శ్వాసిస్తుంటే ఆయువియ్యాల్సిన గాలి ఆపేస్తుంది
వర్షించాల్సిన మేఘం పిడుగుల్ని మోసుకొస్తూ
వెలుగుల్ని తుంచేసి కారుమబ్బులతో కమ్మేస్తుంది
అండగా చుట్టుకోవాల్సిన చేతుల్లో
ద్రుతరాష్ట్ర కౌగిలిలా నలిగిపోతూ
విషవలయం నన్నల్లుకుంటుంది
ఎముకల నుసిని చల్లుకుంటున్నాను మిగిలేది అదే కనుక
నా కోసం నేనెన్నుకున్న రాజ్యం
నానుంచి నన్ను లాక్కుంటుంది
పడేసే జీతపు మెతుకుల్ని ఏరుకొమ్మంటూ
ప్రశ్నించే తత్వాన్ని సమాది చేయమంటుంది
ఆకలికై ఆరాటపడే కడుపు
కన్నీళ్లు భరించే ఓపిక లేక
కుత్తుక తెగిపోతున్నా
కుయ్యిమని మూలిగే సాహాసానికి ఒడిగట్టలేకపోతుంది.
ఇది నాకై నేను రాసుకున్న మరణ శాసనం
ఇక నాకే అస్థిత్వం మిగలని దుర్లభ దుర్ధినం
బతకడమంటే....
బతకాలంటే....
అన్ని మూసుకొని, వచ్చింది తీసుకొని
వెళ్లిపోవాలంతే....
కనీసం
వెనుదిరగకుండా.....
కానీ...
రాజ్యం వెన్నుల వణుకు పుట్టిస్తున్న భయం
బలహీనమైన అణిచివేత అస్త్రాన్నే ఎన్నుకునే భయం
అల్పమైన నిఘాలనే నమ్ముకున్న భయం
కేవలం
నా చర్యలతో
నా ప్రశ్నలతో
నా దిక్కారంతో
మెదలైతే.....
దేవుడా...
ఆకలిని తట్టుకునే శక్తిని నాకివ్వు
అవమానాల్ని ఎదిరించే యుక్తిని నాకివ్వు
నన్ను నన్నుగా ఉండనివ్వు
నాలో ప్రశ్నల్ని బతకనివ్వు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి