నీకెందుక్రా... నేనున్నా కదా... మన ట్రాక్టర్, హార్వెస్టర్ నీదే అనుకో... వాటిని ఏ పని ఉన్నా,
ఎప్పుడున్నా తీసుకుపో కాదని ఎవరన్నారు, అనవసరంగా తల తిరిగే ఆ పుస్తకాలతో కుస్తీ
పట్టి పెద్ద చదువులు చదివి చేసేదేంటీ... మనూరు వదిలేసి పట్నం పోయి దిక్కులేని
బ్రతకు బతకడం తప్పా... అని నారన్న అనడంతో నిజమే కదా అనిపించింది.
మొన్నటికి మొన్న దసరాకు ఊరికొచ్చిన సాప్ట్ వేర్
సునీల్ కూడా ఎంత కష్టపడ్డా రెసీషన్
ఎప్పుడొస్తుందో తెలియని ఉద్యోగాలతో ఇళ్లు కొనడం కలగానే మిగులుతుందేమోరా... అన్న
దగ్గర్నుంచీ, అప్పటికే కుస్తీ పట్టినా అర్థం కాని లెక్కల గజిబిజితో చదువుపై
పెరిగిన విరక్తి భావం పెరుగుతుండగా, ఇప్పుడు నారన్న మాటల్తో ఇక భవిష్యత్తు ఎటువైపో
స్పష్టమౌతుంది. అటెండర్ ఉద్యోగానికీ పీహెచ్డీలు పోటీ అనే పేపర్ హెడ్డింగులు నా
భావాన్ని మరింత బలపర్చాయి,
మొత్తానికి చదువుకు ఎగనామం పెట్టేసి, హాయిగా ఊర్లోనే
పొద్దున ఈతవనం, సాయంత్రం బెల్టు తోరణం మద్యాహ్నం ఓళ్లుకు కష్టం తెలియని వ్యవసాయంతో
సంతోషంగానే ఉన్నానని అనుకొవడం మొదలెట్టాను. ఓరోజు వరికోతకొచ్చిందని నారన్న
హర్వెస్టర్ తీసుకెళ్దామని వాల్లింటికి వెల్లగా... అప్పుడే ఇంటర్మీడియట్ హాస్టల్లో
చదువుతున్న కొడుకుకు తలంటుతున్నాడు నారన్న. ‘ఏమైందన్నా... చిన్నోడిని అంతలా
తిడ్తున్నావు’ అని అడిగితే... ‘లక్షలు, లక్షలు పోసి ఏసీ హాస్టల్లో చదివిస్తే ఓసిగా
తింటూ మంచాల కింద పంటూ, క్లాసులు
ఎగ్గొడుతూ చదువును సంకనాకిస్తున్నాడు, నేను కట్టిన లక్షల మాదిరిగా ర్యాంకులు
తెచ్చుకుంటున్నాడు’ అన్నాడు
‘చదివి మాత్రం చేసేదేముందిలే అన్నా... బంట్రోతు జీతాలు
తప్పా... ఐనా జర ఇవ్వాల హార్వెస్టర్ కావాల్నే పొలం కోతకొచ్చింది’ అని అడిగా. ‘అరే
మొన్ననే మన బండిని పక్కూరు లక్ష్మణ్ నెలరోజులు కిరాయికి మాట్లాడుకున్నాడురా...
ఇవ్వాల పొద్దున్నే వస్తా అన్నాడు తీసుకపోనీకి, ముందు చెప్పద్దారా... ’ అని ఇక
నన్ను వెల్లమన్నట్టుగా మల్లీ కొడుకుతో ‘చదువు రాకుంటే... ఇగో గిట్ల వాన్నీ, వీన్ని
బతిమిలాడుకుంట కుక్కలెక్క బతకాలే’ అనే మాటలు గేటు దాటుతున్న నా చెవుల్లో
గింగురుమంటున్నాయి, అప్పుడర్థమయింది, ఏమాటలు విని బతుకు గేటు దాటాల్నో... ఏ మాటలు
విని బడి గేటు దాటొద్దో...
గంగాడి సుధీర్