శ్వాసిస్తుంటే ఆయువియ్యాల్సిన గాలి ఆపేస్తుంది
వర్షించాల్సిన మేఘం పిడుగుల్ని మోసుకొస్తూ
వెలుగుల్ని తుంచేసి కారుమబ్బులతో కమ్మేస్తుంది
అండగా చుట్టుకోవాల్సిన చేతుల్లో
ద్రుతరాష్ట్ర కౌగిలిలా నలిగిపోతూ
విషవలయం నన్నల్లుకుంటుంది
ఎముకల నుసిని చల్లుకుంటున్నాను మిగిలేది అదే కనుక
నా కోసం నేనెన్నుకున్న రాజ్యం
నానుంచి నన్ను లాక్కుంటుంది
పడేసే జీతపు మెతుకుల్ని ఏరుకొమ్మంటూ
ప్రశ్నించే తత్వాన్ని సమాది చేయమంటుంది
ఆకలికై ఆరాటపడే కడుపు
కన్నీళ్లు భరించే ఓపిక లేక
కుత్తుక తెగిపోతున్నా
కుయ్యిమని మూలిగే సాహాసానికి ఒడిగట్టలేకపోతుంది.
ఇది నాకై నేను రాసుకున్న మరణ శాసనం
ఇక నాకే అస్థిత్వం మిగలని దుర్లభ దుర్ధినం
బతకడమంటే....
బతకాలంటే....
అన్ని మూసుకొని, వచ్చింది తీసుకొని
వెళ్లిపోవాలంతే....
కనీసం
వెనుదిరగకుండా.....
కానీ...
రాజ్యం వెన్నుల వణుకు పుట్టిస్తున్న భయం
బలహీనమైన అణిచివేత అస్త్రాన్నే ఎన్నుకునే భయం
అల్పమైన నిఘాలనే నమ్ముకున్న భయం
కేవలం
నా చర్యలతో
నా ప్రశ్నలతో
నా దిక్కారంతో
మెదలైతే.....
దేవుడా...
ఆకలిని తట్టుకునే శక్తిని నాకివ్వు
అవమానాల్ని ఎదిరించే యుక్తిని నాకివ్వు
నన్ను నన్నుగా ఉండనివ్వు
నాలో ప్రశ్నల్ని బతకనివ్వు.
28, జులై 2021, బుధవారం
19, జులై 2021, సోమవారం
దుస్సాహస యాత్ర
ఏడ నుండి ఏడికి మన ప్రస్థానం
మహా ప్రస్థానాలే చిన్నబోయేలా ఎందుకీ దుస్సాహసం
దోపిడీకి, దొరతనానికి...., వంచనకు, వక్రీకరణలకు ప్రతీకలు వాళ్లు
పీడనకు, బానిసత్వానికి ఎదురెళ్లాం మనం
రోదనలు, ఆక్రందనలు దాటి స్వేచ్చా పతాకాలెగరేసాం
కష్టమో, నష్టమో, కలిమో, లేమో సు:ఖమో, దు:ఖమో మన కాళ్లపై ఇప్పుడిప్పుడే నిలబడుతున్నాం
మరేమైంది మన విచక్షణ
మరెక్కడిదీ ప్రేళాపణ
నేడు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే గుంటనక్కల పంచన ఎలా చేరదాం
నాడు పెద్ద మనుషుల ఒప్పందం పేరు చెప్పి మన నడ్డీ విరిచిన గతాన్నెలా మరుద్దాం
మంచితనమా.... అతిమంచితనమా.... లేక కొందరి అవకాశ రణమా.....
ఎక్కడిదీ దుర్బుద్ది, ఏమిటి ఈ దురవస్థ, ఏ చీకట్లోకి ఈ నినాదం
అవును అతను చేశాడు
ఎంతో కొంత చేశాడు
ఎక్కడ్నుంచి చేశాడో మనకెందుకు
ఎనకటోనికన్నా ఎంతో కొంత చేశాడు
అవును అతను పాలితుడు
మనం పాలితులం.....
సంక్షేమం మాటున అతని కోశాగారం ఎంత నిండిందో తెల్వదు కానీ
ఎంత కొంత మన ఆయాసం తీరింది, భారం తగ్గింది
కానీ....
దేనికోసమైతే శ్వాసను ఉగ్గబట్టుకొని మన బిడ్డలు ఉరికొయ్యలు ఎక్కారో...
దేనికోసమైతే తరాలుగా పోరాటాలనే వారసత్వంగా తండ్రులు అందించారో....
ఆ నినాదం కాదు కదా.... తెలంగాణ అనే పేరునే అతను ఈసడించాడు.
అవసరమైతే కొన్నాడు, అడ్డొస్తే తన గతాన్ని రుచి చూపించాడు...
మొత్తానికి నేతల్ని వశబర్చుకొని విజేతయ్యాడు.
పద్నాలుగు సొరంగాల్లోంచి క్రుష్ణమ్మను తరలించాడు
పదివేల వెంచర్లతో బాగ్యమ్మను అమ్మేసాడు
అన్నింటికీ మించి తెలంగాణ అన్న పదమే నిషేదించాడు
ఈ వారసత్వమేనా మనకు కావాల్సింది
దీనికోసమా మనం పోరాల్సింది
ఏడి నుండి ఏడకు బోదాం
ఏది మన ఐలమ్మ రోషం
ఏది మన బీమన్న రక్తం
జై తెలంగాణ..... జై జై తెలంగాణ
అందరూ అనొచ్చు
కానీ దాని సర్వహక్కులూ నావే
ఈ గడ్డపై పుట్టి ఈ గడ్డలో కలిసే నావి మాత్రమే.....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)