3, నవంబర్ 2021, బుధవారం

గెలుపు ఈటెలదా....? బీజేపీదా...?

 

వ్యక్తి ఎవరైన సరే, వ్యవస్థ ముఖ్యం ఇది బారతీయ జనతా పార్టీ చెప్పుకొనే మౌళిక సూత్రం, సిద్దాంత ఫరంగా జై శ్రీరామ్, హరేక్రుష్ణ అంటూ ఒకరిద్దరు దేవుళ్లని ప్రభలంగా వినిపిస్తూ హైందవమే మా నినాదం అని బహిరంగంగా చెప్పుకొనే పార్టీ, నాడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ నుండి నేటి జే.పి. నడ్డా వరకూ సామాన్యులే మా పార్టీ రథ సారధులు అని చెప్పే పార్టీ, ఒకప్పుడు ఆర్ఎస్ఎస్లో దాని అనుబంద సంస్థల్లో పనిచేసిన వారికే పెద్ద పీట వేసిన పార్టీ, నిన్నటి ఉప ఎన్నికల్లో హుజురాబాద్లో విజయం సాధించింది, ఐతే ఈ గెలుపుకు అభినందించాల్సింది బీజేపీనా....? లేక అక్కడ పోటీ చేసి గెలిచిన ఈటెలనా....? సామాన్యుల మదిని తొలుస్తున్న ఈ ప్రశ్నకు సమాదానం మాత్రం బీజేపీ నాయకత్వానికే ఎక్కువ అవసరం, ఈ ఉప ఎన్నికలకు బీజం పడ్డది ఈటెల రాజేందర్ మంత్రివర్గంనుండి భర్తరఫ్ అయిన తర్వాత, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించిన తర్వాత, అప్పుడు ఈటెల ఉన్నాడు, బీజేపీ లేదు. తదనంతరం ఈటెల కొంతకాలం వరకూ ఒంటరిగానే ఉన్నాడు అప్పుడూ బీజేపీ లేదు, ఇక తర్జనభర్జనల అనంతరం బీజేపీ గూటికి చేరాడు, కానీ అప్పటి నుండి ప్రచారం ముగిసేంతవరకూ పేరున్న బీజేపీ జాతీయ నాయకులెవరూ హుజురాబాద్ వైపు చూడలేదు, ఈ రసవత్తర పోరు సాగుతున్నప్పుడే నిర్మల్కి వచ్చిన అమిత్ షా, హుజురాబాద్ మీదుగానైనా పోలేదు, తమ పార్టీ నినాదమైన జై శ్రీరాం అన్న మాటని ఒక్కసారి పలుకకుండా హుజురాబాద్లో ఈటెల గెలిచాడు, పార్టీ ముఖ్య నేతలెవరూ మీదేసుకొని  ప్రచారం చేసిన దాఖలాలు లేవు, పార్టీ ప్రచార వ్యూహాల్లో ఎప్పుడూ ఉండే మతం అన్న అంశం వినబడలేదు, పోనీ కేంద్ర ప్రభుత్వ విదానాల గురించి చర్చ జరగలేదు, పదే పదే టీఆర్ఎస్, కాంగ్రెస్ కు సంబందించిన నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాల్ని ఎండగడుతూ హుజురాబాద్ కోసం ఏం చేస్తారు, రైతు వ్యతిరేక చట్టాలపై ఏమంటారు, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల్ని ఎలా వెనకేసుకొస్తారు అని బీజేపీని లాగే ప్రయత్నం చేసినా, ఈటెల చాక చక్యంగా ఆ ఊబీలోకి వెల్లలేదు, పార్టీ అనేది జెండా ఎగరడానికి ఊతంగా ఉండే ఊతకర్రే అన్న మాదిరిగా ఏనాడు పార్టీ గురించి చెప్పలేదు, ఓటేయాల్సిన సింబల్గానే కమలం పువ్వు గురించి చెప్పారు. ఇవన్నీ ఎవరు ఔనన్నా... కాదన్నా.... అక్కడ ప్రచారం చేసిన బీజేపీ శ్రేణులకు తెలుసు, ఆ పార్టీ నాయకత్వానికి తెలుసు. ఒక జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారంతో పాటు సింహబాగం 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీని సైతం ఉప ప్రాంతీయ పార్టీ అని సంబోదిస్తున్న పార్టీ  ఇవాల ఒక ఉపఎన్నిక కోసం పార్టీనే పక్కన పెట్టి మన గుర్తు గెలిస్తే చాలు అని అనుకొన్నదా....? ఈ ప్రశ్నకు సమాదానం బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. నిజానికి ఈ దశకు బీజేపీ వచ్చి చాలా రోజులే అయింది. 2014లో మోడీని తెరపైకి తెచ్చినప్పుడే అన్ని పార్టీల మాదిరే బీజేపీ సైతం వ్యక్తిపూజకు ఆస్కారం ఇచ్చింది. అనంతరం జరిగిన ప్రతీ ఎన్నికల్లో గెలుపు క్రెడిట్ని పార్టీకన్నా ఎక్కువగా మోడి-షా ద్వయానికే అంటగట్టి వ్యక్తిపూజలోకి మెల్లమెల్లగా ఆ పార్టీ క్యాడర్ని సైతం దించింది. ఇప్పుడు వారికి కావాల్సింది పార్టీ గెలుపా, సింబల్ గెలుపా అనేది ముఖ్యం కానే కాదు. అధికారం. ఎస్ అధికారంలోకి రావడానికి అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్నీ వాడుకోవడం, ఇదే బీజేపీ నయా వ్యూహం, బయటకు మాకొక్కరికే సిద్దాంత భావజాలం ఉందని చెప్పుకున్నా, అధికారం కోసం సిద్దాంతాన్ని పక్కన పెట్టడానికి ఏమాత్రం ఆలోచించరని వారిని నిశితంగా గమనిస్తున్న వారికి అవగతమౌతుంది. అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో లోక్ సబ స్థానాన్ని కోల్పోయింది, పశ్చిమ బెంగాల్ సహా ఇతర చోట్ల అసెంబ్లీ ఉపఎన్నికల్లోనూ తీవ్రమైన ప్రతికూల గాలి వీచింది 30 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 7 మాత్రమే గెలిచింది, ఇలా ఉత్తరాదిని కోల్పోతున్న సంధీ దశలో ఎలాగైనా దక్షణాదిలో పాగా వేయాలి, 2024 ను ఎదుర్కోవాలంటే ప్రస్తుతం ఇంతకుమించిన వ్యూహం బీజేపీకి కనబడట్లేదు, అందుకే పార్టీ అధికారంలోకి రావడానికి మార్గాల్ని వెతకడమే తక్షణ కర్తవ్యం, అందుకోసం ఇతర పార్టీలోంచి వచ్చే వ్యక్తుల్ని అందలమెక్కించడానికి, అవసరమైతే వ్యక్తి పూజ చేయడానికి సైతం బీజేపీ వెనుకాడడం లేదు. కానీ భలమైన నాయకత్వం తమ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ పోతే, తెలంగాణలాంటి ప్రాంతాల్లో మౌళిక సిద్దాంతం ఆదారంగా ఏళ్లకేళ్లుగా పనిచేస్తున్న వారికి పార్టీలో ప్రాదాన్యం సంగతి దేవుడెరుగు ప్రాతినిధ్యం లేని పరిస్థితులు వస్తాయి. అప్పుడు పార్టీనా....? వ్యక్తా....? అన్న ప్రశ్నలు ఉదయిస్తాయి. వీటికి సమాదానం ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రమే అవుతుంది. అప్పటికైనా గెలిచింది ఈటెలా....? లేక బీజేపీనా.....? అనేది ఒక సమాదానంలా నిలుస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి