వలసలు
‘యాడికి
బోతున్నవ్ మల్లన్న గింత పొద్దుగూకినంక’ అన్న మాటలిన్పిచ్చిన పెద్దతోవ చివరి వంక
జూచి చేను కాడికి పోతన్న త్రీ ఫేస్
లైనచ్చింది గదా మోటర్ పెట్టత్తమల్ల తెల్లారితే నీళ్లు యాదిగాని వంతుకు పోతయ్
అనుకుంటనే పెద్దతొవ్వ సంది మలిగి చీకట్ల కలిసిండు మల్లయ్య ఏ రోజు జూచిన గిదే గొడవ
రాత్రి పదింటికో, పదకొండింటికో కరెంటిత్తరు మల్ల తెల్లారుజామున మూడింటికి
తీసెత్తరు. గ పొద్దుందాక కరెంటుండదు మన్నుండదు ఉన్న ముత్తంత సేపట్లనే చుక్కచుక్క
ఆసరోలే నీళ్లని గాపాడుకోవాలే లేకుంటే పొలం పండది కడుపు నిండది అని గునుక్కుంటనే
తలికి తులాల జుట్టి పైపులు సగవెడుతుండు మల్లన్న రాత్రి కరెంటు పోంగనే అక్కన్నే
పడుకొని తెల్లారుజామున యాపపుల్ల నములుకుంట ఊళ్లకు బయలుదేరిండు నడి ఊళ్లకు రాంగనే
కసీరు దగ్గర బాగా మంది పోగై ఉంటే విషయమేందో తెలుసుకుందామని రాయిచెట్టు చుట్టు కట్టిన
గద్దెమీద కూర్చున్న పెద్దిరెడ్డి పక్కకొచ్చి ఏమైంది పెద్దన్న గిప్పుడు కలిసిండ్రడు
ఏమన్న పంచాయితీ గిట్ల ఉన్నదయే అని చనువుగా అడిగాడు మల్లన్న వాళ్లిద్దరూ ఒకే ఈడువాళ్లు
చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిండ్రు మల్లన్న ఎరుకలి కులానికి చెందినవాడైనా వాళ్ల
మధ్య స్నేహం కులాల గోడలిన చెరిపేసింది అందుకే అంత చనువుగా అడిగాడు. ఆ ఏంలేదురా గా
పెద్ద గద్దెల ఎల్లారెడ్డిది, చిన్ననర్సిగానిది ఇద్దరి పొత్తుల బాయి లేదు దాని
పంపకాల ఇషయంలో ఇద్దరికి లొల్లైందట ఇయ్యల్ల పంచాయితీ పెట్టుకున్నరు అని నిష్టూరంగా
చెప్పి అక్కన్నుంచి లేచిండు పెద్దిరెడ్డి గదెందె లెవ్వవడితివి పంచాయితీ
సురువుగాకముందే ఏమైద్దో ఉందాం ఆగు అని వెళ్లపోతున్న పెద్దిరెడ్డి వంక చూసి ఆడిగిండు
మల్లన్న ఏ... దా... పోదాంరా గా పంచాయితీ గియ్యల్లేడ తెగుద్దిరా చిన్న నర్సిగాని
దగ్గర దడువతి పెట్టడానికి పైసల్లెవ్వని ఆడు తిరుగుతుండి సర్పంచ్ సాబేమో ఏదో
టెడరెయ్యాల్నని జెప్పి సిరిసిల్ల పోయిండు ఇగ పంచాయితీ ఏమయ్యేటట్టుంది అంటూ ఇంటి
ముఖం పట్టారు ఇద్దరు మల్లయ్య ఇంట్లోకి అడుగు పెడుతూనే ముక్కుపుటాలదిరేలా
గుప్పుమనవి చాపల పులుసు వాసనస్తుంది అప్పుడే పొలం దగ్గరి నుంచి వస్తున్న ఎల్లవ్వ
ఏమోయ్ వాసన గుప్పుమనిపిస్తున్నవ్ మా చెల్లె చాపలారబెట్టిందా ఏంది? నడుస్తూనే
అడిగింది ఎల్లవ్వ మల్లయ్యకు ఊళ్ల వరుసలెక్క వదిన అయితది అందుకే అలా అడిగింది ఏమో
వదినే నేనిప్పుడే పొలంకికెయ్యోచ్చిన అంటూ లోపలికెళ్లూనే ఏందే చాపల పులుసు
జేసినట్టున్నవ్ ఎవలన్నా అచ్చిండ్రాయే ఇళ్లంత కలియజూశాడు మల్లయ్య అవును మరి గంజినీళ్లనే
అన్నంల వంపుకొని తాగేది చాపల పులుసు జేసిండ్రంటే ఎవలన్నా చుట్టాలస్తనే అదీ ఇంట్లో
పైసలుంటేనే చేసేది అదే అనుమానంతో అలా అడిగాడు మల్లయ్య ఏంలేదయ్యా చిన్నోడు నిన్న
రాత్రి గాలాలేసోచ్చిండు పొద్దగల్ల బోయి రెండు మొట్టలు పడ్డయని పట్టుకొచ్చిండు
గవిట్నె పులుసెట్టినగని పొలం బారాందా అన్ని మడ్లల్ల నీళ్లు నిండినయో అంటూ పొలంకాడి
సంగతి అడిగింది మల్లయ్య భార్య మల్లమ్మ ఏంబారుడో ఏంపాడో పో పెద్దమడి సగం బట్టింది
గంతే లైనుబోయింది మల్ల మూడ్రోజులుదాకా నీళ్లు రావుగదాయే. అనుకుంటనే మొఖం
కడుక్కోవడానికి పాక ముందుకొచ్చండు మల్లయ్య జాలాట్ల గచ్చుమీద తెల్లగా ముచ్చంలా
మెరిపోతున్న సుద్దముక్కలాంటిదాన్ని చేతిలోకి తీసుకుంటనే జారికిందపడ్డది
గప్పుడప్పుడు పట్నంకేయి కొడుకచ్చినప్పుడు గనపడే సబ్బు ముక్కలాగ కనిపించేసరికి
చేతిల పట్టుకొని ఏమో పెద్దోడు గిట్న నేను బోయనంక నిన్న రాత్రి పట్నంకేయి వచ్చిండా
ఏంది అక్కన్నంచే అడిగాడు మల్లమ్మని రాలేదుదగయ్యా అయినాగని గిప్పడు గాడెందుకొత్తడు
గట్లడుగుతున్నవ్ ఎనుకకు పడ్డ ఎంటుకలను సికముడి వెసుకుంటు బయటకొచ్చి నిలబడ్డది
మరిగీ సబ్బు ముక్కనెవలుదెచ్చిండ్రె... అడగడం పూర్తిగాకముందే మల్లమ్మ దగా మన
రేణవ్వనే కొనుక్కందయ్యా ఏదో టీవిలా జూపుతుండ్రట గదా అండ్ల జూచి దాని బీడీల పైసలు
పెట్టింకొనక్కున్నది అని తినడానికి కంచాలు గడుగుడు మొదలు పెట్టింది టీవీలో ఏంపాడో
పోరగాండ్లను ఆళ్ల మానాన ఆళ్లను బతుకనిత్తలేవుగదాయే సరేగాని చాయిజేసినవా ఇటు
దీసుకరాపో గొంత పానమన్న ఎచ్చవడ్తది అనుకుంటనే అరుగు మీద తువాల వరిచి గుసున్నడు
మల్లయ్య గీ అంబటాల్ల
చాయేందయ్యా
బుక్కడంత చల్లబడుదువురా అని కుసురుకుంటనే చెప్పి లోనికెళ్లింది మల్లమ్మ
తినేటప్పుడే ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఈయేడు వర్షాలే
లేకపాయే మొగులు తరువాయి జూత్తుంటే ఇగ వర్షపు నీళ్లను జుత్తమో లేదో ఇంక యవసాయమేం
నడిచటట్టేం, తడకలల్లితే కొనెటోల్లె లేకపాయే గంపలు, చాట్లన్ని మూలకు పడవట్టె గందుకే
వరికోతలు గాంగనే ఔటఫ్ బోదామనకుంటున్న గిదే ఇషయమ్మీద రేపన్న ఎల్లుండన్న పట్నంబోయి
పాసుపోర్టు దీసుకొచ్చుకుంటనే అన్నం తినడం ముగించి లేచిండు మల్లయ్య ఎన్నో
రోజుల్నుంచి ఇంట్లో అనుకుంటునే ఉన్నారు అందుకే మల్లమ్మ మౌనంగా అలాగే
కూర్చుండిపోయింది మల్లన్న... ఓ... మల్లన్నా.... ఇంట్ల ఉన్నవా లేదా ఎవలో
పిలుస్లుంటే బయటకొచ్చి నిల్చుండు మల్లయ్య ఓ.... నారన్న కుసుందుదాయే ఏం పనిమీద
అచ్చనవే ఏం లేదు మల్లన్న గా నారాయణ రెడ్డి పటేల్ ఏదో పనుందని చెప్పి నిన్నురమ్మన్నడే
అని అక్కన్నుంచి వెళ్లిపోయిండు నారయ్య ఏమో నేను గీ నారాయణరెడ్డి పటేలింటిదాకా పోయొత్త
అనుకుంటనే రోడ్డుమీదకొచ్చి గడీలను దాటుకుంట పోతుండగా పెద్దపెద్ద రాళ్ళతో కట్టిన
ప్రహారి గోడ లోపలింట్లో నుంచి ఓరే మల్లిగా ఇటు రారా అని వామనరావు దొర పిలువంగనే బాగున్నార
దొర ఏమన్న పని వడ్డదా దొర పిల్చిండ్రు అని దొరకెదురంగా పోయి నిలబడ్డడు మల్లయ్య ఏం
లేదురా మా మామిండ్లు కోత కచ్చినయ్ రా రేపట్నుంచి రెండ్రోజులత్తవురా కైకిలి
తీసుకుందవుగని అడిగిండు సరే దొరా ఇంకెవలన్న వత్తుండ్రా నేనొక్కన్నే రావల్న అని
అడిగాడు మల్లయ్య మా జీతగాడు, నువ్వు ఇద్దరు కలిసితెంపుతే రెండ్రోజులల్ల ఒడుత్తయిరా
రేపు పొద్దుగల్ల సద్దిగట్టుకొని తోటకాడికే సక్కగ రారా అని చెప్పి
ఇంట్లోకెళ్లిపోయాడు వామనరావు దొర అట్లాగే అక్కన్నుంచి నారాయణరెడ్డి
పటేలింటికిపోయిండు మల్లయ్యని చూస్తూనే నారాయణ రెడిడ బయటకు వచ్చి కుర్చీల కూర్చుండి
ఏంద్రా మల్లిగా కన్పిత్తలేవు ఊళ్లేలెవ్వారా అని అడిగిండు అక్కన్నే కింద గచ్చుమీద
తువాల పరుచుకొని కూసుండి ఏం లేదు పటేలా పొలం అంకల్నే ఉండుడయింతుంది గందుకే
గిటుదిక్కత్తలేను ఏదో పలిచిండ్రంటా ఏం విషయం పటేలా అని అడిగిండు మల్లయ్య
నారాయణరెడ్డికి అరవయ్యేండ్ల పైననే ఉంటాయి. ఆ ఊళ్లో మోతుబరి రైతు చాలా మంచోడు
వర్షాలు పడ్డప్పుడు మంచిగనే బతికి ఆల్లకు ఈల్లకు అప్పులు గూడ ఇచ్చిండు గని ఇప్పుడు
వర్షాలు లేక కరువు ఆయనను కూడా పట్టింది అందుకే జర దిగులు పడ్డట్టయ్యిండు మనిషి
ఉన్న ఇద్దరు కొడుకులు ఒకడు టీచరు నౌకరు జేసుకుంటూ పెద్దూర్ లోనే ఉంటాడు. చిన్నోడు
ఇంకా ఏమో చదువాల్నని పట్నంలో ఉంటుండు ఇంటిదగ్గర ఇద్దరు పెద్ద మనుషులు
మిగిలిపోయిండ్రు ఏంలేదురా ఇద పొలం జేసుడు నావ్లయ్యేటట్టు లేదురా గందుకే నువు
కౌలుకు గిట్ల జేత్తవేమో అడుగుదామని పిలిపిచ్చిన అసలు సంగతి చెప్పేసిండు
నారాయణరెడ్డి ఆమాట ఈమాట మాట్లాడకున్నంక రెండుమూడ్రోజులయినంక విచారించుకొని చెపుతా
పటేలా మల్ల గిప్పుడే అవుటాఫ్ పోదామనుకుంటున్నా ఇంకా ఏ విషయం తేల్చుకోలే అని అక్కన్నుంచి
లేచిండు మల్లయ్య.
గదేంది వీసా గిట్లచ్చిందారా గిప్పడు
పోతునంటున్నవ్ జరా గా బాకీ పైసలు ఇరువైవెయ్యిల ఇయ్యిరా చిన్నోనికి చదువుల
తక్కువపడ్డాయట అని మాటలల్ల మాటలెక్క అన్నాడు పటేలు. గిప్పుడెక్కడియి పటేలా ఒక్క
యాడాది గు పటేలా మిత్తిగిత్తి అన్ని కలిపి ఒక్కసారిత్త. ఐనా నువ్వే గిట్లంటే ఎట్ల
పటేలా మాకున్న పెద్దదిక్కు మీరేనాయే అని నిలబడే మాట్లాడుతుండు మల్లయ్య నాక్కూడా
గిప్పుడు పైసలు అడుగుడు మంచిగనిపిత్తలేదురా కానీ ఏంజేయాలే పంటలు లేకపాయే వాని
చదువు ఒడవకపోవట్టే గందుకే అడిగినా ఐనా గిప్పుడేం ఆగం గాకుగని జర తొందరగయ్యేటట్టు
జూడు ఏడాదిదాకంటే కష్టమైతదిరా మధ్యలో అనికేమన్నా అవసరమత్తే చెతులుండాలేగదా గందుకే
అడిగినా జర ఇంకొక యాడాది ఆగుండ్రి పటేలా నీకు పుణ్యముంటుంది అని బతిమాలుకుంటనే
అక్కన్నుంచి బయలుదేరి ఇంట్లకచ్చిండు మల్లయ్య వస్తూనే దిగాలుగా ఉన్న భర్తను చూసి
ఏమైంది గట్లున్నవ్ పక్కకొచ్చి కూర్చుంది మల్లమ్మ కరువు కరువులెక్క పటేలుకు పైసలవసరమున్నయట
బాకీ పైసలు ఇయ్యమన్నాడు. గిప్పుడేడికేలితెత్తం ఏంజెప్పినవ్ యాడాదాగుమన్నా. ఏమన్నడు
సరేఅని అన్నడే పొడిపొడిగా మాట్లాడుతుండ్రిద్దరు. ఒస్... భారంగా నిట్టూర్పిడిచి
నేను పొలంకాడికోయి గడ్డికోసుకత్త గా బర్లుగిట్లత్తే కట్టేయి అనుకుంటనే కొడవలి
తీసుకుని బయల్దేరింది మల్లమ్మ.
పట్నంకేయి కొడుకొచ్చి రెండ్రోజులయ్యింది
ఒరేయ్ మయోసు ఎప్పుడూవోతవురా మల్లా పైసలెమన్న అవసరమన్నయిరా గిప్పుడేజెప్పు
ఎవల్దగ్గర్నన్న అడుక్కత్తా గట్లనే ఇయ్యల్లోక్కరోజు ఈతమట్టలు కొనుకరానుపోదాంరా
తడుకలల్లాలే మైబెల్లి నిన్ననే జెప్పిండు రెండు పొనుగు తడకలుగావల్నని కొడుకుతో
చెప్పిండు మల్లయ్య సరే బాపు పోదాంతియ్యి అన్నం తిన్నవా నేను ఊళ్లేదాకా పోయ్యత్త
చెప్పుకుంటనే బయటకెళ్లిండు మహేష్ హైదరాబాద్లో డిగ్రీ ఫైనలియర్ చదువుతుండు మహేష్
చాలా తెలివిగల విద్యార్థి కావడం చేత ఐదో తరగతి నుండే నవోదయ పాఠశాలలో ఇప్పుడు APRDC కళాశాలలో చదువుతూ తన వల్ల ఇంటికి భారం
కాకుండా చూసుకుంటున్నాడు.
అలా ఊళ్లోకెల్లి మిత్రులతో
కలిసి చిన్ననాటి సంగతులు నెమరేసుకుంటున్నాడు ఏదో వెలితిగా అనిపిస్తుంది తనకి
క్రితం రోజులు గుర్తుకొస్తుంటే... తను రాగానే పొలాలెమ్మటి పచ్చటి బయళ్లలో
నడుచుకుంటూ విరబూసిన పొద్దు తిరుగుడు పువ్వులతో నేలంత ఆకుపచ్చ చీరపై పసుపురంగు
అద్దినట్టు అందంగా కనిపిస్తుంటే దూరంగా కొండలనుంచి చల్లని గాలి మెల్లమెల్లగా
వీస్తుంటే మొక్కజొన్న తోట దగ్గర కాల్చుకు తిన్నవెచ్చని కంకులతో పాటు మామిడికాలకు
మసాల నంజుకు తింటుంటే పట్నంలో కోల్పోయిన రుచులన్నీ మెల్లమెల్లగా నాలుకకి
తిరుగచ్చినట్టనిపించింది అందరూ ఒకరికొకరు సాయపడుతూ అరకలెత్తి నాగళ్లు నడుస్తుంటే
చీమలు బారుల్లా కనిపించేవి, పొలాల్లోంచి వచ్చిన తర్వాత ఒక్కరొక్కరుగా వచ్చి కసీరు
దగ్గర కూర్చొని వెన్నెల్లో చిన్నపిల్లలు ఏవో అటలాడుకుంటూ ఉంటే పెద్దోల్లంతా సరదా
కబుర్లలో మునిగి ఊరంతా సందడి సందడిగా రోజు క పండగ వాతావరణంలా అన్పించేది అటువంటిది
ఇప్పటి పరిస్థతి పూర్తిగా మారిపోయింది మా ఊరొక్కటే కాదు మొత్తం ఊర్లన్ని ఇదే పరిస్థతి
ఎక్కడ చూసిన కరువే, అందరి ముఖాలు బాధలతో పాలిపోయాయి ఎవరని కదిలించిన దుఃఖం పొంగుకొస్తుంది
మెల్లిగా వలసలు ఊపందుకుంటున్నాయి గొడ్డూ, గోదా పొలం పుట్రా అన్ని అమ్ముకుని ముసలి
తల్లిదండ్రుల్ని ఇంటిదగ్గర వదిలి పేద, బీద తేడాలేకుండా పోతున్న వలసల్ని చూసి
పల్లెటూర్లు మౌనంగా బావురుమంటున్నాయి. ఒకవైపు కరువు తన కోరలతో జనాల రక్తం
తీల్చుకుంటుంటే మరోవైపు ప్రభుత్వం నిర్భంద వసూళ్లతో బొక్కల్ని సైతం పిప్పి చేస్తుంది
తన ఆవేదనంతా తోటివాళ్లతో పంచుకున్న వరుణుడు కరుణించకపోతే ఎవరు మాత్రం చేసేందేంటి
ఆవేదన నిండిన హృదయంతో ఇంటికెళ్లాడు మహేష్. ఇంట్లోకెలుతూనే మల్లమ్మ అరేయ్ అయ్య
రమ్మన్నాడ్రా నడువు పొలంకాడికి పొయ్యిండు అని చెప్పి సద్ది తీసుకొచ్చి
చెయ్యికిచ్చింది మల్లమ్మ. సాయంత్రి వరకు ఇద్దరు కలిసి మట్లు కొట్టిండ్రు సాయంకాలం
కాగానే మయేసు నువ్వు మట్టలు తీసుకుపోరా నేను గొంతు తడుపుకచ్చుకుంటా అని చెప్పి
సైకిలుకు మట్టలు కట్టిచ్చిండు మల్లయ్య తెల్లారితేనే ఇద్దరు కలిసి పట్నం పోవడానికి
తయారయ్యిండ్రు రాత్రే విషయం మొత్తం చెప్పిండు మల్లయ్య అందుకే మౌనంగానే తంరడిని
అనుసరించాడు మహేష్. పాస్ పోర్టుకు అప్లై చేసుకుని మిగిలిన కార్యక్రమాలన్ని ముగించుకొని
కొడుక్కి చెప్పి ఇంటికొచ్చాడు మల్లయ్య రాగానే రేణమ్మ, చిన్నోడు ఇద్దరు
పరిగెత్తుకొచ్చారు తండ్రి తినడానికేమన్నా తెచ్చాడేమోనని జేబులో డబ్బులే లేకపోయే
ఇంగ పిల్లలకేమి తెచ్చేది. రెన్నెల్ల తర్వాత వరికోతకొచ్చింది రేపు మొదలెడితే మంచిది
లేకపోతే మొగులెటో కమ్ముకొత్తంది నోట్లోకిచ్చిన గింజలు నేలపాలైతయి రేపు కోత
మొదలెడదామని మల్లమ్మ చెప్పినమాటకి సర్లేవే ఈ పాడుమబ్బులోటి వాన పడేదేలేదు మల్ల
గదేందో కాలంగాని కాలంల మబ్బులు రావట్లే మొత్తం కాలికాలం మాయ అనుకుంటనే
కొడుళ్లు సరిపిచ్చుక రావడానికి కమ్మరి కలిమికెళ్లిండు మల్లయ్య ఏమిరా
మల్లిగా నువ్వు గూడ అత్తున్నవట గదరా అవుటఫ్కి అని పలుకరించిండు ఎల్లయ్య గదేందే
నువుగూడ అనవడితివి నువ్వుగిట్న అత్తున్నవా ఏంది అయ్యె ఏమిరా తెల్వనట్టేజెయ్యవడితివి
మనూళ్లకెయి 20 మందిదాకా రావట్టే ఏంది 20 మందత్తురా మరీ విసాలు గిట్ల అచ్చినాయో
దుమాల రాయనర్సు లేడు వాడే మా అందరికి వీసాలు ఇప్పిత్తుండు మరీ నిన్నెవ్వలు దోలుతుండ్రా
అని అడిగాడు ఎల్లయ్య నేను కూడా గాందగ్గరికే బోయినా 60 వెయిలు ఇయ్యమన్నడు ఒక్క పైసగుడ
తగ్గుతలేడు కొత్తబస్టాండ్ అవతల ఏదో రూం తీసుకుండుగదా మా బామ్మర్ది చెప్పిండు
గాడెనాయే అని రుజువు జేసుకుందామని అడిగిండు మల్లయ్య ఆ గాడేరా మేం మనిషికి 30 వెయిలు గట్టినం ఇంకా
30 వెయిలు వీసా అచ్చినంక ఇయ్యిమన్నడు అది సరేగని పాస్ పోర్టచ్చినాదిరా ఆ వచ్చిందే
15 రోజులాయే మొదుగలా ఎవలో పోలీసాయనొచ్చి 200 తీసుకపోయిండు ఎన్కసిరికి పాస్ పోర్ట్
బట్వాడా ఆయనొచ్చి ఇచ్చిండు. ఇంతలో మల్లయ్య కొడళ్లు తళక్కు మనిమెరుస్తూ గడ్డి పీచమనచడానికి
సిద్దమవడంతో సరే నేను పోయత్తనే అని జెప్పి అక్కన్నుంచి బయలుదేరిండు మల్లయ్య.
కరువుకాలం మాయో కలికాలం మాయో అన్నింటి ధరలు రెండింతలవుతున్న వడ్ల ధరలు మాత్రం
పెరగడం లేదు మొత్తం పంటలో తినడానికి ఉంచుకోంగా అమ్మిన 20 కింటాల్లకు అచ్చిన పైసలు
పెట్టుబడి పోంగా మల్ల పెట్టబడికి సరిపోయేటన్నే అచ్చనయి ఆ రోజు రాత్రి మల్లయ్య
మల్లమ్మ ఇద్దరు కూర్చొని బాగా విచారించుకొన్న తర్వాత పంటమ్మగా వచ్చిన పదివేల రూపాయలకి
ఇంకో 20 వెయిలు అప్పు తీసుకొనొచ్చినా పొలమమ్మకపోతే అవుటాఫ్ కు పైసలు సగవడేటట్టు
లేవు గందుకే పొలమ్మడానికే నిశ్చయించుకున్నారిద్దరు. తెల్లారితేనే మల్లమ్మ వాళ్ల
తమ్ముని దగ్గరికి దూమాలకెల్లింది. ఇంకా ఆదారిలో బస్సులు సరిగా నడవకపోవడంతో రెండు కిలోమీటర్లు
నడుచుకుంటూనే పోయింది ఊరికి అవతల విసిరేసినట్లుంటుంది వాళ్ల తమ్ముని ఇల్లు అందుకే
చీకట్లో కిరోసిన్ దీపం ఒక్కటే మిణుకుమిణుకుమంటూ మెరుస్తుంది. అందరి బోజనాలయ్యాక
మెల్లిగా అసలు విషయం చెప్పింది మల్లమ్మ. సరే అక్క చానా రోజుల తర్వాత అడిగినవు నా
దగ్గర ఉన్నయ్ వాళ్ళ దగ్గర వీళ్లదగ్గర అచ్చెటియి మొత్తం కలిపితే 20 వెయిల దాకా
అయితయి ఈసారెట్లయవసం బంజేద్దామనుకున్నా ఇగ మొత్తం పైసలు ప్లేను ఎక్కేటప్పుడు అచ్చి
తీసుకపోమ్మనిచెప్పే బావకు అని చెప్పి నిద్రపోయాడతను తెల్లారి తమ్మునికి మల్లోకసారి
చెప్పి అమ్మ దగ్గర, నాయిన దగ్గర సెలవు తీసుకుని ఇంటికి పయనమయింది మల్లమ్మ. అవుటాఫ్
పోవడానికి అన్ని సిద్దం చేసుకుండు మల్లయ్య ఊళ్లో పోవడానికి సిద్దమైన వాళ్లంతా
కలిసి బ్రోకర్ రాయనర్సు దగ్గరికి పోయిండ్రు గప్పుడే మల్లయ్య చేతులున్న పదివేలు
కట్టేసిండు మిగిలినోళ్లంతా ఇంతకుముందు గట్టిన 30 వేలక ఇంకో పదివేలు గిలిపిండ్రు,
పైసలు గట్టి చాలా రోజులు గడిచిపోయినయి అయినా వీసాలు గ అత్తున్నయి పైసలు రడి చేసుకొండ్రి ఇంకా పదిగేను రోజులల్ల ఎక్కుడే అని
చెప్పుతున్నాడే గాని వీసాలు మాత్రం తీసుకత్తలేడు, ఈ ప్రయత్నంలోనే పొలమును
గిట్లుబాటుగాకున్న ముప్పై వేలకే అమ్మేసిండు మల్లయ్య. ఎదేట్లనన్న గాని నా
కొడుకులన్న సుఖంగా బతుకుతరు. గీ పొలాలల్ల పొద్దంత కష్టపడ్డా తిందామంటే కడుపే
నిండకపాయే అని తనని తాను సముదాయించుకుంటున్నడు. గింతలో పట్నంకేయి కొడుకు
లేటరేసిండు. బాపు ఇక్కడ నేను ఇంకా చదవాలంటే ఫీజు కట్టాలే ఐదు వేలదాకా ఖర్చయితయి.
ఇప్పుడింటికాడ పైసలు లేవని దెలుసు. గందుకే ఈ సంవత్సరంతో చదువు ఆపుదామనుకుంటున్న
అట్లనే ఈన్నే ఏదన్న పని జూసుకుంట. నువు, అమ్మ గిట్ల మంచిగుండుర్రి అవ్ టాఫ్
పోదామనకున్నావు గదా వీసా సంగతేమయ్యింది. ఐనా ఇప్పుడక్కడ యుద్దమైతుంది. గీటైమ్ల
అక్కడికిపోనిదే మంచిది. బ్రోకరుకైతే మొత్తం పైసలియ్యకు. నువ్వాడికి పోకుంటేనే
మంచిదనుకుంటున్న నాగురించి బెంగ పెట్టుకోకుండ్రి అని రాసిండు. ఏం చేస్తం కనీసం
కొడుకుని కూడా చదివించలేకపోతున్న అని బాధపడ్తూనే ఆ ఊరి కరణం దగ్గరికి పోయ్యడిగిండు
అవ్ టాఫ్ ల యుద్దమైతుందా అని అవునురా మల్లిగా నీకు తెల్వదా అమెరికోళ్లు ఇరాకోళ్ల
మీద యుద్దం జేత్తుంరడా మీరు పొదమనుకున్నారు జూడు కువైట్ దాని దగ్గర్నే ఉంటది ఇరాక్
అని చెప్పిండు కరణం. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు యుద్దం వల్ల అవ్ టాఫ్
పోదామనుకున్నోళ్లంతా భయపడ్తున్నరు కొందరైతే పోవడమే మానేద్దామనుకుంటున్నరు. అంతా
కలిసి ఒ రోజు బ్రోకర్ రాయనర్సు దగ్గరికి పోయిండ్రు వారం కల్ల మీ వీసాలిప్పియ్యిలేకపోతే
మా పైసలు మాకిచ్చేయ్ అని గొడవ పెట్టుకున్నారు. లాగొలా పదిహేను రోజులల్ల వీసాలన్న, పైసలన్న
ఇత్త అని చెప్పగానే అందరూ ఊరుకున్నారు. పదిహేను రోజులయిన వీసాలు రాలే పైసలు
ఈయ్యలే. ఒ దిక్కు ఎండలు మండిపోతున్నయ్ రోజు బ్రోకర్ రాయనర్సు దగ్గరికి, ఇంటికి
తిరిగేసరికి బస్సు కిరాయిలకే వెయ్యి రూపాయలొడిసినయి. చెప్పులు అరుగుతున్నయ్ కాని
ఫలితం మాత్రం లేదు మల్లయ్య ఇగ అసలు చాలిచ్చుకున్నడు కాని ఇప్పడేంజేయ్యాల్నొ
అర్థమయితలేదు ఇన్ని రోజులు నీడనిచ్చిన పొలం గూడ అవ్ టాఫ్ జేయ్యపట్టి అమ్ముకుంటి
ఇంక ఈ ఊళ్లో జేయడానికి ఏం మిగులలే మల్లమ్మ రోజు బాధపడ్తూనే ఉంది. ఒ రోజు
పొద్దుగల్లనే ఎల్లయ్య చచ్చిపోయిండని తెల్వంగనే పరుగున ఉరికిండు మల్లయ్య. ఎల్లయ్య
పెండ్లాము శవాన్ని పట్టుకుని ఏడుస్తొంది. ఇగ నాకు దిక్కేవరురో... నేను కూడా నీతోటే
అత్తనే... ఎల్లయ్య ముఖం పాలిపోయింది మొఖంలా బాధకొట్టేచ్చినట్టు కనిపిస్తుంది. బాధ
నిండిన స్వరంతో ఏమైందిరా అని అడిగాడు పక్కనున్న తనతో బ్రోకర్ రాయనర్సు ఎక్కడికి
పారిపొయ్యిండట అంతే పురుగుల మందు తాగి ఒక్కసారిగా కుప్పకూలిపోయిండు. కాళ్లు
చల్లబడిపోయాయి గుండెలో ఎవరో పొడుస్తున్నట్లుగా ఒకటే బాధ పది రోజులు గడిచాయి దూరంగా
చావుడప్పులు వినిపిస్తున్నాయి. అప్పుల బాధ తట్టుకోలేక ఎవరో ఉరేసుకున్నరట ఈ బాధల్లో
నుంచి తేరుకోలేక పోతుండు మల్లయ్య. తనని చూసి మల్లమ్మ కూడా చాలా బాధపడ్తుంది.
కొడుకుని పట్నం నుంచి రమ్మని చెప్పింది. పదివేల పంట పండలేనుకుందం పోతే పొనితీయ్యి
ఎంజేత్తం కొడుకుని రమ్మన్నా రేపొత్తడు గావొచుచ నువ్వు ధైర్యంగుండు అని ధైర్యం
పెస్తుంది మల్లమ్మ. మెల్లమెల్లగా కోలుకుండు మల్లయ్య ఇద బతుకాలంటే పట్నం వలసపోక
తప్పదని తెలిసింది. మల్లమ్మని తమ్మునికి పైసలు అవసరం లేదని జెప్పమని పంపిండు పొలమమ్మగా
వచ్చిన పైసల కేల్లిపట్నం బస్సు చార్జీలు మిగిల్చుకొని మిగిలినయి నారాయణరెడ్డి
పటేలు అప్పు తీర్చడానికి తీస్కపోయిండు. గదేందిరా లెవ్వంటివిగదరా అని తీసుకుండు పటేలు.
ఇగ పత్నంబోతున్న పటేలా అన్నే ఏదో కూలిపనిజేస్కుంటూ, ఈ ఊళ్లో ఇంకనాకు ఏమున్నదని
ముక్తసరిగా చెప్పి బయలుదేరిండు మల్లయ్య.
తెల్లారితేనే ప్రయాణం అందరి
ముఖాలలోను ఒకటే బాధ కన్న తల్లిలాంటి ఊరునొదిలిపోవడానికి మనసొప్పుతలేదు.
తల్లికిజెప్పిండు పిల్లలు బీరిగిట్ల పయిలంగుండుర్రని కొడుకును, బడ్డను పక్కనే
పడుకోబెట్టుకుండు అయినా నిదురావడం లేదు లేచి బయటకొచ్చిండు వెన్నెల దగదగ
మెరిసిపోతుంగి. తువాల భుజం మీదేసుకొని బయలుదేరిండు ముందుపొలంకాడికిబోయిండు ఒళ్లంతా
పర్రెలతో ఏడుస్తూ వీడ్కోలు చెప్తున్నట్టుందది మెల్లిగా అక్కన్నుంచి ఐరంతా చీకట్లనే
తీరుగుతుండి డొక్కలెండని కుక్కలు కూడా మొరగడం మాని నీళ్లు నిండిన కండ్లతో వీడ్కోలిత్తున్నయి.
టికొచ్చేసరికి తెల్లతెల్లరుతుంది మల్లమ్మకు కూడా నిద్రరావడం లేదుకావచ్చు
గుడ్డిదీపం కింద దూలంకు తలాన్చి శూన్యంలో చూస్తుంది ఎప్పడో తెల్లారుజామున
పడుకోవడంతో లేచేసరికి అంబటాల్లయ్యింది. అంత తానాలు జేసీ రడి అయిండ్రు బస్సు
యాల్లయిందని కొడుకు తొందర పెడుతున్నా నిర్లప్తంగానే తయారయ్యిండ్రిద్దరు రేణని, చిన్నోన్ని
దగ్గరికి తీసుకొని నుదుటి మీది ముద్దిచ్చి పది రూపాలయలు చేతిలో పెట్టి ముసలోల్ల
కాళ్లు మొక్కి బస్టాండ్లకచ్చిండ్రు ముగ్గురు ఆపాటికే వలసలు రావడానికి కట్టబట్టలతో
రడిగా ఇంకొందరున్నారు. అందరిముఖాల్లోనూ దిగులు ఎవరికి కన్నతల్లి పేగు
తెంపుకోవడానికి మనసొప్పడం లేదు ఇవేమి పట్టనట్టుగా కరువు సైరన్ మోక్కుంటూ బస్సోచ్చి
ఆగింది ఎక్కడో ఎనకాల సీటు దొరికితే పొయి కూర్చున్నారు మల్లమ్మ, మల్లయ్య, మహేష్
బస్సు దుమ్ము రేపుకుంటూ పోతుంది అవునూర్ బోర్డు ఇంకా దూరమైపోతుంది వలసలకి
తావుచ్చిన కరువుకి జాలిలేదేమో పేదల జీవితాలతోనే అటలాడుకుంటుంది.