24, డిసెంబర్ 2020, గురువారం

రికవరి

 


రికవరి

ఎట్లా కోలుకోవాలి, ఏం చేయాలి, ఏం అర్థంకావడం లేదు, ఆలోచిస్తుంటే తల బద్దలైపోయేలా ఉంది, గత ఐదు నెలలుగా ఇదే ఆలోచన, ఏ పని చేస్తున్నా మనసు స్థిమితంగా ఉండడం లేదు, నాన్న భలవంతం మీద ఇంటర్లో చేసిన వ్యవసాయ పనులేగనక రాకపోతే ఇప్పుడు మరింత కష్టమయ్యేది, ఇక ఏదో ఒకటి తేల్చుకోవాలి నాన్చుకుంటూ పోతే అసలుకే మోసం వచ్చేలా ఉంది. ఇట్లా ఆలోచనల్లో ఉండగానే రాజు ఏంది బిడ్డా, గంత సోచాయిత్తన్నవ్, ఫా ఇంటకి రావా, పొలానికి నీళ్లు పారుతున్నయ్ గదా... అని ఈరయ్య మామ పిలిచే సరికి తేరుకొని ఆ వత్త మామ, బోదాం పా అని బండి స్టార్టు చేసిన, వెనకాలే కూర్చున్న ఈరయ్య మామ పోలం కూడా మా పొలం పక్కనే ఉంటది, ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలంనుంచి బండి మీద పోతుంటే రాజు, మళ్ల నీ నౌకరి చాలైతదా... ఎప్పుడు బోతవ్ పట్నానికి అన్న మాటలకి సమాదానంగాఏం నౌకరో ఏమో మామ, గప్పుడు చదువుకొమ్మంటే ఇనకపోతి, గవర్నమెంటు నౌకరి రాకపాయే, గిప్పుడు అనుభవిత్తన్న తుమ్మితే, దగ్గితే ఊడిపోయే నౌఖర్లతోని వామ్మో తుమ్ముడు, దగ్గుడా... ఆ మాటలింటెనే భయమైతాంది, ఏం బతుకులోపో మా తాతలప్పుడచ్చిన గత్తర మల్ల పది తరాలకు గాని రాదన్నర్, దీనియవ్వ ఈ మయాదారి రోగం మనకే తగులాల్నా.... ఏమో మామ గీ రోగం రోజు రోజుకు పెరగవట్టె, ఐనాగని అన్ని చాలయితున్నయి, మా కంపెనీకేమైందో ఇంకా ఐతలేదు, పోదామంటే. ఏం జేయాల్నో అర్థమైతలే, ఆడికి బొయి ఏదో ఓటి సూసుకుందామంటే, ఏడుండాల్నో సమజైతలేదు, ఎంత జీతమిత్తరో ఏమోనని బుగులైతుంది, కిరాయికి భయపడి ఉన్నరూం ఖాళీ జేసి పెండ్లాం పిల్లల్ని ఈడికే తీసుకొత్తి, గిప్పుడు మళ్ల  బోవుడెట్లనో.. ఏమో... అవ్ రాజు నాకు తెల్వకడుగుతా... ఎందుకయ్యా మీకు గా పట్నం మీద గంత మోజు, ఏముంటదాడ, మాశెడ్డ లావు ఆరాటం గాకపోతే” “అరే.. ఏంది మామ గట్లనవడ్తివి, ఎంత సంపాదించినా.. ఆడి ఖర్చుల్ల బట్ట, పొట్టేనాయో, ఏమో బాగా సంపాదించి మిద్దెలు కడ్తినా.. మేడలు కడ్తినా... నీయవ్వ మంచిగనే అంటర్ పో పట్నపోల్లని” “గాకపోతే, రెక్కలురాంగనే పల్లెలిడిసిన బిడ్డలు మల్లొత్తుండ్రా... పల్లెబతుకు ఇగో సూడు మనూరి రాముల గుట్ట లెక్కయింది, ఎనుకట నక్కవాగొచ్చినప్పుడల్లా... గీ గుట్టమీదకేయి నీళ్లొచ్చి మన శెర్ల వడేటియి, ఎంత మంచిగుండేదో... గిప్పుడు మీరు బోయి చూత్తున్నరు జూడు ఆటర్పాల్స్ గట్ల, ఇటొచ్చే పిల్ల కాలువ రాను రాను పూడుకపోయి, లీళ్లు లేవు, అందం లేదు” “అవునే మా బాపుగూడ మస్తు సార్ల అంటడు గీ ముచ్చట అని మాట్లాడుకుంటూ ఈరయ్య మామ ఇల్లు రావడంతో దించేసి ఇంట్లో కెల్లేసరికి నా భార్య వాకిట్లనే ఎదురయిగా స్కూలోల్లు ఊకె సతాయిత్తండ్రు ఇప్పటికే రెండ్నెళ్లాయే, క్లాసులు ఇంటుండ్రు గని ఫీజు కడ్తలేరని నీయవ్వ ఈడు చదివే మూడో తరగతికి ఏమర్థమయితయే ఆన్లైన్ క్లాసులు, ఐనా మళ్ల పట్నం బోయేదెప్పుడు, ఆడ చదివిచ్చేదెప్పుడు, అప్పుడు గడ్ధాం తియ్, నువుగూడ ఊకె పోరన్ని సతాయించకు చదువూ... చదువూ... అని” “మంచిగనే ఉన్నది యవ్వారం పీజు ముచ్చటెత్తుతె చాలు సిగాలూగుతున్నవ్, అయింత స్కూళ్లకెయి తీసెత్తె మల్లబోయినంకా ఏడెత్తవ్ పోరన్ని, చిన్నదానికి గూడ యూకేజీ ఆన్లైన్ క్లాసులు షురువుజేత్తరు గావచ్చు, గప్పుడెట్ల మల్ల అని మాట్లాడుతుండగానే, బిడ్డా తమ్ముడు చవితికత్తుండట, ఆటోలు గిట్ల ఏం నడుత్తయో, ఎమో సిరిసిల్ల పోయి ఎక్కిచ్చుకరా, ఒకసారి పోన్ల మాట్లాడు ఎప్పుడత్తడోఇంట్లోకొస్తూనే చెప్పిండు బాపు, గామాట ఇన్నడో లేడు మా పెద్దోడు డాడీ, సిరిసిల్ల నేను వస్తా....కేక్ కొనుక్కుందాం అని మారాం చేశాడు, అప్పుడెప్పుడో కేక్ కావాలని గొడవ చేస్తే సిరిసిల్ల పోయినప్పుడు తెచ్చుకుందాం అని చెప్పిన ముచ్చట జ్ణాపకం ఉంచుకొనిగిప్పుడొద్దు బిడ్డా... కరోనా ఉంది గదా... బైటకి బోవద్దు, బైటయి తినొద్దు, నీకు అమ్మ చేసిత్తదితియ్ అని నచ్చచెప్పి, బిటెక్ పాసయి ఏదో చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న తమ్ముణ్ని సిరిసిల్ల పోయి బైక్ పై ఎక్కించుకొని వస్తుంటేభాస్కర్, ఎట్లుందిరా, హైద్రాబాద్ అని అడిగిన గట్నే ఉందన్నా... అన్నైతే చాలయినయి, రోడ్లమీద జనం మనుపటిలెక్కనే తిరుగుతాండ్రు, లోపల్లోపటైతే బుగులున్నట్టే ఉంది గని, ఇగ తప్పుతదా... మరి.” “అవ్ మా కంపెనీ దిక్కు బోయినావురా... ఏమంటున్నర్, ఎప్పుడు చాలయితదటా...” “ఆ బోయినన్నా... మూసే ఉంది, టూరిజం కంపెనీ గదా... ఇంకా చానా రోజులయ్యేటట్టే ఉంది.” “వేరేదేదైనా చూడుమంటి గదరా... ఏమైంది ఆ అడుగుతున్న అన్నా... ఏవ్వలూ కొత్తయి తీస్కునేటట్టు గనవడ్తలేదు, చూద్దాం తియి కొన్ని రోజులు ఇట్లా మాట్లాడుతుండగానే ఇంటికి చేరుకున్నాం. రాత్రి అమ్మ చేసిన వంట తినేసి పడుకున్నాం. తమ్ముడొచ్చిండు గదాని పొలం పక్కనే ఉన్న ఈదుల్లో ఆశాగౌడ్ అన్నకి మంచి ఈత కళ్లు ఉంచుమన్న, తెల్లారి పోలంల లీళ్ల గలుమలు అన్ని చూసుకొనే సరికి ఆశాగౌడన్న కళ్లు తీసుకొచ్చి చెట్టుకింద పెట్టిండు, వచ్చేటప్పటికి ఇంకా తమ్ముడు లేవలే అందుకే ఒక్కన్నే పోలానికొచ్చిన, తమ్ముణికి పోన్చేసి రవిగాడత్తడు ఆన్తోటి బండెక్కి పోలం దగ్గరికి రారా కళ్లు తాగుదాం, అట్నే అచ్చేటప్పుడు ఎంకటేశ్గాని దూకాణ్లకేంచి ఫాలాల్లల్ల కారం కలుపుకొని తే అని చెప్పిన. ముగ్గురం కూసొని కళ్లు తాగుతున్నం, అబ్బా కళ్లు మస్తుందన్నా, చానా రోజులైంది మంచి కల్లు తాగక అన్నాడు తమ్ముడు, వెంటనే రవిగాడు అవ్ ఇయ్యాల్ల కల్లు మంచిగుంది, మెదుగాల్నే చెప్పినవా అన్నా అన్నాడు, అవున్రా, నిన్ననే చెప్పిన జర తమ్ముడత్తుండు మంచిదుంచే అని ఆశన్నకి” “గదీ సంగతి, నీయవ్వ ఊర్లకి అందరొచ్చేసరికి, రోజు దసరా లెక్కనే అయింది, కల్లుగూడ సరిగ్గ దొరుకుతలే, దొరకకపోతే మానే, సంబురంగుందే ఊర్ని చూస్తుంటే... పండగలకి, పబ్బాలకి కలకల్లాడే ఊరు, మీరంతా అచ్చేసరికి మస్తుగుందే. మళ్ల ఎప్పుడు బోతరే మీరంతా... అని రవిగాడనే సరికి గమ్మతనిపించింది, అవును నిజమే కదా దసరా పండుగప్పుడే కలకల్లాడే మా ఊరు గత ఐదునెల్లుగా ఇట్లనే ఉంది, ఈ మద్యనే ఒక్కొక్కరూ మళ్ళీ హైదరాబాద్లో పనులు మెదలయి పోతుంటే మల్లా మా పల్లె వెలిసిపోతున్నట్టనిపిస్తుంది. ఎక్కడ్రా అందరూ పోనేవట్టె, నీయవ్వ మా కంపెనే ఇంకా చాలయితలేదురా పోదామంటే అన్నాన్నేను, ఆ మాటలు వింటూనే రవిగాడుఎందుకన్నా ఈడ్నే ఉండరాదే, సాప్ట్ వేరోడు ఎవడత్తున్నడు గనుక, బాస్కరుగాడెట్లాగు ఊరికి రాడు, నువ్వన్న ఈడ్నే ఉండి ఐదెకరాళ్ళ మంచిగ పండిచుకుంట ఉండరాదె, గప్పుడంటె నీళ్లు లేవగని, గిప్పుడు మత్తుగనే ఉన్నయే మెల్ల మెల్లగా నిషా మెదలయే సరికి వాడి మాటలు పెద్దగా పట్టించుకోలేదు. ఇంటికి పోయేసరికి అమ్మ చికెన్ వండడంతో కడుపునిండా తినగానే నిద్ర ముంచుకొచ్చింది. నిద్రలో ఉండగానే డాడీ... లే... బన్నీగాడుగిట్ల వాటర్ పాల్స్ పోతుండ్రంటా మనమూ పోదాం లే...లే... పెద్దొడు అరుస్తూ ఊపడంతో నిద్రలోంచి మెలుకువ వచ్చింది. రోజూ కురుస్తున్న వానలకి మానేరుకి వరదొచ్చి, నర్మాల నిండిపోయి మత్తడి దుంకుతుందని ఒక్కొక్కరు పోయి చూసొస్తుండ్రు బిడ్డా... కరోనా ఉందిగదా, గిప్పుడొద్దు, మల్లెప్పుడన్న బోదాం తియ్ అనంగనే మా అమ్మ అందుకుంటూఅరేయ్, ఊకె కరీనా.. కరీనా... అనకురా, మత్తడి దుంకేటప్పుడు పోతే ముచ్చటగని, ఎప్పుడోబోతే ఏమత్తదిరా... మనం గూడ బోదాం తియ్ బిడ్డ అని మనుమన్ని సముదాయించింది, దానికి తమ్ముడు గూడఅవన్నా రేపు బోదాం, శీనుతాత ఆటో కిరాయి మాట్లాడుతా అందరం బోదాం అనడంతో ఇంటిళ్లిపాది దానికి వంత పాడారు,  కరోనాగురించి రోజూ మీడియా హడావుడి తప్ప గవర్నమెంటు ట్రీట్మెంట్ బాగుంది అని తెలవడం, ఊర్లో అక్కడక్కడా కేసులు వచ్చినా... పెద్దగా ఎక్కడా ప్రమాదాలు, తెలిసిన వాళ్ల చావులు లేకపోయే సరికి ఆ ఏమైయితది తియి అనే దైర్యం వచ్చినట్టుంది జనాలకి, బాగానే తిరుగుతన్నరు, మెల్ల మెల్లగా నార్మల్ అయితున్నరు. తెల్లారి అంతా నర్మాలకి పోయి చూసొచ్చుడు, మర్నాడు వినాయక చవితి పండుగలతోటి బిజీబిజీగా గడిచి, ఊరికే ఉండే దిగులు అంతగా బయటపడలేదు, రెండ్రోజులు గడిచాయి, రెండ్రోజులు ఆన్లైన్లో వర్క్ ఫ్రం హోం చేసినా వారంలో మూడ్రోజులు ఖచ్చితంగా ఆఫీసుకి వెళ్లాల్సి రావడంతో సెలవులు ఐపోయి హైదరాబాద్ వెల్లడానికి సిద్దమవుతున్న తమ్మునితో బాపుభాస్కర్, నీ ఉద్యోగం కుదుర్కున్నట్టేనా...మరి, బండలింగంపెళ్లోల్లు ఒకతీరుగ అడుగున్నరు, ఏమంటవ్ అని పెళ్లి గురించి అడగడంతో వాడు,బాపు, ఒక్కయాడాదాగు, కొంచెం పెద్ద కంపెనీల జాయినయినంక చేసుకుంటా” “అట్లగాదు బిడ్డా ఏ అయిసు ముచ్చట అప్పుడే తీరాలే” “ఎండకాలం దాంకనన్న ఆగు బాపు, ఇప్పుడచ్చే జీతం సరిపోదు అన్నమాటతో బాపుగూడ తమ్ముణ్ని భలవంతం చేయలే, ఏడాదిదాక కాదేమో అనుకొన్నోళ్లకి తమ్ముణి నోటితోనే ఎండకాలం అనే ఆర్నెల్ల మాట వచ్చేసరికి ఆగిపోయిండ్రు అమ్మ బాపులు. ఆ రోజు రాత్రి పడుకునే ముందు తమ్ముణితోఅరేయ్, ఏమన్నజేసి ఏదో ఓ నౌఖరి జూడ్రా...పదిగేనువేలచ్చినా సరె, గిప్పుడు హైద్రాబాద్ల రెంట్లుగూడ తగ్గినయట గదా, రేపో మాపో బళ్లు చాలయితే పోరన్ని తోలాలే గదా...” “నేను మస్తు ట్రై జేత్తున్నన్నా.... ఏడ లేవంటుండ్రు, గాకపోతే గా బట్టల షాపుల్లల్ల, దుకాండ్లల్ల ఉన్నయంటుండ్రు గని జీతం తక్కువ, పనెక్కువ, పొద్దంత నిలవడే ఉండాలె, అచ్చేటోళ్లకి కరోనా ఎవలకున్నదో తెల్వదు, గీటైంల అవసరమా అద్దన్నా... మా మాటలు వింటున్న అమ్మ కలుగజేసుకొని అవ్ బిడ్డా, మెన్నటిదాకంటే పండక ఏడ్తిమి, ఇప్పుడేమైంది బిడ్డా, మన బోరు నిరుటి యాసంగిల కూడా మూడెకరాలు పారిచ్చింది, రేపో మాపో మలకపేట నింపుతరట, మనకు కాల్వలు రాకున్నా భూమిల అంగాము నీళ్లుంటయ్, మంచిగ పండిచ్చికుంటే ఈన్నే నెలకు ముప్పైవేలు పడ్తయి బిడ్డా, జర సొచాయించురా వెంటనే బాపుఅవ్ బిడ్డా, నేనుగూడ గిదే జెప్దమనుకుంటున్నా, కానీ ఇంత చదువుకున్నోనివి ఏమనుకుంటవో అని ఆగిన, మాగ్గూడ ఇగ శాతనయితలేదు, నువ్వుంటే అన్నింటికి తోడుంటది. పంటగూడ మంచిగత్తుంది, ఆడేడ్నో బిక్కు బిక్కుమనుకుంట ఉన్నదానికన్నా ఈడ రాజులెక్కుండచ్చు బిడ్డా, గిప్పుడన్నిటికి ట్రాక్టర్లేనాయే పెయికి కట్టంగూడ తెల్వది బిడ్డా నా బార్య కలుగజేసుకుంటూమంచిగనే ఉంటదిగని అత్తా... పోరగాండ్ల చదువెట్లా... మేమే సక్కగ చదువుకోక ఇబ్బందులు పడ్తన్నమ్, పిల్లలకి చదువుల్లేకపోతే.... అమ్మ మాట్లాడుతూఈడ గూడ మంచి బళ్లున్నయి బిడ్డా... ఇంగ్లిపీసే గావాల్నంటే సిరిసిల్లకేయి ఇస్కూలు బస్సులు గూడ అత్తున్నయ్, ఆడికి పంపుదాము వెంటనే తమ్ముడుఔనన్నా... నాగ్గూడ నువ్వీడుంటనే మంచిదనిపిత్తుంది, ఒక్క వరే గాకుండా రక రకాల పంటలు, రక రకాల పద్దతుల్ల పండియ్యన్నా.... మంచి దిగుబడితో పాటు పైసలు గూడ ఎక్కువత్తయి, గిప్పుడు సర్కారు పాలీహౌజులకి, డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ లోన్లిత్తుంది, గా కొండాపూర్ల సురేష్ గాడు పాలీహౌజ్ పెట్టి కూరగాయలు పండిచ్చుకుంట నెలకి ముప్పైవేలు సంపాదిత్తుండు, నాటు కోళ్లతోని మల్లో ముప్పై వేలు తీత్తుండు, ఓసారి చూసిరా... నీకేం గావాల్నన్న మన పోన్లనుంచే పన్జేసుకోవచ్చు, ఆలోచించన్నా... అమ్మా నాన్నలు కూడా మళ్లీ మళ్లీ ఇదే ముచ్చట చెప్పిండ్రు. నా బార్య కూడా ఆ ఇరుకిరికు రూములకన్నా ఊరే మంచిగుంది అనుకుంటుంది, పిల్లల చదువులకి కూడా బెంగలేనట్టే అనిపించింది. ఇగ నేను కూడా ఒక నిర్ణయానికొచ్చేశాను, తెల్లారి తమ్ముణ్ని బస్సెక్కియ్యనీకి సిరిసిల్లల దింపి అగ్రికల్చర్ ఆఫీస్కి పోయి పాలీహౌజ్తో పాటు, మినీ గోదాం కోసం అప్లికేషన్ పెట్టుకొని వచ్చిన, మూడు, నాలుగు నెలలు గడిచిపోయినయి, రోజు పొలం పనులకు తోడు పాలీహౌజ్లో మడులు కట్టడం, తీగలు చుట్టడం, కూరగాయలు, ఆకు కూరలు తెంపి సిరిసిల్ల మార్కెట్కి పంపడం. చాలా బిజీ అయిపోయింది. ఒక్క టమాట విషయంలో చాలా ఇబ్బందులొస్తున్నాయి ఒక్కసారే దర అమాంతం పడిపోయి గిట్టుబాటు కాదుకదా... కనీసం ట్రాన్స్పోర్ట్ చార్జీలు కూడా రావడంలేదు. ఇంతలో ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి నక్కవాగు కాలువ పూడిక తీపియ్యడం కూడా అయిపోయింది. ఒకవైపు గోదాం పనులు కూడా చివరికొచ్చాయి. ఈ సారి బాస్కర్ హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు టమాట సాస్ తయారు చేసే మిషన్ తీసుకొచ్చిండు, దాంతో పాటు ప్యాకేజింగ్ చేసి అమ్మడానికి రికవరీ అనే బ్రాండ్ పేరుని రిజిష్టర్ చేయించి, స్టిక్కర్లు కూడా పట్టుకొచ్చిండు, టమాటాలని మార్కెట్కి తీసుకెళ్లకుండా నాణ్యమైన సాస్ తయారుచేసి మా ఊరితో పాటు చుట్టుపక్కల మండలాల్లో, సిరిసిల్లాలో అమ్మడం మెదలు పెట్టాను, మంచి నాణ్యతతో తాజాగా అందిచడంతో కొద్దిరోజుల్లోనే మా బ్రాండ్ మంచి పేరు తెచ్చుకుంది, గోదాం కూడా పూర్తవడంతో మా దాన్యంతో పాటు, మా ఊరి రైతుల దాన్యాన్ని కూడా నిలువ చేసి రేటు వచ్చినప్పుడు అమ్మడంతో పాటు రికవరీ బ్రాండ్ పేరుతో పురుగుమందులు లేని అన్నిరకాల దాన్యాలని సైతం ప్యాక్ చేసి అమ్మడం మెదలుపెట్టాను, ఇప్పుడు నేను, నాకుంటుంబంతో పాటు మా ఊరివాల్లు మరో పదిమందికి నేనే ఉపాది చూపగల్గాను. ఇలా ఆనందంగా జీవితం సాగిపోతున్నప్పుడే తమ్ముడి పెళ్లి కూడా జరిగిపోయింది. అప్పుడే కురిసిన వర్షాలకి నక్కవాగు పొంగిపోయి కాలువ రాముల గుట్టనుండి అందమైన జలపాతంలా చెరువులో కలుస్తుంటే మా ఆవునూరు ఇప్పుడొక పెద్ద టూరిస్ట్ ప్లేసయిపోయింది. ఆ జలపాతంలో సందడి చేస్తున్న మా పిల్లల్ని చూస్తూ ఒక్కసారి గతంలోకి జారిపోయాను, అంతా కలలా అన్పిస్తుంది, కరోనా విలయం నా జీవితాన్ని, మా ఊరిని ఎంతలా మార్చిందో తల్చుకుంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. సంక్షోభంలో సైతం అవకాశాలు దాక్కొని ఉంటాయి, వాటిని అన్వేషించి అందుకుంటే విజయాలు ఎలా వరిస్తాయే నన్ను చూస్తేనే అర్థమయితుంది. ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఎప్పుడూ ఎట్లాంటి కష్టం వచ్చినా అదిగమిస్తాననే నమ్మకం కుదిరింది. దీనికంతటికి కుటుంభ మద్దతుతో పాటు, సాదించాలనే కసి నన్ను ఎలా మార్చిందో, ఎలా రికవరీ చేసిందో అనుకుంటూ ఉండగానే పరుగెత్తుకుంటూ తడిబట్టలతో నా ఒళ్లో దుంకిన నాకూతురు డాడీ, దా ఫాల్స్ దగ్గరికి పోదాం రా... ఎంత మంచింగుందో అనడంతో ఈ లోకంలోకి వచ్చాను,   సరే తల్లి ఎక్కువ తడువకు సడిదయిద్దీ అనడంతో అక్కడే ఉన్న నాభార్యవామ్మె మళ్లా సడిదా...... అని ఆశ్చర్యంగా నవ్వడంతో నేను ఆమెతో నవ్వులు కలిపాను.

ప్రభుత్వోద్యోగమే పనికి పరమావదా?


 


పనినే దైవంగా భావించే సమాజం మనది, అనాదిగా నిర్వహిస్తున్న అనేక వృత్తుల ప్రాతిపదికనే మన పురాతన సంస్కృతి కొన్ని నిర్థిష్టమైన సంప్రదాయాలను ఏర్పరుచుకొని అభివృద్ది చెందుతూ వస్తుంది. పనిచేసేవాడికే విలువ, చేసే పని ఏదైనా అందులో నీతి, న్యాయం ఉండి తనతో పాటు తన కుటుంబం భుక్తికోసం ధర్మబద్దంగా పనిచేసి సంపాదించుకోవడమనేది ప్రతీ ఒక్కరి హక్కు. దురదృష్టవశాత్తు కాల క్రమంలో చేసే పని ఆదారంగానే వర్ణవ్యవస్థ రూపుదాల్చి, కులం అనే కబంద హస్తాల్లో అది చిక్కుకు పోయి పనిని బట్టి గౌరవం ఇవ్వడమనే దుష్ట సాంప్రదాయానికి తెరతీసిన విషాద చరిత్ర సైతం మనదే. నాటి ఆదిమ మానవుడు జీవనం కోసం వేటాడడం మెదలు నేటి ఆదునిక మానవుడి ఖండాంతర యానం వరకూ ప్రతీది తను చేసే పని ఆదారంగానే పరిణామక్రమం కొనసాగింది, అది కొనసాగుతూనే ఉంటుంది కూడా. పనే లేకుంటే ఈ ప్రపంచం లేదు. సృజనాత్మక ఆవిష్కరణలతో ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించిన పని కొందరిదైతే, ఆ ఆవిష్కరణలతో తమ జీవనాన్ని సరళికృతం చేసుకొని తమతో పాటు తమ సమాజాన్ని అభివృద్ది చెసిన పని అందరిది. ఇలా కేవలం ఆహార సంపాదనే ముఖ్యమైన పనిగా ఉన్న దశనుండి శాఖోపశాఖలుగా విస్తరించి, ఈ పనిలో చూపించే నైపుణ్యాల ఆదారంగా వారి వారి ఆర్థిక, సామాజిక స్థితిగతుల్ని మార్చుకునే స్థాయి వరకూ పని పరిణామం చెందుతూ వచ్చింది. ఐతే రాను రాను పని అనేది కేవలం సంపదని సృష్టించుకునే ఒక భౌతిక సాదనంగానే చూడడం మెదలైన నాటినుండి దీనికి అనేక రకాల జాడ్యాలు అంటుకున్నాయి. కేవలం ప్రాపంచికమైన విషయాల సాదనగానే పని మిగిలిపోయింది. ప్రభుత్వోద్యోగమే పరమావది అన్నా చందంగా తయారైంది. అలా ఇప్పుడు ఈ పనిని కల్పించడం అనేది ఒక రాజకీయ వస్తువుగా రూపాంతరం చెందింది. అధికార, విపక్షాలు పరస్పర విమర్శలు చేసుకోవడానికి అంశీభూతమవుతుంది. పని కల్పించడం కేవలం ప్రభుత్వాల పనే అనేంతగా మన మెదళ్లలో విషబీజాలు నాటుతున్నాయి నేటి రాజకీయాలు. ఉన్నత విద్యాభ్యాసం ముగించుకొన్న ప్రతీ ఒక్కరికి ప్రభుత్వమే పని కల్పించాలి అనే విపరీత దోరణి రాజకీయ విమర్శల్లో కన్పిస్తుండడం విచారకరం. ఇది కనీస ఆచరణ సాద్యం కాదనే అసలు నిజం వారికి తెలిసినా, అభూత కల్పనలైన వాదనలతో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పైచేయి సాదిస్తున్నామనే భ్రమలో యువకుల మెదళ్లని ఎంత విషపూరితం చేస్తున్నారో వారు గ్రహిస్తున్నారా? ప్రభుత్వోద్యోగమే సర్వరోగ నివారిణి, సంజీవని అనే ఈ మాటల ద్వారా చదువుకున్న వ్యక్తి సామర్థ్యాల్ని కుదిస్తున్నామన్న నిజాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? కేవలం కొన్ని ఉద్యోగాలే ఉన్న ఈ సెక్టార్లో విపరీతమైన పోటీని పెంచి తద్వరా యువత ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నదెవరూ? ఇలా కేవలం ప్రభుత్వోద్యోగమే చాలని అనుకుంటే ఐన్ స్టీన్, స్టీపెన్ హాకింగ్, సచిన్ టెండుల్కర్, విశ్వనాథన్ ఆనంద్, బాలసుభ్రమణ్యం, బిల్ గెట్స్, స్టీవ్ జాబ్స్, జుకర్ బర్గ్, అంబానీ, టాటాలు పుట్టేవారా? నేడు వేలమందికి దైవ సమానమైన పనిని కల్పించేవారా? అందరూ ప్రభుత్వోద్యోగాలే ఎంచుకుంటే నవీన ఆవిష్కరణలు ఎవరు చేయాలి? కోటానుకోట్ల మానవులకి అవసరమైన అనేక ఉత్పత్తులు ఏలా సాద్యం? ఇంతటి ముఖ్యమైన విషయాల గురించిన ఆలోచన లేకుండా రాజకీయాలు కొనసాగుతుండడం మన దురదృష్టం, నిజానికి ఈ సమయంలో చేయవలసింది కసితో పనిచేసే యువతకి సరైన మార్గదర్శనం, వారిలో ఉన్న అంతులేని జ్ణానతృష్ణని వెలికితీసి, అనేక రంగాల్లో ఎదగడానికి ఉన్న అవకాశాల్ని పరిచయం చేయడం. ఉరకలేసే వారి ఉత్సాహానికి ఊతకర్రలా నిలబడి సాయం చేయడం. ప్రభుత్వోద్యోగంలో దొరికే సౌకర్యాలని అన్ని రంగాల్లో కల్పించేలా పోరాటాలు చేయడం. సమాజంలోని వ్యక్తుల వికాసాన్ని పెంచి వారి దృక్పథాలు మార్చి నవ సమాజం దిశగా తీసుకెళ్లే విద్యని అభ్యసించిన యువకులకి అవకాశాల్ని వెతుక్కునే సామర్థ్యం ఉందని తెలియజెప్పడం. వారిలోని నైపుణ్యాలని పెంచి అనేక రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలి. కేవలం దాదాపు నాలుగు లక్షల మంది మాత్రమే అవసరమైన ప్రభుత్వ శాఖల్లో నాలుగున్నర కోట్ల తెలంగాణ బిడ్డలకు అవకాశం ఎలా ఇవ్వగలం అనే వాస్తవికతను అర్థం చేసుకోవాలి. విమర్శలే ఎజెండాగా ముప్పైవేల ఉద్యోగాలే ప్రభుత్వం భర్తీ చేసింది. లక్ష ఉద్యోగాలేవీ అనే కోణాన్ని... ప్రైవేట్ రంగంలోని అపార అవకాశాలని తెలియజెప్పే దిశగా మార్చుకోవాలి. ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక రంగాల్లో పెరిగిన ఉద్యోగ అవకాశాల్ని, వాటిలో పనిచేసుకొని జీవనం కొనసాగిస్తున్న లక్షలమంది ఉన్నారనే అభయాన్ని ఇవ్వాలి. అదేసమయంలో శ్రమదోపిడి జరుగుతున్న రంగాల్లో వాటిని అడ్డుకోవడానికి ఉన్న అవకాశాల గురించి అన్వేషించాలి. ఇవన్నీ ఒక్కరోజులో జరిగే మార్పులు కావు, కానీ వాటి దిశగా నేటి నుండి మన కార్యాచరణ ఉండేలా జాగరూకత వహించాలి. యువకుల కలలకి రెక్కలు తొడగాలి. ప్రభుత్వోద్యోగాన్ని మించిన పనులెన్నో ఉన్నాయని చాటిచెప్పాలి. ఇదే ప్రజాపక్షం వహించే వారి ఎజెండా కావాలి. కృషితో నాస్తి దుర్భిక్షం.

గంగాడి సుధీర్, జర్నలిస్ట్.

9394486053

21, సెప్టెంబర్ 2020, సోమవారం

రైతుకి ఏం కావాలి?

 

రైతుకి ఏం కావాలి?

భారతదేశం వ్యవసాయాదారిత దేశం అనే విషయాన్ని ఇంచుమించు మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరినుంచి పాఠ్యపుస్తకాల్లో చదువుకోవడమే కాదు, ప్రతీ నేత నోటినుండి వింటున్న మాటే. కానీ ఇందుకోసం ప్రభుత్వాలు చేస్తున్న క్రుషి ఏంటి? తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడుబిల్లులు స్వేచ్చా విక్రయం, ముందస్తు ఒప్పందాలకి చట్టబద్దత, అత్యవసరాల నిల్వలపై ఆంక్షల ఎత్తివేతల వల్ల రైతుకి ఒరిగేదేంత? వ్యాపారికి మిగిలేదెంత? మనదేశంలో ఇప్పటికీ దాదాపు డెబ్బై శాతం మంది వ్యవసాయం, దాని అనుబంద రంగాలపై ఆదారపడి జీవనం కొనసాగిస్తున్న వారే, అయితే గత రెండు దశాభ్దాలుగా దేశంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, పండగలా ఉండాల్సిన వ్యవసాయం దండగలా మారుతున్నా సంస్కరణల పేరుతో ఎన్ని నూతన విదానాలు అవలంబించిన ఈ పరిస్థితి ఎందుకు ఇంకా ఇలా కొనసాగుతూనే ఉంది, మెక్సికోలో ఆహార సంక్షోభాన్ని అదిగమించడానికి సంకర వంగడాలని, క్రిమి సంహారక, రసాయన ఎరువులని వాడి హరిత విప్లవం పేరుతో పంట దిగుబడులని ఇబ్బడిముబ్బడిగా పెంచిన విదానాన్ని 1961లోనే భారత్ లోనూ ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల సాగునీరు ఆదారిత వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచింది మెదలు, పింక్ రెవల్యూషన్, బ్లూ, రెడ్, వైట్, ఎల్లో, సిల్వర్, గోల్డన్ రెవెల్యూషన్ల పేరుతో ఒక్కో వ్యవసాయ ఉత్పత్తికి ఒక్కో రకమైన విదానాన్ని అవలంబించి సాధించిన ప్రగతి రైతు జీవితాల్లో మార్పులైతే తీసుకువచ్చింది కానీ అది సంపూర్ణంగా లేకపోవడానికి కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది, ఇలా ప్రభుత్వం మేదోమధనాన్ని కొనసాగిస్తూ ఉన్న బడుగు, సన్న,చిన్నకారు రైతుల జీవితాల్లో ఎటువంటి మార్పులు సంబవించకపోవడం శోచనీయం. ఇలా స్వతంత్ర భారతంలోని డెబ్బై దశకాలు రైతుకి నిర్ధిష్టంగా ఏం కావాలి అనే దానిపై పరిశోదనలతోనే గడిచిపోయాయి, ఈ కాలంలో భాక్రానంగర్ ప్రాజెక్టు, హీరాకుడ్ ప్రాజెక్టు, తెహ్రీడ్యామ్, జయక్వాడి ప్రాజెక్టు, కలఘర్ ప్రాజెక్టు వంటి దేశవ్యాప్త ప్రాజెక్టులతో పాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు, దవళేశ్వరం ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వంటి భారి ప్రాజెక్టులతో పాటు చిన్నా చితకా అన్నీ కలిపి దాదాపు మూడువేల ఎనిమిది వందల ప్రాజెక్టుల ద్వారా అందుబాటులోకి వస్తున్న నీరు కన్నా వ్రుదాగా సముద్రంలో కలిసిపోతున్న నీరే అదికం అనే విషయం బహిరంగ రహస్యమే. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న డెబ్బైవేల టీఎంసీలని ఎలా ఉపయోగించుకోవాలి, దేశంలోని డెబ్బై కోట్ల ఎకరాల్ని ఎలా సాగులోకి తేవాలి అనే ప్రణాళికలపై చిత్తశుద్ది లేకుండా రైతులకోసం ఏం చేసినా అది తూతూ మంత్రం చర్య అనిపించుకోదా? ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మన దేశంలోని రైతాంగం కొట్టుమిట్టాడుతుంటే, పాలకులు చేసిన కొత్త చట్టాలు రైతులకి ఏమేరకు ప్రయేజనం చేకూరుస్తాయో గమనిస్తే వాటిలోని డొల్ల తేటతెల్లం అయిపోతుంది. దేశంలోని తొంబై శాతం కమతాలు చిన్న సన్నకారు రైతుల చేతుల్లోనే ఉన్నాయి. కేవలం ఐదెకరాల లోపు కమతాలే ఇందులో ఎక్కువ శాతం మరిలాంటి బక్క రైతులు తమ పంటల్ని ఎక్కడో ఉన్న సుదూర తీరాలకి తరలించుకుపోయి అమ్ముకోగలరా?  అప్పుల కోసం కల్లాల్లోనే పంటలని అమ్మడం కోసం దళారులు సిండికేట్ మాయాజాలంలో కనీస మద్దతు దరని కూడా సాదించుకొని బక్క రైతు పంటలని నిల్వ చేసుకొని రేటు వచ్చినప్పుడు అమ్ముకోగలరా? ఇక ముందస్తు ఒప్పందాలకి చట్టబద్దత ద్వారా నకిలీవిత్తనాలు వేసి మోసపోయినప్పుడు ఎలాంటి పరిహారం వస్తుందో చెప్పని చట్టం, తర్వాత కార్పోరేట్లని ప్రశ్నించి ఒప్పంద అమలుకు ప్రభుత్వ యంత్రాంగమే లేనప్పుడు ఏం చేయగలుగుతాయి. దీని ద్వార కార్పోరేట్లకి ఒప్పందం అనే దొడ్డిదారిని కాస్తా రహదారిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమా? గుజరాత్లో పెప్సీకో కంపెనీ ఆలుగడ్డ రైతులని కోర్టుకి లాగిన ఉదంతాలు మనముందే కనబడుతున్నాయి. క్రమంగా రైతులనే వారిని లేకుండా చేసి కేవలం కూలీలని మాత్రమే ఈ చట్టాలు తయారుచేయవనే గ్యారంటీ ఏంటీ? రైతుల ముసుగులో కార్పోరేట్ శక్తుల్లోకి వ్యవసాయం దాని అనుభంద రంగాలు వెల్లిపోతే రక్షించే రక్షణ వ్యవస్థలు ఈ చట్టంలో ఉన్నాయా? ఒకవేళ ఉన్నా ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థీక్రుత అవినీతి విదానాలతో లాభం ఎవరికి? అతి సామాన్య వ్యక్తులకి కలుగుతున్న ఈ సందేహాలు చట్టం రూపకల్ఫన చేసే మోదావులకి రాకపోవడం విచారకరం, కనీసం వీటి నివ్రుత్తికి ఎలాంటి మార్గాలని సూచించారో ప్రజలకి వివరించకపోవడం బాదాకరం, ఇదే అంశంపై ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన అకాళిదళ్ మంత్రివర్గంనుండి వైదొలిగినా ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. స్థూలంగా రైతు ప్రయోజనాలే ఈ మూడు చట్టాల్లో కన్పిస్తున్నా ఆచరణలో దీనికి పూర్తి విరుద్దంగా జరుగబోతుంది అనేది ఈ ఆరునెలల ఆర్డినెన్స్ కాలమే నిరూపించిన ఉదంతాలు ఉన్నాయి. అసలు వ్యవసాయాన్ని సులభతరం చేసే మెకనైజేషన్ని చిన్న కమతాలకి ఎలా దగ్గర చేయాలో అనే తొందర లేకుండా ఈ చట్టాల వల్ల ఉపయోగమేంటి, ఒకవేళ ఈ చట్టాల్లోని సందేహాలన్నీ నిజమయి, అప్పుడు మెకనైజేషన్ తీసుకువస్తే ఖచ్చితంగా అది ఆత్మహత్యసద్రుశ్యమే. ఇప్పటికే వివిద రాష్ట్ర ప్రభుత్వాలు తమ రైతుల భాగోగుల కోసం అనేక రకమైన సంక్షేమ పథకాలని తీసుకువస్తున్నాయి, తెలంగాణ ఈ అంశంలో ఎంతో ముందుంది, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం, నియంత్రిత పద్దతుల్లో డిమాండ్కి అవసరమైన పంటల సాగు, ఇరవైనాలుగ్గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరంతో కాలువల ద్వారా, భూగర్భజలాల పెంపు, రైతుబందు, రైతు భీమా, వంటి విప్లవాత్మక పథకాలతో రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని పండగలా చేయడానికి చిత్తశుద్దితో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో రైతుబందు స్పూర్తితో ఏడాదికి ఆరువేలు అందించే కిషాన్ సమ్మాన్ నిదిని ప్రవేశపెట్టిన కేంద్రం మిగతా విషయాల్లో ఎందుకు ఆదర్శాన్ని కొనసాగించలేకపోతుంది. ఖచ్చితంగా వ్యవసాయానికి అవసరమైన భూమి, నీరు, కల్తీలేని విత్తనాలు, సకాలంలో ఎరువులు, శ్రమని, సమయాన్ని ఆదాచేసే యాంత్రీకరణ పద్దతులు, పండిన పంటకి గిట్టుబాటు రేటు, రైతులే మార్కెటింగ్ చేసుకొనే వెసులుబాటు, ప్రక్రుతి వైపరీత్యాలు సంభవించినపుడు అన్నదాతకి అండగా నిలబడడం. ఇవీ ముఖ్యమైనవి వీటిపై ప్రభుత్వాలు శ్రధ్ద కనబర్చాలి, అవసరమైన సంస్కరణలు తీసుకురావాలి అంతేకానీ ప్రక్రుతి వైపరీత్యాలతో, మార్కెట్ మోసాలతో అల్లాడుతున్న రైతుని రాజుని చేయకపోయినా ఫరువాలేదు, కూలీగా మాత్రం మార్చకండి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలపై సమగ్ర చర్చ జరగాలి, రైతులకి ఉండాల్సిన అన్ని రక్షణలని అందులో చేర్చాలి. అప్పుడే రైతుకిభరోసా దొరుకుతుంది. ఆ భరోసా ఇవ్వడమే ప్రభుత్వాల అతి ముఖ్యమైన భాద్యత.

 

గంగాడి సుధీర్, జర్నలిస్ట్13, జులై 2020, సోమవారం

నా తెలంగాణ కంజాతవల్లివి

ఎంత పుణ్యఫలమో ఇవ్వాల నేనిక్కడ నిలబడి ఈ స్వేచ్చాగానాన్ని ఆలపిస్తున్నాను
ఈ ఆరేండ్లలో నా తెలంగాణా ఎన్ని లక్ష్యాలని ముద్దాడింది
ఎన్నెన్ని కలల్ని సాకారం చేసుకుంది
ఎంతెంత ఆనందాన్ని అనుభవించింది
వీటన్నింటికి కారణమై...
ఇవ్వాల్టి తెలంగాణా ప్రజలందరి బతుక్కి తోరణమై....
మెరిసే పుణ్యజీవుల్ని స్మరించుకోవడమే...
నా స్వేచ్చాగానానికి నిండుదనం.
ఎవరెన్ని చెప్పినా....
చరిత్ర ఎలా రాసినా....
ముమ్మాటికీ నా ఈ నేల రత్నగర్బగా..
కోటి రతనాల వీణగా...
రాగాలాపనలలో.....
శ్రుతి, లయ, రాగం, భావం
ఆత్మభలిదానాలతో ఆచరణకి బాటలు వేసిన నా అమరులకే అగ్రతాంబూలం.
రేపన్నది స్వరాష్ట్రంతోనే ఉంటుందని చైతన్యం చేసిన త్యాగశీలులదే దార్శనికం.
స్వరాష్ట్రం మా జన్మహక్కని చాటిన నాలుగున్నర కోట్ల తెలంగాణా ప్రజలదే అంతిమ విజయం.
1967లొ విఫలమైన చోట 2014లో విజయాన్ని ముద్దాడడం వెనుకనున్నది ఖచ్చితంగా నాయకత్వ వ్యూహం
నేడు చూస్తున్న కుళ్లు రాజకీయాల్లో...
ఎవడేమైపోతే నాకేంటి అనుకునే కుఠిల కపటత్వంలో...
ఆమె ఏ ప్రయేజనాలని ఆశించిందో....
ఏ ఎత్తుల జిత్తులతో ఆటాడిందో....
కానీ తల్లీ....
నువ్వు లేకపోతే....
నువ్వంత కఠినంగా లేకపోతే...
తలుపులు మూసైనా...మా తలపులని నెరవేర్చకపోతే....
నాకల కల్లనే ఔను.
నాకల రావణ కాష్టంలా రగులుతూనే ఉండు.
ఇంకా ఎన్నో బలిదానాలు సాగుతూనే ఉండు.
అందుకే..... అందుకే.....
అమ్మా....
నీ జాతియత నాకక్కరలేదు
నీ మతం నేనెరుగను
నీ కులగోత్రాల ఊసు నాకొద్దు
నువ్వే నా తల్లివి
నా తెలంగాణ కంజాతవల్లివి
జై తెలంగాణ జై జై తెలంగాణ


ఇవ్వాలేమైంది నీకు.....

ఇవ్వాలేమైంది నీకు....
గ్రీష్మంలో మోడువారినప్పుడు కూడా
తాపంతో తరుక్కుపోయిన నామోములో అరుణారుణకాంతుల్ని చూసినవాడివి
శిశిరంలో గడ్డకట్టుకపోయినప్పుడు కూడా
విడివడిన బిందువుల్ని మంచులా బందించి అల్లుకుపోయినవాడివి
ఇవ్వాలేమైంది నీకు....
ఆశాడ మేఘంలో ప్రేమలేఖల్ని నీటి బిందువులుగా చేసి
అవనిపై అల్లుకుపోయే తీగల్ని ముద్దాడడానికి వర్షంగా నేను వస్తుంటే....
పూల రెమ్మల్లోంచి పుప్పొడి మోహంతో కైపెక్కి
ఎదురుగాలుల్ని చీలుస్తూ నీ యదసడికోసం తుమ్మెదనై నేనొస్తుంటే....
ఎక్కడిదీ ప్రచండ మారుతం
ఏమిటీ విది వైపరీత్యం
ఎడబాటు కోసం ఎవరు స్రుష్టించారి తడబాటు
నిను కలువద్దంటుంది
తనువులు తగలద్దంటుంది
వసంతం వేసిన చిగురులు మ్రుగశిర తొలకరి కోసమేగా....
మట్టిని ముద్దాడే విత్తు చివురుల మెలకల కోసమేగా...
ఉరకలై పరుగులెత్తే గంగమ్మ సముద్రుడి సాన్నిత్యం కోసమేగా....
ఇదే కదా ప్రక్రుతి
దీన్ని విక్రుతి చేసిందెవరు
ఆత్మీయ ఆలింగనాలు లేకుండా
మనసారా పలకరింపులు లేకుండా
ఇవ్వాలేమైంది నీకు.....

పొక్కిలి

అరే, ఆకిలంత పొక్కిలి జెయ్యకుబిడ్డా... గిప్పటికే హైద్రాబాద్ల సాబాష్ బండలేపియ్యకుండా లీల్లచ్చినప్పుడల్లా గీ బురదేందని వాడకట్టోల్లంత తిట్టవట్టే... ఇంకా అండ్ల నువ్వు పొక్కిలి జేస్తే ఎట్ల బిడ్డా... అని వాకిట్లో ఆడుకుంటున్న మనమరాలిని అదలిస్తూనే లోపలికెళ్లాడు లక్ష్మణ్. అప్పటికే ఇంట్లో వంటచేసి తినడానికి లక్ష్మణ్ కోసం ఎదురుచూస్తున్న ఆమె బార్య లక్ష్మీ ‘బిడ్డ జేసే పొక్కిలి గాదు నువ్వుజేసే పొక్కిలి గురించి జెప్పు, గిప్పుడు ఎనిమిదైతంది ఇంకెంతసేపు జూడాలే బువ్వ తిననీకి తొమ్మిదైతే గేటు బంజేత్తమని కిరాయోల్లకి జెప్పుడు గాదు, మనంగూడుక సందియ్యద్దు. సరే సరే జల్ది రాపో ఆకలైతాంది తిందాం' అన్న బార్య అదిలింపుతో పాంటు షర్ట్ విప్పి కాళ్లు చేతులు మోఖం కడుక్కొని దిగూట్ల పెట్టిన బాటిల్ బయటకి తీసి పెగ్గుపోసుకొని లిలబడే తాగి, మరోపెగ్గు కలుపుకొని టీవీ ముందటికొచ్చి కూర్చున్నడు లక్ష్మణ్. బార్య వడ్డించిన అన్నం తింటూనే... 'ఉగాది పండగ సీజన్ గదా... మా బట్టల షాపుల గిరాకీ ఎక్కువున్నది ఎనిమిది దాక పంజేయాలని జెప్పిండ్రు, ఏం జేత్తం మరి తప్పదు గదా...' అన్నడు. 'ఏంది తప్పేది సప్పుడు జేక నీ నౌకరి బంజేయ్, మన దాబాపైనేసిన రెండు రేకుల షెడ్ల కిరాయి ఆరేలు చాలవా మనం బతకనీకి, ఉన్న ఇద్దరు బిడ్డలు ఆళ్లుల్లతోని ఉన్నదాంట్ల మంచిగనే బతకవట్టె ఎందుకింత ఆరాటం మనిషికి, ఏం జేసుకుంటాం ఇదంతా' అంది. 'ఏందే చాలేది, గీ పట్నంల ఆరువేలు ఎంత కడుపుగట్టి బతికినా రెండువారాలు జాలయి. మరి తతిమ రోజులు అళ్లుల్లని అడుక్కొని బతకమంటవా... నాకింక గా కర్మవట్టలే... నా కాళ్లు చేతులు ఆడినంతకాలం నా పని నేనే జేసుకొని బతుకుతా... సరే గని పొల్ల తిన్నదా... పండుక్కి బిడ్డల్లత్తుండ్రా... బచ్చ్యాలు జేయనీకి సామాను తెచ్చినవా... అళ్లుల్లకి బట్టలు వెడ్దామా...' అని ఇంకా ఏదో అడగబోతుంటే లక్ష్మీ అడ్డుతగులుతూ... 'ఆ పెడ్తం తియ్ దసురకి పెడ్తం మల్ల ఉగాదికి పెడ్తం ఎన్ని సార్ల పెడ్తం గయినా మనం కడుపుకట్టుకొని సంపాయించిందంతా మనం బోయినంక ఆళ్లకి గాకపోతే ఎవులకు బెడ్తం. ముందు పెరుగేసుకొ.... దావఖానకు బోయినవా... మందులు తెచ్చుకొమ్మంటే ఇంటున్నవా... ముందు నామాటిను నువ్వు' అని లక్ష్మీ రోజూ అన్నం తినేట్టప్పుడు చెప్పే మాటల్నే చెపుతుంది. 'ఆ సరే సరేలే అన్నీ తెచ్చుకున్న, గా సంటిదాన్కి తినపెట్టి పడుకో...' అని పల్లెం పట్టుకొని జాలాట్ల కెల్లి కడుక్కచ్చుకొని సిగరేట్ ముట్టిచ్చుకుండు లక్ష్మణ్. నలబై ఏళ్ల క్రితం ఉన్నఊరు ఆవునూరిని వదిలి పెళ్లైన కొత్తల్నే పట్నంకి బతకనీకి వచ్చాడు లక్ష్మణ్. దొరికినకాడల్లా ఆలూ మగలూ పన్జేసుకుంటూ... ఖైరతాబాద్ బస్తీల అరవై గజాల్లో నోటరీ ఇల్లు సంపాదించి, ఉన్న ఇద్దరు కూతుర్లకి మంచి చదువులు చదివించి, వాల్ల పెండ్లి తనకన్నా మెరుగ్గా పనిమంతులయి ఏసీరూముల్లో పన్జేసుకొని, ఈఎమ్ఐల్లో ఇల్లుకొనుక్కున్న అళ్లుల్లకిచ్చి చేశాడు. ఈ బస్తీకొచ్చి బతకడానికి వాళ్లకి నామోషి, ఆ మార్బుల్ జారుడులో బతకడానికి వీళ్లకి ఇబ్బంది, ఇలా అటు మద్యతరగతికి, ఇటు ఊళ్లో తన తండ్రి బతికిన లేకి బతుక్కి మద్యస్థంగా బతుకుబండిని సాగదీసుకుంటూ వస్తున్నాడు లక్ష్మణ్. ఈ నలబై ఏళ్లలో దసరా పండగున్న ఐదు రోజులు తప్ప మిగతా జీవితమంటా ఏదో ఓ పనిజేసుకుంటూనే బతికారు ఆ దంపతులు. బిడ్డల పెండ్లీలయినంకా... బరువు బాద్యతలు కొంచెం తీరినంకా..., లక్ష్మీతో పనిమానిపించి తను మాత్రం పనిచేస్తూనే ఎలాగోలా ఎవరిజీవితాలు వాళ్లు కష్టపడుతూ వెల్లదీస్తూనే ఉన్నారు. ఇలా 2020 మార్చి22వ తేది వాళ్ల జీవితాన్ని చిన్నాబిన్నం చేసేవరకూ ఉన్నంతలో సంతోషంగానే బతికారు. ఇప్పటికి నాలుగు నెళ్లైంది మూడుపూటలా కడుపునిండా తిని. ఎన్నడూ రాని కష్టం ఈ కుటుంబాన్ని విపరీతంగా కుంగదీసింది. అప్పటివరకూ పనిచూపిచ్చిన బట్టల దుకాణం మూతపడి పనిలేదు పొమ్మంది. ఇంట్లో కిరాయికుండే బక్కప్రాణాలు తనలాగే పనిదొరక్క ఖాళీ చేసి సొంతూరెల్లిపోయారు. అటు ఉద్యోగం లేదు, ఇటు కిరాయి లేదు, దాచుకున్న పదివేలు ఎంత గీచి ఖర్చుపెట్టుకున్నా రెండు నెళ్లుకూడా రాలేదు. అటు బిడ్డల బతుకు ఆగమైంది. ఇద్దరు అళ్లుల్లకి నో వర్క్ నో పే అని రెండు నెళ్లైంది. ఈఎమ్ఐలు ఇప్పటికిప్పుడు కట్టకున్నా... భవిష్యత్ తలుచుకొని అళ్లుల్లు ఆగమాగం ఐతుండ్రు. ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలీదు, ఇప్పుడే గిట్లుంటే రాబోయే రోజులు ఇంకెంత భయంకరంగా ఉంటయో అని భయపడుతుండ్రు. ఉద్యోగం కాదు కదా సగం జీతంకి కూడా కొలువు దొరుకుతదో లేదోనని టెన్షన్తో అళ్ళుల్లు బతుకుతుండ్రు. నెలకి ముప్పైవేళు ఈఎమ్ఐలు ఏడికేయి కట్టాల్నని పరేషాన్ ఐతుండ్రు. ఇంతలో చిన్నళ్లుడు కొంచెం దగ్గు, ఆయాసంతో జరం వచ్చిన రెండురోజులకే టీవీల వార్తలు జూసి ఆగమాగమైపోయి, అయ్యే నాకొచ్చింది అసలు రోగమేమోనని ఆత్మహత్యా యత్నం చేసిండు. మెత్తానికి ప్రాణాపాయం నుంచైతే బయటవడ్డడు. అప్పటినుండి లక్షణ్కి కాళ్లు చేతులు ఆడుతలేవు, బిడ్డల్నీ అళ్లుల్లని ఇంటికి పిలిచి దైర్యం చెప్పిండు. 'గప్పుడెప్పుడో మా తాత కాలంల గత్తరొచ్చి ఊరు ఊరంతా ఖాళీ చేసి బాయిలకాడ్నే బతికిండ్రట, గండ్ల మిగిలినోడే మాతాత , నా బిడ్డలు పుట్టనీకి రెండేండ్ల ముందు స్కైలాబ్ బడ్తదని ఉన్నయన్ని ఊర్సుకొని తిన్నం, తర్వాత పుణే మిల్లుల పన్జేసేటప్పుడు ప్లేగొచ్చి సచ్చిపోతమంటే దాన్ని తట్టుకొని బతికినం... గాబట్టే గియ్యాల్ల మీరందరూ ఈడున్నరు. భయమెందుకు బిడ్డా..., ఆగో గా పసిపోరల జూడుండ్రి. ఆళ్లేం జూసిండ్రు. ఎందుకాగమాగం ఐతున్నరు, కాలం ఎప్పుడు ఒక్కతీరుగుండదు, పొక్కిలి వడ్డ వాకిలి శాన్పుతోటి సక్కగ గాకపోదు, భయపడకుండ్రి బిడ్డా.. బోదాం పా ఆవునూరికే బోదాం పా... ఓ నెళ్లాల్లు కలోగంజో తాగి ఆడ్నే బతుకుదాం... మా ఊరెప్పుడూ ఆకల్తోటుంచది'. అనంగనే ఆ మాటల్తోటి దైర్యం తెచ్చుకున్న లక్ష్మీ కూడా 'అవ్ బోదాం పా మనూరికి బోదాం పా... కాలమాగుతదా ఏంది, ఎదిరిచ్చి నిలవడ్దాం... నా మనుమరాళ్ల బతుకుజూడద్దా.. ఆళ్ల పెండ్లి జూడద్దా... బుగులొద్దు, ఇంట్ల పొక్కిలి తీర్చే శాన్పు కాలమే జల్తది...' అనడంతో ఆమెతో పాటు గొంతుకలిపారు అందరూ భతుకుపై భరోసా తెచ్చుకొని. చెడుల మంచి లెక్క బిడ్డల రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూసిన ఆవునూరు గోస ఇట్లనన్న తీరింది.
9394486053

23, ఏప్రిల్ 2020, గురువారం

కరోనా టైమ్స్ - కథచెవుల్లో ఒకటే రొద, పిల్లల అల్లరికి తోడు టీవీ సౌండ్కి ఇల్లు టాప్ లేచిపోయేలా ఉంది, అప్పుడప్పుడే నిద్రలోంచి మెలకువొచ్చి ఈ గోల విన్పించకుండా చెవులకి దిండుని అదిమిపెట్టుకొని పక్కమీదే అటూ ఇటూ దొర్లుతున్నాను, ఒక్కసారిగా ఇళ్లంతా నిశ్శబ్దం అయింది, ఝుయ్యని సౌండ్ చేస్తూ తిరుగుతున్న ప్యాను మెల్లగా ఆగిపోయింది. అప్పటి వరకూ చల్లగా ఉన్న మత్తు కాస్తా వదిలిపోయింది, కరెంట్ పోవడంతో మూగబోయిన పిల్ల రాక్షసుల గొంతులు క్షణమైనా గడవకముందే మరింత బీకరంగా ఆన్ అయ్యాయి, అదేంటో మామూలుగా చలికాలం ముసుగేసుకొని పడుకున్న దానికన్నా... ఎండాకాలం చల్లటిగాలికి అస్సలు లేవాలనిపించట్లేదు, అలా బద్దకంగా లేవాలా, వద్దా అని పక్కపై సణుగులాట జరుగుతున్నప్పుడే... వంటింట్లోంచి రివ్వున దూసుకొచ్చాయి మాటల తూటాలు, టైం పదవుతుంది, ఏంటా మెద్దు నిద్ర, ఊరోళ్ల మజ్జంతా నీకొస్తుంది ఇకనైనా లేవు, అయినా.. ఆపీసు లేకపోతే.... ప్రపంచమే లేదనుకుంటున్నావా... ఏంటీ... ఏదో ఆదివారం అలసిపోయి పడుకున్నావంటే ఒక అర్థం, ఇప్పుడు ప్రతీ రోజు ఆదివారమే అంటే ఎట్లా... లే... లే...అనే సుప్రభాతానికి తోడు ఒళ్లంతా చెమట్లు పడుతుండడంతో ఇక లేవక తప్పలేదు, ఏంటీ గోల పిల్లల అరుపులని మించిపోతుంది నీ లొల్లి, అయినా రోజు ఆదివారం లాగా ఎక్కడే... మెదటి రోజేమో ఇళ్లంతా సర్దించావు, మరునాడు కార్ క్లీనింగ్ చేయించావు, నిన్నట్నుండు అంట్లు తోమడం కూడా మెదలెట్టించావు, దీనికన్నా ఆఫీసు ఉంటేనే నయం అని ఆవులిస్తూనే వంటింట్లోకెళ్లా... చీ చీ ఇక్కడినుండి కదలండి ముందు, బాత్రూంకెళ్లి క్లీనయి రండి, అని వంటింట్లోంచి నెట్టేస్తూ.. ఇప్పటికైనా అర్థమయిందా ఆఫీసుకెళ్లి కంప్యూటర్ ముందేసుకొని కుర్చీలో కుర్చునే దానికన్నా ఇక్కడ ఇంట్లో పని చేయడం ఎంతో కష్టం అని. సరె సరె ఓ బాగానే ఉందిలే సంబడం... ముందు కొంచెం బెడ్ కాఫీ ఇస్తావా... ఏంటీ.. బెడ్ కాఫీ కావాలా... ఓ వైపు ప్రపంచం మెత్తం కరోనాతో శుచి, శుభ్రత కోసం ఉరకలేస్తుంటే... పాచి మెఖంతో తిని తాగుతా అనడానికి సిగ్గులేదూ... అంటూ గదమాయించే సరికి బాత్రూంకి వెల్లక తప్పలేదు, మెఖం కడుక్కుంటుంటే... సింకు దగ్గర మహా సముద్రాలు పొంగుతున్నాయా అన్నట్టుగా నీళ్లు పొంగి బాత్రూంలో కొస్తున్నాయి, ఇద్దరు పిల్ల రాక్షసులు హాండ్ వాష్ పేరుతో ఒకర్నొకరు తోసేసుకుంటూ చేతులు కడగడం కన్నా పోటీపడడంలోనే ఆసక్తి చూపిస్తూ నీళ్లని ఎగజిమ్ముతూ ఆటలాడుతున్నారు, నల్లా కట్టేసి ఇద్దరి చేతులు కడిగి హాల్లోకి లాక్కొచ్చా...సోపాలో తిన్నగా కూర్చొకుండా టీవీ రిమోట్ని అందుకోవడానికి ఎగిరి దుంకాడు చిన్నోడు, ఆ కుదుపుకి సోపా రెండడుగులు వెనక్కి జారిపోయింది. కోపంగా అరుస్తూ.. సోపాని సరిచేసి వాడి చేతుల్లోంచి రిమోట్ లాక్కొని న్యూస్ ఛానల్ పెడుతూ కూర్చున్నా... అంతే ఒక్కసారిగా వాడి గొంతు వంద డెసిబుల్ల శభ్దంతో భళ్లున తెరుచుకుంది, ఆ శబ్దానికి వంటింట్లోంచి మా ఆవిడ తెస్తున్న టిఫిన్ గిన్నె అమాంతం గాల్లో ఎగిరి వచ్చి నా ఒళ్లో వాలిపోయింది. దాన్ని ఒడుపుగా పట్టుకుంటుండగానే... ఏమన్నారు వాడ్ని, ఇందాకట్నుంచి బుద్దిగా ఆడుకుంటున్న వాల్లతో టీవీ కోసం ఎందుకు గొడవ పెట్టుకుంటావ్, ముందా రిమోట్ వాడికివ్వండి అని ఆర్డరేసింది. టీవీలో ఇక రేపో మాపో ప్రపంచం మునిగిపోతుంది. కరోనా ప్రపంచంలోని మనుషులందర్ని చంపేస్తుంది అంటూ ఉదరగొడుతున్నారు. ఇప్పటివరకూ మనదేశంలో వివిదకారణాలతో ఇంచుమించు రోజూ ఇరవైరెండువేల మంది చనిపోతున్నారు, అందులో కరోనా సోకి చచ్చేవాళ్లు కనీసం నలబైమంది మించి లేరు. కానీ ఈ న్యూస్ చానల్స్ చూస్తే నిజంగానే కరోనాతో ఖచ్చితంగా అందరం చచ్చిపోతామనే భయమేసింది, వెంటనే రిమోట్ వాడి చేతిలో పెట్టా... అప్పటివరకూ ట్రాఫిక్లో రోతపెడుతున్న ఫైరింజన్ల అరిచిన వాడు, చటుక్కున కార్టూన్ చానల్ పెట్టి ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయాడు. ఏంటీ టిఫిను అంటూ ఒళ్లోని గిన్నె తెరచి చూస్తే.. ఇడ్లీలు కన్పించాయి, ఇవ్వాల్లా ఇడ్లీలేనా... రోజు ఇడ్లీలే తినాలంటే ఎలా...లాక్ డౌన్కి ముందు ఉడిపి హోటల్లో తిన్న వెరైటీ వెరైటీ టిఫిన్లు గుర్తొచ్చి ఇడ్లీలు తినాలంటే సయించలేదు. నిన్ననేగా ఉప్మా చేశా.. మల్లీ రేపు ఏదైనా వెరైటీ చేస్తాలే.. అయినా ఇప్పుడు చూడాల్సింది టేస్ట్ కాదు హెల్త్ అంటూ వడ్డించింది. ఉప్మా, ఇడ్లి, దోశ ఇదేగా నీ రొటేషన్, అయినా ఈ మూడే కాదు ఇంకా చాలా ఉన్నాయి, అని లొట్టలేస్తూ... బొండా, వడ, పెసరట్టు, పాస్తా, శాండ్ విచ్, డోనట్, పిజ్జా, బర్గర్…’ ఇలా చదువుబోతుంటే... బర్గర్ పేరు వినగానే.. మా చిన్నోడు శోకం మెదలెట్టేశాడు బర్గర్.. బర్గర్ అంటూ, బుద్దిలేకపోతే సరి, హోటల్లో బేరర్ లా అన్నీ గుర్తుచేసి పిల్లాడ్ని చెడగొట్టడానికి, వాన్ని ఊరడిస్తూనే... అందుకేనా ఇన్ని రోజులు ఇంట్లో ఏం వండినా... ఆఫీసులో అర్జంట్ పనుంది అక్కడికెల్లి తింటా అని వెల్లిపోయేవారు.. ఇక నుండి ఇవ్వన్నీ బంద్ ఏదైనా ఇంట్లో చేసిందే తినాలి, ఊ తినండి అని గద్దించేసరికి ఇక చేసేదేం లేక టిఫిన్ చేస్తూనే... మద్యాహ్నం లంచ్ ఏం వండుతున్నావ్ అన్నా... అంతే గయ్యిమని లేచింది. ఇంకా టిఫినే కాలేదు, అప్పుడే లంచ్ కావాల.... ఆహా అది కాదు, ఏంటో తెలుస్తే.... కొంచెం ఉత్సాహంగా ఉంటుంది కదా అని నసిగా... ఆ..అందుకే ఏ పనీ లేకపోతే తిండిమీదే యావ, మీకు ఉత్సాహం నేను తెప్పిస్తాగా... పద ముందెళ్లి టాంకు శుబ్రం చేద్దాం పద అంది... వామ్మో ఇప్పుడా బయట చూడు ఎండ ఎలా కొడుతుందో అమ్మో నేను రాను అన్నా...అంతే మూతి మూడు వంకర్లు తిప్పుతూ... ఎలాగూ వాకింగ్ లేదు, కనీసం ఇలా దాబాపై వల్లు వంచితేనన్నా ఇంత ఎండతగిలి విటమిన్ డి అందితే మంచిది కదా... మీ ఆరోగ్యం కోసమేగా నేను చెప్పేది అని శోకం తగిలించుకుంది. సరె సరె వెల్దాంలే... కనీసం కొంచెం చాయ్ అయినా ఇవ్వు తాగి వెల్తా అంటున్నా విన్పించుకోకుండా బ్లీచింగ్ పౌడర్ డబ్బాతో పాటు నా రెక్క పట్టుకొని లాక్కుపోయింది. టాంకు క్లీన్ చేసి కిందకొచ్చేసరికి పన్నెండు దాటింది. వస్తూనే ప్రిజ్ డోర్ తీయబోతుంటే.. అమాంతం కేకేసింది, బయట్నుండొచ్చాక హండ్ వాష్ చేయకుండా ఏం ముట్టుకోవద్దని, అదేంటే..ఇందాక బ్లీచింగ్తోనేగా క్లీన్ చేసింది. ఇంకా అంతకన్నా వాష్ ఉంటుందా చేతులకీ అన్నా..అవన్నీ ఆపండి ముందు హాండ్ వాష్ అంటూ గదిమింది. సింక్ దగ్గర చేతులు కడుక్కుంటూనే.. ఐనా ఇంట్లో ఉండేటోల్లేందుకే ఊకూకే హండ్ వాష్ చేసుకోవాలి. మన చేతులకేం కరోనా వైరస్ లేదుగదా అని లాజిక్ తీసా... మా పెద్దోడు ఈ వాషింగ్ గోల వదిలించుకోవాలని నా లాజిక్కి వెంటనే అవును నాన్నా...ఇంట్లో ఉండే మనమెందుకు పదే పదే హండ్ వాష్ చేసుకోవాలి. బాగానే ఉంది మీ వాలకం, కరోనా వైరస్ని కడిగేసుకోవడం ఒకటే కాదు, చేతులు మురిగ్గా ఉంటే ఏదో ఓ ఇన్పెక్షన్ వస్తుంది, దాంతో రోగనిరోదక శక్తి తగ్గిపోతుంది కరోనా సోకడానికి అవకాశం ఎక్కువుంటుంది, అందుకు తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలంది, ఆమె నాలెడ్జికి ఆశ్చర్యపోతూ... ఇదంతా నీకెవరు చెప్పారు, వాట్సాప్ చూడట్లేదేంటి అంది. ప్రిడ్జ్ ఓపెన్ చేస్తూ.. బ్రెడ్డు అయిపోయినట్టుంది అలా సూపర్ మార్కెట్ కెల్లి తెస్తా అన్నా... అవసరం లేదు కిచెన్లో ఉంది అంది. బట్టర్, జామ్ లేనట్టుంది తెస్తా...’ ‘అవేం నిత్యావసరాలు కాదు, షుగరో, సాల్టో, ఆయిలో, పప్పో ఎదో ఒకటి తెస్తా అసలే ఈ లాక్ డౌన్ ఎన్నిరోజులుంటుందో ఏమో...తర్వాత్తర్వాత రేట్లు పెరిగిపోతే... అవి దొరకకపోతే ఏట్లా అన్నా... ఏం అవసరం లేదు ఏదో ఓ వంకతో బయటకెళ్లాలనే ఆలోచన మానేయండి. మీకు వర్క్ ఫ్రం హోం ఇచ్చింది ఇలా మాటి మాటికి ఏదో సాకుతో భయట తిరగడానికి కాదు, ఇంట్లోనే ఉండి ఎటూ కదలకుండా బుద్దిగా పనిచేసుకోడానికి. అని చురకంటించింది. ఇప్పటికి నాలుగు రోజులైంది రోడ్డు మెఖం చూసి, బోర్ కొడ్తుంది ఏదో రీజన్ చెప్పి బయటకెళ్దామని చేస్తున్న నా ప్రయత్నాలన్ని విఫల ప్రయత్నాలే అవుతున్నాయి. టీవీ రిమోట్ మన చేతికి రావాలంటే స్మార్ట్ పోన్ పిల్లల చెతిలోకెళ్లాల్సిందే... టీవీకన్నా ఇది మరింత ప్రమాదకరం అని భయమేసి, నేనే పోన్లో తలదూర్చా... కాసేపయ్యాక అదీ బోర్ కొట్టింది. ఏమోయి కొంచెం జంతికలు, కారప్పూసతో పాటు పల్లిపట్టి తెస్తావా అని అడిగా... అబ్బబ్బబ్బా.. ఒక్క క్షణమైనా మీ గిర్నీ నడిపించకుండా ఖాళీగా ఉండలేరా... అంటూ గిన్నె ముందు పెట్టింది, కాసేపు మరాడించాక కొంచెం టీ పెడ్తావా...టీ తీసుకొచ్చి ముందు పెట్టింది. రెండవడంతో లంచ్ కానిచ్చి ఏం పాలుపోక సరసం పైకి మనసు మళ్లి వంటింట్లో పనిచేసుకుంటున్న శ్రీమతి నడుం చుట్టూ చేయి వేశా, అంతే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఎగిరి దుంకింది, ఏంటీ పిచ్చిపని వేళా పాళా లేదా, పిల్లలున్నారన్న ద్యాసన్నా ఉండదా... అంటూ పంచమహా పాతకం చేసిన వాడిలా కసురుకుంది. పిల్లలు ఆన్లైన్ క్లాసుల్లో బిజీగా ఉన్నారులే అన్నా... చీ ముందిక్కడి నుండి నడుస్తారా లేదా... ఈ స్టే హోం ఏమోకానీ మీ గొంతెమ్మ తిండి కోర్కెలు తీర్చడానికే టైం సరిపోవడం లేదు, ఇంకా... అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది. ఇంకా మన ఆటలు సాగవనుకొని కాసేపు కునుకు తీసా.. అంతలోనే డాం మీదునుంచి దుంకుతున్న జలపాతాల్లా మా పుత్రరత్నాలు నామీంచి గెంతుతూ ఆటలాడుతున్నారు, కాసేపు వాల్లతో ఆటాడుకొని లేచి చూసే సరికి వంటింట్లో ఏదో చేస్తున్నట్టుంది. డిస్ట్రబ్ చేయడం ఎందుకులే అని ప్రిడ్జ్ లొంచి ప్రూట్స్ తీసుకొని ప్లేట్లలో పెట్టుకొని హాల్లో తింటూ... పిల్లలకిస్తూ...టీవీ చూడటంలో మునిగిపోయా..అలా ఏదో ఓటి నముల్తూ ఉండగానే సాయంత్రం అయిపోయింది. పదండి ఈ బట్టలన్నీ ఆరేద్దాం అంటూ మల్లీ బిల్డింగ్ ఎక్కించింది. అలా ఓ యాబై రౌండ్లు బిల్డింగ్ పై వాకింగ్ చేశాక కిందికొచ్చి, కాసేపు టీవీలో తలదూర్చా... మల్లీ పిల్లల గోల మెదలయింది. డాడీ అన్నయ్య కొడుతున్నాడు అంటూ అమాంతం ఎగిరి ఒళ్లోకి దూకాడు చిన్నోడు, ఏయ్ ఆగరా తమ్మున్ని ఆడిపించాల్సింది పోయి ఎందుకు కొడుతున్నావ్రా అని కొంచెం కోపంగానే పెద్దోన్ని మందలిస్తే... ఏంటి డాడీ అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను తిడ్తావ్ అని బుంగమూతి పెట్టి కోపంగా అటు తిరిగి కూర్చున్నాడు పెద్దోడు, అయ్యో ఫీలయ్యాడే అని అది కాదు నాన్నా... అంటూ మెల్లగా అనునయించబోయా... వాడు పో డాడి, వాడేం తప్పుచేసినా ఏం అనవు, నన్ను మాత్రం తప్పులేకుండానే తిడ్తావు అంటూ ఏడుపుమెఖం పెట్టాడు, సరె సరె ఏడవకు, ఇగో ఈ ఫోన్లో కాసేపు ఆడుకో అని వాడికివ్వగానే... చిన్నోడు ఆ... నాకు పోన్ కావాలి అని గోల చేయడం మెదలెట్టాడు, వాడికి నచ్చచెప్పి రిమోట్ వాడి చేతిలో పెట్టి, ఇక అక్కడుంటే మనవల్ల కాదనుకొని శ్రీమతి దగ్గరికెళ్లి, వామ్మో ఎలా భరిస్తున్నావే వీళ్లని, ఎప్పుడు కామ్గా ఉంటారో, ఎప్పుడు ఇళ్లుపీకి పందిరేస్తారో అర్థమవడం లేదు అన్నా... మరిప్పుడు అర్థమయిందా ఇళ్ళాలి పనంటే ఎలా ఉంటుందో... ఇటు ఇంటిని చక్కబెడుతూనే... పిల్లల్ని కంట్రోల్లో ఉంచడం ఎంత కష్టమో... వామ్మో ఏదేమైనా మగమహరాజులం, సంపాదిస్తాం, అనే మా మగాళ్ల ఫిలింగ్ ఎంత తప్పో అర్థమయింది. ఆరాదనా భావంతో వంగి మగువా నీకు సలాం అన్నా... దీవిస్తున్నట్టుగా ఫోజిస్తూ... ఈ నిజాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకో భక్తా అంది. మెల్లగా నవ్వుతూ హాల్లోకొస్తూ.... నైట్ డిన్నర్కి చపాతి వద్దు ఏదైనా వెరైటీ చేసుకుందామా... అన్నా... హా ఇప్పుడే కదా జ్ణానోదయమైంది, అంతలోనే.... మరిచిపోయారా....అంది. ఇద్దరం ఒకేసారి నవ్వేశాం.
Gangadi Sudheer
9394486053