26, జులై 2012, గురువారం

sunday - sarada katha

‘ఎమండీ త్వరగా లేవండి మొద్దు నిద్ర, టైం ఏడు కావస్తోంది. కుళాయి ఆగిపోతుంది త్వరగా లేవండి’ మా ఆవిడ సువ్రభాతానికి అసహనంగా వక్కపై దొర్లుతూ 'అబ్బా ఇప్పుడే ఏం కొంపలు అంటుకుపోయాయి. సండే కూడా నిద్రపోనివ్వవా’ అని కసురుకున్నాను, ఇంతలోనే ‘అహా బాగుందండి వరుస ఇవాల తప్పితే మరో రెండు రోజులు కుళాయి రాదు, అప్పుడు ఏం తాగుతారో చూస్తాను, పోయినసారి ఎన్ని వందలు ఖర్చయ్యాయో గుర్తుకుతెచ్చుకోండి’ అంది. పోయిన సారి ఇలాగే కుళాయి తప్పినందుకు ఇంటికొచ్చిన చుట్టాలతో పాటు ఇంట్లో వాళ్లెవ్వరూ బోరు నీరు తాగమని మొరాయించి కూర్చుంటే తెచ్చిన బిస్లరీ డబ్బాలు గుర్తొచ్చి లేచి కూర్చున్నాను. రాత్రి ఆఫీసుతో తెల్లారి సండేనే కదా అని చెప్పి ఉన్నచాకిరంతా మేనేజర్ అప్పజేపితే అది ముగుంచుకొని వచ్చేసరికి పన్నెండు అయింది. అందుకే నిద్రు ముంచుకొస్తుంది, బలవంతాన కళ్లు తెరిచాను, అయినా చాతనవడం లేదు, మల్లీ ముసుగేసుకొని పడుకున్నాను, ‘సరే మీ ఇష్టం నేనే కుళాయి దగ్గరకు వెళ్తున్నాను, అసలే కింద బాచులర్స్, అయినా నాకు తొందరగానే పట్టిస్తారులే’ అని వెళ్లబోతుంటే ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాను. ‘అమ్మబాబోయ్, ఇంకా ఏమైనా ఉందా, నువ్వు వెల్లావంటే ఆ బ్రహ్మచారుల చూపులు కుళాయి మీదుంటాయా? ఆ బిందిటివ్వు నేనే వెళ్తాను’ అని లేచి లుంగీ సవరించుకొని ఈ ఓనరొకడు బాచులర్లకి ఇవ్వద్దంటే వినడు అని సణుక్కుంటూ కిందకి వెల్లాను, ఆపాటికే ఇరవై బిందెలు ఉన్నాయి, వెళ్లి పావుగంట అయినా లైన్ దొరకకపోయేసరికి సహనం నశించి ముందుకెళ్లి పట్టబోయాను, అంతే వెనుకనుండి ‘వచ్చాడురోయ్ మెనగాడు కౌబాయ్ అనుకుంటున్నాడేమో’ అన్నాడెవరో, వెనక్కి తిరిగి చూశాను, ‘ముసలి క్రుష్ణకు కోపమొచ్చింది పారిపోండిరోయ్‘ అన్నాడు ఇంకొకడు, ‘ఏంటయ్యా వాగుతున్నారు’ అని గుడ్లురిమి చూశాను, ‘ఏం సార్ మీరు మన్యంలో మొనగాడు అనుకుంటున్నారా లేకపోతే మేమంతా చవటలం అనుకుంటున్నారా.... పాపం ఆ ఆంటీనే అరగంట నుంచి నిలబడి ఉంది, మీరు అలా దూకితే ఎలా’ అన్నాడు ఓ బ్యాచులర్. చురచురమంటూ చూసాను అతని వంక. ‘మగవాళ్ల దౌర్జన్యమా బాబు, ఆడవాళ్లను కాదని అంత ముందుకెళ్తున్నావు, బలముందనా దబాయిస్తున్నావు, అందుకే కుళాయి దగ్గర కూడా 33% రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనంటూ’ వాదానికి దిగింది ఓ ఆంటి. ఆమె పెమినిస్టు రచయిత, ఆమెతో పోటీ అంటే మాటలు కాదు వెంటనే బిందెను తీసుకొని వెనక్కి వచ్చాను. ‘అబ్బా తగ్గిందిరా కా.....’ తిరిగి చూడగానే అక్కడితో ఆపేసాడు. అక్కడి బిందెలిటు, ఇక్కడి బిందెలటూ ఎలాగో తంటాలు పడి నీళ్లు తీసుకొని పైకి వెళ్లాను, మా ఆవిడ తిరిగ్గా టీవీ ఆన్ చేసుకొని భక్తి పాటల్లో మమేకమైపోయింది. జయ కాఫీ తీసుకురా అని సోపాలో కూలబడ్డాను. ‘అయ్యో సారీ అండీ టీవీని చూస్తూ మరిచిపోయా, ఐనా ప్లీజ్ స్టౌ వెలిగించి కాఫీ పెట్టరా మంచి పాటలు వస్తున్నాయి, చూడాలి’ అంటూ టీవీ దగ్గర నుంచి కదలట్లేదు, విపరీతమైన కోపం వచ్చింది ‘కాఫీ పెడతావా, పెట్టవా...’ అని అరిచాను, పొద్దున కూడా సంసారులను టీవీ వదలడం లేదు అని కోపాన్నంతా టీవీపైకి మల్లించాను. దానికి మా ఐదేళ్ల బాబుకు మెళకువొచ్చి ‘కే...... అంటూ కేకెట్టాడు’ ‘అయ్యో ఏం మనిషండి మీరూ బాబు నిద్ర చెడగొట్టారు’ అంటూ వాడ్నెత్తుకొచ్చి నా చేతుల్లో పెట్టి కాఫీ చపెట్టడానికెళ్లింది, వాడు ఒకటే ఏడుపు ఎంత బతిమాలినా ఏడుపాపడం లేదు, వాన్ని ఎత్తుకోవడానికి నానా తంటాలు పడ్తూ చేతుల్లో పైకెగిరేసి ఆడిస్తున్నాను. ఐనా వాడు ఏడుపు ఆపడం లేదు, కోపమొచ్చి విసుక్కున్నాను, వాడికీ కోపమొచ్చింది కావచ్చు బట్టల్ని ముద్దగా తడిపేసాడు, ‘ఇదిగోండి కాఫీ, తొందరగా కానీయండి అసలే ఆధివారం ఈరోజు సాయంత్రం సినిమాకెళ్లాలి, తొందరగా బజార్లోకెల్లి కూరలు తీసుకురండి’ అని సంచి చేతిలో పెట్టింది. ‘బట్టల్ని వీడు తడిపాడు, తడితో గొంతును నువు కొస్తున్నావు కదే’ అంటూ బాబుని తనకిచ్చి కాఫీ తాగి తయారయ్యి బజారుకెళ్లాను. ఆదివారం కూడా చప్పటి పప్పేంటని కొలో చికెన్ తీసుకెళ్లాను, ఇంట్లోకెళ్తూనే దూపం వేసిన పొగంతా బయటకు వస్తుంది, ఇల్లు తగలబడ్తుందా ఏమిటి అని భయపడ్తూనే జయా.. జయా... అదర్థాగా పరుగెత్తుకుంటూ వెళ్లి, దబ్.....దబ్.... డబేల్. శబ్దం చేస్తూ పడిపోయాను, మా ఆవిడ పరుగెత్తుకుంటూ వచ్చి ఏమైందండీ అలా పడిపోయారు, మెల్లగా కళ్లు తెరిస్తే ఏమి కనిపించడం లేదరు ఒక్కసారిగా భయపడి కళ్లు నులుముతూ అటూ ఇటూ చూసాను, కొంచెం కొంచెంగా కనిపిస్తోంది, మా ఆవిడ అప్పటికే హరతి పళ్లెంతో ఎదురుగా నిలుచుంది, ఏవేవో మంత్రాలు చదువుతూ మీకు గాలి సోకిందేమోనండి అందుకే అటు ఇటు పిచ్చిపిచ్చిగా చూస్తూ పడిపోయారండి అంది. మెల్లగా నిలబడ్డాను అమ్మా నొప్పి, అనుకుంటూ ఆమె మాటల్తో కోపంగా ‘పిచ్చిదానా పడిపోయాకే దిక్కులు చూశానే, ఇంతకీ హల్ మద్యలో రోలు పెట్టిన వెదవెవ్వడే’ అని కసురుకున్నాను, ‘రామ.... రామ,.... అంత మాటనకండి, ఆస్వామి వారే పెట్టారు, ఇందాక మీరు మార్కెట్కి వెల్లినప్పుడు స్వామివారొస్తే శాంతి పూజ చేయించానండి, ఈ రోజు నుండి మన కష్టాలన్నీ తీరిపోతాయి, మనం హాయిగా ఉండొచ్చు’ అని మురుసుకుంటూ చెప్తొంది. ‘అంటే ఇక కుళాయి పట్టక్కర్లేదా’ అంత బాధలోనూ అన్నాను, ‘మరదే వెటకారం’ అంటూ వయ్యారాలు పోతుంది. అంతే వయ్యారంగా అన్నాను ‘జయా పోయినవారం కంటే ఈవరం చికెన్ అదిరిపోవాలి, తొందరగా చేసేయ్, కడుపులో ఎలుకలు పరుగెడ్తున్నాయి......’ దబేల్ మని శబ్దం ఎంటా అని చూస్తే ఆమె చేతిలోని మరచెంబు జారిపోయింది ‘ఏంటీ వెటకారంగా ఉందా, నేను మీరు బాగుండాలని ఉపవాసం చేస్తే మీకు చికెన్ కావాల్సివచ్చిందా.... అసలే స్వామివారు ఇప్పుడే పూజ చేసి వెల్లారు’ అంటూ చిందులేసింది. ఇంతకు ముందు వయ్యారాలు పోయిన జయేనా ఈమే ఇంతలా మండుతుందేంటి ’అదికాదు జయా,,ఆదివారం కదా...’ అని అనునయించబోయా‘ముందు ఆ దరిద్రాన్ని బయటపడేసి రండి’ అని గర్జించి విసవిస లోపలికి వెల్లిపోయింది. అయిష్టంతోనే మెట్లు దిగి బాచులర్స్ కి చికిన్ ఇచ్చేసి పైకొచ్చా. ‘ఈరోజు టిఫిన్ మాత్రమే బోజనం లేదు’ అంటూ ఉప్మా ప్లేట్ ముందేసింది, అలసటగా తిని నడుం వాల్చానో లేదో ‘ఏమండి పడుకోవడానికి  చాలా టైముంది, ఈరోజు పోతే మీరు మల్లీ చేతికి చిక్కరు, ఒక్కదాన్నే ఇల్లు సర్దలేకపోతున్నా కొంచెం సాయపడండి’ అంటూ పోరు పెట్టడం మెదలెట్టింది. ‘ఛీ అందుకే అన్నారేమో సంసారం సాగరమని అన్నారు, పెళ్లి కాని రోజులే చాలా బాగుండేవి, హాయిగా కాలేజీకి వెళ్తూ ఇష్టమైన అమ్మాయితో షికార్లు కొడుతూ క్లాసులు ఎగ్గొట్టి సినిమాకెళ్తూ,హోటళ్లలో ఇష్టమొచ్చిన కూరలతో తింటూ ఆనందంగా గడిచిపోయేవి’ అని లోపల గొణుక్కుంటున్న మాటల్ని నాకు తెలియకుండానే బయటకే అనేసాను. ఇంకేముంది అసలే అనుమానపు మనిషి ఏడుపు మెఖం పెట్టి ‘ఒరే చిన్నూ రారా మా అమ్మవాళ్ల ఇంటికి వెళ్దాం, ఇంకా మీరు తిరగండి హాయిగా, నచ్చినదాంతో షికారు చేయండి’ అని ఏడుస్తూనే భాబుని ఎత్తుకొంది, ‘ఓసి పిచ్చి మొఖమా తమాషాకు అన్నాను, ఒట్టు నాకు అలాంటివేం తెలియదే’ బాబును తీసుకొని ఇంట్లోని వస్తువులను సర్దుతూ అలక తీరుద్దామని అతిగా సాయపడ్డా అంతే ఒళ్లు హునమైంది, సాయంత్రం ఐదు కావస్తోందేమో కాఫీ తాగి అలా ఇంటి పక్కన పార్కులోకి వెల్లి కూర్చున్నా చల్లగాలికి మనసు శ్రావ్యమైన సంగీతపు అలజడులను స్రుష్టిస్తుంటే ఆ లయకు అనుగుణంగా అన్నట్టు రాగం తీస్తున్నాను. ‘ఈ చల్లని గాలిలో ఆ వెననెల రేయిలో అని ’ ‘ఏ చెలికోసమో ’ అంటు వెనకాలే బాబును ఎత్తుకొని కూర్చొంది జయం. ‘చీ ఎప్పుడూ అనుమానాలేనా... చల్లని సాయంత్రాన్ని కూడా ఎంజాయ్ చేయనియ్యవా’ అంటూ చీత్కరించుకున్నాను. ‘అది సరేగాని పదండి పదండి సినిమాకు టైం అవుతుంది, తొందరగా పదా అసలే ఈ రోజు సండే టికెట్లు దొరకవు’ అంటూ తొందరపెడ్తూ అక్కన్నుంచి లాక్కెల్లింది. ‘ఏంటే ఆడవాళ్లు సహనానికి మారుపేరు అంటారు గదా నువ్వేంటే ఇంత పాస్ట్గా వున్నావు’ ఆశ్చర్యపడ్తూనే వెల్లాను, ‘నేను ఈ కాలపు మహిళనండి’ అని గర్వంగా తలెత్తింది ‘ఏంటే నువ్వు హైటెక్ కుంకుమ బొట్టు పెట్టుకోవు కదా’ అన్నాను ‘వెటకారాలు వద్దులెండి ముందు త్వరగా రడీ అవ్వండి’ అని గర్జించింది. రెడి అయి కింద బండి తీయబోతుంటే ‘థాంక్స్ అంకుల్ మీరు ఇచ్చిన చికెన్ సూపర్ గుంది, అంకుల్ సుగుణ చికెనా’ అన్నాడు కుర్రాడు. మరిచిపోయిన జిహ్వని మళ్లీ గుర్తుచేసి చిరాకెత్తించాడు, సినిమా హాల్ కెల్లేసరికి కిక్కిరిసిపోయింది. మగవారి క్యూ గేట్ చివరి వరకూ ఉండటం చూసి డబ్బులు తీసి మా ఆవిడకు ఇచ్చాను. ఎప్పుడొచ్చిందో ఫెమినిస్ట్ ఆంటీ ‘ఏమండీ సుధీర్ గారు ఇప్పుడొప్పుకుంటారా ఆడవాళ్ల శక్తిని’ అని లెక్చర్ మెదలెట్టింది. అసహనంగా దిక్కులు చూస్తుండగానే మా ఆవిడ వచ్చి టిక్కెట్లు చేతుల్లో పెట్టింది. కేవలం టిక్కెట్లే కనపడడంతో ‘చిల్లరేది’ అని అడిగాను ‘చిల్లరెక్కడిదండి ఈ రోజు బడ్జెట్ వచ్చింది కదా రేట్లు పెంచారంటా’ అంది. ‘ఆ... బడ్జెట్కి సినిమా టిక్కెట్లకి సంబందం ఏంటి, ’ ఆశ్చర్యపోతూ అడిగా..... ‘అంత సినిమా హాల్లోకి పోతున్నారు, సరేలే రండి సినిమా మెదలయ్యేట్టుంది.’ తన సహజ పాస్ట్నెస్ తో అటువూపు బాబుని తీసుకొని కదిలింది. లోపలికి పోబోతుంటే నా డిగ్రీ క్లాస్ మేట్ ప్రసనన లక్ష్మీ గుర్తుపట్టి హలో సుధీర్ అని పిలిచింది,  ఆడగొంతు నా పేరును పలకడంతో నా కన్నా ముందే మా ఆవిడ వెనక్కి తిరిగి చూసింది. ‘అరే ప్రసన్నా బాగున్నావా...’ అని పక్కకి నిలబడి మాట్లాడుతున్నాను, ఆమె డిగ్రీ జ్ణాపకాలన్నీ గుర్తుచేస్తుంది. ఒకవైపు ఆనందంగానే ఉన్నా దూరంగా ఉన్న మా ఆవిడను చూస్తే ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టు తయారయింది నా పరిస్థితి, కానీ ప్రసన్న చాలా చనువుగా మీద చేతులు వేస్తూ నవ్వుతూ మాట్లాడుతుంది. ఎలాగోలా ఆమెను వదిలించుకొని లోపలికి వెలళ్న ఆమె  నా ముందు వరుసలోనే కూర్చోవడంతో పక్కన మా ఆవిడ ఉండడం ఇంకా ఇబ్బందిగా అనిపించింది. సినిమా మధ్యలో ‘ఎవరావిడా... పెళ్లయి కాపురం చేసుకుంటుందా’ అని అడిగింది. ‘అదేంటి అలా అడిగావ్, ఐనా అవన్నీ నీకెందుకే’ అని మెల్లిగానే అన్నా... ...గయ్ మంటూ చెపుతారా లేదా అని గద్దించి చూసింది. ‘మా డిగ్రీ క్లాస్ మేట్ ఇంకా పెళ్లవలేదు’ అన్నాను అదోలా చూసింది. చీకట్లో కాబట్టి బతికిపోయాను, లేదంటే ఆ చూపుల మంటల్లో మాడి మసయ్యేవాడినే, ఇంటర్ వెల్లో ప్రసన్న మా ఆశిడను కూడా పరిచయం చేసుకొని బాబుని ముద్దు చేస్తూ అంతా నీ పోలికే అంది. ఆవిడ బలవంతపెట్టేసరికి కూల్ డ్రింక్ తీసుకోక తప్పలేదు. సినిమా ముగుసే టైం దగ్గరపడుతున్న కొద్దీ నా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇంటికి చేరేవరకు నేనెంత మాట్లాడించిన ఊ కొడ్తుందే కానీ మాట్లాడటం లేదు, ఇంట్లోకెళ్తూనే బాబును తొట్టేలో వేసి విసురుగా వెల్లి బెడ్రూంలో పడుకుంది. నాకేదే భయమనిపించి బాబును తీసుకొని లోపలికి వెల్లా... ‘జయా... మెల్లగా పిలిచా...’ కోపంతో కళ్లు ఎర్రబారిపోయాయి, ఎప్పుడూ ఉండే కోపం స్థానంలో దిగులు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. బేలగా ‘మాట్లాడకండి శ్రీరామచంద్రుడి లాంటోళ్లనుకున్నా... అన్ని క్రుష్ణ లీలలే’ కన్నీరు కారుస్తుంది. బాబుని పడుకోబెట్టి పక్కకి వెల్లి కూర్చొని అనునయంగా అంతా వివరించి చెప్పా, ‘తాను నాకు చెల్లిలాంటిదని నాకు నువ్వు తప్ప మరేవరు ముఖ్యం కాదని నేను నిజంగా మంచివాడినని ఒట్టేశా’ అంతే కరిగిపోయింది. పదండి మధ్యాహ్నం కూడా అన్నం తినలేదు, ఆకలవుతుందేమో అంటూ తీసుకెళ్లి వడ్డించింది. ఆహా శకాయ పెరుగన్నం యమగా ఉంది. ఆకలితో గబ గబా తింటున్నా. ‘ఆ..... అని అరిచా’ ‘ఏమైందండి’  అంది ‘పన్నుకింద రాయి పడిందే’ అన్నాను ‘అయ్యే బియ్యం సరిగా చూడలేదండి ’ అని భాదపడింది. ‘సరేలే సంసారంలో సండేలు, సరదాలు, కొట్లాటలుండగా లేనిది పన్నుకింద రాయి రాకుడదా’ అని గునిగాను...ఆ... గద్దించింది. ఏం లేదు అని తమాయించుకొని నీళ్లు తాగాను, ఎంత చిత్రమో కదా స్త్రీ... అంతలోనే కోపాలు, చిన్నమాటకే తాపాలు, గొనుక్కున్నాను, ఆ..... అని శ్రీరామచంద్రుడే నండి మీరు అని అంది. ఇద్దరం నవ్వుకున్నాం.....






2 కామెంట్‌లు: