27, జనవరి 2018, శనివారం

ఈ రోజు అలా అలా గడిచిపోతుంది

ఈ రోజు అలా అలా గడిచిపోతుంది
రేపు కూడా అలాగే సాగిపోతుంది 
మరి 
ఈ ప్రశ్నకి అంతం వచ్చినపుడూ.........
ఆలోచించడానికైనా అనుభూతించడానికైనా
నీ దగ్గర ఏమి మిగిలిందనేదే ప్రశ్న
కాలం మిగిల్చే వేదనల్లో నీకోసం తపించిన హృదయాల ఘోష కనబడుతుంది
ఆరోజున వదిలేసిన నీ పైశాచికత్వం కనబడుతుంది
అంతే
ఈ రోజు అలా అలా గడిచిపోతుంది
దాచుకోవడానికి నెమెరేసుకోడానికి చిన్న అనుభూతి లేకుండా
రేపు కూడా అలాగే సాగిపోతూనే ఉంటుంది చితిలో చిటపటలు సర్థుమణిగేదాకా

లెక్కలు తప్పుతున్నాయ్

లెక్కలు తప్పుతున్నాయ్ ఆశలు చెదురుతున్నాయ్ 
గురువా
రెక్కా డొక్కా ఆడించి రొక్కమంతా గుమ్మరించి
చదువుల గోదాలో దించుతున్నాం
ఇరుకిరుకు గదుల్లో బాల్యం బందీ అవుతున్నా
వేటేసే ప్రైవేటులే గురుపూజకి అర్హమౌతున్నాయ్
వేల జీతాలు విశాల ఆవరణలు
మద్యాహ్న భోజనాలు ఇవేవీ మమ్మాకట్టుకోవట్లే
ఏం
లక్షలు ఖర్చౌతున్నా లక్షణం తెలియకపోవడం మా తప్పా
నమ్మకాన్నే నేర్పడం రాని ఈ గురువుల సమర్థత గొప్పా
ప్రైవేట్ పబ్లిక్ ఈ గోలంతా లేని
వసుదైక విద్యా కుటుంబం మా కల
కళలకి కాణాచిగా భవితని రూపొందించడం మీ నేల.
గురువా గద్దించైనా గర్జించైనా నీ ఆస్థిత్వాన్ని నిలుపు
టీచర్ కొలువంటే భుక్తికోసం కాదు
జాతి విముక్తి కోసం అని చాటు
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.
ఓ నిజాము పిశాచమా.....
నిరంకుశ నాజీలా అణిచేసిన రిజ్వీలా
నీ నరహంతక రూపాలు పటాపంచలైన రోజు
పోరాటాల తుది రూపు
అమరుల త్యాగాల గెలుపు
కలగలసి తెలంగానమైన రోజు
ఆపరేషన్ పోలోతో మా పరేషానీ తీర్చిన మహనీయులందరికీ శతకోటి ఉద్యమాభివందనాలు

రణం మా నినాదం

రణం మా నినాదం
దౌర్జన్యాలపై నిరసనం మా ఇజం
నిర్బంధాలని నిరసించడం మా నైజం
నాటి రజాకార్ నుండి నేటి దోపిడీకోర్ వరకీ ప్రతిఘటన రూపం చూపినోల్లం
సాయుధ పోరాటం నుండి చీరల భాగోతం వరకూ దుమ్ము దులిపినోల్లం
రణం మా నినాదం
బతుకునే ప్రశ్నించీ బానిసగా మార్చాలనే కుతంత్రాన్ని
ఎదురించి బతుకమ్మ ఆడినోల్లం
నిర్బంధించిన గళాల్లోనే ఉయ్యాల పాటల్ని
మార్మోగించిన దీరులం
అందుకే
దౌర్జన్యాలపై నిరసనం మా ఇజం
పోరాట స్ఫూర్తితో పోరు తెలంగాణలో సాగే రేపటి పౌరులం
బతుకమ్మ చూపిన దోవలో బరిగీచి నిలిచే తెలుగోల్లం
నా ఆమ్మలక్కలందరికీ ఉద్యమాబివందనాలతో బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

విజేత-పరాజిత

ఒకానొక రహదారి యాత్రలో సూదూర గమ్యాన్ని చేరాలని
వడివడిగా సాగే నడకలో
చిన్న బొడ్రాయి అడ్డొచ్చి కలల్ని చీల్చేసి 
కష్టాల్ని కావలించి
ఇష్టంగా నిన్ను పాతాలమార్గానికి మల్లిస్తే
దొర్లుకుంటూ జారి అద్రుష్యమయ్యేవాడే పరాజిత
దొరికిన ఆసరాని అందుకొని ద్రుగ్గోచరమయ్యేవాడే విజేత

Global Enterprenuer summit 2018

ఉరుకుదాం ఉరుకురికి ఎగురుదాం
ఎందాకా అంటే 
ఏవంక చూసినా అస‌హ్యం అదిరిపోయేలా
అప‌హాస్యం అంతుతేలేలా
విశ్వ‌వినువీదుల్లో వెలుగుజిలుగుల విజయాలు విస్తుపోయేలా
ప‌సిపాపల్ని ప‌రిహారంకోసం అమ్మే అమ్మ‌ల్లా
దేన్నికాద‌నాలి ఏదేది నాద‌నాలి
ఏంటో అంతా గంద‌ర‌గోళం
అభివ్రుద్ది రెక్క‌లు అంత‌లా ఎగురుతుంటే
చెల‌రేగే గాలి దుమారం న‌న్నెందుకు క‌ల‌వ‌ర‌పెడుతుంది
ఎంట్ర‌ప్రెన్యూర్లు వెలుగులు చిందిస్తుంటే
మంట‌ల్లో కాలే గూడులు నన్నెందుకు ద‌హిస్తున్నాయి
మెట్రోలు పైలాన్లు
పాల‌వ్యాన్లు ప‌గ‌టి క‌ల‌లు
దేన్ని కాద‌నాలి ఏది వాస్త‌విక‌మ‌వ్వాలి
సంపూర్ణ‌మైన‌దేది స‌త్యం కాద‌న్న‌ట్టు
ఇప్ప‌టికిందాక అనుకోవ‌డ‌మే మ‌న‌ద‌న్న‌ట్టు
సాదించిన దానికి సంతోషం
చితికిపోయిన దానికి సంఘ‌ర్ష‌ణం
స‌హ‌జం, స‌మాజ నైజం

HAPPY NEW YEAR .

ప్రయాణం ప్రవాహం.. 
సాగడమే కానీ ఆగడం తెలయని సజీవ లక్షణం
ఒక్కోసారి అనంతంగా ముంచేసే అల రావొచ్చు
మరోసారి అజేయంగా నిలబెట్టే కల తీరొచ్చు
కానీ 
గమనానికి గరిమనాభిలా
నీ గమ్యానికి నైతికసూచికని వదలొద్దు
ఇవ్వాళ ఉన్నది రేపుంటుందా?
రేపన్నది నీది కాకపోతుందా.
ఎదురయ్యే మలుపేదైనా వెరుపుచూపక వెలగడమే నీ ఇజం
రోజు వెనుక రోజు, చేదు వెనక తీపి
ఇదే కాలం మన దారిలో చేసే కొత్త సంతకం.
HAPPY NEW YEAR .