదివరకటి రోజుల్లోనైతే తప్పకుండా రమ్మనే వారు, ఇప్పడంత పని లేదు. ఏదో ఇద్దరు వంగి
చేస్తే రెండు రోజుల్లో ముగిసే పని ఐనా ఈ జ్ఞపకాల నుంచి కొంచెం సేపైనా విశ్రాంతి
దొరుకుతుందని వస్తానని చెప్పేశాను. తెల్లారి నుంచి వరి కోత మొదలెట్టాం ఎండలు
బాగానే ఉన్నాయి తొలి రోజు అవడం చేత కొంచెం ఒళ్లు నొప్పులున్నాయి,
తల కూడా నొప్పిగానే ఉంది కానీ అమ్మ చేతి వంట తినడం చేత
అను జ్ఞపకాలకు దూరంగా ఉండడం చేత కొంచెం ఉపశమనం అనిపించినా ఆ ఆత్మీయ స్పర్శ గుండెను
తాకుతూనే ఉంది, తెల్లారి నుంచి ఐదు
రోజులుగా పని చేస్తూనే ఉన్నాం, కైకిళ్లు దొరక్కపోవడం చేత పని కొంచెం ఆలస్యమైంది
కానీ మరునాటి నుంచి బదల్లు పోవడం చేత ఇంకో 15 రోజులు పని చేస్తూనే ఉన్నాను.
ఇప్పుడిప్పుడే జ్ఞపకాల తెరల అలల తాకిడి తగ్గుతుంది కానీ గుండె సంద్రం మాత్రం
హోరెత్తుతూనే ఉంది ప్రతి రోజు సాయంత్రాలు గద్దెమీద కూచోని
చిన్నప్పటి సోపతులతో కబుర్లు చెప్తుంటే కాలం గడుస్తూనే ఉంది క్రమ క్రమంగా జ్ఞపకాలు పెరుగుతూనే ఉన్నాయి పని లేదు కదా మళ్లీ అలజడి. మద్యలో ఒక్కసారి పొయోద్దామని అనుకున్నా కానీ పోలేకపోయాను, కాలేజీ మళ్లీ మొదలవ్వడానికి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది ఒక రోజు
నాన్నొచ్చి అన్నాడు చెల్లెలికి పెళ్లి కుదిరింది కదా డబ్బు
ఇబ్బందవుతుందేమో అందుకే నీకు కూడా పెళ్లి చేద్దామనుకుంటున్నామని, నెత్తిన పిడుగు పడ్డట్టయింది అదిరిపడి చూశాను, అదేంటి ఇప్పుడే పెళ్లా అని అన్నాను ఆశ్చర్యంగా
ఏం చేయమంటావ్ మీ మామయ్య ఇంకా ఆగలేనన్నాడు, ఈడొచ్చిన పిల్లను ఎన్ని రోజులని ఇంట్లో పెట్టుకొమ్మంటావ్ అని అంటున్నాడు.
ఇక్కడ చెల్లి పెళ్లికి సాయం చేస్తానని అంటున్నాడని నాన్న నసిగాడు, ఏం చెప్పాలో అర్థం కాకపోయినా ఖచ్చితంగా చెప్పేశాను నా కాళ్లమీద నేను నిలబడే దాకా పెళ్లి చేసుకోనని, ఇంతలోనే అమ్మచ్చింది ఇప్పుడే ఎందకీ గొడవ ఇంకా సంబంధం కుదరనిదే అంటూ నాన్నని
తీసుకుని బయటకెళ్లాం. నాకు మాత్రం చాలా అదుర్ధాగా భయంగా ఉంది, అదేమిటి ఇప్పుడే పెళ్లా ఒకవైపు నాకే తిండిదొరక్క చస్తుంటే ఇంకొకల్ని ఎలా
భరించగలను ఖచ్చితంగా చేసుకోకూడదని నిర్ణయానికొచ్చాను, మళ్లీ అమ్మతో చెప్పాను నేను పెళ్లి ఇప్పుడే చేసుకోను, మామయ్య బిడ్డను అస్సలే చేసుకోను ఏమనుకుందో మౌనంగా ఉండిపోయింది, ఇంకో ఐదు రోజుల్లో కాలేజీ మొదలైతుందనగా ఇంట్లో చెప్పి బయలు దేరాను
బస్టాండ్ వరకు వచ్చిన నాన్న వారం రోజులుగా చెప్తున్నదే మళ్లీ చెప్తున్నాడు, ఇంటి పరిస్థితి గురించి, చెల్లెలి పెళ్లి గురించి ఒక్కటొక్కటిగా
అన్నీ సమస్యలే ఈ వారం రోజులుగా నాలో వ్యక్తిత్వానికి,
పరిస్థితులకు మధ్య సంఘర్షణ ఎంత బాధేస్తుందంటే చచ్చి పోదామనిపిస్తుంది, కానీ తల వంచితే చచ్చిపోయినట్లే అనుకొని అవే ఆలోచనలతో బస్సెక్కాను, రూం లోకివెళ్లాను, చిందరవందరగా దుమ్ము పేరుకుపోయింది, తుడుద్దామనుకున్నాను కానీ ఒపిక లేదు, రాగానే వెళ్లి అనుపమను కలుద్దాం అనుకున్నాను కానీ ఆసక్తి లేదు, ఐనా ఆమెను చూస్తే మనస్సు స్థిమితంగా ఉంటుందా? అమ్మో అది మాత్రం నా
వల్ల కాదు. పది రోజులు గడిచాయి రాజుగాడు నిన్ననే వచ్చాడు కాలేజీకి వెళ్లుతున్నాను
కానీ అనుపమకు కనిపించట్లేదు అస్సలు తను వస్తుందో లేదో ఏమీ తెలియదు, ఆ రోజు సాయంత్రం రాజుతో ఇంటి దగ్గర జరిగిన మొత్తం సంగతులు అన్నీ
విడమరచి చెప్పాను, అంతా విన్నాక తిట్టాడు ఏంట్రా అలా ఆలోచిస్తావ్ డబ్బు ఇవ్వాల కాకుంటే రేపు సంపాదిస్తావ్ కానీ ప్రేమను సంపాదించలేవ్ రా ధైర్యంగా వెళ్లి
అనుతో నీ ప్రేమ విషయం చెప్పెయ్ అన్నాడు, వాడు చెప్పింది
నిజమే కానీ అంత ధైర్యం ఎక్కడిది నాకు తెల్లారింది స్నానం చెసి కాలేజీకి వెళ్దామని
రడీ అయ్యాను ఇస్త్రీ బట్టలు తెస్తూ ఆయాసపడుతూ ఉరుకొస్తున్నాడు రాజు, ఏంట్రా అన్నాను అనుపమ వస్తుంది రా అన్నాడు ఒక్కసారిగా కట్టలు తెగిన
సంతోషంతో ఎక్కడ్రా అన్నాను, కానీ మరుక్షణమే నిరాసక్తత దూరంగా జరిగాను ఏమైందిరా అన్నాడు మౌనంగా ఉండడం చూసి ఒరేయ్ ఇంకా నువ్వు
ఇంటి జ్ఞపకాల్లోనే ఉన్నావ్ ఏమైతే అదైందీ అనుపమతోనే నీ జీవితం ఒక వేళ ఇప్పడు నీవు చెప్పకున్నా నేను చెప్తాను
అంటున్నాడు ఆవేశంతో, వాణ్ని పట్టుకున్నాను ఇంతలో అనుపమ రానే వచ్చింది తనని చూస్తూనే రాజు బయటకెళ్లాడు
లోపలికొచ్చింది అవే కళ్లు మళ్లీ నీళ్లు తిరుగుతున్నాయి ఇద్దరి మద్య మౌనమే రెండు
నెలల ఎడబాటుని మరిచిపోయేలా ఒకరి కళ్లు ఒకరిలోకి అర్థ్రంగా చూసుకుంటున్నాయ్
హఠాత్తుగా ఏడుస్తూ గుండెల పై వాలిపోయింది, ఒక్కసారిగా గుండె ఝల్లుమంది ఏమైందీ అంటూ పైకి లేపబోయాను కానీ ఉద్వేగం పెళ్లుబుకుతుందేమో అలాగే
ఉండి పోయింది ఐదు నిమిషాల తర్వాత మెళ్లిగా తలపైకెత్తి నుదుటిపై చుంబించాను కానీ
తర్వాత అనిపించింది ఎందుకలా చేశానా అని కానీ తను మాత్రం నిశ్శబ్దంగానే ఉంది
ఒక్కటొక్కటిగా అన్నీ మాట్లాడుకున్నాం మూడు గంటలు మూడు క్షణాల్లా గడిచిపోయాయి
చివరికి అందీ ఇక్కడికొచ్చి పది రోజులైదంటగా నన్నెందుకు కలువలేదంది మళ్లీ ఒక్కసారిగా
పరిస్థితులు గుర్తొచ్చాయ్ మౌనంగా అలాగే కూర్చున్నాను లేవబోయింది కూర్చోమన్నాను లేదు వెళ్లాలంటూ లేచింది నేనూ
లేచాను గుమ్మం దాకా వెళ్లి వెనక్కు తిరిగి చూసింది కళ్లలో నీళ్లు అలాగే వెనక్కి
వచ్చి అధరాన్ని చుంబించింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి షాక్ అయ్యాను ఇంకా తేరుకోక
ముందే ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి వెళ్లిపోయింది. మళ్లీ
షాక్ అయ్యాను రాజు లోపలికి వచ్చాడు ఏంట్రా మరీ ఇంత సేపు బయటకూర్చోపెట్టారు తనేంటి
సంతోషంగా నవ్వుకుంటూ వెళ్తుంది అన్నాడు తర్వాత నాలుగు నెలలుగా దూరంగానే ఉంటున్నాను
ఓ రోజు ఏడుస్తూ రాజుతో రూంకి వచ్చింది, నేనేం తప్పు చేశానో చెప్పమంది ఏం చెప్పాలి, తనేం తప్పు చేసింది, తప్పంతా
నాదేగా రాజు సీరియస్ గా తిడుతూనే ఉన్నాడు వానికి విసుగనిపించిందేమో బయటకెళ్లాడు నా
పరిస్థితి అంతా ఆమెకు చెప్పాను, చావనైతే చస్తాను కానీ నువ్వు లేనిది
బ్రతకనంది మొహం చూస్తుంటే అన్నంత పని చేసేలాగా ఉంది రేపటిలోగా ఏదో ఒకటి తేల్చమని
చెప్పి వెళ్లిపోయింది. రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నా. తనకంత ధైర్యం ఉండగా నేనేంటి పిరికి వాడిలా
ఆలోచిస్తున్నాను, ఏది ఏమైనా సరే తనే నా జీవితం ఇది కృత నిశ్చయం లేదంటే ఆమె లేని నేను
ఉంటానా? అది మాత్రం జరగని పని అందుకే అయ్యేదేమైనా ఇద్దరికి కలిసే జరగుతుందనే
నిర్ణయానికొచ్చాను. ప్రతి రోజు ఉషోదయాలు, పచ్చిక బయళ్లు పారే సెలయేళ్లు, చెరువు గట్లపై అను,
నేను ఊహకేం అద్భుతం.. ఆరె నెలలు ఆరు నిమిషాల్లా గడిచాయి ఈ కాలంలో కవితలెన్నో
కథలెన్నొ ఒకటేంటి చాలా వీటన్నింటినీ నాకు తెలయకుండా పేపర్లకు పంపుతూనే ఉందేమో ఒక
రోజు ఇంటి దగ్గరి నుండి లెటర్ అర్జంట్ గా రమ్మని కబురంపారు వెళ్లాను చెల్లికి
పెళ్లి కుదురిందటా నాకు పెళ్లి నిశ్చయం చేస్తారట, నేను వద్దన్నాను అను గురించి చెప్పాను నాన్న
కోపానికి అవదుల్లేవు, అమ్మ ఏడుస్తుంది చెల్లి దగ్గరకు వెళ్లి అడిగాను నేను చేసింది తప్పా అని, ఏడుస్తోంది పిచ్చిది కష్టాలన్నీ
కలిసొచ్చినట్టుగా ఓదార్చాను అంతా సవ్యంగా జరుగుతుందని నచ్చజెప్పాను ఇంతలో మామయ్య
వాళ్లోచ్చారు విషయం తెలిసినట్టుంది చిరుబురులాడుతున్నారు నిక్కచ్చిగా చెప్పాను
నేను అనునే పెళ్లి చేసుకుంటానని కోపంతో గంతులేశాడు, చదువు నేర్పిన పొగరన్నాడు ఐనా భరించాను ఎందుకంటే కూతురు పెళ్లి
చేయలేకపోతున్నాననే బాధలో అలా అంటున్నాడనుకొని నచ్చజెప్పాను నా కంటే మంచి సంబంధం దొరుకుతుందని, వినలేదు నాన్న
దగ్గరికెళ్లి చెప్పాను నేను పెళ్లంటూ చేసుకుంటే అది అనుని మాత్రమే కాలేజీకి
వెళ్లాడానికి సిద్దమయ్యాను ఇదివరకట్లా లేరు, ఐనా అమ్మ దగ్గరికెళ్లి నాన్నకు వినపడేట్లుగా చెప్పాను చెల్లిలికి
ఆసంబందం కుదర్చమని ఎండకాలం లాగ్గాల్లో పెళ్లి ఏర్పాట్లు చెయమని చెప్పి
బస్సెక్కాను, కానీ మళ్లీ ఆలోచనలు చెప్పనైతే చెప్పాను కానీ యాబై వేలు ఎక్కడి నుంచి తెస్తాను. అవే బాధలు ఎగ్జామ్స్ మొదలయ్యాయి అనుకి అన్ని
విషయాలు చెప్పాను, తనే రోజూ దగ్గరుండి చదిస్తుంది వాళ్లింట్లో కూడా మా విషయం చెప్పేసింది, చస్తానని బెదిచించడంతో వాళ్లోప్పుకున్నారు
అందుకే అంత దైర్యం తనకి కానీ చదువు బుర్రకెక్కడం లేదు ఒకటే ఆలోచన మళ్లీ డబ్బు కావాలి ప్రేమను పొందలేను
అనుకున్నా కానీ దాన్ని సాధించాకా మళ్లీ ఇదొక్కటొచ్చిపడింది ఎన్ని సమస్యలో చిన్న
జీవితానికి, ఐనా అను రోజు దైర్యం చెబుతూనే ఉంది. నువ్వు మీ చెల్లలి పెళ్లి చేస్తావ్
అని అదే దైర్యం నాకు లేకపోతే ఈ వయస్సులోనే గుండెపోటు వచ్చేదేమో ఎగ్జామ్స్
అయిపోయాయి. నాకు ఖచ్చితంగా తెలుసు నేను తప్పుతానిని ఒక పేపరు అస్సలే రాయలేదుగా ఇంటికెళ్లబుద్దికావట్లేదు
ఫ్రెండ్స్ అంతా వెళ్లారు, వెళుతూ వెళుతూ పెళ్లికి తప్పక పిలవాలని చెప్పారు కాలేజీ లో అటెండర్ దగ్గరి నుంచి ప్రిన్సిపాల్ వరకు అందరికీ తెలుసుగా మా ప్రేమ
కథ ఏమౌతుందోనని అందరికీ ఆసక్తే వాళ్లకేంటి మోసే వాడికి తెలుస్తుంది కావడి బరువేంటో చెల్లెలి పెళ్లి
పదిహేను రోజులే ఉంది నాన్న లెటర్ వేశాడు ఇళ్లు తాకట్టు పెట్టానని, తొందరగా రమ్మని మడిచి
జేబులో పెట్టుకున్నాను. ఓడిపోయిన వాణ్ని అంతకుమించి ఏం చేయగలను రేపే ఇంటికెళ్దామని
నిశ్చయించుకున్నాను. అనుపమకి నిన్ననే చెప్పాను తొందరగా రమ్మని కానీ తనొచ్చేదాకా నేను
నిద్రలేవలేదు అసలు నిద్రపట్టిందే నాలుగింటికి కదా డోర్ పెద్ద శబ్దంతో మోగుతుంటే
అసహనంగానే వెళ్లి తలుపు తీశా ఎదురుగా అను తెల్లని చీరలో మిళ మిళ మెరుస్తుంది చాలా
సంతోషంగా ఉంది ఏదో చెప్పాలనే ఆత్రుతలో ఉంది లోపలికి వెళ్లబోయాను ఆపింది
ఏంటన్నట్లుగా చూశాను నోరు తెరవ మంది ఎందుకో అర్థం కాలేదు అయినా తెరిచాను స్వీట్
పెట్టింది అదేంటి పిచ్చిదా మోహం కడగకముందే స్వీటు పెట్టావని విసుక్కున్నాను న్యూస్
పేపర్ తీసి చదవమంది ఏంటన్నాను చదివితే తెలుస్తుందిగా అని చూపించింది, చదువతుండగానే ఆశ్చర్యపోయాను నా కళ్లను నేను నమ్మలేకపోయాను అసలు కళో, నిజమో
అర్తం కావడం లేదు నా కథకి ‘ఆటా’వారి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే లక్ష రూపాయలు బహుమతి ఆనందంతో తనని గిరగిరా గాల్లో
తిప్పాను, రెండ్రోజుల తర్వాత మంత్రి చేతుల మీదుగా చెక్కు తీసుకుని డ్రా చేసి ఆనందం
నిండిన కన్నులతో మా ఊరి బస్సెక్కాను, అప్పుడడిగాను మెళ్లిగా అవునూ ‘ఆటా’కి నా కథను ఎవరు పంపారని ముసి ముసిగా నవ్వుకుంది, ఇంటికెళ్లా అందరు పేపర్లో చూసినట్టున్నారు అభినందిస్తునే ఉన్నారు.
మామయ్యనైతే మరీ బాధపడుతున్నాడు నన్నుఎగతాలి చేసినందుకు పశ్చాత్తాపం కావచ్చు. మేళ తాళాల మద్య సంబరంగా చెల్లి పెళ్లి
అయిపోయింది భోజనాల దగ్గర అమ్మని మెచ్చుకుంటున్నారంతా బంగారం లాంటి కోడలు
దొరికిందని అవును మరీ బంగారం కన్నా విలువైనదే ఎప్పుడొచ్చిందో వెనక నిల్చుంది, తన చేతిని చేతిలోకి తీసుకున్నా తినడానికి
పిలిస్తే వెళ్లాం. ఈ సారి పరీక్షల్లో తప్పినా జీవితం పెట్టిన పరీక్షలో మాత్రం 100 శాతం మార్కులతో పాసైన సంతృప్తితో తృప్తిగా భోం చేశా
చాలా రోజుల తర్వాత కడుపునిండా.