21, సెప్టెంబర్ 2020, సోమవారం

రైతుకి ఏం కావాలి?

 

రైతుకి ఏం కావాలి?

భారతదేశం వ్యవసాయాదారిత దేశం అనే విషయాన్ని ఇంచుమించు మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరినుంచి పాఠ్యపుస్తకాల్లో చదువుకోవడమే కాదు, ప్రతీ నేత నోటినుండి వింటున్న మాటే. కానీ ఇందుకోసం ప్రభుత్వాలు చేస్తున్న క్రుషి ఏంటి? తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడుబిల్లులు స్వేచ్చా విక్రయం, ముందస్తు ఒప్పందాలకి చట్టబద్దత, అత్యవసరాల నిల్వలపై ఆంక్షల ఎత్తివేతల వల్ల రైతుకి ఒరిగేదేంత? వ్యాపారికి మిగిలేదెంత? మనదేశంలో ఇప్పటికీ దాదాపు డెబ్బై శాతం మంది వ్యవసాయం, దాని అనుబంద రంగాలపై ఆదారపడి జీవనం కొనసాగిస్తున్న వారే, అయితే గత రెండు దశాభ్దాలుగా దేశంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, పండగలా ఉండాల్సిన వ్యవసాయం దండగలా మారుతున్నా సంస్కరణల పేరుతో ఎన్ని నూతన విదానాలు అవలంబించిన ఈ పరిస్థితి ఎందుకు ఇంకా ఇలా కొనసాగుతూనే ఉంది, మెక్సికోలో ఆహార సంక్షోభాన్ని అదిగమించడానికి సంకర వంగడాలని, క్రిమి సంహారక, రసాయన ఎరువులని వాడి హరిత విప్లవం పేరుతో పంట దిగుబడులని ఇబ్బడిముబ్బడిగా పెంచిన విదానాన్ని 1961లోనే భారత్ లోనూ ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల సాగునీరు ఆదారిత వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచింది మెదలు, పింక్ రెవల్యూషన్, బ్లూ, రెడ్, వైట్, ఎల్లో, సిల్వర్, గోల్డన్ రెవెల్యూషన్ల పేరుతో ఒక్కో వ్యవసాయ ఉత్పత్తికి ఒక్కో రకమైన విదానాన్ని అవలంబించి సాధించిన ప్రగతి రైతు జీవితాల్లో మార్పులైతే తీసుకువచ్చింది కానీ అది సంపూర్ణంగా లేకపోవడానికి కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది, ఇలా ప్రభుత్వం మేదోమధనాన్ని కొనసాగిస్తూ ఉన్న బడుగు, సన్న,చిన్నకారు రైతుల జీవితాల్లో ఎటువంటి మార్పులు సంబవించకపోవడం శోచనీయం. ఇలా స్వతంత్ర భారతంలోని డెబ్బై దశకాలు రైతుకి నిర్ధిష్టంగా ఏం కావాలి అనే దానిపై పరిశోదనలతోనే గడిచిపోయాయి, ఈ కాలంలో భాక్రానంగర్ ప్రాజెక్టు, హీరాకుడ్ ప్రాజెక్టు, తెహ్రీడ్యామ్, జయక్వాడి ప్రాజెక్టు, కలఘర్ ప్రాజెక్టు వంటి దేశవ్యాప్త ప్రాజెక్టులతో పాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు, దవళేశ్వరం ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వంటి భారి ప్రాజెక్టులతో పాటు చిన్నా చితకా అన్నీ కలిపి దాదాపు మూడువేల ఎనిమిది వందల ప్రాజెక్టుల ద్వారా అందుబాటులోకి వస్తున్న నీరు కన్నా వ్రుదాగా సముద్రంలో కలిసిపోతున్న నీరే అదికం అనే విషయం బహిరంగ రహస్యమే. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న డెబ్బైవేల టీఎంసీలని ఎలా ఉపయోగించుకోవాలి, దేశంలోని డెబ్బై కోట్ల ఎకరాల్ని ఎలా సాగులోకి తేవాలి అనే ప్రణాళికలపై చిత్తశుద్ది లేకుండా రైతులకోసం ఏం చేసినా అది తూతూ మంత్రం చర్య అనిపించుకోదా? ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మన దేశంలోని రైతాంగం కొట్టుమిట్టాడుతుంటే, పాలకులు చేసిన కొత్త చట్టాలు రైతులకి ఏమేరకు ప్రయేజనం చేకూరుస్తాయో గమనిస్తే వాటిలోని డొల్ల తేటతెల్లం అయిపోతుంది. దేశంలోని తొంబై శాతం కమతాలు చిన్న సన్నకారు రైతుల చేతుల్లోనే ఉన్నాయి. కేవలం ఐదెకరాల లోపు కమతాలే ఇందులో ఎక్కువ శాతం మరిలాంటి బక్క రైతులు తమ పంటల్ని ఎక్కడో ఉన్న సుదూర తీరాలకి తరలించుకుపోయి అమ్ముకోగలరా?  అప్పుల కోసం కల్లాల్లోనే పంటలని అమ్మడం కోసం దళారులు సిండికేట్ మాయాజాలంలో కనీస మద్దతు దరని కూడా సాదించుకొని బక్క రైతు పంటలని నిల్వ చేసుకొని రేటు వచ్చినప్పుడు అమ్ముకోగలరా? ఇక ముందస్తు ఒప్పందాలకి చట్టబద్దత ద్వారా నకిలీవిత్తనాలు వేసి మోసపోయినప్పుడు ఎలాంటి పరిహారం వస్తుందో చెప్పని చట్టం, తర్వాత కార్పోరేట్లని ప్రశ్నించి ఒప్పంద అమలుకు ప్రభుత్వ యంత్రాంగమే లేనప్పుడు ఏం చేయగలుగుతాయి. దీని ద్వార కార్పోరేట్లకి ఒప్పందం అనే దొడ్డిదారిని కాస్తా రహదారిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమా? గుజరాత్లో పెప్సీకో కంపెనీ ఆలుగడ్డ రైతులని కోర్టుకి లాగిన ఉదంతాలు మనముందే కనబడుతున్నాయి. క్రమంగా రైతులనే వారిని లేకుండా చేసి కేవలం కూలీలని మాత్రమే ఈ చట్టాలు తయారుచేయవనే గ్యారంటీ ఏంటీ? రైతుల ముసుగులో కార్పోరేట్ శక్తుల్లోకి వ్యవసాయం దాని అనుభంద రంగాలు వెల్లిపోతే రక్షించే రక్షణ వ్యవస్థలు ఈ చట్టంలో ఉన్నాయా? ఒకవేళ ఉన్నా ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థీక్రుత అవినీతి విదానాలతో లాభం ఎవరికి? అతి సామాన్య వ్యక్తులకి కలుగుతున్న ఈ సందేహాలు చట్టం రూపకల్ఫన చేసే మోదావులకి రాకపోవడం విచారకరం, కనీసం వీటి నివ్రుత్తికి ఎలాంటి మార్గాలని సూచించారో ప్రజలకి వివరించకపోవడం బాదాకరం, ఇదే అంశంపై ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన అకాళిదళ్ మంత్రివర్గంనుండి వైదొలిగినా ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. స్థూలంగా రైతు ప్రయోజనాలే ఈ మూడు చట్టాల్లో కన్పిస్తున్నా ఆచరణలో దీనికి పూర్తి విరుద్దంగా జరుగబోతుంది అనేది ఈ ఆరునెలల ఆర్డినెన్స్ కాలమే నిరూపించిన ఉదంతాలు ఉన్నాయి. అసలు వ్యవసాయాన్ని సులభతరం చేసే మెకనైజేషన్ని చిన్న కమతాలకి ఎలా దగ్గర చేయాలో అనే తొందర లేకుండా ఈ చట్టాల వల్ల ఉపయోగమేంటి, ఒకవేళ ఈ చట్టాల్లోని సందేహాలన్నీ నిజమయి, అప్పుడు మెకనైజేషన్ తీసుకువస్తే ఖచ్చితంగా అది ఆత్మహత్యసద్రుశ్యమే. ఇప్పటికే వివిద రాష్ట్ర ప్రభుత్వాలు తమ రైతుల భాగోగుల కోసం అనేక రకమైన సంక్షేమ పథకాలని తీసుకువస్తున్నాయి, తెలంగాణ ఈ అంశంలో ఎంతో ముందుంది, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం, నియంత్రిత పద్దతుల్లో డిమాండ్కి అవసరమైన పంటల సాగు, ఇరవైనాలుగ్గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరంతో కాలువల ద్వారా, భూగర్భజలాల పెంపు, రైతుబందు, రైతు భీమా, వంటి విప్లవాత్మక పథకాలతో రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని పండగలా చేయడానికి చిత్తశుద్దితో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో రైతుబందు స్పూర్తితో ఏడాదికి ఆరువేలు అందించే కిషాన్ సమ్మాన్ నిదిని ప్రవేశపెట్టిన కేంద్రం మిగతా విషయాల్లో ఎందుకు ఆదర్శాన్ని కొనసాగించలేకపోతుంది. ఖచ్చితంగా వ్యవసాయానికి అవసరమైన భూమి, నీరు, కల్తీలేని విత్తనాలు, సకాలంలో ఎరువులు, శ్రమని, సమయాన్ని ఆదాచేసే యాంత్రీకరణ పద్దతులు, పండిన పంటకి గిట్టుబాటు రేటు, రైతులే మార్కెటింగ్ చేసుకొనే వెసులుబాటు, ప్రక్రుతి వైపరీత్యాలు సంభవించినపుడు అన్నదాతకి అండగా నిలబడడం. ఇవీ ముఖ్యమైనవి వీటిపై ప్రభుత్వాలు శ్రధ్ద కనబర్చాలి, అవసరమైన సంస్కరణలు తీసుకురావాలి అంతేకానీ ప్రక్రుతి వైపరీత్యాలతో, మార్కెట్ మోసాలతో అల్లాడుతున్న రైతుని రాజుని చేయకపోయినా ఫరువాలేదు, కూలీగా మాత్రం మార్చకండి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలపై సమగ్ర చర్చ జరగాలి, రైతులకి ఉండాల్సిన అన్ని రక్షణలని అందులో చేర్చాలి. అప్పుడే రైతుకిభరోసా దొరుకుతుంది. ఆ భరోసా ఇవ్వడమే ప్రభుత్వాల అతి ముఖ్యమైన భాద్యత.

 

గంగాడి సుధీర్, జర్నలిస్ట్