13, జులై 2020, సోమవారం

నా తెలంగాణ కంజాతవల్లివి

ఎంత పుణ్యఫలమో ఇవ్వాల నేనిక్కడ నిలబడి ఈ స్వేచ్చాగానాన్ని ఆలపిస్తున్నాను
ఈ ఆరేండ్లలో నా తెలంగాణా ఎన్ని లక్ష్యాలని ముద్దాడింది
ఎన్నెన్ని కలల్ని సాకారం చేసుకుంది
ఎంతెంత ఆనందాన్ని అనుభవించింది
వీటన్నింటికి కారణమై...
ఇవ్వాల్టి తెలంగాణా ప్రజలందరి బతుక్కి తోరణమై....
మెరిసే పుణ్యజీవుల్ని స్మరించుకోవడమే...
నా స్వేచ్చాగానానికి నిండుదనం.
ఎవరెన్ని చెప్పినా....
చరిత్ర ఎలా రాసినా....
ముమ్మాటికీ నా ఈ నేల రత్నగర్బగా..
కోటి రతనాల వీణగా...
రాగాలాపనలలో.....
శ్రుతి, లయ, రాగం, భావం
ఆత్మభలిదానాలతో ఆచరణకి బాటలు వేసిన నా అమరులకే అగ్రతాంబూలం.
రేపన్నది స్వరాష్ట్రంతోనే ఉంటుందని చైతన్యం చేసిన త్యాగశీలులదే దార్శనికం.
స్వరాష్ట్రం మా జన్మహక్కని చాటిన నాలుగున్నర కోట్ల తెలంగాణా ప్రజలదే అంతిమ విజయం.
1967లొ విఫలమైన చోట 2014లో విజయాన్ని ముద్దాడడం వెనుకనున్నది ఖచ్చితంగా నాయకత్వ వ్యూహం
నేడు చూస్తున్న కుళ్లు రాజకీయాల్లో...
ఎవడేమైపోతే నాకేంటి అనుకునే కుఠిల కపటత్వంలో...
ఆమె ఏ ప్రయేజనాలని ఆశించిందో....
ఏ ఎత్తుల జిత్తులతో ఆటాడిందో....
కానీ తల్లీ....
నువ్వు లేకపోతే....
నువ్వంత కఠినంగా లేకపోతే...
తలుపులు మూసైనా...మా తలపులని నెరవేర్చకపోతే....
నాకల కల్లనే ఔను.
నాకల రావణ కాష్టంలా రగులుతూనే ఉండు.
ఇంకా ఎన్నో బలిదానాలు సాగుతూనే ఉండు.
అందుకే..... అందుకే.....
అమ్మా....
నీ జాతియత నాకక్కరలేదు
నీ మతం నేనెరుగను
నీ కులగోత్రాల ఊసు నాకొద్దు
నువ్వే నా తల్లివి
నా తెలంగాణ కంజాతవల్లివి
జై తెలంగాణ జై జై తెలంగాణ


ఇవ్వాలేమైంది నీకు.....

ఇవ్వాలేమైంది నీకు....
గ్రీష్మంలో మోడువారినప్పుడు కూడా
తాపంతో తరుక్కుపోయిన నామోములో అరుణారుణకాంతుల్ని చూసినవాడివి
శిశిరంలో గడ్డకట్టుకపోయినప్పుడు కూడా
విడివడిన బిందువుల్ని మంచులా బందించి అల్లుకుపోయినవాడివి
ఇవ్వాలేమైంది నీకు....
ఆశాడ మేఘంలో ప్రేమలేఖల్ని నీటి బిందువులుగా చేసి
అవనిపై అల్లుకుపోయే తీగల్ని ముద్దాడడానికి వర్షంగా నేను వస్తుంటే....
పూల రెమ్మల్లోంచి పుప్పొడి మోహంతో కైపెక్కి
ఎదురుగాలుల్ని చీలుస్తూ నీ యదసడికోసం తుమ్మెదనై నేనొస్తుంటే....
ఎక్కడిదీ ప్రచండ మారుతం
ఏమిటీ విది వైపరీత్యం
ఎడబాటు కోసం ఎవరు స్రుష్టించారి తడబాటు
నిను కలువద్దంటుంది
తనువులు తగలద్దంటుంది
వసంతం వేసిన చిగురులు మ్రుగశిర తొలకరి కోసమేగా....
మట్టిని ముద్దాడే విత్తు చివురుల మెలకల కోసమేగా...
ఉరకలై పరుగులెత్తే గంగమ్మ సముద్రుడి సాన్నిత్యం కోసమేగా....
ఇదే కదా ప్రక్రుతి
దీన్ని విక్రుతి చేసిందెవరు
ఆత్మీయ ఆలింగనాలు లేకుండా
మనసారా పలకరింపులు లేకుండా
ఇవ్వాలేమైంది నీకు.....

పొక్కిలి

అరే, ఆకిలంత పొక్కిలి జెయ్యకుబిడ్డా... గిప్పటికే హైద్రాబాద్ల సాబాష్ బండలేపియ్యకుండా లీల్లచ్చినప్పుడల్లా గీ బురదేందని వాడకట్టోల్లంత తిట్టవట్టే... ఇంకా అండ్ల నువ్వు పొక్కిలి జేస్తే ఎట్ల బిడ్డా... అని వాకిట్లో ఆడుకుంటున్న మనమరాలిని అదలిస్తూనే లోపలికెళ్లాడు లక్ష్మణ్. అప్పటికే ఇంట్లో వంటచేసి తినడానికి లక్ష్మణ్ కోసం ఎదురుచూస్తున్న ఆమె బార్య లక్ష్మీ ‘బిడ్డ జేసే పొక్కిలి గాదు నువ్వుజేసే పొక్కిలి గురించి జెప్పు, గిప్పుడు ఎనిమిదైతంది ఇంకెంతసేపు జూడాలే బువ్వ తిననీకి తొమ్మిదైతే గేటు బంజేత్తమని కిరాయోల్లకి జెప్పుడు గాదు, మనంగూడుక సందియ్యద్దు. సరే సరే జల్ది రాపో ఆకలైతాంది తిందాం' అన్న బార్య అదిలింపుతో పాంటు షర్ట్ విప్పి కాళ్లు చేతులు మోఖం కడుక్కొని దిగూట్ల పెట్టిన బాటిల్ బయటకి తీసి పెగ్గుపోసుకొని లిలబడే తాగి, మరోపెగ్గు కలుపుకొని టీవీ ముందటికొచ్చి కూర్చున్నడు లక్ష్మణ్. బార్య వడ్డించిన అన్నం తింటూనే... 'ఉగాది పండగ సీజన్ గదా... మా బట్టల షాపుల గిరాకీ ఎక్కువున్నది ఎనిమిది దాక పంజేయాలని జెప్పిండ్రు, ఏం జేత్తం మరి తప్పదు గదా...' అన్నడు. 'ఏంది తప్పేది సప్పుడు జేక నీ నౌకరి బంజేయ్, మన దాబాపైనేసిన రెండు రేకుల షెడ్ల కిరాయి ఆరేలు చాలవా మనం బతకనీకి, ఉన్న ఇద్దరు బిడ్డలు ఆళ్లుల్లతోని ఉన్నదాంట్ల మంచిగనే బతకవట్టె ఎందుకింత ఆరాటం మనిషికి, ఏం జేసుకుంటాం ఇదంతా' అంది. 'ఏందే చాలేది, గీ పట్నంల ఆరువేలు ఎంత కడుపుగట్టి బతికినా రెండువారాలు జాలయి. మరి తతిమ రోజులు అళ్లుల్లని అడుక్కొని బతకమంటవా... నాకింక గా కర్మవట్టలే... నా కాళ్లు చేతులు ఆడినంతకాలం నా పని నేనే జేసుకొని బతుకుతా... సరే గని పొల్ల తిన్నదా... పండుక్కి బిడ్డల్లత్తుండ్రా... బచ్చ్యాలు జేయనీకి సామాను తెచ్చినవా... అళ్లుల్లకి బట్టలు వెడ్దామా...' అని ఇంకా ఏదో అడగబోతుంటే లక్ష్మీ అడ్డుతగులుతూ... 'ఆ పెడ్తం తియ్ దసురకి పెడ్తం మల్ల ఉగాదికి పెడ్తం ఎన్ని సార్ల పెడ్తం గయినా మనం కడుపుకట్టుకొని సంపాయించిందంతా మనం బోయినంక ఆళ్లకి గాకపోతే ఎవులకు బెడ్తం. ముందు పెరుగేసుకొ.... దావఖానకు బోయినవా... మందులు తెచ్చుకొమ్మంటే ఇంటున్నవా... ముందు నామాటిను నువ్వు' అని లక్ష్మీ రోజూ అన్నం తినేట్టప్పుడు చెప్పే మాటల్నే చెపుతుంది. 'ఆ సరే సరేలే అన్నీ తెచ్చుకున్న, గా సంటిదాన్కి తినపెట్టి పడుకో...' అని పల్లెం పట్టుకొని జాలాట్ల కెల్లి కడుక్కచ్చుకొని సిగరేట్ ముట్టిచ్చుకుండు లక్ష్మణ్. నలబై ఏళ్ల క్రితం ఉన్నఊరు ఆవునూరిని వదిలి పెళ్లైన కొత్తల్నే పట్నంకి బతకనీకి వచ్చాడు లక్ష్మణ్. దొరికినకాడల్లా ఆలూ మగలూ పన్జేసుకుంటూ... ఖైరతాబాద్ బస్తీల అరవై గజాల్లో నోటరీ ఇల్లు సంపాదించి, ఉన్న ఇద్దరు కూతుర్లకి మంచి చదువులు చదివించి, వాల్ల పెండ్లి తనకన్నా మెరుగ్గా పనిమంతులయి ఏసీరూముల్లో పన్జేసుకొని, ఈఎమ్ఐల్లో ఇల్లుకొనుక్కున్న అళ్లుల్లకిచ్చి చేశాడు. ఈ బస్తీకొచ్చి బతకడానికి వాళ్లకి నామోషి, ఆ మార్బుల్ జారుడులో బతకడానికి వీళ్లకి ఇబ్బంది, ఇలా అటు మద్యతరగతికి, ఇటు ఊళ్లో తన తండ్రి బతికిన లేకి బతుక్కి మద్యస్థంగా బతుకుబండిని సాగదీసుకుంటూ వస్తున్నాడు లక్ష్మణ్. ఈ నలబై ఏళ్లలో దసరా పండగున్న ఐదు రోజులు తప్ప మిగతా జీవితమంటా ఏదో ఓ పనిజేసుకుంటూనే బతికారు ఆ దంపతులు. బిడ్డల పెండ్లీలయినంకా... బరువు బాద్యతలు కొంచెం తీరినంకా..., లక్ష్మీతో పనిమానిపించి తను మాత్రం పనిచేస్తూనే ఎలాగోలా ఎవరిజీవితాలు వాళ్లు కష్టపడుతూ వెల్లదీస్తూనే ఉన్నారు. ఇలా 2020 మార్చి22వ తేది వాళ్ల జీవితాన్ని చిన్నాబిన్నం చేసేవరకూ ఉన్నంతలో సంతోషంగానే బతికారు. ఇప్పటికి నాలుగు నెళ్లైంది మూడుపూటలా కడుపునిండా తిని. ఎన్నడూ రాని కష్టం ఈ కుటుంబాన్ని విపరీతంగా కుంగదీసింది. అప్పటివరకూ పనిచూపిచ్చిన బట్టల దుకాణం మూతపడి పనిలేదు పొమ్మంది. ఇంట్లో కిరాయికుండే బక్కప్రాణాలు తనలాగే పనిదొరక్క ఖాళీ చేసి సొంతూరెల్లిపోయారు. అటు ఉద్యోగం లేదు, ఇటు కిరాయి లేదు, దాచుకున్న పదివేలు ఎంత గీచి ఖర్చుపెట్టుకున్నా రెండు నెళ్లుకూడా రాలేదు. అటు బిడ్డల బతుకు ఆగమైంది. ఇద్దరు అళ్లుల్లకి నో వర్క్ నో పే అని రెండు నెళ్లైంది. ఈఎమ్ఐలు ఇప్పటికిప్పుడు కట్టకున్నా... భవిష్యత్ తలుచుకొని అళ్లుల్లు ఆగమాగం ఐతుండ్రు. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలీదు, ఇప్పుడే గిట్లుంటే రాబోయే రోజులు ఇంకెంత భయంకరంగా ఉంటయో అని భయపడుతుండ్రు. ఉద్యోగం కాదు కదా సగం జీతంకి కూడా కొలువు దొరుకుతదో లేదోనని టెన్షన్తో అళ్ళుల్లు బతుకుతుండ్రు. నెలకి ముప్పైవేళు ఈఎమ్ఐలు ఏడికేయి కట్టాల్నని పరేషాన్ ఐతుండ్రు. ఇంతలో చిన్నళ్లుడు కొంచెం దగ్గు, ఆయాసంతో జరం వచ్చిన రెండురోజులకే టీవీల వార్తలు జూసి ఆగమాగమైపోయి, అయ్యే నాకొచ్చింది అసలు రోగమేమోనని ఆత్మహత్యా యత్నం చేసిండు. మెత్తానికి ప్రాణాపాయం నుంచైతే బయటవడ్డడు. అప్పటినుండి లక్షణ్కి కాళ్లు చేతులు ఆడుతలేవు, బిడ్డల్నీ అళ్లుల్లని ఇంటికి పిలిచి దైర్యం చెప్పిండు. 'గప్పుడెప్పుడో మా తాత కాలంల గత్తరొచ్చి ఊరు ఊరంతా ఖాళీ చేసి బాయిలకాడ్నే బతికిండ్రట, గండ్ల మిగిలినోడే మాతాత , నా బిడ్డలు పుట్టనీకి రెండేండ్ల ముందు స్కైలాబ్ బడ్తదని ఉన్నయన్ని ఊర్సుకొని తిన్నం, తర్వాత పుణే మిల్లుల పన్జేసేటప్పుడు ప్లేగొచ్చి సచ్చిపోతమంటే దాన్ని తట్టుకొని బతికినం... గాబట్టే గియ్యాల్ల మీరందరూ ఈడున్నరు. భయమెందుకు బిడ్డా..., ఆగో గా పసిపోరల జూడుండ్రి. ఆళ్లేం జూసిండ్రు. ఎందుకాగమాగం ఐతున్నరు, కాలం ఎప్పుడు ఒక్కతీరుగుండదు, పొక్కిలి వడ్డ వాకిలి శాన్పుతోటి సక్కగ గాకపోదు, భయపడకుండ్రి బిడ్డా.. బోదాం పా ఆవునూరికే బోదాం పా... ఓ నెళ్లాల్లు కలోగంజో తాగి ఆడ్నే బతుకుదాం... మా ఊరెప్పుడూ ఆకల్తోటుంచది'. అనంగనే ఆ మాటల్తోటి దైర్యం తెచ్చుకున్న లక్ష్మీ కూడా 'అవ్ బోదాం పా మనూరికి బోదాం పా... కాలమాగుతదా ఏంది, ఎదిరిచ్చి నిలవడ్దాం... నా మనుమరాళ్ల బతుకుజూడద్దా.. ఆళ్ల పెండ్లి జూడద్దా... బుగులొద్దు, ఇంట్ల పొక్కిలి తీర్చే శాన్పు కాలమే జల్తది...' అనడంతో ఆమెతో పాటు గొంతుకలిపారు అందరూ భతుకుపై భరోసా తెచ్చుకొని. చెడుల మంచి లెక్క బిడ్డల రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూసిన ఆవునూరు గోస ఇట్లనన్న తీరింది.
9394486053