23, ఏప్రిల్ 2020, గురువారం

కరోనా టైమ్స్ - కథచెవుల్లో ఒకటే రొద, పిల్లల అల్లరికి తోడు టీవీ సౌండ్కి ఇల్లు టాప్ లేచిపోయేలా ఉంది, అప్పుడప్పుడే నిద్రలోంచి మెలకువొచ్చి ఈ గోల విన్పించకుండా చెవులకి దిండుని అదిమిపెట్టుకొని పక్కమీదే అటూ ఇటూ దొర్లుతున్నాను, ఒక్కసారిగా ఇళ్లంతా నిశ్శబ్దం అయింది, ఝుయ్యని సౌండ్ చేస్తూ తిరుగుతున్న ప్యాను మెల్లగా ఆగిపోయింది. అప్పటి వరకూ చల్లగా ఉన్న మత్తు కాస్తా వదిలిపోయింది, కరెంట్ పోవడంతో మూగబోయిన పిల్ల రాక్షసుల గొంతులు క్షణమైనా గడవకముందే మరింత బీకరంగా ఆన్ అయ్యాయి, అదేంటో మామూలుగా చలికాలం ముసుగేసుకొని పడుకున్న దానికన్నా... ఎండాకాలం చల్లటిగాలికి అస్సలు లేవాలనిపించట్లేదు, అలా బద్దకంగా లేవాలా, వద్దా అని పక్కపై సణుగులాట జరుగుతున్నప్పుడే... వంటింట్లోంచి రివ్వున దూసుకొచ్చాయి మాటల తూటాలు, టైం పదవుతుంది, ఏంటా మెద్దు నిద్ర, ఊరోళ్ల మజ్జంతా నీకొస్తుంది ఇకనైనా లేవు, అయినా.. ఆపీసు లేకపోతే.... ప్రపంచమే లేదనుకుంటున్నావా... ఏంటీ... ఏదో ఆదివారం అలసిపోయి పడుకున్నావంటే ఒక అర్థం, ఇప్పుడు ప్రతీ రోజు ఆదివారమే అంటే ఎట్లా... లే... లే...అనే సుప్రభాతానికి తోడు ఒళ్లంతా చెమట్లు పడుతుండడంతో ఇక లేవక తప్పలేదు, ఏంటీ గోల పిల్లల అరుపులని మించిపోతుంది నీ లొల్లి, అయినా రోజు ఆదివారం లాగా ఎక్కడే... మెదటి రోజేమో ఇళ్లంతా సర్దించావు, మరునాడు కార్ క్లీనింగ్ చేయించావు, నిన్నట్నుండు అంట్లు తోమడం కూడా మెదలెట్టించావు, దీనికన్నా ఆఫీసు ఉంటేనే నయం అని ఆవులిస్తూనే వంటింట్లోకెళ్లా... చీ చీ ఇక్కడినుండి కదలండి ముందు, బాత్రూంకెళ్లి క్లీనయి రండి, అని వంటింట్లోంచి నెట్టేస్తూ.. ఇప్పటికైనా అర్థమయిందా ఆఫీసుకెళ్లి కంప్యూటర్ ముందేసుకొని కుర్చీలో కుర్చునే దానికన్నా ఇక్కడ ఇంట్లో పని చేయడం ఎంతో కష్టం అని. సరె సరె ఓ బాగానే ఉందిలే సంబడం... ముందు కొంచెం బెడ్ కాఫీ ఇస్తావా... ఏంటీ.. బెడ్ కాఫీ కావాలా... ఓ వైపు ప్రపంచం మెత్తం కరోనాతో శుచి, శుభ్రత కోసం ఉరకలేస్తుంటే... పాచి మెఖంతో తిని తాగుతా అనడానికి సిగ్గులేదూ... అంటూ గదమాయించే సరికి బాత్రూంకి వెల్లక తప్పలేదు, మెఖం కడుక్కుంటుంటే... సింకు దగ్గర మహా సముద్రాలు పొంగుతున్నాయా అన్నట్టుగా నీళ్లు పొంగి బాత్రూంలో కొస్తున్నాయి, ఇద్దరు పిల్ల రాక్షసులు హాండ్ వాష్ పేరుతో ఒకర్నొకరు తోసేసుకుంటూ చేతులు కడగడం కన్నా పోటీపడడంలోనే ఆసక్తి చూపిస్తూ నీళ్లని ఎగజిమ్ముతూ ఆటలాడుతున్నారు, నల్లా కట్టేసి ఇద్దరి చేతులు కడిగి హాల్లోకి లాక్కొచ్చా...సోపాలో తిన్నగా కూర్చొకుండా టీవీ రిమోట్ని అందుకోవడానికి ఎగిరి దుంకాడు చిన్నోడు, ఆ కుదుపుకి సోపా రెండడుగులు వెనక్కి జారిపోయింది. కోపంగా అరుస్తూ.. సోపాని సరిచేసి వాడి చేతుల్లోంచి రిమోట్ లాక్కొని న్యూస్ ఛానల్ పెడుతూ కూర్చున్నా... అంతే ఒక్కసారిగా వాడి గొంతు వంద డెసిబుల్ల శభ్దంతో భళ్లున తెరుచుకుంది, ఆ శబ్దానికి వంటింట్లోంచి మా ఆవిడ తెస్తున్న టిఫిన్ గిన్నె అమాంతం గాల్లో ఎగిరి వచ్చి నా ఒళ్లో వాలిపోయింది. దాన్ని ఒడుపుగా పట్టుకుంటుండగానే... ఏమన్నారు వాడ్ని, ఇందాకట్నుంచి బుద్దిగా ఆడుకుంటున్న వాల్లతో టీవీ కోసం ఎందుకు గొడవ పెట్టుకుంటావ్, ముందా రిమోట్ వాడికివ్వండి అని ఆర్డరేసింది. టీవీలో ఇక రేపో మాపో ప్రపంచం మునిగిపోతుంది. కరోనా ప్రపంచంలోని మనుషులందర్ని చంపేస్తుంది అంటూ ఉదరగొడుతున్నారు. ఇప్పటివరకూ మనదేశంలో వివిదకారణాలతో ఇంచుమించు రోజూ ఇరవైరెండువేల మంది చనిపోతున్నారు, అందులో కరోనా సోకి చచ్చేవాళ్లు కనీసం నలబైమంది మించి లేరు. కానీ ఈ న్యూస్ చానల్స్ చూస్తే నిజంగానే కరోనాతో ఖచ్చితంగా అందరం చచ్చిపోతామనే భయమేసింది, వెంటనే రిమోట్ వాడి చేతిలో పెట్టా... అప్పటివరకూ ట్రాఫిక్లో రోతపెడుతున్న ఫైరింజన్ల అరిచిన వాడు, చటుక్కున కార్టూన్ చానల్ పెట్టి ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయాడు. ఏంటీ టిఫిను అంటూ ఒళ్లోని గిన్నె తెరచి చూస్తే.. ఇడ్లీలు కన్పించాయి, ఇవ్వాల్లా ఇడ్లీలేనా... రోజు ఇడ్లీలే తినాలంటే ఎలా...లాక్ డౌన్కి ముందు ఉడిపి హోటల్లో తిన్న వెరైటీ వెరైటీ టిఫిన్లు గుర్తొచ్చి ఇడ్లీలు తినాలంటే సయించలేదు. నిన్ననేగా ఉప్మా చేశా.. మల్లీ రేపు ఏదైనా వెరైటీ చేస్తాలే.. అయినా ఇప్పుడు చూడాల్సింది టేస్ట్ కాదు హెల్త్ అంటూ వడ్డించింది. ఉప్మా, ఇడ్లి, దోశ ఇదేగా నీ రొటేషన్, అయినా ఈ మూడే కాదు ఇంకా చాలా ఉన్నాయి, అని లొట్టలేస్తూ... బొండా, వడ, పెసరట్టు, పాస్తా, శాండ్ విచ్, డోనట్, పిజ్జా, బర్గర్…’ ఇలా చదువుబోతుంటే... బర్గర్ పేరు వినగానే.. మా చిన్నోడు శోకం మెదలెట్టేశాడు బర్గర్.. బర్గర్ అంటూ, బుద్దిలేకపోతే సరి, హోటల్లో బేరర్ లా అన్నీ గుర్తుచేసి పిల్లాడ్ని చెడగొట్టడానికి, వాన్ని ఊరడిస్తూనే... అందుకేనా ఇన్ని రోజులు ఇంట్లో ఏం వండినా... ఆఫీసులో అర్జంట్ పనుంది అక్కడికెల్లి తింటా అని వెల్లిపోయేవారు.. ఇక నుండి ఇవ్వన్నీ బంద్ ఏదైనా ఇంట్లో చేసిందే తినాలి, ఊ తినండి అని గద్దించేసరికి ఇక చేసేదేం లేక టిఫిన్ చేస్తూనే... మద్యాహ్నం లంచ్ ఏం వండుతున్నావ్ అన్నా... అంతే గయ్యిమని లేచింది. ఇంకా టిఫినే కాలేదు, అప్పుడే లంచ్ కావాల.... ఆహా అది కాదు, ఏంటో తెలుస్తే.... కొంచెం ఉత్సాహంగా ఉంటుంది కదా అని నసిగా... ఆ..అందుకే ఏ పనీ లేకపోతే తిండిమీదే యావ, మీకు ఉత్సాహం నేను తెప్పిస్తాగా... పద ముందెళ్లి టాంకు శుబ్రం చేద్దాం పద అంది... వామ్మో ఇప్పుడా బయట చూడు ఎండ ఎలా కొడుతుందో అమ్మో నేను రాను అన్నా...అంతే మూతి మూడు వంకర్లు తిప్పుతూ... ఎలాగూ వాకింగ్ లేదు, కనీసం ఇలా దాబాపై వల్లు వంచితేనన్నా ఇంత ఎండతగిలి విటమిన్ డి అందితే మంచిది కదా... మీ ఆరోగ్యం కోసమేగా నేను చెప్పేది అని శోకం తగిలించుకుంది. సరె సరె వెల్దాంలే... కనీసం కొంచెం చాయ్ అయినా ఇవ్వు తాగి వెల్తా అంటున్నా విన్పించుకోకుండా బ్లీచింగ్ పౌడర్ డబ్బాతో పాటు నా రెక్క పట్టుకొని లాక్కుపోయింది. టాంకు క్లీన్ చేసి కిందకొచ్చేసరికి పన్నెండు దాటింది. వస్తూనే ప్రిజ్ డోర్ తీయబోతుంటే.. అమాంతం కేకేసింది, బయట్నుండొచ్చాక హండ్ వాష్ చేయకుండా ఏం ముట్టుకోవద్దని, అదేంటే..ఇందాక బ్లీచింగ్తోనేగా క్లీన్ చేసింది. ఇంకా అంతకన్నా వాష్ ఉంటుందా చేతులకీ అన్నా..అవన్నీ ఆపండి ముందు హాండ్ వాష్ అంటూ గదిమింది. సింక్ దగ్గర చేతులు కడుక్కుంటూనే.. ఐనా ఇంట్లో ఉండేటోల్లేందుకే ఊకూకే హండ్ వాష్ చేసుకోవాలి. మన చేతులకేం కరోనా వైరస్ లేదుగదా అని లాజిక్ తీసా... మా పెద్దోడు ఈ వాషింగ్ గోల వదిలించుకోవాలని నా లాజిక్కి వెంటనే అవును నాన్నా...ఇంట్లో ఉండే మనమెందుకు పదే పదే హండ్ వాష్ చేసుకోవాలి. బాగానే ఉంది మీ వాలకం, కరోనా వైరస్ని కడిగేసుకోవడం ఒకటే కాదు, చేతులు మురిగ్గా ఉంటే ఏదో ఓ ఇన్పెక్షన్ వస్తుంది, దాంతో రోగనిరోదక శక్తి తగ్గిపోతుంది కరోనా సోకడానికి అవకాశం ఎక్కువుంటుంది, అందుకు తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలంది, ఆమె నాలెడ్జికి ఆశ్చర్యపోతూ... ఇదంతా నీకెవరు చెప్పారు, వాట్సాప్ చూడట్లేదేంటి అంది. ప్రిడ్జ్ ఓపెన్ చేస్తూ.. బ్రెడ్డు అయిపోయినట్టుంది అలా సూపర్ మార్కెట్ కెల్లి తెస్తా అన్నా... అవసరం లేదు కిచెన్లో ఉంది అంది. బట్టర్, జామ్ లేనట్టుంది తెస్తా...’ ‘అవేం నిత్యావసరాలు కాదు, షుగరో, సాల్టో, ఆయిలో, పప్పో ఎదో ఒకటి తెస్తా అసలే ఈ లాక్ డౌన్ ఎన్నిరోజులుంటుందో ఏమో...తర్వాత్తర్వాత రేట్లు పెరిగిపోతే... అవి దొరకకపోతే ఏట్లా అన్నా... ఏం అవసరం లేదు ఏదో ఓ వంకతో బయటకెళ్లాలనే ఆలోచన మానేయండి. మీకు వర్క్ ఫ్రం హోం ఇచ్చింది ఇలా మాటి మాటికి ఏదో సాకుతో భయట తిరగడానికి కాదు, ఇంట్లోనే ఉండి ఎటూ కదలకుండా బుద్దిగా పనిచేసుకోడానికి. అని చురకంటించింది. ఇప్పటికి నాలుగు రోజులైంది రోడ్డు మెఖం చూసి, బోర్ కొడ్తుంది ఏదో రీజన్ చెప్పి బయటకెళ్దామని చేస్తున్న నా ప్రయత్నాలన్ని విఫల ప్రయత్నాలే అవుతున్నాయి. టీవీ రిమోట్ మన చేతికి రావాలంటే స్మార్ట్ పోన్ పిల్లల చెతిలోకెళ్లాల్సిందే... టీవీకన్నా ఇది మరింత ప్రమాదకరం అని భయమేసి, నేనే పోన్లో తలదూర్చా... కాసేపయ్యాక అదీ బోర్ కొట్టింది. ఏమోయి కొంచెం జంతికలు, కారప్పూసతో పాటు పల్లిపట్టి తెస్తావా అని అడిగా... అబ్బబ్బబ్బా.. ఒక్క క్షణమైనా మీ గిర్నీ నడిపించకుండా ఖాళీగా ఉండలేరా... అంటూ గిన్నె ముందు పెట్టింది, కాసేపు మరాడించాక కొంచెం టీ పెడ్తావా...టీ తీసుకొచ్చి ముందు పెట్టింది. రెండవడంతో లంచ్ కానిచ్చి ఏం పాలుపోక సరసం పైకి మనసు మళ్లి వంటింట్లో పనిచేసుకుంటున్న శ్రీమతి నడుం చుట్టూ చేయి వేశా, అంతే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఎగిరి దుంకింది, ఏంటీ పిచ్చిపని వేళా పాళా లేదా, పిల్లలున్నారన్న ద్యాసన్నా ఉండదా... అంటూ పంచమహా పాతకం చేసిన వాడిలా కసురుకుంది. పిల్లలు ఆన్లైన్ క్లాసుల్లో బిజీగా ఉన్నారులే అన్నా... చీ ముందిక్కడి నుండి నడుస్తారా లేదా... ఈ స్టే హోం ఏమోకానీ మీ గొంతెమ్మ తిండి కోర్కెలు తీర్చడానికే టైం సరిపోవడం లేదు, ఇంకా... అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది. ఇంకా మన ఆటలు సాగవనుకొని కాసేపు కునుకు తీసా.. అంతలోనే డాం మీదునుంచి దుంకుతున్న జలపాతాల్లా మా పుత్రరత్నాలు నామీంచి గెంతుతూ ఆటలాడుతున్నారు, కాసేపు వాల్లతో ఆటాడుకొని లేచి చూసే సరికి వంటింట్లో ఏదో చేస్తున్నట్టుంది. డిస్ట్రబ్ చేయడం ఎందుకులే అని ప్రిడ్జ్ లొంచి ప్రూట్స్ తీసుకొని ప్లేట్లలో పెట్టుకొని హాల్లో తింటూ... పిల్లలకిస్తూ...టీవీ చూడటంలో మునిగిపోయా..అలా ఏదో ఓటి నముల్తూ ఉండగానే సాయంత్రం అయిపోయింది. పదండి ఈ బట్టలన్నీ ఆరేద్దాం అంటూ మల్లీ బిల్డింగ్ ఎక్కించింది. అలా ఓ యాబై రౌండ్లు బిల్డింగ్ పై వాకింగ్ చేశాక కిందికొచ్చి, కాసేపు టీవీలో తలదూర్చా... మల్లీ పిల్లల గోల మెదలయింది. డాడీ అన్నయ్య కొడుతున్నాడు అంటూ అమాంతం ఎగిరి ఒళ్లోకి దూకాడు చిన్నోడు, ఏయ్ ఆగరా తమ్మున్ని ఆడిపించాల్సింది పోయి ఎందుకు కొడుతున్నావ్రా అని కొంచెం కోపంగానే పెద్దోన్ని మందలిస్తే... ఏంటి డాడీ అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను తిడ్తావ్ అని బుంగమూతి పెట్టి కోపంగా అటు తిరిగి కూర్చున్నాడు పెద్దోడు, అయ్యో ఫీలయ్యాడే అని అది కాదు నాన్నా... అంటూ మెల్లగా అనునయించబోయా... వాడు పో డాడి, వాడేం తప్పుచేసినా ఏం అనవు, నన్ను మాత్రం తప్పులేకుండానే తిడ్తావు అంటూ ఏడుపుమెఖం పెట్టాడు, సరె సరె ఏడవకు, ఇగో ఈ ఫోన్లో కాసేపు ఆడుకో అని వాడికివ్వగానే... చిన్నోడు ఆ... నాకు పోన్ కావాలి అని గోల చేయడం మెదలెట్టాడు, వాడికి నచ్చచెప్పి రిమోట్ వాడి చేతిలో పెట్టి, ఇక అక్కడుంటే మనవల్ల కాదనుకొని శ్రీమతి దగ్గరికెళ్లి, వామ్మో ఎలా భరిస్తున్నావే వీళ్లని, ఎప్పుడు కామ్గా ఉంటారో, ఎప్పుడు ఇళ్లుపీకి పందిరేస్తారో అర్థమవడం లేదు అన్నా... మరిప్పుడు అర్థమయిందా ఇళ్ళాలి పనంటే ఎలా ఉంటుందో... ఇటు ఇంటిని చక్కబెడుతూనే... పిల్లల్ని కంట్రోల్లో ఉంచడం ఎంత కష్టమో... వామ్మో ఏదేమైనా మగమహరాజులం, సంపాదిస్తాం, అనే మా మగాళ్ల ఫిలింగ్ ఎంత తప్పో అర్థమయింది. ఆరాదనా భావంతో వంగి మగువా నీకు సలాం అన్నా... దీవిస్తున్నట్టుగా ఫోజిస్తూ... ఈ నిజాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకో భక్తా అంది. మెల్లగా నవ్వుతూ హాల్లోకొస్తూ.... నైట్ డిన్నర్కి చపాతి వద్దు ఏదైనా వెరైటీ చేసుకుందామా... అన్నా... హా ఇప్పుడే కదా జ్ణానోదయమైంది, అంతలోనే.... మరిచిపోయారా....అంది. ఇద్దరం ఒకేసారి నవ్వేశాం.
Gangadi Sudheer
9394486053

20, ఏప్రిల్ 2020, సోమవారం

రోనా మత్ కరో.... కరోనా హైనా...

రోనా మత్ కరో....
కరోనా హైనా...
అమ్మా భూమాతా నీ కన్నీరింక చాలు
విచ్చలవిడి దోపిడితో...
విశృంకలమైన నడవడితో...
ఖండాంతరాలు దాటి
గ్రహాంతర యానాల్లో
మానవుడి దోపిడి ప్రస్థానానికి
కామా కాదు ఏకంగా ఫుల్ స్టాప్ పడబోతుంది.
రోనా మత్ కరో...
కరోనా ఆనా...
తెగిపడే జంతువుల తలలు
నరికేయబడే వ్రుక్షాల కాండాలు
చిదిమేయబడే ప్రకృతి విద్వంసాలు
అన్నింటి తరుపున
యుద్దం ప్రకటించింది సూక్ష్మజీవిగా...
అగ్రరాజ్యం ఆపుతుందో...
కమ్యూనిజం కలబడుతుందో...
దానవత్వం దారికాస్తుందో...
మానవత్వం నిలబడుతుందో...
తేలడానికి సమయమేం పట్టదు
రణమేం లేదు... కారుణ్యం తప్ప
కాఠిన్యమేం అవసరం లేదు... కనికరం తప్ప
కనీసం మారుదాం
మనిషిగా మారుదాం
తల్లిని వేడుకొందాం
తప్పుని మన్నించమందాం.
కరోనాని శాంతించమందాం.

ఆకలి రోగం కథ (వి6 వెలుగు దర్వాజ మాగజైన్ 17.01.2021నాన్న ఆకలౌతుంది, అన్నం తిందామా... అని చేతిని పట్టుకొని ఊపుతూ అడుగుతున్న ఆరేళ్ల కొడుకు శ్రీజన్ మాటలతో ఈ లోకంలోకొచ్చాడు సుధీర్, ఆ తిందాం బేటా... ఇంకా రెండు కాలేదు కదా... చిన్న ముళ్లు రెండు మీదికి రాగానే తిందాం అంటూ గోడకి వేలాడుతున్న పగిలిపోయిన గడియారం వంకా చూపిస్తూ చెప్పాడు సుధీర్, ఆకలైతే అన్నం తినాలని చెప్పావు కదా... మరిప్పుడు రెండింటికి ఎందుకు తిందామంటున్నావు అంటూ గతంలో సుధీర్ చెప్పిన సంగతిని గుర్తుచేసుకుంటూ మల్లీ అడిగాడు శ్రీజన్, హా అవును బేటా కానీ మన ప్రదానమంత్రి చెప్పాడు కదా రోజుకి రెండు పూటలే తినాలని అందుకే రెండింటికి తిన్నావనుకో రాత్రిదాకా ఆకలి కాదు అని కొడుక్కి నచ్చచెప్తున్నాడు. కానీ అసలు విషయం ఇంట్లో అన్నీ నిండుకున్నాయి, ఇవాలో రేపో అన్నట్టుంది సామాన్ల పరిస్థితి అందుకే వాటి ఆయుష్షు రెండురోజులు పెంచుతూనే... మెల్ల మెల్లగా ఆకలికి తట్టుకునే అలావాటు చేస్తున్నాడు కొడుక్కి. ఎక్కడో కరీంనగర్ జిల్లాలోని మారుమూల పల్లెటూరు ఆవునూర్లో పుట్టిన సుధీర్ పన్నెండో తరగతి వరకి చదివి ఆ తర్వాత చదివే స్థోమత లేకపోవడంతో, తండ్రి ద్వారా సంక్రమించిన ఎకరా పొలాన్ని ఆయనకొచ్చిన బిమారీ తగ్గించడానికైన అప్పుల కోసం అమ్మేసి, ఉన్న ఊల్లో బతుకుదెరువు లేక పెళ్లైన ఏడే హైదరాబాద్ మహానగరంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనికి కుదిరి కాంక్రీట్ మిక్చర్ ఆపరేటర్గా కుదురుకున్నాడు, పెళ్లాం ఇండ్లలో పాచిపనులు చేస్తూ అసలుకు కొసరు జమచేస్తుంది. పోయిన పొలం తనతో పాటు తండ్రిని కూడా తీసుకెళ్లింది, ఊర్లోని పెంకుటిల్లుని, తనని నమ్ముకున్న బిడ్డని వదిలి రానంటూ తల్లి అక్కడే ఉండిపోయింది, ఉన్న ఒక్క చెల్లెలు భర్త దుబాయిలో పనికోసం పోయి దశాభ్దం దాటిపోయింది, మెదట్లో అరకొరగా పంపిన పైసలు ఐదేళ్లుగా ఆగిపోయాయి, మనిషి ఉన్నాడో లేడో తెలియదు. ఒకప్పుడు ఎంతో కొంత దాచుకున్న సుధీర్ కుటుంభం ఆర్థిక సంస్కరణల ఫలితమో... అభ్యున్నత సంఘ నియమమో తెలియదు కానీ రెక్కాడితే కానీ డొక్కాడని స్థితికి చేరుకుంది, లక్షల కోట్ల బడ్జెట్లు, డజన్ల కొద్ది సంక్షేమ పథకాలు ఏ దిశగా పనిచేస్తున్నాయో.... యూనివర్శిటీల్లో గొప్ప గొప్ప పరిశోదకులు చూపే సంస్కరణల అంతిమ లక్ష్యం ఏంటో సుధీర్ లాంటి లక్షలాది కుటుంబాలు నిరూపిస్తున్నాయి. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదని ఎందుకైనా మంచిదని దాచుకున్న రెండువేలు కాస్తా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయనే సామెతని నిజం చేస్తూ నెలరోజులకే అయిపోయాయి. కొడుకు పేరు రేషన్ కార్డులో ఎక్కించమని ఎన్నిసార్లు విజ్ణాపన పత్రాలిచ్చిన పాపం వాడు పుట్టాడనే సత్యాన్ని నమ్మని అదికారులు ఆ పనిచేయలేదు. కాయకష్టం చేసే శరీరం శ్రమకి తగ్గ ఆహారాన్ని అందించేంత వరకూ నిద్రపోనిచ్చేది కాదాయే... దాంతో ప్రభుత్వం ఇచ్చే పన్నెండుకిలోల బియ్యం పన్నెండు రోజులకి సరిపోతే మిగతా ఇరవై కిలోలు రేషన్ షాపు ముందు నిలబడి మూడువందలకి కొనుక్కొచ్చుకొని తినే పరిస్థితి. పెళ్లాం మెగుడు కష్టపడి పనిచేసిన కూలీ గుడిసెకి ఎక్కువ ఇంటికి తక్కువ అనేట్టుండే ఇంటి కిరాయికి, ఉప్పు, పప్పు, నూనెలు కొనేందుకే సరిపోయే, ఇప్పుడు దానికి తోడు కరోనా విరుచుకుపడింది. బతుకుని దుర్భరం చేసింది. నాన్నా చిన్నముళ్లు రెండుమీదికొచ్చింది అంటూ తండ్రి తలని పట్టుకొని గడియారం వంక తిప్పి చూపాడు కొడుకు, టీవీల్లో చూపిస్తున్న మాస్కులు తనకూ కావాలని మారం చేస్తున్న కొడుకు కోసం తన చీర కొంగుని చింపి మాస్కులాగా కుడుతున్న తల్లి గడియారం వంక కళ్లలోని నీటిపోరని చెరిపేస్తూ చూసి పన్నెండులోని రెండు దగ్గర చిన్న ముళ్లు ఉండడాన్ని గమనించి, మనం రెండింటికి తిందాంలే... నువు రా బిడ్డా అంటూ అన్నం పెట్టడానికి లేచింది. గదిగాదే గీ కర్ప్యూ గిప్పుడప్పుడే అయేటట్టు లేదు, గిప్పట్నుంచే ఆకలికి ఆపడం అలవాటు చేస్తే... అని నసుగుతూ ఆగిపోయాడు సుధీర్, ఆ రోగమేదో మనకొచ్చినా బాగుండు, సర్కారోల్లే రోగం తగ్గేదాక పుణ్యానికే అన్నం పెడుతారంటా.. అనుకుంటూ కొడుక్కి అన్నంలోకి చారు కలిపి చేతికిచ్చింది, అమ్మా ఇయ్యాల పులుసేనా... అనుకుంటూనే గబగబ తింటున్నాడు కొడుకు, అన్నం మెత్తగయితుంది బిడ్దా గండ్లకి పులుసైతేనే కమ్మగుంటది తిను,బయట కూరగాయలు కొనాలంటే ఏసీలల్ల పనిచేసే ఉద్యోగం ఉన్నోళ్లకే అయ్యేపని గాదు బిడ్డా.... గీ రోగం పోయినంకా పనికిపోయినప్పుడు పెద్దసారింట్ల కేల్చి మంచి మంచి కూరలు తెత్త తియి బిడ్డా అంటూ తన పన్లో నిమగ్నమయింది. ఇంట్లో ఊరికే కూర్చుంటే రేపట్నుంచి ఆకలిచావు చావాల్సొస్తుందేమో అని బయమేసి ఎటెళ్లలో తెలియకున్నా మెయిన్ రోడ్డుదాక పొయ్యత్త అనుకుంటూ బయటకి బయల్దేరాడు సుధీర్, సరె సరె గా కాంట్రాక్టర్ దగ్గరికిపోయి అప్పు దొరుకుద్దేమో చూడు, జాగ్రత్త పోలీసులు కొడుతున్నరంటా దెబ్బలు తాకిచ్చుకొని వచ్చెవ్, గిప్పుడు గోలీలగ్గూడ పైసలు లెవు అని జాగ్రత్తలు చెప్పింది. పెళ్లాం మాటలతో అప్పు దొరుకొచ్చూ అనే ఆశతో ఎటెల్లాలో నిర్ణయించుకుండు సుధీర్, ఎప్పుడూ లీకయ్యే మోరీలోంచి దుర్గందం బస్తీ మెత్తం వ్యాపిస్తుంది. మాడు పగలకొట్టే ఎండ, ఎక్కడా ఎవ్వరూ లేరు, అక్కడక్కడ కుక్కలు, పందులు జాతివైరాన్ని మరిచి డొక్కతేలి సొమ్మసిల్లి పడుకున్నాయి అలా మెల్ల మెల్లగా నడుచుకుంటూ కాంట్రాక్టర్ ఇంటివైపు నడుస్తున్నాడు, కాలనీలో ఇళ్లు దగదగ మెరిసిపోతున్నాయి, ఎన్నెన్నో రంగులతో తీరిగ్గా పేర్చినట్టు అందంగా ఉన్నాయి, వాటన్నింటిని చూస్తూనే ఇంత అందంగా ఇళ్లు కట్టిన మాకు ఇవ్వాళ్ల ఒక్క ఇళ్లు ఆసరా ఇవ్వకపాయే అనుకుంటూ నడుస్తున్నాడు, అక్కడక్కడా కొన్ని ఇండ్లకి తాళాలు వేలాడదీసున్నాయి, కాంట్రాక్టర్ ఇంటికి కూడా తాళం వేసుంది, లేబర్ని తీసుకెళ్లె వ్యానులో మార్చి ఇరవైమూడో తారీఖునే ఊరెల్లాడని పక్కింటోళ్లు చెప్పారు, ఉన్న ఒక్క ఆశ అడుగంటింది, ఆకలితో పేగులు నకనకలాడుతున్నాయి, ఒక్క పూట ఆలస్యమైతేనే భరించలేకపోతున్నా అనుకుంటూ వెనుదిరిగి వస్తుంటే... కూడలి వద్ద జనం గుమిగూడి ఉన్నారు, ఏమయిందో చూద్దామని అటువైపు వెల్లాడు సుధీర్.. అక్కడ అన్నదానం చేస్తున్నారు, లైన్లో నిలబడ్డాడు సుధీర్, సామాజిక దూరం సంగతి దేవుడెరుగు, లైన్లో జాగా దొరుకుతే చాలనుకుంటూ దూరుతున్నారు జనం, అందులో సగం మంది తమ బస్తీకి చెందినవారున్నారు, వాల్ల వాలకం చూస్తూనే తెలిసేలా మిగతా కొంత మంది సుధీర్ లాంటి వాల్లున్నారు, అయితే అప్పటికే వడ్డించుకొని తింటున్నవాల్లు ఎవరూ తమలాంటి వారు కాదని తెలుస్తూనే ఉంది సుధీర్కి, మరి వాల్లెవరూ అని అరా తీస్తే... ఆ అన్నదాన నిర్వాహక సంఘం వారంటా... ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ అన్నదానం చేసినా... ఇండ్లలో వంట చేసుకోకుండా ముందు ఆ సంఘం వాల్లంతా వనబోజనాల్లా తిన్నతర్వాతే మిగిలిన దాంట్లోంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారంటా... మెత్తానికి వాల్ల బోజనం ముగిసింది, అసలు సిసలు అవసరార్థులకి వడ్డించడం మెదలైంది, పావుగంటైనా ఎంతకూ లైన్ కదలడం లేదు, ఏమిటా అని తొంగిచూస్తే... వడ్డించడం కన్నా పోటోలు తీయడం కోసమే ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడిదో పాషన్ అయిపోయింది, ఇచ్చేదానికన్నా సోషల్ మిడియాలో చెప్పడమే ఎక్కువయింది, దానం తీసుకుంటున్నవాడికి అసలు ఆత్మాభిమానమే లేదన్నట్టు, ఒక్క పూటకి దానం చేసి వాల్లని తరతరాలుగా పోషిస్తున్నట్టుగా చెప్పుకునే వీల్లని చూస్తే... స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్ అన్న శ్రీశ్రీ మాటలకి నిలువెత్తు నిదర్శనంలా అనిపించింది ఆ తతంగం, ఎలాగోలా తన కంచంలో అన్నం పడడంతో ప్రాణం లేచొచ్చింది సుధీర్కి గబ గబా తిని, ఇంట్లో ఆకలితో ఉన్న భార్యా కొడుక్కి కొంచెం ఏమైనా ఇంటికిస్తారేమోనని అడిగాడు నిర్వాహకుల్ని.. కసురుకుంటూ.. ఎవలున్నా ఇక్కడికే రమ్మను అంటూ తిట్టాడు, ఇంతలో అక్కడే ఉన్న చదువుకున్న వ్యక్తి, ఇంకా జనాలు కూడా ఎవరూ లేరు కదా కొంచెం పెట్టివ్వండి, ఈ సమయంలో బయట తిరగడం ద్వారా కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ కదా అనడంతో... నిర్వాహకుల్లోంచి ఒకడు పెట్టేది ఒక్కపూటే అయినా... మెత్తం వీడొక్కడి కుటుంబానికే పెడితే ఎట్లా... అయినా బస్తీల్లో మోరీల పక్కన బతికేవాల్లకి కరోనా అంటినా ఏం కాదంటండీ టీవీల్లో ఎవడో చెప్తుంటే విన్నా, ఇక్కడికే వచ్చి తీసుకుపోనివ్వండి.. అని పళ్లికిలించుకుంటూ నవ్వుతున్నాడు. ఆ మాటలు విన్న సుధీర్కి తన తోటి మనుషుల మీద వెగటు పుట్టింది. ఒకడి దరిద్రాన్ని చూసి నవ్వుకుంటున్న సమాజంపై తీవ్రమైన ద్వేషం కలిగింది, ఇన్నాళ్లు దరిద్రాన్ని అనుభవించినా... తన కాయకష్టాన్నే నమ్ముకొని పనిచేసుకు బతుకుతున్న ఒక సామాన్య కూలీలో తొలిసారి నేనెందుకు ఆకలి చావు చావాలి. ఇన్నాళ్లు నా శ్రమని దోపిడీ చేసి ఇవ్వాల కనీసం కనికరం కూడా చూపని ఈ సమాజాన్ని నేనెందుకు దోచేయకూడదు అనే ఆలోచన కలిగింది. ఇంటివైపు నడుస్తూనే... తాళం వేసిన ఇల్లలోకి ఎలా దూరొచ్చో గమనిస్తున్నాడు. అలా కోపంతో.. ఆవేశంతో వెళ్తున్న సుధీర్ పక్కగా ఒక ఆటో వచ్చి ఆగింది. అందులోంచి ఓ నడివయసు వ్యక్తి మూటకట్టిన సామాన్ల సంచిని తన చేతికందిస్తూ... ఇక్కడ రోజూ కూలీలు చేసుకొనే ప్రజలు ఎక్కడుంటారు, నీకేమన్నా తెలుసా అని అడిగాడు, అప్పటిదాకా మనుషులపై తీవ్ర ఆవేశంలో ఉన్న సుధీర్కి దేవుడు తనకోసమే ఇతన్ని పంపించాడేమో అనిపించి తన బస్తీలోకి ఆటోని తీసుకెళ్లాడు, అక్కడ ఆకలితో నకనకలాడుతున్న తనలాంటి కుటుంబాలకందరికీ పదిహేను రోజులు సరిపడా తిండి దొరికినందుకు చాలా సంతోష పడిపోయాడు. ఖాళీ ఆటోని తీసుకెలుతూ...మీకిచ్చిన సామాను పక్షం రోజులకి సరిపోతుంది, అప్పటికీ లాక్ డౌన్ ఎత్తేయకపోతే నేను మల్లీ వస్తా అని చెప్పి త్రుప్తిగా వెల్లిపోయాడు పెద్దమనిషి, ఇంట్లోకి వెళ్తూనే... లోకంలో మంచితనం బతికే ఉందే...కరోనా రోగం కన్నా భయంకరమైన మనిషిలోని ఆకలి రోగం లేవకముందే దేవుడు భయపడిపోయాడే అన్నాడు. ఆ మాటలు అర్థం కాకపోయినా... మంచివాల్లకెప్పుడూ మంచే జరుగుతుందండి అంటూ కొడుక్కి కూర వండడానికి పప్పుని కడుగడంలో మునిగిపోయింది ఆ ఇల్లాలు.

గంగాడి సుధీర్
9394486053ఏం కాదు భయపడకు

ఏం కాదు భయపడకు
రోడ్డుపై అడ్డదిడ్డంగా హెల్మెట్ లేకుండా హెల్ కెల్లినప్పుడు లేని భయం ఇప్పుడెందుకు
ఏం కాదు భయపడకు
అడ్డమైన, అపరిశుభ్ర హోటళ్లలో లొట్టలేసుకుంటూ.. పీపాలుపీపాలు లాగించినప్పుడు లేని భయం ఇప్పుడెందుకు
ఏం కాదు భయపడకు
పదిమంది తిండిని పూటలో లాగించి ఒబెసిటీ ఉచ్చులో పడి హ్రుద్రోగపుటంచుల దాక పోయినప్పుడు లేని భయం ఇప్పుడెందుకు
ఏం కాదు భయపడకు
అర్థం పర్థం లేని ఇగోలతో సొంతోళ్లనే తోడేళ్లలా పీక్కు తిని మానసిక వికలాంగుడివైనప్పుడు లేని భయం ఇప్పుడెందుకు
ఏం కాదు భయపడకు
అన్నింటికి ఆయనున్నాడు, ఆదుకునే భగవంతుడు కాచుకున్నాడు, కాకపోతే నీ లెక్కలు చూస్తున్నాడంతే, పై తప్పులన్నీ సరిచేసుకో... ఆపన్నులని అక్కున చేర్చుకో.. ఇప్పుడే... ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు
ఏం కాదు భయపడకు
ఎన్నో గండాలు దాటి ఇక్కడిదాకొచ్చావు, ఇంకెన్నో సుడిగుండాల్లో సంచరిస్తూ ఎదిరిస్తావు.
ఏం కాదు భయపడకు

పోలీస్-రియల్ వారియర్ పోన్లో కరోనా మెస్సెజులు చదివి చదివి బోర్తో పాటు భయం కూడా వేస్తోంది, చైనా వణికిపోతుంది, ఇటలీ ఊడ్చుకుపోతుంది, అమెరికా ఆపలేకపోతుంది వంటి హెడ్డింగులు మరింత భయపెట్టిస్తున్నాయి, మన దగ్గర ఏం లేకున్నా ఈ ఫార్వర్డ్ మెస్సెజిలు చదివితే రోగం రావడం మాత్రం ఖాయం అనుకుంటూ.. టైం చూసేసరికి మూడవుతుంది. పోన్లో పడి టైం మర్చేపోయా... సర్, ఎస్సై ఎప్పుడొస్తాడండి, నన్ను పన్నెండింటికే రమ్మన్నారు ఎంత సేపు వెయిట్ చేయాలి, నేను ఊరెల్లాలి, అని కొంచెం అసహనంతో అడిగాను కానిస్టేబుల్ని, ఏంటయ్యా నువ్వు ఊరికూరికే అడిగేతే వచ్చేస్తాడా...నీ ఒక్కపనే ఉంటుందా మాకు, చానా పన్లుంటాయి, కూసొమన్నా కదా అని కానిస్టేబుల్ విసుక్కుంటుడగానే జీపొచ్చి స్టేషన్ ముందు ఆగింది, లోపలికి వస్తున్న ఎస్సైకి సెల్యూట్ చేసి అతన్తో పాటు రూంలోకెల్లాడు కానిస్టేబుల్. పది, ఇరవై, ముప్పై నిమిషాలయింది, ఇక ఉండబట్టలేక నేరుగా ఎస్సై రూంలోకెల్లాను, నన్ను చూస్తూనే కానిస్టేబుల్ కూర్చోమన్నా కదా...లోపలికెందుకొచ్చావ్ అంటూ గద్దించాడు, ఇంతలో ఎస్సై కల్పించుకొని ఎవరితను అని అడిగాడు, అదే సార్ ఆ వెంకటాపురం పొలం గొడవ ఉందిగా...ఆ లక్ష్మణ్ అన్నాడు. ఏరా కబ్జాలు చేస్తున్నావా... కేసు బుక్ చేయమంటావా...చూస్తుంటే చదువుకున్నోని లెక్క ఉన్నవ్, సిగ్గులేదురా...అంటూ నా పేరు వినగానే తిట్ల దండకం అందుకున్నాడు ఎస్సై, ఏంటి సర్ నిజమేదో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు, అది నా పొలమే, మేమే సాగు చేసుకుంటున్నాము, నేను హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తాను, అంతేకానీ నేనేం కబ్జాకోరుని కాను, ఏం ఇన్ప్లూయన్స్ చేస్తున్నావా సినిమా ఇండస్ట్రీ అని, నువ్వెవడైతే నాకేంట్రా... వాడు నీ మీద కంప్లైంట్ ఇచ్చిండు, సివిల్ మాటరేదన్నా ఉంటే కోర్టులో చూసుకోండి, ఇలా క్రిమినల్ ఆక్టివిటీస్ చేస్తే బొక్కలో ఎయ్యాల్సోస్తుంది, సర్ మీరొచ్చి ఎంక్వైరీ చేయండి, తప్పు ఎవరిదో తెలుస్తుంది, అంతేగానీ మీ స్టేషన్కొచ్చినగదాని ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు, నాకూ చట్టం అంటే తెలుసు, అని కొంచెం సిరియస్గానే రిప్లై ఇచ్చాను, చట్టం తెలుసుగదరా...మరి బొక్కలో ఎయ్యిమంటవా... పొ పో ఏం పీక్కుంటవో పీక్కో, మల్లోసారి నీ మీద కంప్లైంటొచ్చిందో ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా నా కొడకా... పొయి మీ సర్పంచ్తో కూసొని మాట్లాడుకోండ్రి అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేయకుండ్రి. పో పో అంటూ కసురుకున్నాడు. బయటకి వస్తూనే ఎస్సై అన్న మాటలకి విపరీతమైన కోపం వచ్చింది, ఈ నా కొడుకులని సినిమాల్లో అందుకే విలన్లుగా చూపిస్తార్రా... డైరెక్టుగా వచ్చి లోకువయిపోయా. ఏ లోకల్ లీడర్తోనో..ఎమ్మెల్యేతోనో పోన్ చేపిస్తే కానీ రెస్పెక్ట్ ఇవ్వడు వరస్ట్ నా కొడుకు అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాను, పోన్ రింగవడంతో ఎవరా అని చూస్తే ప్రొడ్యూసర్ దగ్గర్నుండి పోన్,  ఎక్కడున్నారు లక్ష్మణ్, మీరు చెప్పిన స్టోరీ లైన్ చదివాను, బాగుంది రేపు సండే కదా ఒకసారి రండి కూర్చొని మాట్లాడుకుందాం. అన్నాడు. అప్పటివరకున్న కోపమంతా ఆవిరైంది, ప్రోడ్యూసర్ పోన్ చేసి మరీ కథ చెప్పడానికి పిలిచాడంటే యాబై శాతం పని అయిపోయినట్టే. వెంటనే అమ్మకి పోన్ చేసి హైదరాబాద్ వెళ్తున్నాను, అర్జంట్ పని పడింది, ఈ కేసు సంగతి నేను చూసుకుంటాలే... అంటూ హైదరాబాద్ బయల్దేరాను. రేడియోలోని ఎఫ్ ఎంలో పాటలు ఆగిపోయి మోడీ స్పీచ్ మెదలయింది,కరోనా కట్టడి కోసం ఒకరికి ఒకరు దూరంగా ఉండాలని చెపుతూ రేపు జనతా కర్ప్యూ పాటిద్దామని అనౌన్స్ చేశారు మోడీగారు, ఇంట్లోకెళ్లే సరికి మా ఆవిడ జనతా కర్ప్యూ సామాన్ల లిస్ట్ రాసుకొని మరీ తెచ్చుకుంది, ఒక్కరోజు కర్ప్యూకి ఇంత సామానెందుకు అని అడిగా... దానికి అదేంటండి మోడీ చెప్పిన దగ్గర్నుండి వాట్సాప్లో జనతా కర్ప్యూకోసం ఏమోం తెచ్చుకోవాలో చెప్పారు, చూడలేదా... అని అడిగింది, సరె సరె అంటూ స్నానం చేసి రేపు ప్రొడ్యూసర్కి వినిపించే స్టోరీనీ మరొక్కసారి చూసుకున్నాను, ఆదివారం పదింటికల్లా ప్రొడ్యూసర్ ఇంటికి చేరుకుందామని రోడ్డెక్కాను, జనాలు పలుచగా ఉన్నారు, రోజులో ఉండే ట్రాపిక్లో కనీసం రెండో వంతు కూడా ఎవరూ లేరు, పన్లో పడి పట్టించుకోలేదు కానీ జనాల్లో కరోనా భయం సిరియస్గానే ఉందని అనిపించింది, అక్కడక్కడా పోలీసులు నిలబడి ఎవరూ రాకుండా కంట్రోల్ చేస్తున్నారు, నా కార్ని కూడా ఆపారు, మందులు తెచ్చుకోవాలి, మెడికల్ షాప్ కెల్తున్నా అంటూ సినిమాటిక్ అభద్దం చెప్పి వాల్లని ఫూల్స్ని చేసి తప్పించుకొన్నాననే ఆనందంతో ప్రొడ్యూసర్ని కలిసి స్టోరీ మెత్తం డిటైల్డ్ గా డైలాగ్స్ తో సహా చెప్పా. ఆయన కూడా ఇంప్రెస్ అయ్యాడు, అక్కడక్కడా ఆయన కొన్ని కరెక్షన్స్ చెప్పి నెక్ట్స్ మీటింగ్ ఆపీస్లో టీంతో పెట్టుకుందాం అని చెప్పాడు, చాలా హాపీగా ఇంటికి బయల్దేరా.. వెల్లేసరికి టీవీలో మల్లీ మోడీ ప్రత్యక్షమయ్యాడు, ఎప్రిల్ పద్నాలుగు వరకూ దేశాన్ని లాక్ డౌన్ చేస్తున్నాం అని చెప్పాడు, వెంటనే టీవీల్లో కలకలం చెలరేగింది, కొంపలు మునిగిపోతున్నాయనే రీతిలో ఉదరగొడుతున్నారు యాంకర్లు, టీవీ కట్టేసి పడుకొన్నాను అప్పటికే అలిసిపోయి ఉండడంతో మంచి నిద్ర పట్టింది. తర్వాత రెండు మూడ్రోజులు స్ర్కిప్ట్ వర్క్తో చాలా వేగంగా గడిచాయి, ఎప్పుడూ ఒకటే పనితో ఉండడంతో కొత్త అయిడియాలు తట్టక ఆ పని పక్కన పెట్టి టీవీలో న్యూస్ పెట్టాను, ఏవో చిన్న చిన్న కారణాలతో రోడ్లపైకి వస్తున్న జనాన్ని వెరైటీ వెరైటీ శిక్షలతో పోలీసులు కొడ్తున్న ద్రుశ్యాలు చూపించారు, చీ ఈ శాడిస్టులు అన్నింట్లో ఇంతే, క్రైం సీన్లో నైనా... కామెడీ సీన్లో నైనా కొట్టడమే వీరి పని అని చీదరించుకున్నా... ఈ లోగా శ్రీమతి వేడివేడిగా మసాలా దోశ ఇవ్వడంతో తీసుకొని తింటూ... నేషనల్గా ఏం జరుగుతుందోనని ఇంగ్లీష్ చానల్ పెట్టా... రోడ్ల నిండా కుప్పకుప్పలుగా జనం, పనుల్లేక వందల వేల కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్న ద్రుశ్యాలు కనిపిస్తున్నాయి, చిన్నచిన్న పిల్లలని మెడల మీద కూర్చోబెట్టుకొని, భుజాలకు సంచులు తగిలించుకొని, పెళ్లాం పిల్లలతో, తల్లిదండ్రులతో పనులు లేక సొంతూళ్లకు పోతున్న వలస కూలీలు వాళ్లు. దారిపొడవునా ఎవరైనా దాతలు దయతలిచి పెడితే తింటూ.. లేకుంటే పస్తులతోనే నడుస్తూ... ఒక్కపూట తిండిలేక ఇంటిల్లిపాది పడుతున్న బాదలు చూస్తుంటే చేతిలో ఉన్న దోశ తినాలనిపించలేదు, ఈ లోగా మా ఆవిడ చేతిలోని రిమోట్ లాక్కుంటూ, సీఎం మాట్లాడుతున్నాడంటా లైవ్లో అంటూ చానల్ మార్చింది, సిరియళ్లకి తప్పా అంత ఆత్రంగా నా దగ్గర రిమోట్ తీసుకోని మా ఆవిడ న్యూస్ చానల్ పెట్టిందంటే ఏదో పెద్ద విశేషమే ఉండి ఉంటుందంటూ ఆసక్తిగా చూశా... గంటసేపు సాగిన సీఎం ప్రసంగం అప్పుడే అయిపోయిందా అనిపించింది, అంతకుముందు నార్త్ ఇండియాలో చూసిన హ్రుదయవిదారక ద్రుశ్యాలతో కకావికలం అయిన మనసు, సీఎం దైర్యవచనాలతో కాస్త కుదుటపడింది, అందరికీ నేనున్నాననే భరోసానిస్తూ...ఉచితంగా డబల్ రేషన్తో పాటు కూరగాయల కోసం అకౌంట్లో డబ్బులు వేస్తానని చెపుతూ.. మైగ్రేంట్స్ని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం... అని దైర్యం ఇస్తుంటే కొంత ఉపశమనం కలిగింది, చివరగా ఆయన అన్న మాటలు నాలో ఆలోచన రేకెత్తించాయి. సమాజం తన బాద్యత నిర్వర్తించాల్సిన సమయమిది, ఉన్నంతలో మన చుట్టూ ఉన్న వాళ్ల కనీస అవసరాల్ని చాతనయినంతలో తీర్చమన్న ఆయన మాటలతో మా ఊర్లో బిల్డింగ్ పని చేసే కూలీలు గుర్తొచ్చారు, వెంటనే ఊర్లోవున్న రవిగాడికి పోన్ చేసి వాల్లెంతమంది ఉన్నారో కనుక్కున్నా... కిరాణా దుకాణం వెంకటేశంకి పోన్ చేశా...ఒక్కొక్క కుటుంబానికి నెలకి సరిపడే సామాన్లన్నింటినీ మూటలుగా కట్టి ఉంచమని చెప్పి వెంటనే డబ్బులు ఆన్లైన్లో పంపించా... రవిగాడికి వాటిని తీసుకొని ఆ కూలీల కుటుంబాలకి అందించమని చెప్పి పోన్ పెట్టేసా... కొంచెం త్రుప్తిగా అనిపించింది, వెంటనే ఈ సామాను తీసుకుంటున్నప్పుడు వాల్ల కళ్లలో త్రుప్తిని చూడాలనిపించింది, కానీ పోలీసులని తప్పించికొని వెల్లాలి కాబట్టి అప్పటికప్పుడే ఒ కథ అల్లుకున్నా, అలాగే వచ్చేటప్పుడు ఊర్లో ఒక్కతే ఉన్న అమ్మని తీసుకురావచ్చని వెంటనే రెడీ అయి సాయంత్రం వస్తానని శ్రీమతికి చెప్పి బయల్దేరా... మా ఊరు నేనుంటున్న ఏరియాకి యాబై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా గల్లీలోంచి మెయిన్ రోడ్డెక్కగానే పోలీసు నా ముందున్న బండిని ఆపాడు, వాడు ఏదో ఆశీర్వాద్ అటాకోసం వచ్చానని చెప్పడంతో లాఠీతో ఒక్కటిచ్చి వెనక్కి పంపించాడు పోలీసు, నాముందే ఒకణ్ని కొడుతుంటే.. కొట్టే అదికారం ఎవడిచ్చాడని అడగాలనిపించింది, నా దగ్గరికి రాగానే అలవోకగా అతనికి ముందే సిద్దం చేసుకున్న అబద్దపు కథ చెప్పి వెల్లబోతూ..కొట్టడం ఎందుకండి, చెపితే సరిపోతుందిగా అన్నా.. ఎవడింటున్నాడు సర్ కొట్టకపోతే.. సమస్యని అర్థం చేసుకోకుండా ప్రతోడు ఏదో ఓ రీజన్ చెప్పి తిరుగుతున్నవాడే, మేం రోడ్లమీద తిండీ తిప్పలు మాని పెండ్లాం పిల్లలని వదిలేసి ఇరవైనాలుగ్గంటలు కాపాలా కాస్తుంది మాత్రం ఎవరి కోసం సార్, వాల్లకోసమేగా... ఇలా అడ్డదిడ్డంగా తిరిగి రోగం అంటించుకుంటే వానితో పాటు వాని ఇంటిల్లిపాది మెత్తం చస్తారు గదా అంటూ కుర్చీలో కూర్చోబోతున్నవాడు, ఇంకెవడొ బండిమీద రావడం చూసి అటువైపెల్లాడు, ముందుకెళ్తుంటే రోడ్డుపై జనం అక్కడక్కడా ఉన్నారు, కార్ రయ్యిమని దూసుకెళ్తుంది, సర్కిల్ దగ్గరికి రాగానే బారీకేడ్లు అడ్డంగా ఉన్నాయి, కొంచెం మెల్లగా కారును పోనిచ్చాను, అక్కడో అయిదారుగురు పోలీసులున్నారు, ఇంకో ముగ్గురు నలుగురు కొంచెం దూరంగా చెట్టుకింద నిలబడే టిఫిన్ తింటున్నారు, బారీకేడ్లు దాటుతుంటే అర్థమయింది, ఆ టిఫిన్ వాల్లు ఇల్లలోంచి తెచ్చుకుంది కాదని, అక్కడే ఆపిన పోలీసుని అడిగాను, ఇంట్లోంచి బాక్సులు తెచ్చుకుంటున్నారా సర్ అని, ఏం బాక్సులయ్యా ఇంటికి పోక వారమయింది, ఎక్కడ కరోనా అంటిస్తామో అనే భయంతో అసలు పిల్లల్ని కలవాలంటేనే బయమేస్తుంది. కంట్రోల్ రూంనుండే రావడం పోవడం. బోజనం కూడా అక్కడినుండే వస్తుంది, అన్ని ఏరియాలు కవర్ చేయడం వాల్లకి కూడా కష్టమే కదా... అందుకే ఒక్కోసారి అట్లా ఎవలన్నా దాతలు ఇస్తేనే తినేది అంటూ వాల్లని చూపించాడు, ఎందుకో మెదటిసారి నాకు సిగ్గేసింది, ప్రతీసందర్భంలో పోలీసుల్ని తిట్టుకునే నాకు తొలిసారి అలా ఆలోచించినందుకు అదోలా అనిపించింది. సొంత పిల్లల్ని కూడా మన:స్పూర్తిగా హత్తుకోలేని పరిస్థితుల్లో డ్యూటీ చేస్తున్న అసలు సిసలు వారియర్స్ వాల్లే అనిపించింది. ఇంతలో పెట్రోల్ బంకులోకి పోయి పెట్రోల్ కొట్టిస్తుంటే... బంకు బయట ఒక పోలీసు అక్కడ అడుక్కుంటూ ఉండే ముసలాయనకి పండ్లు, బ్రెడ్డు ఫాకెట్లిస్తున్నాడు. బంకు పిల్లాన్ని అడిగితే.. ఈ ముసలోడు ఇక్కడే అడుక్కుంటూ ఆ గుడిసెలో ఉంటాడండీ...ఇప్పుడెవరూ రావడం లేదు కదా.. పాపం ఈ పోలీసుల్లే ఆ ముసలాడికి అప్పుడప్పుడు తినడానికేమైనా ఇస్తుంటారండీ అన్నాడు.  అలా ముందుకు సాగుతున్న నాకు ప్రతీ జంక్షన్లో, చెమటలు కక్కుతూ... మాసిపోయి నలిగిపోయిన బట్టలతో కన్పిస్తున్న పోలీసుల్ని చూసి కళ్లలో నీల్లు తిరిగాయి. యువకుడైన కానిస్టేబుల్ నుండి, పండిపోయిన హెడ్ కానిస్టేబుల్ వరకూ అందరూ అలా రోడ్లపై గంటలు గంటలు సమాజం బాగుండాలని నిలబడే ఉండడం చూసి వాల్లకి మనసులోనే సెల్యూట్ చెప్పుకున్నా. ఊర్లో డిస్ట్రిబ్యూషన్ అయ్యాక అమ్మతో వెజిటబుల్ బిర్యానీ వండించి పాకెట్లలో పాక్ చేసుకొని వస్తూ... కనబడ్డ ప్రతీ జంక్షన్లో పోలీసులకి వాటిని అందిస్తూ వచ్చా... రేపనేది ఉంటుందనే ఆశతో సమాజంలో రూపాయి రూపాయి కూడబెట్టుకొని అందులోంచి ఓ పదిరూపాయలు అదే సమాజానికి అందించి ఎంతో సేవ చేశామని త్రుప్తి పడుతున్నాం మనం. కానీ తమ జీవితాల్నే పణంగా పెట్టి సమాజం కోసం పనిచేస్తున్న ఈ అసలైన వీరులదే కదా నిజమైన సేవ.
sudheer gangadi
9394486053

4, ఏప్రిల్ 2020, శనివారం

లాక్ డౌన్ (కథ) 02.02.2020 (sakshi 03.05.2020)            ఎక్కడ చూసినా నిర్మానుష్యంగా ఉంది, మా సందులోంచి మెయిన్ రోడ్ ఎక్కానో లేదో పోలీస్ కానిస్టేబుల్ ఏం మాట్లాడకుండానే లాఠీ తీసుకొని ఒక్కటిచ్చాడు ముడ్డిపై, అయ్యే... అవ్వా అనుకుంటూనే ఎటునుండొచ్చానో అదే సందులోకి మళ్లీ దూరిపోయాను, ఇంట్లో బుడ్డోడు ఒకటే గోల బిస్కెట్లు కావాలనీ, పక్షమయింది ఇంట్లోంచి బయటకి రాక, సామానంతా అయిపోయింది, ఒక్క బియ్యం, కొంత పప్పు తప్ప మిగతావన్నీఇంచుమించుగా నిండుకున్నాయి, మా గల్లీలోని చిన్నచిన్న దుకాణ్లు ఎందుకొచ్చిన లొల్లని బంజేసుకొని వారమయింది. ఏ ముహూర్తం చూసుకొని వచ్చిందో ఈ మహమ్మారి దేశంలో తిష్టవేసుకొని కూర్చుంది, ఆ మాటకొస్తే దేశంలో ఏంటి మెత్తం దునియానే తన గుప్పిట్లో బందించింది. ఎక్కడ చూసినా లాక్ డౌన్లే, ఏ నోట విన్నా షట్ డౌన్లే, నావల్ కరోనా రక్కసి చేస్తున్న కరాళ న్రుత్యానికి రాజు, బీద అనే తేడా లేదు, కమ్యూనిస్టు, కాఫిటలిస్టు అనే మీమాంస లేదు, ఎక్కడో చైనాలో మెదలయి ఇటలీ మీదుగా అమెరికాతో పాటు ప్రపంచం మెత్తాన్ని కబలించి మన దేశానికి దూసుకొచ్చింది, ఒకప్పుడు నాయనమ్మ మాత్రమే దుశ్శకునం అని చూసే తుమ్ముకి నేడు ప్రపంచం మెత్తం గజ గజ వణుకుతుంది, దగ్గు, తుమ్ము తుంపర్లతో అంటుకుపోయే కరోనా వైరస్ భయటపడి మూడునెలలు దాటిపోయింది, మందు సంగతి దేవుడెరుగు దాన్ని రాకుండా ఆపే యవ్వారం తెలిసినా... ఆపలేక అపసోపాలు పడుతున్నాయి గవర్నమెంట్లు, పదిహేను రోజులు దాటింది లాక్డౌన్ ప్రకటించి, చేద్దామంటే ఉద్యోగం లేదు, తిరుగుదామంటే ఊరులేదు, ఇంట్లో బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీయడం తప్పా మరేం చేసే పరిస్థితి లేదు, పోలీసు కొట్టిన దెబ్బ సుర్రుమంటుంటే ఇంటిదారి పట్టబోయిన నాకు వెంటనే ఇంట్లో తినడానికి బియ్యం తప్ప ఏం లేవని, వంటసామాన్లతో పాటు బుడ్డోడు బిస్కెట్ల కోసం ఏడిస్తేనే బయటకొచ్చానని గుర్తుకొచ్చింది, కానీ దెబ్బ సుర్రుమని మండుతుంటే.. ఇంటికెళ్లి పక్కింటి కాంపౌండర్ రాజు ఎట్లాగూ హాస్పిటల్కి వెళ్తాడు కదా ఆయన్ని సామాను తెమ్మందామనుకొన్నా, కానీ పాపం తన సొంత ఇంట్లోకి చాయి తాగడానికి కూడా రాజు పోవట్లేదు, నిద్రాహారాలు మాని నాలుగురోజులకొకసారి ఇంటికొస్తుండు, ఆయనకే నేను సహాయం చేయాల్సింది పోయి ఆయనని అడగడం సరికాదనిపించి ఎలాగైనా సామాను తీసుకొద్దామని నిర్ణయించుకొని  చూట్టూ చూసా ఏ నరమానవుడూ కంటికి కనబడడం లేదు, ఏం చేయాలో పాలుపోని పరిస్థితి, ఇంతలో బండిపై రయ్యిమని దూసుకొచ్చి నా పక్కకే ఆగాడు ఎవరో... ఎక్కడనుండొస్తున్నారు అని అడిగా... శ్రీనగర్ కాలనీ అన్నాడు, ఏంటీ ఇంత దూరం ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అని అడిగా... ఆశీర్వాద్ గోదుమపిండికోసం పోలీసుల కళ్లుగప్పి వచ్చా అన్నాడు, ఏమన్నాడో కొంచెం సేపు అర్థం కాలేదు, నాకర్థమయ్యేలోపే రయ్యిమని ఎటునుండొచ్చాడో అటు దూసుకుపోయాడు, ఆశీర్వాద్ గోదుమ పిండికోసం వాడు పదికిలోమీటర్లు తిరుగుతుంటే.. నిత్యావసరాల కోసం నేను మా మెయిన్ రోడ్డెక్కలేనా అని నాకు నేనే దైర్యం చెప్పుకొని గల్లీ గల్లీ ల్లోంచి అతికష్టం మీద మెయిన్ రోడ్డుమీది సూపర్ మార్కెట్ దగ్గరకెళ్లా... అక్కడ జనాన్ని చూసి బిత్తరపోయా.. కిక్కిరిసిపోయి ఉన్నారు, ఒక పామిలీ సంవత్సరం మెత్తం తినే తిండి ఒక్కొక్కడే పాక్ చేయించుకొని బిల్లు కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తూ కనబడ్డారు, ఇక రేపట్నుండి ప్రపంచంలో అసలేం దొరకదన్నట్టుగా ఉన్నాయి ఒక్కొక్కడి మొఖాలు, బయటకొస్తున్న వాళ్ల మొఖాలు ప్రపంచ యుద్దంలో విజయం సాదించినట్టుగా ఉన్నాయి. పాపం అక్కడే మెట్ల కింద కూర్చొని అడుక్కుంటున్న అవ్వకి మాత్రం కనీసం తము కొన్నదాంట్లోంచి ఒక పండు కూడా ఒక్కలు తీసివ్వడం లేదు,   అసలు ప్రభుత్వం లాక్ డౌన్ చేసి ఆఫీసులు, సినిమాహాళ్లు, మాల్స్ అన్ని మూసేసి ఒకరికొకరు తాకకుండా.. కలువకుండా ఉండండి అని చెపితే.. ఇక్కడ మాత్రం వారం రోజులు ఇంట్లో కూర్చుని కలువలేకపోయిన వాల్లకి రెండింతలు ఒకలమీద ఒకలు పడిపోయి ఉన్నారు. అందులోకెలితే సామానుతో పాటు కరోనాని కూడా ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తుందని భయమేసి.. పక్కనే ఉన్న కీరాణ కొట్టుకెళ్లి కావాల్సిన సామాన్లు కొనుక్కున్నా... కూరగాయలు కొనుక్కొంటుంటే మా ఆవిడకిష్టమైన పాలకూర కోసం వెతికా.. కన్పించకపోయేసరికి ముందుకు పోదామనుకున్నోన్ని ఇందాకటి దెబ్బదగ్గర నొప్పి గుర్తొచ్చి ఆగిపోయా... వస్తుంటే చెట్టుకింద దీనంగా కూర్చున్న కుటుంబం కన్పించింది, పక్కనే బాగులున్నాయి, ఏంటీ ఇక్కడ కూర్చున్నారు అని అడిగా.. ఊరికోతున్నాం ఎండ బాగ కొడుతుంది గందుకే గీడ కూసున్నాం అన్నారు, ఏ ఊరు అని అడిగా, కన్యాగురం దగ్గర అన్నారు, వాళ్లని చూస్తే జాలేసింది, పాలకులు చెప్పారని చప్పట్లని తపేళాలతో,డ్రమ్ములతో వీదుల్లోకి గుంపులు గుంపులుగా చేరి సమైఖ్యతని తెలిపిన మన ప్రజలు, లైట్లార్పేసి థౌజండ్ వాలాలతో, మినుకుమనే రాకెట్లతో కాండిల్లని మించి వెలుగులు పంచిన మన జనాలు పాపం ఆకలితో చెట్టుకింద కూర్చున్న వీల్లకోసం కదిలిరాకపోవడం చూసి బాదేసింది, చేతిలో ఉన్న కొన్ని పండ్లు, బిస్కెట్లు ఇచ్చి  అక్కడినుండి ఇంటికి వెళ్తుంటే... పోలీసు చెక్ పోస్టు కనబడే సరికి ఇందాకె కొట్టిన దెబ్బగుర్తుకొచ్చి సందులోకి దూరి పోలీసులు ఎప్పుడు పోతారా అని అభ్జర్వ్ చేస్తూ కూర్చున్నా... నిజంగానే చాలామంది పని ఉన్నా లేకున్నా.. ఇంట్లో కూర్చోవడం కష్టమని.. టైం పాస్ కావడం లేదని కరోనా సీరియస్ నెస్ అర్థం చేసుకోకుండా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు, కొట్టేటోల్లని కొడుతుండ్రు, నచ్చచెప్పేటోల్లకి చెపుతుండ్రు, ఫామిలీ వాల్లకి హారతులిచ్చి మరీ కరోనా కష్టాలు చెపుతున్నారు, పాపం పోలీసోల్లకి క్షణం తీరకదొరకడం లేదు, దీనికి తోడు ఎవరికి కరోనా ఉందో తెలీదు, ఎక్కడ అంటుకుంటదో తెల్వదు, పాపం వాళ్లు కొట్టేదాంట్లో కూడా న్యాయముందీ అనిపిస్తుంది, ఎలాగోలా కష్టపడి ఇంటికి పోయేసరికి గుమ్మంలో మూడు రకాల బకెట్లతో ఎదురొచ్చింది మా ఆవిడ, ఒక దాంట్లో సబ్బునీళ్లు, ఇంకో దాంట్లో వేడి నీళ్లు, మరో దాంట్లో ఉప్పునీళ్లు, నా దగ్గర ఉన్న సామాన్లని తీసుకొని వేటిలో కడగాల్సినవి ఆ బకెట్లో పోసేసింది, ఎవరైనా ముస్లీంని కలిశావా అని అడిగింది, అదేంటి వింత ప్రశ్న అన్నట్టుగా మొఖం పెట్టా.. మల్లీ తనే వివరిస్తూ.. మనదగ్గర్నుండి మొన్నే డిల్లీలో మర్కజ్ దర్గాకి ప్రార్థనలకని పోయిన వాల్లకందరికీ వచ్చిందంటగా ఆ మాయదారి రోగం మరి వాల్లలో ఎవరైనా తాకారేమోనని అనేసరికి, కలువలేదన్నట్టుగా తల అడ్డంగా ఊపా..  చివరగా నా ముట్టుమయిలని తీసేస్తున్నట్టుగా బట్టలతోనే నాకు మడీస్నానం చేయించి ఇంట్లోకి రానిచ్చింది, అప్పటికీ మా బుడ్డోడ్ని మంచం కోడుకి కట్టేసింది, ఇంట్లోంచి బిస్కెట్లని ఏడుస్తున్నవాడు బయటకెందుకు రావట్లేదో అప్పుడర్థమయింది, మెత్తానికి ప్రదాని, ముఖ్యమంత్రి, ఇంకా టీవీల వాళ్ల కరోనాయనానికి ఫలితం కన్పిస్తుందనిపించింది, బట్టలు మార్చుకుంటున్నప్పుడు నా ముడ్డిమీంచి నడుము వరకూ కన్పిస్తున్న వాతని చూసి అయ్యే ఏమయిందని కంగారు పడుతూ దగ్గరకొచ్చింది శ్రీమతి, ఆదుర్థా పడుతూనే... టీవీ, సోషల్ మిడియా గాసిప్పులతో మెహం వాచి ఉన్నదేమో నా దెబ్బనుంచి మెదలు బయటి సంగతులన్నీ అదేపనిగా అడుగుతూనే ఉంది, పనిలో పనిగా రేషన్ ఇస్తున్నారేమో కనుక్కోకపోయారా... గవర్నమెంట్ ఇస్తానన్న డబ్బులు చేతికిస్తారా.. బాంకులో వేస్తారా... అంటే చేతికిస్తే డబ్బులతో కూడా కరోనా వస్తుందంటున్నారుగా.. మనం అకౌంట్ ఇచ్చామా రేషన్ కార్డులో...ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం కోసం ముందు వాడి కట్టిప్పి బిస్కెట్ ఇవ్వు వాడికి లేదంటే వాడి అల్లరికి ఓనరోల్లచ్చి లొల్లి లొల్లి చేస్తారు అనేసరికి ఆగిపోయింది, ఇంతలో ఒకటో తారీఖు అయిపోయి మూడ్రోజులయిందన్న విషయం గుర్తుకొచ్చింది, ఇంటి ఓనర్తో పాటు పాలవాడు, కేబుల్, కరెంట్, గ్యాసు ఇలా ఒకరేమిటీ పెద్ద క్యూనే కనిపించేలా ఉంది, పాపం పోపులపెట్టెలో, బియ్యం డబ్బాల్లో దాచుకున్న రెండువేలతో మరో పదిరోజులకి సరిపడా సరుకుల కోసం ఇందాకే ఇచ్చింది తను, ఇక ఎందుకైనా మంచిదని ఇవ్వాల్సిన వాల్లకు ఇవ్వకుండా అకౌంట్లో దాచుకున్న ఐదువేలే మిగిలాయి, అవి కిరాయికి సరిపోతాయి, మిగతా వాళ్ల సంగతేంటో అర్థం కావడం లేదు, జీతం వస్తుందో రాదో ఇంకా క్లారిటీ లేదు, గట్టిగా అడగుతే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనే భయం, హే రామ్, అల్లా, జీసస్ ఏంటీ క్లిష్ట పరిస్థితి, ఈ గండం నుంచి మానవాళి బయటపడదా అనుకుంటూ ఉండగానే.. పిల్లాడి కట్లు విప్పి చేతులు సబ్బుతో కడిగి తీసుకొచ్చి ఒల్లో కూర్చోబెట్టింది, వాన్ని పట్టుకొని రిమోట్తో న్యూస్ ఛానల్ పెట్టా... టీవీలో కుప్పలు కుప్పలుగా వలసపోతున్న కూలీలు కన్పించారు, కూలీ చేయడానికి పని లేకా, ఉండడానికి వసతి లేక, తినడానికి తిండిలేక సొంతూరుకు పయనమైన కూలీలు వాల్లు, వందల, వేల కిలోమీటర్లు ఎర్రటి ఎండలో తినడానికి తిండిలేక, అక్కడక్కడ దాతలు, పోలీసులు అందించే పులిహోర పొట్లాలతో రోజుల తరబడి నడుచుకుంటూ పోతున్నారు, దయనీయంగా కన్పిస్తోంది పరిస్థితి, సోషల్ మిడియాలో చేతులు కడుక్కొండి, సోషల్ డిస్టెన్స్ మెంటేన్ చేయండి అని పదే పదే మొత్తుకునే సెలబ్రిటీలు, గవర్నమెంట్లు లక్షలాది జనం చిన్నా పెద్దా తేడాలేకుండా అలా రోడ్లమీదకొస్తుంటే ఎక్కడి వాళ్లని అక్కడ ఒకచోటకి చేర్చి ఇంత అన్నం ముద్ద పెట్టడానికి ఎందుకు తటపటాయిస్తున్నారో అర్థం కావడం లేదు, అగమేఘాల మీద విదేశాలకి విమానాలని పంపి రోగంతో కూడిన వాళ్లని ఇంపోర్టు చేసుకోవడం మీద చూపిన శ్రధ్ద, కనీసం ఎర్రబస్సులు పెట్టైనా ఈ కూలీ జనాలని సొంతూర్లకి తరలిద్దామనే ద్యాస రాకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది, ఇక్కడ పుట్టని రోగాన్ని జనవరి నుండి ఎక్కడికేల్చో ప్లైటెక్కి తీసుకొచ్చే లక్ష మందిని కంట్రోల్ చేసుంటే ఇవ్వాళ దేశమంతా ఇలా లాక్ డౌన్లోకి పోయే పరిస్థితి వచ్చేదా అని సోషల్ మిడియాలో రాజకీయ నాయకులు చేస్తున్న గోలలో విషయముందీ అనిపిస్తుంది,  ఇంత బాదలో మిశ్రా గుర్తొచ్చాడు, ఒక్క క్షణం నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంబించింది, బీహార్ నుండొచ్చిన మిశ్రా మా కన్ట్రక్షన్ కంపెనీలో కాంట్రాక్ట్ మేస్రీగా పనిచేస్తున్నాడు, చాలా మంచోడు, ఎదుటోని కష్టానికి చలించే మనిషి, ఆయన ఆద్వర్యంలోనే  ఓ పదిమందిదాక పనిచేస్తున్నారు, అందులో అతని భార్య కూడా ఉంది, తనలాగే ఓ చిన్న పాపకూడా ఉంది, పని ఆగిపోవడంతో లాక్ డౌన్కి ముందే అన్నాడు సొంతూరికి వెల్లిపోతానని. ఎక్కడున్నాడో అనిపించింది, వెంటనే ఫోన్ తీస్కొని డయల్ చేశా.. అదేంటో మనకి అదుర్థా ఉన్నప్పుడు పోన్ అస్సలు కలిసి సావదు, అలా కొట్టగా కొట్టగా పోన్ కలిసింది, హలో మిశ్రాజీ ఎక్కడున్నావ్ అని అడిగా.. చాలాసేపు ఏం మాట్లాడలేదు, గొంతు జీరబోయినట్టుగా మెల్లగా తెలంగాణా బార్డర్లో అన్నాడు, ఎలా వెళ్తున్నావ్ అని అడిగా... నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నాడు, నీతో పాటు ఎవరెవరు ఉన్నారు, అందరూ బాగున్నారు కదా... బాగుండడం కాదు జీ ఎందుకు భయల్దేరామా అని భయంగా ఉంది, అసలు మా ఊరుని మా వాల్లని చూస్తామన్న నమ్మకం సన్నగిల్లుతోంది, కరోనాతో కాదు, కడుపుమాడి చచ్చేలా ఉంది పరిస్థితి, వేల మంది జనం, బార్దర్ దాటనీయడం లేదు, ఒక్క వెహికిలూ లేదు,  పులిహోర పొట్లాలతో కడుపునింపుకుంటున్నాం, ఏది కొందామన్నా చాలా రేటుతో అమ్ముతున్నారు, అమ్మాయి పాలకోసం కూడా ఇబ్బంది పడుతున్నాం... మిశ్రాజీ దైర్యం కోల్పోవద్దు, ఏం కాదు అంతా మంచే జరుగుతుంది, మరి ఒకరికొకరు దూరంగా లేకపోతే ఇంకా ఇబ్బందే కదా అని అడిగా... దూరంగా కాదు తాకకుండా ఉండడానికి కూడా జాగాలేదు, పోన్ చార్జింగ్ పెట్టుకోడానికి కూడా కష్టంగా ఉంది,అన్నాడు,  డబ్బులు ఉన్నాయా.. ఏదన్నా వెహికిల్ మాట్లాడుకొని పొరాదు అన్నాను, హా.. జీ నిన్నటి నుండి కొంచెం వెహికిల్స్ తిరుగుతున్నాయి కానీ ఇరవై వేయిలు అడుగుతున్నారు, పోతే పోనీ వెహికిల్ తీసుకొని పోరాదు, చేతిలో అంత డబ్బు లేదు, ముందు డబ్బులిస్తేనే కానీ వెహికిల్లో ఎక్కనివ్వడం లేదు, మిశ్రాజీ మరేం పర్లేదు నా దగ్గర ఉన్న ఐదువేలు పంపిస్తాను సరిపోతాయా... ఇంకా ఏమన్నా అరేంజ్ చేయమంటావా.... సరిపోతాయి జీ.. బతికుంటే ఖచ్చితంగా నీ రుణం తీర్చుకుంటాను అని జీరబోయిన గొంతుతో అన్నాడు, ఒక్కసారిగా కండ్లలోకి నీళ్లొచ్చాయి. పోన్ కట్ చేసి మిశ్రా అకౌంట్లోకి డబ్బులు పంపించి కుర్చిలో అలా జారగిల పడి కూర్చున్నా... ఏంటో మనిషి సంఘజీవి అని పేరుకే కానీ... పక్కోడికి ఆపదొస్తే.. దాన్ని అదనుగా తీసుకొని అడ్డగోలుగా రేట్లు పెంచి సంపాదించుతూనే ఉంటాడు, చివరికి మాయదారి రోగాలు ముసురుకొని చచ్చిపోతానని తెలిసినా... తన దగ్గర ఉన్నదంతా తనే తినాలని చూస్తాడు కానీ, పక్కవాడికి సహాయం చేయడానికి ముందుకురారు, మామూలు అప్పుడు ఎలా ఉన్నా.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ స్పందించనివాన్ని కరోనా తీసుకుపోవడమే న్యాయమేమో..... ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో.. అయిపోయాక నా ఉద్యోగం ఉంటుందో..ఉండదో..అనే దిగులు మనసుని ఆవరించింది, అంతలోనే టీవీలో కితకితల ప్రోగ్రామ్ చూస్తూ పల్లికిలిస్తున్న మా బుడ్డోడి నవ్వులని చూసి ఈలోకంలో కొచ్చా... నేను ఆ ప్రోగ్రాములో లీనమయ్యా....
గంగాడి సుధీర్ (02.04.2020)
9394486053.
అవునూర్, రాజన్న సిరిసిల్ల.