24, డిసెంబర్ 2020, గురువారం

రికవరి

 


రికవరి

ఎట్లా కోలుకోవాలి, ఏం చేయాలి, ఏం అర్థంకావడం లేదు, ఆలోచిస్తుంటే తల బద్దలైపోయేలా ఉంది, గత ఐదు నెలలుగా ఇదే ఆలోచన, ఏ పని చేస్తున్నా మనసు స్థిమితంగా ఉండడం లేదు, నాన్న భలవంతం మీద ఇంటర్లో చేసిన వ్యవసాయ పనులేగనక రాకపోతే ఇప్పుడు మరింత కష్టమయ్యేది, ఇక ఏదో ఒకటి తేల్చుకోవాలి నాన్చుకుంటూ పోతే అసలుకే మోసం వచ్చేలా ఉంది. ఇట్లా ఆలోచనల్లో ఉండగానే రాజు ఏంది బిడ్డా, గంత సోచాయిత్తన్నవ్, ఫా ఇంటకి రావా, పొలానికి నీళ్లు పారుతున్నయ్ గదా... అని ఈరయ్య మామ పిలిచే సరికి తేరుకొని ఆ వత్త మామ, బోదాం పా అని బండి స్టార్టు చేసిన, వెనకాలే కూర్చున్న ఈరయ్య మామ పోలం కూడా మా పొలం పక్కనే ఉంటది, ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలంనుంచి బండి మీద పోతుంటే రాజు, మళ్ల నీ నౌకరి చాలైతదా... ఎప్పుడు బోతవ్ పట్నానికి అన్న మాటలకి సమాదానంగాఏం నౌకరో ఏమో మామ, గప్పుడు చదువుకొమ్మంటే ఇనకపోతి, గవర్నమెంటు నౌకరి రాకపాయే, గిప్పుడు అనుభవిత్తన్న తుమ్మితే, దగ్గితే ఊడిపోయే నౌఖర్లతోని వామ్మో తుమ్ముడు, దగ్గుడా... ఆ మాటలింటెనే భయమైతాంది, ఏం బతుకులోపో మా తాతలప్పుడచ్చిన గత్తర మల్ల పది తరాలకు గాని రాదన్నర్, దీనియవ్వ ఈ మయాదారి రోగం మనకే తగులాల్నా.... ఏమో మామ గీ రోగం రోజు రోజుకు పెరగవట్టె, ఐనాగని అన్ని చాలయితున్నయి, మా కంపెనీకేమైందో ఇంకా ఐతలేదు, పోదామంటే. ఏం జేయాల్నో అర్థమైతలే, ఆడికి బొయి ఏదో ఓటి సూసుకుందామంటే, ఏడుండాల్నో సమజైతలేదు, ఎంత జీతమిత్తరో ఏమోనని బుగులైతుంది, కిరాయికి భయపడి ఉన్నరూం ఖాళీ జేసి పెండ్లాం పిల్లల్ని ఈడికే తీసుకొత్తి, గిప్పుడు మళ్ల  బోవుడెట్లనో.. ఏమో... అవ్ రాజు నాకు తెల్వకడుగుతా... ఎందుకయ్యా మీకు గా పట్నం మీద గంత మోజు, ఏముంటదాడ, మాశెడ్డ లావు ఆరాటం గాకపోతే” “అరే.. ఏంది మామ గట్లనవడ్తివి, ఎంత సంపాదించినా.. ఆడి ఖర్చుల్ల బట్ట, పొట్టేనాయో, ఏమో బాగా సంపాదించి మిద్దెలు కడ్తినా.. మేడలు కడ్తినా... నీయవ్వ మంచిగనే అంటర్ పో పట్నపోల్లని” “గాకపోతే, రెక్కలురాంగనే పల్లెలిడిసిన బిడ్డలు మల్లొత్తుండ్రా... పల్లెబతుకు ఇగో సూడు మనూరి రాముల గుట్ట లెక్కయింది, ఎనుకట నక్కవాగొచ్చినప్పుడల్లా... గీ గుట్టమీదకేయి నీళ్లొచ్చి మన శెర్ల వడేటియి, ఎంత మంచిగుండేదో... గిప్పుడు మీరు బోయి చూత్తున్నరు జూడు ఆటర్పాల్స్ గట్ల, ఇటొచ్చే పిల్ల కాలువ రాను రాను పూడుకపోయి, లీళ్లు లేవు, అందం లేదు” “అవునే మా బాపుగూడ మస్తు సార్ల అంటడు గీ ముచ్చట అని మాట్లాడుకుంటూ ఈరయ్య మామ ఇల్లు రావడంతో దించేసి ఇంట్లో కెల్లేసరికి నా భార్య వాకిట్లనే ఎదురయిగా స్కూలోల్లు ఊకె సతాయిత్తండ్రు ఇప్పటికే రెండ్నెళ్లాయే, క్లాసులు ఇంటుండ్రు గని ఫీజు కడ్తలేరని నీయవ్వ ఈడు చదివే మూడో తరగతికి ఏమర్థమయితయే ఆన్లైన్ క్లాసులు, ఐనా మళ్ల పట్నం బోయేదెప్పుడు, ఆడ చదివిచ్చేదెప్పుడు, అప్పుడు గడ్ధాం తియ్, నువుగూడ ఊకె పోరన్ని సతాయించకు చదువూ... చదువూ... అని” “మంచిగనే ఉన్నది యవ్వారం పీజు ముచ్చటెత్తుతె చాలు సిగాలూగుతున్నవ్, అయింత స్కూళ్లకెయి తీసెత్తె మల్లబోయినంకా ఏడెత్తవ్ పోరన్ని, చిన్నదానికి గూడ యూకేజీ ఆన్లైన్ క్లాసులు షురువుజేత్తరు గావచ్చు, గప్పుడెట్ల మల్ల అని మాట్లాడుతుండగానే, బిడ్డా తమ్ముడు చవితికత్తుండట, ఆటోలు గిట్ల ఏం నడుత్తయో, ఎమో సిరిసిల్ల పోయి ఎక్కిచ్చుకరా, ఒకసారి పోన్ల మాట్లాడు ఎప్పుడత్తడోఇంట్లోకొస్తూనే చెప్పిండు బాపు, గామాట ఇన్నడో లేడు మా పెద్దోడు డాడీ, సిరిసిల్ల నేను వస్తా....కేక్ కొనుక్కుందాం అని మారాం చేశాడు, అప్పుడెప్పుడో కేక్ కావాలని గొడవ చేస్తే సిరిసిల్ల పోయినప్పుడు తెచ్చుకుందాం అని చెప్పిన ముచ్చట జ్ణాపకం ఉంచుకొనిగిప్పుడొద్దు బిడ్డా... కరోనా ఉంది గదా... బైటకి బోవద్దు, బైటయి తినొద్దు, నీకు అమ్మ చేసిత్తదితియ్ అని నచ్చచెప్పి, బిటెక్ పాసయి ఏదో చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న తమ్ముణ్ని సిరిసిల్ల పోయి బైక్ పై ఎక్కించుకొని వస్తుంటేభాస్కర్, ఎట్లుందిరా, హైద్రాబాద్ అని అడిగిన గట్నే ఉందన్నా... అన్నైతే చాలయినయి, రోడ్లమీద జనం మనుపటిలెక్కనే తిరుగుతాండ్రు, లోపల్లోపటైతే బుగులున్నట్టే ఉంది గని, ఇగ తప్పుతదా... మరి.” “అవ్ మా కంపెనీ దిక్కు బోయినావురా... ఏమంటున్నర్, ఎప్పుడు చాలయితదటా...” “ఆ బోయినన్నా... మూసే ఉంది, టూరిజం కంపెనీ గదా... ఇంకా చానా రోజులయ్యేటట్టే ఉంది.” “వేరేదేదైనా చూడుమంటి గదరా... ఏమైంది ఆ అడుగుతున్న అన్నా... ఏవ్వలూ కొత్తయి తీస్కునేటట్టు గనవడ్తలేదు, చూద్దాం తియి కొన్ని రోజులు ఇట్లా మాట్లాడుతుండగానే ఇంటికి చేరుకున్నాం. రాత్రి అమ్మ చేసిన వంట తినేసి పడుకున్నాం. తమ్ముడొచ్చిండు గదాని పొలం పక్కనే ఉన్న ఈదుల్లో ఆశాగౌడ్ అన్నకి మంచి ఈత కళ్లు ఉంచుమన్న, తెల్లారి పోలంల లీళ్ల గలుమలు అన్ని చూసుకొనే సరికి ఆశాగౌడన్న కళ్లు తీసుకొచ్చి చెట్టుకింద పెట్టిండు, వచ్చేటప్పటికి ఇంకా తమ్ముడు లేవలే అందుకే ఒక్కన్నే పోలానికొచ్చిన, తమ్ముణికి పోన్చేసి రవిగాడత్తడు ఆన్తోటి బండెక్కి పోలం దగ్గరికి రారా కళ్లు తాగుదాం, అట్నే అచ్చేటప్పుడు ఎంకటేశ్గాని దూకాణ్లకేంచి ఫాలాల్లల్ల కారం కలుపుకొని తే అని చెప్పిన. ముగ్గురం కూసొని కళ్లు తాగుతున్నం, అబ్బా కళ్లు మస్తుందన్నా, చానా రోజులైంది మంచి కల్లు తాగక అన్నాడు తమ్ముడు, వెంటనే రవిగాడు అవ్ ఇయ్యాల్ల కల్లు మంచిగుంది, మెదుగాల్నే చెప్పినవా అన్నా అన్నాడు, అవున్రా, నిన్ననే చెప్పిన జర తమ్ముడత్తుండు మంచిదుంచే అని ఆశన్నకి” “గదీ సంగతి, నీయవ్వ ఊర్లకి అందరొచ్చేసరికి, రోజు దసరా లెక్కనే అయింది, కల్లుగూడ సరిగ్గ దొరుకుతలే, దొరకకపోతే మానే, సంబురంగుందే ఊర్ని చూస్తుంటే... పండగలకి, పబ్బాలకి కలకల్లాడే ఊరు, మీరంతా అచ్చేసరికి మస్తుగుందే. మళ్ల ఎప్పుడు బోతరే మీరంతా... అని రవిగాడనే సరికి గమ్మతనిపించింది, అవును నిజమే కదా దసరా పండుగప్పుడే కలకల్లాడే మా ఊరు గత ఐదునెల్లుగా ఇట్లనే ఉంది, ఈ మద్యనే ఒక్కొక్కరూ మళ్ళీ హైదరాబాద్లో పనులు మెదలయి పోతుంటే మల్లా మా పల్లె వెలిసిపోతున్నట్టనిపిస్తుంది. ఎక్కడ్రా అందరూ పోనేవట్టె, నీయవ్వ మా కంపెనే ఇంకా చాలయితలేదురా పోదామంటే అన్నాన్నేను, ఆ మాటలు వింటూనే రవిగాడుఎందుకన్నా ఈడ్నే ఉండరాదే, సాప్ట్ వేరోడు ఎవడత్తున్నడు గనుక, బాస్కరుగాడెట్లాగు ఊరికి రాడు, నువ్వన్న ఈడ్నే ఉండి ఐదెకరాళ్ళ మంచిగ పండిచుకుంట ఉండరాదె, గప్పుడంటె నీళ్లు లేవగని, గిప్పుడు మత్తుగనే ఉన్నయే మెల్ల మెల్లగా నిషా మెదలయే సరికి వాడి మాటలు పెద్దగా పట్టించుకోలేదు. ఇంటికి పోయేసరికి అమ్మ చికెన్ వండడంతో కడుపునిండా తినగానే నిద్ర ముంచుకొచ్చింది. నిద్రలో ఉండగానే డాడీ... లే... బన్నీగాడుగిట్ల వాటర్ పాల్స్ పోతుండ్రంటా మనమూ పోదాం లే...లే... పెద్దొడు అరుస్తూ ఊపడంతో నిద్రలోంచి మెలుకువ వచ్చింది. రోజూ కురుస్తున్న వానలకి మానేరుకి వరదొచ్చి, నర్మాల నిండిపోయి మత్తడి దుంకుతుందని ఒక్కొక్కరు పోయి చూసొస్తుండ్రు బిడ్డా... కరోనా ఉందిగదా, గిప్పుడొద్దు, మల్లెప్పుడన్న బోదాం తియ్ అనంగనే మా అమ్మ అందుకుంటూఅరేయ్, ఊకె కరీనా.. కరీనా... అనకురా, మత్తడి దుంకేటప్పుడు పోతే ముచ్చటగని, ఎప్పుడోబోతే ఏమత్తదిరా... మనం గూడ బోదాం తియ్ బిడ్డ అని మనుమన్ని సముదాయించింది, దానికి తమ్ముడు గూడఅవన్నా రేపు బోదాం, శీనుతాత ఆటో కిరాయి మాట్లాడుతా అందరం బోదాం అనడంతో ఇంటిళ్లిపాది దానికి వంత పాడారు,  కరోనాగురించి రోజూ మీడియా హడావుడి తప్ప గవర్నమెంటు ట్రీట్మెంట్ బాగుంది అని తెలవడం, ఊర్లో అక్కడక్కడా కేసులు వచ్చినా... పెద్దగా ఎక్కడా ప్రమాదాలు, తెలిసిన వాళ్ల చావులు లేకపోయే సరికి ఆ ఏమైయితది తియి అనే దైర్యం వచ్చినట్టుంది జనాలకి, బాగానే తిరుగుతన్నరు, మెల్ల మెల్లగా నార్మల్ అయితున్నరు. తెల్లారి అంతా నర్మాలకి పోయి చూసొచ్చుడు, మర్నాడు వినాయక చవితి పండుగలతోటి బిజీబిజీగా గడిచి, ఊరికే ఉండే దిగులు అంతగా బయటపడలేదు, రెండ్రోజులు గడిచాయి, రెండ్రోజులు ఆన్లైన్లో వర్క్ ఫ్రం హోం చేసినా వారంలో మూడ్రోజులు ఖచ్చితంగా ఆఫీసుకి వెళ్లాల్సి రావడంతో సెలవులు ఐపోయి హైదరాబాద్ వెల్లడానికి సిద్దమవుతున్న తమ్మునితో బాపుభాస్కర్, నీ ఉద్యోగం కుదుర్కున్నట్టేనా...మరి, బండలింగంపెళ్లోల్లు ఒకతీరుగ అడుగున్నరు, ఏమంటవ్ అని పెళ్లి గురించి అడగడంతో వాడు,బాపు, ఒక్కయాడాదాగు, కొంచెం పెద్ద కంపెనీల జాయినయినంక చేసుకుంటా” “అట్లగాదు బిడ్డా ఏ అయిసు ముచ్చట అప్పుడే తీరాలే” “ఎండకాలం దాంకనన్న ఆగు బాపు, ఇప్పుడచ్చే జీతం సరిపోదు అన్నమాటతో బాపుగూడ తమ్ముణ్ని భలవంతం చేయలే, ఏడాదిదాక కాదేమో అనుకొన్నోళ్లకి తమ్ముణి నోటితోనే ఎండకాలం అనే ఆర్నెల్ల మాట వచ్చేసరికి ఆగిపోయిండ్రు అమ్మ బాపులు. ఆ రోజు రాత్రి పడుకునే ముందు తమ్ముణితోఅరేయ్, ఏమన్నజేసి ఏదో ఓ నౌఖరి జూడ్రా...పదిగేనువేలచ్చినా సరె, గిప్పుడు హైద్రాబాద్ల రెంట్లుగూడ తగ్గినయట గదా, రేపో మాపో బళ్లు చాలయితే పోరన్ని తోలాలే గదా...” “నేను మస్తు ట్రై జేత్తున్నన్నా.... ఏడ లేవంటుండ్రు, గాకపోతే గా బట్టల షాపుల్లల్ల, దుకాండ్లల్ల ఉన్నయంటుండ్రు గని జీతం తక్కువ, పనెక్కువ, పొద్దంత నిలవడే ఉండాలె, అచ్చేటోళ్లకి కరోనా ఎవలకున్నదో తెల్వదు, గీటైంల అవసరమా అద్దన్నా... మా మాటలు వింటున్న అమ్మ కలుగజేసుకొని అవ్ బిడ్డా, మెన్నటిదాకంటే పండక ఏడ్తిమి, ఇప్పుడేమైంది బిడ్డా, మన బోరు నిరుటి యాసంగిల కూడా మూడెకరాలు పారిచ్చింది, రేపో మాపో మలకపేట నింపుతరట, మనకు కాల్వలు రాకున్నా భూమిల అంగాము నీళ్లుంటయ్, మంచిగ పండిచ్చికుంటే ఈన్నే నెలకు ముప్పైవేలు పడ్తయి బిడ్డా, జర సొచాయించురా వెంటనే బాపుఅవ్ బిడ్డా, నేనుగూడ గిదే జెప్దమనుకుంటున్నా, కానీ ఇంత చదువుకున్నోనివి ఏమనుకుంటవో అని ఆగిన, మాగ్గూడ ఇగ శాతనయితలేదు, నువ్వుంటే అన్నింటికి తోడుంటది. పంటగూడ మంచిగత్తుంది, ఆడేడ్నో బిక్కు బిక్కుమనుకుంట ఉన్నదానికన్నా ఈడ రాజులెక్కుండచ్చు బిడ్డా, గిప్పుడన్నిటికి ట్రాక్టర్లేనాయే పెయికి కట్టంగూడ తెల్వది బిడ్డా నా బార్య కలుగజేసుకుంటూమంచిగనే ఉంటదిగని అత్తా... పోరగాండ్ల చదువెట్లా... మేమే సక్కగ చదువుకోక ఇబ్బందులు పడ్తన్నమ్, పిల్లలకి చదువుల్లేకపోతే.... అమ్మ మాట్లాడుతూఈడ గూడ మంచి బళ్లున్నయి బిడ్డా... ఇంగ్లిపీసే గావాల్నంటే సిరిసిల్లకేయి ఇస్కూలు బస్సులు గూడ అత్తున్నయ్, ఆడికి పంపుదాము వెంటనే తమ్ముడుఔనన్నా... నాగ్గూడ నువ్వీడుంటనే మంచిదనిపిత్తుంది, ఒక్క వరే గాకుండా రక రకాల పంటలు, రక రకాల పద్దతుల్ల పండియ్యన్నా.... మంచి దిగుబడితో పాటు పైసలు గూడ ఎక్కువత్తయి, గిప్పుడు సర్కారు పాలీహౌజులకి, డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ లోన్లిత్తుంది, గా కొండాపూర్ల సురేష్ గాడు పాలీహౌజ్ పెట్టి కూరగాయలు పండిచ్చుకుంట నెలకి ముప్పైవేలు సంపాదిత్తుండు, నాటు కోళ్లతోని మల్లో ముప్పై వేలు తీత్తుండు, ఓసారి చూసిరా... నీకేం గావాల్నన్న మన పోన్లనుంచే పన్జేసుకోవచ్చు, ఆలోచించన్నా... అమ్మా నాన్నలు కూడా మళ్లీ మళ్లీ ఇదే ముచ్చట చెప్పిండ్రు. నా బార్య కూడా ఆ ఇరుకిరికు రూములకన్నా ఊరే మంచిగుంది అనుకుంటుంది, పిల్లల చదువులకి కూడా బెంగలేనట్టే అనిపించింది. ఇగ నేను కూడా ఒక నిర్ణయానికొచ్చేశాను, తెల్లారి తమ్ముణ్ని బస్సెక్కియ్యనీకి సిరిసిల్లల దింపి అగ్రికల్చర్ ఆఫీస్కి పోయి పాలీహౌజ్తో పాటు, మినీ గోదాం కోసం అప్లికేషన్ పెట్టుకొని వచ్చిన, మూడు, నాలుగు నెలలు గడిచిపోయినయి, రోజు పొలం పనులకు తోడు పాలీహౌజ్లో మడులు కట్టడం, తీగలు చుట్టడం, కూరగాయలు, ఆకు కూరలు తెంపి సిరిసిల్ల మార్కెట్కి పంపడం. చాలా బిజీ అయిపోయింది. ఒక్క టమాట విషయంలో చాలా ఇబ్బందులొస్తున్నాయి ఒక్కసారే దర అమాంతం పడిపోయి గిట్టుబాటు కాదుకదా... కనీసం ట్రాన్స్పోర్ట్ చార్జీలు కూడా రావడంలేదు. ఇంతలో ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి నక్కవాగు కాలువ పూడిక తీపియ్యడం కూడా అయిపోయింది. ఒకవైపు గోదాం పనులు కూడా చివరికొచ్చాయి. ఈ సారి బాస్కర్ హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు టమాట సాస్ తయారు చేసే మిషన్ తీసుకొచ్చిండు, దాంతో పాటు ప్యాకేజింగ్ చేసి అమ్మడానికి రికవరీ అనే బ్రాండ్ పేరుని రిజిష్టర్ చేయించి, స్టిక్కర్లు కూడా పట్టుకొచ్చిండు, టమాటాలని మార్కెట్కి తీసుకెళ్లకుండా నాణ్యమైన సాస్ తయారుచేసి మా ఊరితో పాటు చుట్టుపక్కల మండలాల్లో, సిరిసిల్లాలో అమ్మడం మెదలు పెట్టాను, మంచి నాణ్యతతో తాజాగా అందిచడంతో కొద్దిరోజుల్లోనే మా బ్రాండ్ మంచి పేరు తెచ్చుకుంది, గోదాం కూడా పూర్తవడంతో మా దాన్యంతో పాటు, మా ఊరి రైతుల దాన్యాన్ని కూడా నిలువ చేసి రేటు వచ్చినప్పుడు అమ్మడంతో పాటు రికవరీ బ్రాండ్ పేరుతో పురుగుమందులు లేని అన్నిరకాల దాన్యాలని సైతం ప్యాక్ చేసి అమ్మడం మెదలుపెట్టాను, ఇప్పుడు నేను, నాకుంటుంబంతో పాటు మా ఊరివాల్లు మరో పదిమందికి నేనే ఉపాది చూపగల్గాను. ఇలా ఆనందంగా జీవితం సాగిపోతున్నప్పుడే తమ్ముడి పెళ్లి కూడా జరిగిపోయింది. అప్పుడే కురిసిన వర్షాలకి నక్కవాగు పొంగిపోయి కాలువ రాముల గుట్టనుండి అందమైన జలపాతంలా చెరువులో కలుస్తుంటే మా ఆవునూరు ఇప్పుడొక పెద్ద టూరిస్ట్ ప్లేసయిపోయింది. ఆ జలపాతంలో సందడి చేస్తున్న మా పిల్లల్ని చూస్తూ ఒక్కసారి గతంలోకి జారిపోయాను, అంతా కలలా అన్పిస్తుంది, కరోనా విలయం నా జీవితాన్ని, మా ఊరిని ఎంతలా మార్చిందో తల్చుకుంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. సంక్షోభంలో సైతం అవకాశాలు దాక్కొని ఉంటాయి, వాటిని అన్వేషించి అందుకుంటే విజయాలు ఎలా వరిస్తాయే నన్ను చూస్తేనే అర్థమయితుంది. ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఎప్పుడూ ఎట్లాంటి కష్టం వచ్చినా అదిగమిస్తాననే నమ్మకం కుదిరింది. దీనికంతటికి కుటుంభ మద్దతుతో పాటు, సాదించాలనే కసి నన్ను ఎలా మార్చిందో, ఎలా రికవరీ చేసిందో అనుకుంటూ ఉండగానే పరుగెత్తుకుంటూ తడిబట్టలతో నా ఒళ్లో దుంకిన నాకూతురు డాడీ, దా ఫాల్స్ దగ్గరికి పోదాం రా... ఎంత మంచింగుందో అనడంతో ఈ లోకంలోకి వచ్చాను,   సరే తల్లి ఎక్కువ తడువకు సడిదయిద్దీ అనడంతో అక్కడే ఉన్న నాభార్యవామ్మె మళ్లా సడిదా...... అని ఆశ్చర్యంగా నవ్వడంతో నేను ఆమెతో నవ్వులు కలిపాను.

ప్రభుత్వోద్యోగమే పనికి పరమావదా?


 


పనినే దైవంగా భావించే సమాజం మనది, అనాదిగా నిర్వహిస్తున్న అనేక వృత్తుల ప్రాతిపదికనే మన పురాతన సంస్కృతి కొన్ని నిర్థిష్టమైన సంప్రదాయాలను ఏర్పరుచుకొని అభివృద్ది చెందుతూ వస్తుంది. పనిచేసేవాడికే విలువ, చేసే పని ఏదైనా అందులో నీతి, న్యాయం ఉండి తనతో పాటు తన కుటుంబం భుక్తికోసం ధర్మబద్దంగా పనిచేసి సంపాదించుకోవడమనేది ప్రతీ ఒక్కరి హక్కు. దురదృష్టవశాత్తు కాల క్రమంలో చేసే పని ఆదారంగానే వర్ణవ్యవస్థ రూపుదాల్చి, కులం అనే కబంద హస్తాల్లో అది చిక్కుకు పోయి పనిని బట్టి గౌరవం ఇవ్వడమనే దుష్ట సాంప్రదాయానికి తెరతీసిన విషాద చరిత్ర సైతం మనదే. నాటి ఆదిమ మానవుడు జీవనం కోసం వేటాడడం మెదలు నేటి ఆదునిక మానవుడి ఖండాంతర యానం వరకూ ప్రతీది తను చేసే పని ఆదారంగానే పరిణామక్రమం కొనసాగింది, అది కొనసాగుతూనే ఉంటుంది కూడా. పనే లేకుంటే ఈ ప్రపంచం లేదు. సృజనాత్మక ఆవిష్కరణలతో ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించిన పని కొందరిదైతే, ఆ ఆవిష్కరణలతో తమ జీవనాన్ని సరళికృతం చేసుకొని తమతో పాటు తమ సమాజాన్ని అభివృద్ది చెసిన పని అందరిది. ఇలా కేవలం ఆహార సంపాదనే ముఖ్యమైన పనిగా ఉన్న దశనుండి శాఖోపశాఖలుగా విస్తరించి, ఈ పనిలో చూపించే నైపుణ్యాల ఆదారంగా వారి వారి ఆర్థిక, సామాజిక స్థితిగతుల్ని మార్చుకునే స్థాయి వరకూ పని పరిణామం చెందుతూ వచ్చింది. ఐతే రాను రాను పని అనేది కేవలం సంపదని సృష్టించుకునే ఒక భౌతిక సాదనంగానే చూడడం మెదలైన నాటినుండి దీనికి అనేక రకాల జాడ్యాలు అంటుకున్నాయి. కేవలం ప్రాపంచికమైన విషయాల సాదనగానే పని మిగిలిపోయింది. ప్రభుత్వోద్యోగమే పరమావది అన్నా చందంగా తయారైంది. అలా ఇప్పుడు ఈ పనిని కల్పించడం అనేది ఒక రాజకీయ వస్తువుగా రూపాంతరం చెందింది. అధికార, విపక్షాలు పరస్పర విమర్శలు చేసుకోవడానికి అంశీభూతమవుతుంది. పని కల్పించడం కేవలం ప్రభుత్వాల పనే అనేంతగా మన మెదళ్లలో విషబీజాలు నాటుతున్నాయి నేటి రాజకీయాలు. ఉన్నత విద్యాభ్యాసం ముగించుకొన్న ప్రతీ ఒక్కరికి ప్రభుత్వమే పని కల్పించాలి అనే విపరీత దోరణి రాజకీయ విమర్శల్లో కన్పిస్తుండడం విచారకరం. ఇది కనీస ఆచరణ సాద్యం కాదనే అసలు నిజం వారికి తెలిసినా, అభూత కల్పనలైన వాదనలతో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పైచేయి సాదిస్తున్నామనే భ్రమలో యువకుల మెదళ్లని ఎంత విషపూరితం చేస్తున్నారో వారు గ్రహిస్తున్నారా? ప్రభుత్వోద్యోగమే సర్వరోగ నివారిణి, సంజీవని అనే ఈ మాటల ద్వారా చదువుకున్న వ్యక్తి సామర్థ్యాల్ని కుదిస్తున్నామన్న నిజాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? కేవలం కొన్ని ఉద్యోగాలే ఉన్న ఈ సెక్టార్లో విపరీతమైన పోటీని పెంచి తద్వరా యువత ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నదెవరూ? ఇలా కేవలం ప్రభుత్వోద్యోగమే చాలని అనుకుంటే ఐన్ స్టీన్, స్టీపెన్ హాకింగ్, సచిన్ టెండుల్కర్, విశ్వనాథన్ ఆనంద్, బాలసుభ్రమణ్యం, బిల్ గెట్స్, స్టీవ్ జాబ్స్, జుకర్ బర్గ్, అంబానీ, టాటాలు పుట్టేవారా? నేడు వేలమందికి దైవ సమానమైన పనిని కల్పించేవారా? అందరూ ప్రభుత్వోద్యోగాలే ఎంచుకుంటే నవీన ఆవిష్కరణలు ఎవరు చేయాలి? కోటానుకోట్ల మానవులకి అవసరమైన అనేక ఉత్పత్తులు ఏలా సాద్యం? ఇంతటి ముఖ్యమైన విషయాల గురించిన ఆలోచన లేకుండా రాజకీయాలు కొనసాగుతుండడం మన దురదృష్టం, నిజానికి ఈ సమయంలో చేయవలసింది కసితో పనిచేసే యువతకి సరైన మార్గదర్శనం, వారిలో ఉన్న అంతులేని జ్ణానతృష్ణని వెలికితీసి, అనేక రంగాల్లో ఎదగడానికి ఉన్న అవకాశాల్ని పరిచయం చేయడం. ఉరకలేసే వారి ఉత్సాహానికి ఊతకర్రలా నిలబడి సాయం చేయడం. ప్రభుత్వోద్యోగంలో దొరికే సౌకర్యాలని అన్ని రంగాల్లో కల్పించేలా పోరాటాలు చేయడం. సమాజంలోని వ్యక్తుల వికాసాన్ని పెంచి వారి దృక్పథాలు మార్చి నవ సమాజం దిశగా తీసుకెళ్లే విద్యని అభ్యసించిన యువకులకి అవకాశాల్ని వెతుక్కునే సామర్థ్యం ఉందని తెలియజెప్పడం. వారిలోని నైపుణ్యాలని పెంచి అనేక రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలి. కేవలం దాదాపు నాలుగు లక్షల మంది మాత్రమే అవసరమైన ప్రభుత్వ శాఖల్లో నాలుగున్నర కోట్ల తెలంగాణ బిడ్డలకు అవకాశం ఎలా ఇవ్వగలం అనే వాస్తవికతను అర్థం చేసుకోవాలి. విమర్శలే ఎజెండాగా ముప్పైవేల ఉద్యోగాలే ప్రభుత్వం భర్తీ చేసింది. లక్ష ఉద్యోగాలేవీ అనే కోణాన్ని... ప్రైవేట్ రంగంలోని అపార అవకాశాలని తెలియజెప్పే దిశగా మార్చుకోవాలి. ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక రంగాల్లో పెరిగిన ఉద్యోగ అవకాశాల్ని, వాటిలో పనిచేసుకొని జీవనం కొనసాగిస్తున్న లక్షలమంది ఉన్నారనే అభయాన్ని ఇవ్వాలి. అదేసమయంలో శ్రమదోపిడి జరుగుతున్న రంగాల్లో వాటిని అడ్డుకోవడానికి ఉన్న అవకాశాల గురించి అన్వేషించాలి. ఇవన్నీ ఒక్కరోజులో జరిగే మార్పులు కావు, కానీ వాటి దిశగా నేటి నుండి మన కార్యాచరణ ఉండేలా జాగరూకత వహించాలి. యువకుల కలలకి రెక్కలు తొడగాలి. ప్రభుత్వోద్యోగాన్ని మించిన పనులెన్నో ఉన్నాయని చాటిచెప్పాలి. ఇదే ప్రజాపక్షం వహించే వారి ఎజెండా కావాలి. కృషితో నాస్తి దుర్భిక్షం.

గంగాడి సుధీర్, జర్నలిస్ట్.

9394486053