24, డిసెంబర్ 2020, గురువారం

ప్రభుత్వోద్యోగమే పనికి పరమావదా?


 


పనినే దైవంగా భావించే సమాజం మనది, అనాదిగా నిర్వహిస్తున్న అనేక వృత్తుల ప్రాతిపదికనే మన పురాతన సంస్కృతి కొన్ని నిర్థిష్టమైన సంప్రదాయాలను ఏర్పరుచుకొని అభివృద్ది చెందుతూ వస్తుంది. పనిచేసేవాడికే విలువ, చేసే పని ఏదైనా అందులో నీతి, న్యాయం ఉండి తనతో పాటు తన కుటుంబం భుక్తికోసం ధర్మబద్దంగా పనిచేసి సంపాదించుకోవడమనేది ప్రతీ ఒక్కరి హక్కు. దురదృష్టవశాత్తు కాల క్రమంలో చేసే పని ఆదారంగానే వర్ణవ్యవస్థ రూపుదాల్చి, కులం అనే కబంద హస్తాల్లో అది చిక్కుకు పోయి పనిని బట్టి గౌరవం ఇవ్వడమనే దుష్ట సాంప్రదాయానికి తెరతీసిన విషాద చరిత్ర సైతం మనదే. నాటి ఆదిమ మానవుడు జీవనం కోసం వేటాడడం మెదలు నేటి ఆదునిక మానవుడి ఖండాంతర యానం వరకూ ప్రతీది తను చేసే పని ఆదారంగానే పరిణామక్రమం కొనసాగింది, అది కొనసాగుతూనే ఉంటుంది కూడా. పనే లేకుంటే ఈ ప్రపంచం లేదు. సృజనాత్మక ఆవిష్కరణలతో ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించిన పని కొందరిదైతే, ఆ ఆవిష్కరణలతో తమ జీవనాన్ని సరళికృతం చేసుకొని తమతో పాటు తమ సమాజాన్ని అభివృద్ది చెసిన పని అందరిది. ఇలా కేవలం ఆహార సంపాదనే ముఖ్యమైన పనిగా ఉన్న దశనుండి శాఖోపశాఖలుగా విస్తరించి, ఈ పనిలో చూపించే నైపుణ్యాల ఆదారంగా వారి వారి ఆర్థిక, సామాజిక స్థితిగతుల్ని మార్చుకునే స్థాయి వరకూ పని పరిణామం చెందుతూ వచ్చింది. ఐతే రాను రాను పని అనేది కేవలం సంపదని సృష్టించుకునే ఒక భౌతిక సాదనంగానే చూడడం మెదలైన నాటినుండి దీనికి అనేక రకాల జాడ్యాలు అంటుకున్నాయి. కేవలం ప్రాపంచికమైన విషయాల సాదనగానే పని మిగిలిపోయింది. ప్రభుత్వోద్యోగమే పరమావది అన్నా చందంగా తయారైంది. అలా ఇప్పుడు ఈ పనిని కల్పించడం అనేది ఒక రాజకీయ వస్తువుగా రూపాంతరం చెందింది. అధికార, విపక్షాలు పరస్పర విమర్శలు చేసుకోవడానికి అంశీభూతమవుతుంది. పని కల్పించడం కేవలం ప్రభుత్వాల పనే అనేంతగా మన మెదళ్లలో విషబీజాలు నాటుతున్నాయి నేటి రాజకీయాలు. ఉన్నత విద్యాభ్యాసం ముగించుకొన్న ప్రతీ ఒక్కరికి ప్రభుత్వమే పని కల్పించాలి అనే విపరీత దోరణి రాజకీయ విమర్శల్లో కన్పిస్తుండడం విచారకరం. ఇది కనీస ఆచరణ సాద్యం కాదనే అసలు నిజం వారికి తెలిసినా, అభూత కల్పనలైన వాదనలతో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పైచేయి సాదిస్తున్నామనే భ్రమలో యువకుల మెదళ్లని ఎంత విషపూరితం చేస్తున్నారో వారు గ్రహిస్తున్నారా? ప్రభుత్వోద్యోగమే సర్వరోగ నివారిణి, సంజీవని అనే ఈ మాటల ద్వారా చదువుకున్న వ్యక్తి సామర్థ్యాల్ని కుదిస్తున్నామన్న నిజాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? కేవలం కొన్ని ఉద్యోగాలే ఉన్న ఈ సెక్టార్లో విపరీతమైన పోటీని పెంచి తద్వరా యువత ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నదెవరూ? ఇలా కేవలం ప్రభుత్వోద్యోగమే చాలని అనుకుంటే ఐన్ స్టీన్, స్టీపెన్ హాకింగ్, సచిన్ టెండుల్కర్, విశ్వనాథన్ ఆనంద్, బాలసుభ్రమణ్యం, బిల్ గెట్స్, స్టీవ్ జాబ్స్, జుకర్ బర్గ్, అంబానీ, టాటాలు పుట్టేవారా? నేడు వేలమందికి దైవ సమానమైన పనిని కల్పించేవారా? అందరూ ప్రభుత్వోద్యోగాలే ఎంచుకుంటే నవీన ఆవిష్కరణలు ఎవరు చేయాలి? కోటానుకోట్ల మానవులకి అవసరమైన అనేక ఉత్పత్తులు ఏలా సాద్యం? ఇంతటి ముఖ్యమైన విషయాల గురించిన ఆలోచన లేకుండా రాజకీయాలు కొనసాగుతుండడం మన దురదృష్టం, నిజానికి ఈ సమయంలో చేయవలసింది కసితో పనిచేసే యువతకి సరైన మార్గదర్శనం, వారిలో ఉన్న అంతులేని జ్ణానతృష్ణని వెలికితీసి, అనేక రంగాల్లో ఎదగడానికి ఉన్న అవకాశాల్ని పరిచయం చేయడం. ఉరకలేసే వారి ఉత్సాహానికి ఊతకర్రలా నిలబడి సాయం చేయడం. ప్రభుత్వోద్యోగంలో దొరికే సౌకర్యాలని అన్ని రంగాల్లో కల్పించేలా పోరాటాలు చేయడం. సమాజంలోని వ్యక్తుల వికాసాన్ని పెంచి వారి దృక్పథాలు మార్చి నవ సమాజం దిశగా తీసుకెళ్లే విద్యని అభ్యసించిన యువకులకి అవకాశాల్ని వెతుక్కునే సామర్థ్యం ఉందని తెలియజెప్పడం. వారిలోని నైపుణ్యాలని పెంచి అనేక రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలి. కేవలం దాదాపు నాలుగు లక్షల మంది మాత్రమే అవసరమైన ప్రభుత్వ శాఖల్లో నాలుగున్నర కోట్ల తెలంగాణ బిడ్డలకు అవకాశం ఎలా ఇవ్వగలం అనే వాస్తవికతను అర్థం చేసుకోవాలి. విమర్శలే ఎజెండాగా ముప్పైవేల ఉద్యోగాలే ప్రభుత్వం భర్తీ చేసింది. లక్ష ఉద్యోగాలేవీ అనే కోణాన్ని... ప్రైవేట్ రంగంలోని అపార అవకాశాలని తెలియజెప్పే దిశగా మార్చుకోవాలి. ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక రంగాల్లో పెరిగిన ఉద్యోగ అవకాశాల్ని, వాటిలో పనిచేసుకొని జీవనం కొనసాగిస్తున్న లక్షలమంది ఉన్నారనే అభయాన్ని ఇవ్వాలి. అదేసమయంలో శ్రమదోపిడి జరుగుతున్న రంగాల్లో వాటిని అడ్డుకోవడానికి ఉన్న అవకాశాల గురించి అన్వేషించాలి. ఇవన్నీ ఒక్కరోజులో జరిగే మార్పులు కావు, కానీ వాటి దిశగా నేటి నుండి మన కార్యాచరణ ఉండేలా జాగరూకత వహించాలి. యువకుల కలలకి రెక్కలు తొడగాలి. ప్రభుత్వోద్యోగాన్ని మించిన పనులెన్నో ఉన్నాయని చాటిచెప్పాలి. ఇదే ప్రజాపక్షం వహించే వారి ఎజెండా కావాలి. కృషితో నాస్తి దుర్భిక్షం.

గంగాడి సుధీర్, జర్నలిస్ట్.

9394486053

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి