5, జనవరి 2020, ఆదివారం

వివక్ష - కథ


వివక్ష
రోజులు వేగంగా గడుస్తున్నాయి, చల్లటి చలిగాలులకి ఆరింటికే నట్టనడిరాత్రి చీకట్లు కమ్ముకుంటున్నాయి, అలా తెల్లారిందో లేదో ఇలా రాత్రి ముంచుకొస్తున్నట్టుగా అన్పిస్తుంది, అన్ని సవ్యంగా ఉన్నవారికి ఇది అద్బుతంగా అన్పించవచ్చు, కానీ ఇంత వేగంగా నడుస్తున్న కాలంలోనూ నా జీవితం మాత్రం భారంగా గడుస్తూ ఉంది, రేపటిని తలుచుకుంటూనే బెంగ పట్టుకుంటుంది, అలవాటుగా ఇంట్లో నాన్న ఏమైనా తీసుకొస్తాడని ఎదురు చూస్తున్న పిల్లలకి గత నెల రోజులుగా మెఖం కన్పించకుండా వాల్లు పడుకున్నాక ఇంటికి వెళ్తున్నాను, ఏం తెచ్చావ్ నాన్నా అనే వాళ్ల ప్రశ్నకి సమాదానం చెప్పలేక, హైదరాబాద్ వచ్చిన పదిహేనేళ్ల తర్వాత కూడా నేనేం సాదించాను అనే ప్రశ్నని నాకు నేనే వేసుకోలేకపోవడం నా చేతగాని తనమా లేక నన్నిలాగే ఉంచిన ఈ వ్యవస్థ లోపమా అనేది అర్థం కావట్లేదు, ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ.... నా పేరు మహిపాల్ రెడ్డి మాది మానేరు నదీ పక్కనే ఉన్న అందమైన గ్రామం ఆవునూరు, సిరిసిల్లకి కూతవేటు దూరంలో చక్కని పాడిపంటలతో నిర్మలమైన మనుషులున్న గ్రామం, స్కైలాబ్ పడ్డాక రెండేళ్లకి పుట్టానంట నేను, భూమ్మీద మనుషులెవరూ బతకరనుకొని స్కైలాబ్ పడడానికి ముందే అందినకాడికి వండుకు తిన్నారంట అప్పట్లో... ఆ గండం దాటి పుట్టాను కాబట్టి మల్లీ పాత రోజుల్లోలా మహిలో రెడ్డి రాజ్యాన్ని స్థాపించాలనే ఆశతో మహిపాల్ రెడ్డి అని పేరు పెట్టాడంట మా పెదతాత నాకు, వాళ్ల ఇల్లు మా ఇంటి పక్కనే ఉండేది మాతాతలు నాతో కలిసి బతికిన కాలం కొంచెమే అయినా.. పెద తాత ఇంట్లో కర్ణాలు, మునసబులు, గ్రామ పెద్దలు అంతా ఆయన పక్కనే కూర్చొని దర్జా ఒలకబోస్తుంటే... తాత చెప్పేది శ్రద్దగా వినే పాలేగాల్లు దూరంగా చేతులు కట్టుకొని గుమ్మం భయటే ఎందుకు కూర్చున్నారనేది అంతగా అర్థం కాకపోయేది, ఇంట్లో రెండు గ్లాసులు, ఆచారాలు, మడికట్లు చతుర్వర్ణ వ్యవస్థని నిక్కచ్చిగా పాటించే ఆయన జీవనం తెలిసీ తెలియని వయసులో అంతగా అర్థమయ్యేది కాదు, రెండు మూడేళ్లు వచ్చాక మా ఇంటికి రెండు వాడల ఆవతల ముదిరాజులు, యాదవుల ఇండ్లుండేటివి అక్కడి పిల్లలు మేము కలిసి మా ఊరి పెద్ద చెరువు వరకీ వెళ్లి కోతి కొమ్మచ్చి, తొక్కుడు బిల్లా, సిర్ర గోనే ఆటలు ఆడుకునేటోల్లం ఇలా ఆడుకునేటప్పుడు ఒకరింట్లలోకి ఒకరం ఆడుతూ పాడుతూ గెంతుతూ పరుగెత్తే వాళ్లం, వాల్లిండ్లకి వెల్లినప్పుడు పటేలు ఇంటికొచ్చిండు అంటూ గౌరవంగా చూసేవాళ్లు, అదే వాళ్లు మా ఇంటికి వచ్చినప్పుడు పెద్దింట్లో వరకీ వచ్చినా వంటింట్లోకి మాత్రం వచ్చేవారు కాదు, అదే మా పెద తాత గుమ్మంలోకి కూడా పొరపాటున వచ్చేవారు కాదు, అప్పుడప్పుడు మా పెద తాత అంత దూరం పోయి ఎందుకు ఆడుతున్నావ్, ఇక్కడే మనవాల్లతోనే ఆడుకో అని తిడుతుంటే అర్థమయ్యేది కాదు, దూరం పోతే అజాగ్రత్తగా ఉంటామని అంటున్నాడేమో అని అనుకునేటోన్ని, ఆ కాలంలోనే మా ఊర్లో పదో తరగతి దాక బడుండేది, అట్లనే మా ఇంటిదగ్గరే నాలుగోతరగతి వరకూ రంగాచారి బడుండేది, ఆరో ఏట నేను బడికి పోవుడు, మా తాతలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు కాలం చేసుడూ ఒకేసారి జరిగిపోయాయి, అలా ఆటపాటల స్థానంలోకి కొంచెం చదువు వచ్చి చేరింది, కాలం గడుస్తున్నా కొద్ది మా ఇంట్లోకి సైతం నా స్నేహితులు వడివడిగా వచ్చేవారు, అయితే పండగలప్పుడు, నోములప్పుడు మాత్రం వంటిట్లోకి రాకపోయేవారు, తర్వాత్తర్వాత పెద్దబడికి మారింది మా చదువు, అక్కడికి ఊర్లోని అందరు పిల్లలూ చదువుకోవడానికి వచ్చేవారు, మా ఊరికి దూరంగా తుర్కపల్లిలో మాదిగ కులానికి చెందిన వారు ఎక్కువగా ఉండేవారు, పెద్దబడిని ఆనుకొని మాలవాడ ఉండేది అక్కడినుండి మా పెద్దబడికి పిల్లలు చదువుకోవడానికి వచ్చేవారు, ఇంకా చుట్టుపక్కల ఊర్లకి మా ఊరే సెంటర్‌గా ఉండడంతో లచ్చపేట, కట్కూరు, పదిరల నుండి పిల్లలంతా వచ్చి చదువుకునేటోల్లు, అందరికీ ఒకే రకం యూనిఫామ్‌తో సీతాకోకచిలుకల వనంలా ఉండేది మా స్కూలు, ఏ రోజు ఎట్లున్నా... జెండా మందిరం రోజు మాత్రం అందరం కొత్త బట్టలతో ఒక కొమ్మకు పూచిన పూవుల్లా ఉండేవాళ్లం, ఈ లోగా మా బాబాయిలు, అత్తలు ఎవరి కాపురం వాల్లు పెట్టడంతో ఒకే ఊర్లో ఉన్నా ఎవల ఇంట్లో వాళ్లు ఎవల పొలాలు వాల్లవీ అన్నట్టుగా సాగుతుండేది జీవితం, పదోతరగతికి వచ్చేసరికి మాతాత ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఇంటి పరిస్థితుల్లో తేడాలు స్పష్టంగా తెలుస్తున్నాయి, వర్షాలు సరిగ్గాలేక, పంటలు సరిగ్గా పండక, వ్యవసాయం తప్ప మరే ఉపాది లేక, అడ్డగోలు బోర్లు, అడ్డమైన దళారీలు ఇలా మోతుబరి కుటుంబం కాస్తా ఓ మోస్తరు కుటుంబానికి దిగజారింది. కొంచెం పలుకుబడి కల్గిన ఆసాములు మాత్రం అప్పుడప్పుడే మెదలైన యాంత్రీకరణని వాడుకొని, ఆర్థిక సరళీకరణలో అవకాశాలని అందిపుచ్చుకుంటూ ఆర్థికంగా మరింత ఉన్నతి సాదించి రాజకీయం అనే కొత్త పాత్రలోకి మారిపోయారు. ఈ పదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి, నరిగాడు, భీంరాజుగాడు, రాజిరెడ్డిగాడు, దోరోల్ల సులక్ష్మన్ అనే తేడాలైతే తొలిగిపోయాయి, మా ఇంట్లో అందరం కలిసి సరదాగా చదువుకొనేటోళ్లం. మాల వాడల్లో.. మాదిగ పల్లేల్లో పెద్ద తేడాలైతే ఏం రాలేదు, చిన్నప్పుడు నేను ఎట్లాగైతే చూసానో ఇంచుమించు అలాగే ఉంది, అయితే చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న కొందరి గుడిసెల స్థానంలో కొన్ని దాబాలు, తారురోడ్లు, కొంత మంది ప్రభుత్వ సాయంతో పొలాలు కొనుక్కొని వ్యవసాయం చేస్తున్న ఇంకా ఎనబై శాతం మాత్రం అలాగే ఉండిపోయారు. నేను చదువులో మరీ మెరిట్ స్టుడెంట్ కాకపోయిన డల్ స్టూడెంట్‌ని మాత్రం కాదు, నిజానికి ఆ కాలంలో పదోతరగతి పాసవడమే కొంచెం గొప్ప అన్న పరిస్థితులని మా స్కూలు అదిగమించింది, ఇంచుమించు ఒకరిద్దరు మినహా మేమంతా పదోతరగతి పాసయ్యాము, నాకు మాత్రం డాక్టర్ చదవాలని తెగ ఆరాటంగా ఉండేది, ఎందుకంటే మా ఇంటిపక్కనే అయ్యగారు మందులిస్తూ చాలా మంది రోగాల్ని నయం చేసేవాడు, నేను కూడా అలా చేయాలి అనుకునేవాన్ని, అందుకే సిరిసిల్ల కాలేజిలో బైపీసీకి అప్లై చేశా, నా ప్రెండు నరిగాడు కూడా బైపీసీకే అప్లై చేశాం, అయితే ఇద్దరి మార్కులు సమానమే అయినా వాడికి సీటొచ్చి నాకు రాలేదు, ఎందుకు అనే ప్రశ్నకి నాకొచ్చిన సమాదానం నువు ఫార్వర్డ్ కాస్ట్ అతను బ్యాక్వార్డ్ క్లాస్ అందుకే రాలేదు అని, దీంట్లోని సామాజిక న్యాయాన్ని అర్థం చేసుకునేంత వయసు కాదు, నాకున్న పరిజ్ణానం అందుకు అప్పుడు సరిపోదు. కానీ తొలిసారిగా ఇన్నేళ్లు నా సహోదరులు ఎదుర్కొన్న వివక్షత ఎలా ఉంటుందో నా మనసుకి అర్థమయింది, అప్పుడప్పుడే ఏర్పడిన ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో చదివించే స్థోమత నుండి నా కుటుంబం దిగజారిపోయింది. అలా చదువుకుంటున్న ప్రతీ దశలోనూ రిజర్వేషన్ల వల్ల నేను కోల్పోతున్న ఒక్కో అవకాశం మా పెద తాత ముందు గుమ్మం బయట చెప్పులు విడిచి నిలబడిన ఒక్కో కుటుంబం పొందుతుందనే భరోసా కలిగేది. ఇలా ఉన్నతవిద్యాబ్యాసం సాగిన ఏడేళ్లు నా ఆలోచనా పరిది విస్రుతవుతున్న కొద్ది తరానికి సంబవించే మార్పులు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో నెలల్లో సంబవిస్తున్నా.... నాడు నా పూర్వీకులు చూపిన వివక్షత ఇంకా మమ్మల్ని వెంటాడటం మానలేదన్పిస్తుంది. దీనికి తోడు ఈ ఏడేళ్లలో వ్యవసాయం సరిగ్గా సాగక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇంట్లో చెళ్లెల్ల పెండ్లీల్లు చేసి నా కుటుంబం ఉన్నదంతా అమ్మి అప్పుల్ని తీర్చుకొని, అప్పటివరకూ దర్జాగా బతికిన అదే ఊరిలో కూలీ పనులకి వెళ్లలేక నాతో పాటు హైదరాబాద్ వచ్చి స్థిరపడడం ఒకేసారి జరగడం యాద్రుచ్చికమో విది ఆడిన వింత నాటకమో అర్థం కాదు కానీ ఎడమని కుడికి తీసుకురావడం కోసం బాలెన్స్ చూపించాల్సిన విదానాలు తిరిగి కుడిని ఎడంగా ఎక్కడో అద:పాతాళానికి దిగజార్చుతున్నాయనే నిజాన్ని తెలుసుకోకపోవడం మర దురదృష్టం , కన్స్ర్టక్షన్ కంపెనీలో సూపర్ వైజర్‌గా మా నాన్న, ప్రైవేట్ మీడియాలో ఉద్యోగిగా నేను, సాప్ట్ వేర్ కంపెనీలో మా తమ్ముడు ఒకేసారి ఈ మహానగరంలోని మాయాబజార్లోకి అడుగుపెట్టడం జరిగిపోయింది. అన్యాయం చేసైనా.. అబద్దం ఆడైనా.. బాగుపడే సగటు రాజకీయ తత్వంలేని మామూలు మనుషులం... పొట్లాడైనా....పోటీపడైనా....సాదించేంత చేవ లేనోళ్లం, సర్థుకుపోయి బతకడమే తెలిసిన సామాన్య మానవులం మేం, ఇలాగే మమ్మల్ని వదిలేస్తే... ఇంకో వందేళ్లకి మైనార్టీగా మిగిలే మాకోసం చట్టాల్ని సవరించినా ఇదో చక్రభ్రమణమే కానీ ఉపయేగం శూన్యం. భారత రాజ్యంగ మౌళిక సూత్రానికి విరుద్దంగా జరుగుతున్న ఈ తంతుని ప్రశ్నించడానికి ముందుకు రాని సమాజాన్ని, తమ అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి నటిస్తున్న రాజకీయ వ్యవస్థని, మౌళికమైన ఈ సూక్ష్మాన్ని పసిగట్టలేని న్యాయ వ్యవస్థని నేనేం అడగను, ఎందుకంటే... ప్రైవేటు ఉద్యోగమంటేనే భద్రతలేనిదనే సమాజంలో బతుకుతూ నెల రోజుల క్రితం ఉద్యోగంలోంచి తీసేసిన యాజమాన్యాన్నే ప్రశ్నించలేని మిడియా రంగం నాది. అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి, ముప్పైవేల జీతానికి ఒక్కణ్నే ఎందుకు ముగ్గురు అందుబాటులో ఉన్నప్పుడు అనే వ్యాపార సూత్రాన్ని యాజమాన్యాలు పాటిస్తున్నప్పుడు ఎవర్ని మాత్రం ఏమనగలం. ఇదంతా కాదు, అసలు రేపటి భవిష్యత్తుపై భయంతో బతకడం ఎంత దుర్బరమో అవగాహనకొస్తుంది. అయితే అప్పుడు నాతో పాటు చదువుకోని అయిలయ్య ఇంకా అదే ఊర్లో అదే కూలీ చేసుకుంటూ బతుకుతున్నాడు, రిజర్వేషన్ ఇచ్చిన అస్త్రాన్ని వాడుకొని పైకొచ్చిన నారాయణస్వామి లాంటివాళ్లు ఇప్పుడు నా ఇంటికి ఓనర్ అయ్యాడు. ప్రభుత్వోద్యోగం చేస్తూనే.... రాజకీయ ప్రోద్బలంతో భార్య పేరున కంపెనీలు నిర్వహిస్తున్నాడు, కొడుకుని కార్పోరేటర్‌గా గెలిపించుకున్నాడు, పరిపూర్ణంగా తనతోటి వాళ్ల అవకాశాలని కూడా వాడుకుంటున్నాడు. పదేళ్లలో ఈ వివక్షతలని దూరం చేయాలన్న మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని నెరవేర్చలేని నేతలు 2020 జనవరితో ముగియాల్సిన రిజర్వేషన్లని మరో పదేళ్లు పొడిగిస్తూ చట్టం చేశారనే వార్తే చివరగా నేనందించిన వార్త, అంతకుముందే అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల వార్త చూసినప్పుడు ఎంత నవ్వొచ్చిందో ఇదీ అలాగే అన్పించింది. ఇంత జరిగీ 21వ శతాభ్దంలో కృత్తిమ మేధ ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తున్నా నేటికి అవసరమైన చట్టాల్ని సమగ్రంగా రూపొందించలేకపోవడం కొంచెం వింతగానే ఉంది, కొండ నాలికకి మందేస్తే ఉన్న నాళిక ఉండిందన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ గందరగోళానికి పనిలేకపోవడం కూడా తోడవడంతో నిరంతరం అవే ఆలోచనలు. ఇంతలో సంక్రాంతి పండగ రావడంతో ఊరెళ్లాను, కొంచెం ప్రశాంతంగా అనిపించింది, రేపటి గురించిన చింత లేకుండా హాయిగా అన్పించింది, బీంరాజు ఊళ్లొకెళ్లగానే ఎదురయి, ఎప్పుడ్రా రావడం సాయంత్రం జున్ను తెస్తాను తింటూ కబుర్లు చెప్పుకుందాం అన్నాడు. సరేరా అంటూ ఇంట్లోకి వెళ్లాను, చుట్టుపక్కల వాల్లతో మాట్లాడుతుంటే బతుకుమీద కొంచెం ప్రేమ కలిగింది, నాకోసం నా అనేవాళ్లు ఉన్నారనే దైర్యం కలిగింది. పట్నం వెళ్లాక ఎలాగైనా బతకగలననే దైర్యాన్ని ఇచ్చింది మా ఊరు. పాలకేంద్రానికి పాలు తెస్తూ జున్ను తీసుకొని ఇంట్లోకొచ్చాడు బీంరాజు, ఇద్దరం తింటూ మంచంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో బీంరాజు తండ్రి వచ్చి అదేంట్రా పటేల్ పక్కన కూర్చున్నావ్ కొంచెం దూరంగా కూర్చో అంటూ పాల కాన్ తీసుకొని కేంద్రానికి వెళ్లిపోయాడు. బీంరాజు పడుతున్న ఇబ్బంది అర్థమయి మాట మార్చుతూ కబుర్లు చెప్పడం మెదలెట్టాను, బీంరాజు వెళ్లాక అన్పించింది, ఒక్క జీవితానికే ఈ వివక్షని అందులో సామాజిక వెలి లేని ఆర్థిక పరమైన వివక్షనే నేను తట్టుకోలేకపోయాను. ఇంకా అంతర్గతంగా వారిని వెంటాడుతున్న ఈ సామాజిక వెలిని వాళ్ల పూర్వీకులు ఎంత దారుణంగా అనుభవించారో.... సృష్టిలో ఏ జంతువు అనుభవించని క్షోభ కదా అది.

3, డిసెంబర్ 2019, మంగళవారం

సమ్మేhttps://epaper.v6velugu.com/m5/2474525/Darwaza-Sunday-Magazine/22-12-19#page/24/1

"ఏమైందే దనన్నా మంచి ఊపుమీదున్నవ్, ఏడికో పొద్దుగాల్లనే భయల్దేరినవ్, వరికోతకి అచ్చిందాయో, చూస్తంటే ఫాంటేసినవ్ గదా పొలంకాడికి గాదనుకుంటా.... మళ్ల ఆటోగూడ ఇంటెనుకనే పెట్టి బండి తీయవడ్తివి ఏడికి బోతున్నవ్ గింత పొద్దుగాల.." అని గ్యాప్ లేకుండా తనే ప్రశ్న తనే సమాదానం చెపుతూ మాట్లాడుతనే ఉన్నాడు వెంకటేశు, బండి స్టార్ట్ చేస్తూనే సమాదనం చెప్పిండు దనుంజయ్, "ఏం లేదురా నిన్నటి సంది మన ఆర్టీసోల్లు సమ్మే జేస్తుండ్రు గదా టెంపర్ వరీ డ్రైవర్లు గావాల్నంటా.. పోతన్నా.. గప్పట్ల లారీ నడిపిన లైసెన్స్ ఉంది నా దగ్గర రోజుకి పదిగేనువందలు ఇత్తరట, వరికోతకచ్చింది చేతుల పైసలు లేవు ఇంట్ల గూడ చిన్న చిన్న అవసరాలున్నయ్, కూలీ చేద్దామంటెనేమో ఇప్పుడు పనులు లెవ్వాయో ఉన్నా పదిగేనువందలు రావుకదా గందుకే సిరిసిల్ల డిపోకు నిన్నపోయి అప్లికేషన్ ఇచ్చచ్చిన రేపు ఎల్లుండి బతుకమ్మ, దసర పండుగలు గదా జర ఎక్కువ సేపుండాల్నంటా జల్ది రమ్మన్నరు గందుకే పొద్దుగాల్లనే పోతన్న, జర పొలందిక్కు పోతే నా చేను చూసిరా... నీళ్లు బంజేసిన గనీ గట్లే పక్కోల్లు ఇంక తడి పెడ్తాండ్రు దాంట్లకేంచి వత్తయోమో కనిపెట్టు" అనుకుంటనే బండి స్టార్ట్ చేసి వెల్లిపోయిండు. ఆవునూర్నించి సిరిసిల్ల బోయేసరికి ఆరున్నరయింది, డిపో మేనేజర్, ట్రాఫిక్ సూపర్వైజర్తో పాటు చాలా మంది పోలీసుల్లున్నరు, ఓ ముప్పై నలబై మంది సివిలోల్లున్నరు, అందరూ టెంపరరీ డ్రైవర్, కండక్టర్లు గావచ్చు  లోపలికిపోబోతుంటే దనుంజయ్ని ఆపేసిండ్రు. "సర్ నేను పాత సమ్మే డ్రైవర్ని కాదు టెంపరరీ డ్రైవర్ని నిన్ననే రమ్మన్నరు పండగ బస్సులు తియ్యాల్నట" అని సమాదానం చెపుతున్నప్పుడే లోపల్నుండి సూపర్ వైజరొచ్చి దనుంజయ్ కొత్త డ్రైవర్ అని పోలీసోల్లకి చెప్పి తీసుకొని పోయిండు, ఓరిజనల్ లైసెన్స్ తీసుకొని 'బస్సుల ముందుగాళ్ల నిండ మందిని ఎక్కించుకోండ్రి, జర బాగా స్పీడుగ పోకుండ్రి, నీ బండ్ల పోసిన డీజిల్ ఎంత అత్తదో మాకు తెలుసు మల్ల నువ్వు గీడికొచ్చినంకనే డీజిల్ పోసుకోవాల, ఎక్కడికి పోవాల్నో కండక్టర్ చెప్తడు, అన్నింటి కంటె ముఖ్యం దసరా పండగ తెల్లారి దాక అంటే ఈ నాలుగు రోజులు కంటిన్యూగా తప్పకుండా రావాలే నీకు రోజుకు పదమూడు పద్నాలుగు గంటలు డ్యూటీ ఉంటది, ఉంటా అంటే ఈడ్నే షెడ్ల పడుకో లేకుంటే ఇంటికి పోయిరా కని టైంకు రావాలే సమజైందా' అని సుద్దులు చెప్పి బస్సు తాళం ఇచ్చిండు కంట్రోలర్, 'సరే సర్ అన్ని జెప్పినవ్ గాని నాకిచ్చే పదిహేనువందలు ఎప్పుడిత్తరో చెప్పకపోతిరి' అని అడిగిండు దనుంజయ్, 'ఏ రోజుకారోజు నువు డిపోకి తిరిగి రాంగనే ఇత్తం, నీ పైసలు ఏడికి పోవు జర కండక్టర్ని ఓ కంట కనిపెడుతుండు, మా స్క్వాడ్ టీంలు ఆడ ఆడ ఉంటయ్ గని ఎంత మంది ఎక్కిండ్రో నువ్వే లెక్క జెప్పాలే' అని పంపించిండు,  తాళం తీసుకొని బస్సు దగ్గరికి పోయిండు దనుంజయ్, ఎక్స్ ప్రెస్ బస్సు అంటే ఎటో దూరం ఏసినట్టున్నరు అనుకున్నడు, బండి చుట్టూత తిరిగి టైర్ల గాలి చెక్ చేసుకొని డ్రైవర్ సీట్ల కూర్చున్నడు. మనసుల ఇష్ట దైవం ఎములాడ రాజన్నని మెక్కుకొని బండి స్టార్ట్ చేసిండు గురు గురు మనుకుంటనే మెదటి సారికే స్టార్టయింది, అంటే డిపోల కండిషన్ల ఉన్న బస్సుల్నే ఇస్తున్నరని అర్థమయింది గేరు వేసి కొంచెం ముందుకు కదిలించి బ్రేకులు చెక్ చేసుకున్నడు అన్ని మంచిగనే ఉన్నయ్ అని ఇంజిన్ ఆఫ్ చేద్దామనుకునే లోపల, 'అన్నా నమస్తేనే నాపేరు క్యారం శీను' అని బస్సు బోర్డు పట్టుకొని బానెట్ల పెట్టుకుంట పరిచయం చేసుకున్నడు కండక్టర్, ఏ ఊరే మీది అనంగనే  కొండాపూర్ అన్నా అంటూనే  మీది అన్నడు మాది ఆవునూర్ అగో ఎన్నడు ఇటేంకల కనిపియ్యలే ఏం జేత్తవే అని అడిగిండు, హైదరాబాద్‌ల వెల్డింగ్ షాపుల చేత్త అన్న పండుగని అచ్చిన, కానీ రోజుకు వెయ్యి రూపాయలనేసరికి దేనికన్న అయితయి గదా.. అని వచ్చినన్నా..చూద్దాం ఎట్లుంటదో కొత్త పని పోదామాయే ఇగ అన్నడు, సరే సరే ఎటుపోవాల్నే ఇంతకీ అన్నడు, ముందుగాళ కరీంనగర్ రెండు ట్రిప్పులెయ్యాలే అటెన్కా హైదరాబాద్ పోవాల్నో, కామారెడ్డి పోవాల్నో చెపుతరంట అన్నడు, సరే తియ్యని బండి స్టార్ట్ చేసి కొత్త బస్టాండ్ కొచ్చిండ్రు, అక్కడో నలుగురైదుగురు పాసింజర్లు వచ్చి ఎక్కిండ్రు ఒక ఐదునిమిషాలు అక్కడ ఆగి పాత బస్టాండ్ పోయేసరికి హలీడే కావడం వల్ల ఎక్కువ మంది లేరు, ఓ పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత మెత్తం మీద సగం కంటె ఎక్కువ నిండిన్రు, ఇంకొంచెం సేపు ఆపుదామనుకునే లోపల, లోపలున్న పాసింజర్లు ఒకటే గోల పోదాం పండ్రి మెత్తం నిండేదాక ఉంటరా ఏంది, గింతపొద్దుగాల్ల పనున్నోల్లే అత్తరు జల్ది పోవాలే తియ్యుండ్రి అంటూ సతాయిస్తున్నరు ఇంతల బస్టాండ్ కంట్రోలరొచ్చి ఇంకో బస్సు అత్తది ఇగ మీరు తియ్యుండ్రి అనంగనే బండి స్టార్ట్ చేసి పోతున్నడు దనుంజయ్, కొత్త పని, కొత్త మనుషులు, కొత్త అనుభూతి అన్నింటికన్నా ముఖ్యంగా నాలుగురోజులల్ల నాలుగువేల ఐదువందలొత్తయి అనేదే ఎక్కువ హుషారిస్తున్నది, మంచి జోష్‌లో బస్సునడపుతున్నడు, వెములాడల బస్సు పుల్లయిపోయింది, అనుకున్న టైం వరకి కరీంనగర్ చేరిండ్రు, టిఫన్ టైం అవడంతో, గతంలో ఆర్టీసీవాల్లు టిఫిన్ సెంటర్ల సెపరేట్‌గా పైసలు లేకుండా తినేది గుర్తొచ్చి, కండక్టర్ క్యారం శ్రీనివాస్‌ని తీస్కొని బస్టాండ్ల టిఫిన్ సెంటర్కెల్లి స్టాఫ్ అని చెప్పాడు, వాడు కొంత అనుమానంగా చూసే సరికి, అరే శీనన్నా జర నీ కాష్ బాగ్ చూపియ్యే మనం టెంపరరీ స్టాపనే ముచ్చట ఎరుకయితది ఈయనకి అంటుండగానే. కాష్ బాగ్ తీసి చూపించిండు కండక్టర్, అండ్ల అడ్డదిడ్డంగా ఉన్న చిల్లర పైసలు, మాసిపోయిన నోట్లు చూసి నిర్దారించుకొని టిఫన్ టోకన్ ఇచ్చిండు హోటల్ వ్యక్తి, అలా టిఫిన్ చేస్తూనే మూడురోజుల కింద  జరిగింది యాజ్జేసుకుంటుండు దనుంజయ్,
దనుంజయ్ ఒక మోస్తరు రైతే గతంలో లారీ డ్రైవర్‌గా పనిచేసిండు, ఆరోగ్యం పాడవడం, తెలంగాణా రావడం ఒకేసారి జరిగి ఏదైతే గదయితది ఊర్ల వ్యవసాయం చేస్కుంట బతుకుత అని వచ్చిండు, మోత్తానికి వానలు మంచిగ పడుడు, రైతుకి సాయం అందుడు సురువు అవుడుతోని లాగోడికి అప్పుల మెఖం చూడకపోయేసరికి ఉన్న మూడెకరాలల్ల యవసాయం చేసుకుంట, ఉన్నదాంట్ల ఉగాదికి బిడ్డ పెళ్లిచేసిండు, కొడుకుని సిద్దిపేట్ల డిగ్రీ చదివిత్తండు, అయితే గత యాడాదినుండి చేతికి రావాల్సిన పైసలు సరిగ రాక, బిడ్డ పెళ్లి అప్పులు పెరిగి, చిన్న చిన్నవాటికి కూడా అప్పులు అడుగుడు మెదలయింది, ఐదారేళ్లకిందటి లెక్కనే మల్ల బతుకు గాయి గాయి అయితదనే భయం పట్టుకుంది, ఇంకొక ఐదారేండ్లు గట్టిగ కష్టపడితే కొడుకు చేతికందుతడు, బిడ్డ గూడ కుదురుకుంటది అనుకొని అప్పులు చెయ్యకుండా ఉన్నంతల సగపెట్టుకుందామని నిర్ణయించుకున్నరు మెగుడు పెండ్లాం, అయితే కొత్తల్లున్ని దీపావళికి పిలవాలే, కొడుకు పరీక్షలకి డబ్బులు కట్టాలే, వరికోతకి కూలీలు గావాలే గివ్వన్ని కలిసి మల్లో పదిగేను ఇరవైవేల ఖర్చయితాంది, ఈ సారి పంట బాగానే ఉన్న సరైన సాయాలు అందక తెచ్చిన అప్పులు పెరిగిపోయి అవి కట్టడానికి పోను మల్ల పెట్టుబడికే సరిపోయేటట్టున్నది, ఇప్పటికి రంది లేకున్నా రాబోయే దినాలమీదైతే బెంగ మెదలయింది, గీ కష్టాలన్నీ చూసిండేమో దేవుడు సమ్మె సైరన్ ఊదిండు, దనుంజయ్ మల్ల డ్రైవింగ్ జేత్తా అంటే మెదట వద్దని అన్నది అతని భార్య, అయితే ఎంతలేదన్నా వారం రోజులు సమ్మే నడుస్తది ఓ పది పన్నెండు వేయిలత్తయి, ముందు అళ్లుని మర్యాదలు, పొలం కోత ఖర్చులు కలిసొత్తయి అని సముదాయించడంతో పాణం బాగలేకున్నా..డ్రైవింగ్ అంటే బుగులు అయితున్నా.. జాగ్రత్తలు చెప్పి సాగనంపింది దనుంజయ్ పెండ్లాం, దీర్ఘంగా ఆలోచిస్తున్న దనుంజయ్ని అన్నా ఏందే ఆలోచిత్తున్నవ్ అని శ్రీనివాస్ పిలవడంతో ఈ లోకంలోకొచ్చిండు, అప్పటికే కొంత చనువు ఏర్పడడంతో ఏంలేదు తమ్మి, ఏవో ఇంటి ముచ్చట్లు యాదికచ్చినయ్ అన్నడు, దానికి నవ్వుతూ శ్రీనివాస్ అవ్ అన్నా నేను గుడ దుబాయ్‌ల గిట్లే ఇంటిని యాజ్జేసుకుంట బతికేటోల్లం, అయినా అందరివీ గవే కథలు, అన్నీ అత్యవసరాలు అందుకే గదనే అందరు దసరా పండుగు జేసుకుంటుంటే మనం నౌకర్ చేయవడ్తిమి అని కొంత కలుపుగోలుగా మాట్లాడిండు.
  మెత్తానికి తొలిరోజు రెండు సార్ల కరీంనగర్, ఒకసారి హైదరాబాద్ పోయొచ్చే సరికి చాలా పోద్దుపోయింది, రాత్రి పదకొండు గంటలకి డిపోలో బస్సు పెడ్తూనే అకౌంటింగ్ సెక్షన్ దగ్గరికి వెల్లారు డ్రైవర్ కండక్టర్ ఇద్దరు, అప్పటికే అక్కడ ఒకరిద్దరు ఉండి కొంచెం ఏదో వాగ్వాదం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది, దనుంజయ్ అక్కడికి వెళ్తూనే ఏంటీ సంగతి అని అడుగుతే పట్టించుకోకుండానే  అంతా దొంగ లెక్కలు దొంగ నాయాల్లు అని గుణుగుతూ వెల్లిపోతున్నాడు టెంపరరీ లేబర్, ఆ బస్ నెంబర్ చెప్పుండ్రి, లెక్కలు చెప్పుండ్రి అని ఇవరాలు రాసుకొని డ్రైవర్‌కి వెయ్యి రూపాయలు, కండక్టర్‌కి ఏడువందల యాబై ఇచ్చిండు, అదేంటి పదిగేనువందలని, వెయ్యిత్తాండ్రు అని అడిగాడు దనుంజయ్, గదంతా మాకు తెల్వదు గియ్యల్టి లెక్కైతే గింతే ఇయ్యమన్నరు పెద్దసార్లు అనే సరికి మరి మిగతా పైసలు ఎప్పుడిత్తరు, గవన్నీ మాకు తెల్వయి అన్నడు అకౌంటెంట్, తీసుకునేటప్పుడు పదిగేనువందలని చెప్పుడేంది మల్ల ఐదువందలు మీరు నొక్కుడేంది గిదంత గలీజు దంద లెక్కుంది అని కోపంతో మాట్లాడుతుంటే, అకౌంటెంట్ గొడవకి దిగిండు గివ్వన్ని మాకు తెల్వదు, గీడ గిట్లనే ఉంటదిగని నోర్మూసుకొని పోండ్రి, అయినా కండక్టర్తోని కలిసి మీరు దొబ్బలేదా.. మాకు అప్పజెప్పన లెక్కలకెయి ఎంత నొక్కిండ్రో తెల్వదా మాకు నిన్నటి లెక్కలకి ఇయ్యాల్టికీ ఐదారువేలు తేడత్తోంది, మేమన్న అడిగినమా, మేమిచ్చింది ఏ మూలకు పోతది గదే మత్తుగుండే నడువుండ్రి, ఏదన్నుంటే రేపు మేనేజర్‌తో మాట్లాడుండ్రి అని దబాయించే సరికి, దనుంజయ్, శీను ఇద్దరు ఒకలి మెకాలొకలు చూసుకుండ్రు, ఓ వంద రూపాయల చిరుతిండ్లు తప్ప ఒక్క రూపాయి ముట్టకుంట తెచ్చి మోసపోయినమన్నా మనం గూడ గట్లనే చెయ్యాలే, ఈడ నియతున్నోనికి బతుకు లేదు అనుకుంట ఇంటి మెఖం పట్టిండ్రు, రేపట్నుంచి ఒకటే బండిమీద అద్దాం అన్నా కొండాపూర్‌ల కేయి ఆవునూర్ల నిన్నెక్కిచ్చుకుంట అత్తా అన్నడు సరే తియి అని ఇద్దరూ ఇంటికి భయల్దేరిండ్రు,
          రాత్రి ఇంట్లోకి వెల్లేసరికి కూతురొచ్చింది అని చెప్పింది భార్య, తిందువురా ఆమెని లేపుతా అనేసరికి గిప్పుడేం లేపుతవ్ గనీ వద్దు, రేపు మాట్లాడుతా, బస్సు ట్రిప్పులనే తిన్నా జర పాణం అంతా అలిసిపోయినట్లైంది నేను పడుకుంట పొద్దున్నే పోవాల మల్ల అనుకుంటా పడుకున్నడు దనుంజయ్, తెల్లారగట్లనే రెడీ అవుతున్న నాన్న దగ్గరికొచ్చిన బిడ్డ నిండార కౌగిలించుకొని గిప్పుడు బస్సు నడుపుడెందుకు బాపు వద్దు, అసలే నీ పాణం బాగలేదు, మల్ల పెద్ద పండగపూట నువు ఇంట్ల లేకుంటే ఎట్లనో ఉన్నది, అయినా నేనాయనకి చెప్త తియి మా బాపు గీ దీపావలికి ఏం పెట్టడు అని కళ్లనీళ్లు పెట్టుకుంది, దనుంజయ్కి దు:ఖం ఆగలేదు, గట్టిగా వాటేసుకొని నువ్వు ఏడవకు నాకు బుగులైతది, నాకేం కాదు బిడ్డా మస్తురోజులైంది గదా నాకే పెద్ద బండి నడుపబుద్దైంది గందుకే పొయిన, మీకు పెట్టుపోతల కోసం కాదుబిడ్డా..అని ఓదార్చిండు, నువు పో మెఖం కడుక్కపో అప్పడికి మాట్లాడుకుందాం, అంటూనే అల్లుడు ఎప్పుడొత్తడటా బిడ్డా అని అడిగిండు, వెల్లిపోబోతున్న కూతురు నాన్న వంక చూసి దసరా తెల్లారి తోలుకపోనీకి అత్త అన్నడు అనుకుంటూ వెల్లిపోయింది, భయటకు వెళ్తూ పెండ్లాంతో గీ ముచ్చట్లన్ని బిడ్డకెందుకు చెప్పినవ్, అదెంట్ల బాదవడుతుందో చూడు అని కోపగించుగుండు, నేను చెప్పకపోతే దానికి తెల్వదా ఇయ్యాల కొడుకత్తుండు వానికి గూడా నేను చెప్పకున్నా తెలుత్తది గని జర నువు జాగ్రత్త, మెల్లగ నడుపు అసలే యాక్సిడెంట్లు ఎక్కువయితున్నయని టీవీల్ల చెపుతుండ్రు అని జాగ్రత్తలు చెపుతుంది, నీ మెఖం తియి వాల్లని గట్లనే చెప్తరు ఏన్నో ఓటి రోజు అయ్యేటియే ఇప్పుడు సమ్మే కదా జర ఎక్కువ చెప్తరు గంతే అని భయటకి రాంగనే శ్రీనివాస్ బండేసుకొని ఇంటిముంగటికొచ్చిండు, అయన్ని చూస్తూనే చాయ్ తాగి పోదాం దా అంటే ఏ ఎందుకన్నా అప్పడికి టిఫిన్ చేసినంక తాగుదాం తియి, అసలే ఇయ్యాల బతుకమ్మ పండగ నడువ్ జనం ఫుల్లుగుంటరు తొందరగా పోదాం అని వెల్లిపోయారు,
          నిజంగానే జనం పొద్దుగాల్లట్నుంచే ఫుల్లుగున్నరు, టిఫన్ చేయనీకి కూడా టైం దొరకలే, ఇయ్యల్ల రేపు రెండ్రోజులు హైదరాబాద్‌కి వేములాడోల్లే నడుపుతరంటా మనం కామారెడ్డి, కరీంనగర్ ట్రిప్పులే అని బండి స్టార్ట్ చేసిండ్రు, సాయంత్రం పూట ప్రతీ ఊర్ల బతుకమ్మలాటల మద్యలకేల్చి బస్సుపోతంటే, ఇద్దరికీ పాణం కొట్టుకుంది, అట్నో ఇట్నో రాత్రి ఎనిమిదింటి వరకి డిపోల బస్సు పెట్టిండ్రు, ఇయ్యాల పదిగేనువందలియ్యిమని కొంచెం గట్టిగనే అడుగుతాండ్రు, ఇద్దరూ బండి స్టార్టు చేసుకొని ఇంటికొచ్చేటప్పుడు యమా ఉషారుగా ఉన్నరు, వాల్లిచ్చిన వెయ్యికి ఇంకో రెండు వేయిలు తోడవడంతో పోతూ పోతూ పండక్కి ఇంట్లో వాల్లకిద్దామని చెరో బాటిల్ కొనుక్కొని పోయిండ్రు, ఊర్లో అంతా దసరా సంబరాల్లో మునిగి తేలుతున్నది చూసి కొంచెం బాద అనిపించినా అవసరాలు తీరుతున్నాయనే ఆశ వారిలో ఆ నిరాశని దూరం చేసింది, మెత్తం మీద ఆ సెలవుల్లో బస్సులు తిప్పి ఎంత అలసి పోయారో వారం రోజుల్లో వాల్ల అవసరాలకి సరిపడా మెత్తం చేతికందడంతో సంతోషంగా ఉన్నారు, అయితే పండగ సెలవులు అయిపోవడం, ఇంకా కొత్త కొత్త ప్రైవేటు స్కూలు డ్రైవర్లు అందుబాటులోకి రావడం, టిక్కెట్లు మెదలుపెట్టడంతో పాటు ఒప్పుకున్న పదిహేనువందలు ఇస్తుండడం కూడా మెదలయింది, కానీ డిపోల్లోకి వెళ్తుంటే అక్కడే టెంట్లు వేసుకొని కూర్చున్న ఆర్టీసీ కార్మికులని చూస్తే జాలేస్తుంది దనుంజయ్కి, పండుగ ఎట్ల గడుస్తదో అనే నా ఇంటి బుగులు వాల్లిండ్లకు పోయింది అన్నాడు దనుంజయ్ అవునన్నా రోజుకొకరు ఎక్కడో ఒక చోట చనిపోతున్నారు అనే వార్తలు ఇంటుంటే మస్తు నారాజుగుంది అంటూ గొంతు కలిపాడు శ్రీనివాస్, మనలాంటోల్లు బసు నడుపకపోతే గవర్నమెంట్ దిగిరాకపోవునా... పాపం వాల్ల అవసరాలు తీరక పోవునా అన్నాడు దనుంజయ్, అయినా మనం గాక పోతే ఇంకొక్కడు, వాడు గాకపోతే ఎవడో ఒకడు నడిపేటోల్లు, గదంతా కాదు పండగున్న ముణ్నాలుగు రోజులు తప్ప మా బస్సులు రాకపోతే ఎంతమంది ఆగమాగం అయిండ్రు, ఎవని బండ్లు వానికున్నయి, ఎవని తొవ్వ వాడు పోతాండు గదన్నా అన్నడు శ్రీనివాస్,  అదీ నిజమే పాపం ఎటొచ్చీ ఎర్రబస్సే దిక్కయ్యే బక్కచచ్చిన జనం మాత్రం కొంచెం ఇబ్బందులు పడ్డరు, చేతి చమురు ఎక్కువే వదిలించుకున్నరు, అంతా గమ్మత్తుగా అన్పించింది దనుంజయ్కి, మద్యమద్యల పాతోల్లందరు డిస్మిస్ అయిండ్రు అని తెలిసినప్పుడల్లా అయ్యే అని బాద, అంతల్నే ఈ ఉద్యోగం పర్మినెంట్ అయితదేమో అనే ఆశ ఇద్దరిదీ, నెలరోజులకే నాకిట్ల అన్పిస్తే పాపం ఎన్నెండ్ల సందు చేత్తుండ్రో వాళ్లకెంత బాదనో అని శ్రీనివాస్‌తో అంటుంటే ఏమో అన్న ఈ లొల్లి మనకు ఆశ పెరగకముందే జల్దిన తెగుతె మంచిగుండు అన్నడు శ్రీనివాస్, బస్సులో రోజు ఎక్కే ఒక్కొక్కరిదీ ఒక్కో కథ, ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ, ఎవ్వన్నీ తప్పు పట్టనీకి లేదు, అరకొర జీతాలందుకునే కార్మికుల సమస్య ఒకటైతే.. ఏడ్నుంచి ఇయ్యాలే అనే ప్రభుత్వ సమస్య మరొకటి, ఎవన్ది ఒప్పో ఎవన్ది తప్పో మనకెందుకులే అనే ప్రజల గమ్మత్తు అసలు సమస్య. అలా రోజులు గడుస్తున్నాయ్ బస్సు రోడ్డుమీద తిరిగేదానికన్నా ఎక్కువ మలుపులే తిరుగుతుంది సమ్మే, దీపావళి పండగ అల్లుడచ్చిన రెండురోజులు ఇంట్లనే ఉండి ఘనంగా చేసిండు దనుంజయ్, మిగతా రోజులన్నీ బస్సులు నడుపుకుంటనే ఉన్నడు, అప్పుడప్పుడు రోడ్డు మీద కొన్ని ప్రమాదాలు జరిగినా దేవుడి దయ వల్ల భయటపడ్డడు, సమ్మే ముగించామని ప్రకటించిన రోజు చాలా బాదేసింది దనుంజయ్కి ఇన్ని రోజులు ప్రభుత్వోద్యోగిలాగా ఠంచనుగా ఇంట్లోంచి పోయి పనిచేసుకోవడం అలవాటైన దనుంజయ్, ఆ రోజు డిపోల దగ్గర వాతావరణం చూసి భయపడ్డాడు, పాపం డ్యూటీల్లోకి తీసుకొమ్మని  కాళ్లా వేళ్లా మెక్కుతున్నకార్మికులని చూసి కరిగిపోయాడు, ఎట్లనన్న వాళ్ల ఉద్యోగాలు పోకుండా చూడు సామీ అని ఎములాడ రాజన్నకి మెక్కుకున్నాడు, మెత్తానికి యాబై మూడు రోజుల తర్వాత సమ్మే ముగిసింది. దనుంజయ్కి ఉద్యోగం ఊడింది, చివరిరోజు శ్రీనివాస్‌తో పాత ఆర్టీసీ ఉద్యోగులతో సరదాగా కలిసి మెలిసి ఉన్నడు. డిపో మెనేజరు దగ్గర వీడ్కోలు తీసుకొని ఇంటికి పోయిండు, భార్య కూడా సంతోషంగా ఉంది, డబ్బులేమో కానీ పొద్దున పోయి రాత్రి వచ్చేంత వరకీ ఏ ప్రమాదం వినాల్సి వస్తుందో అనే భాద రేపట్నుంచి ఉండదని మురిసిపోతుంది. ఓ ఐదారు రోజుల తర్వాత మల్ల పాత పనిలో పడిపోయిండు, పొద్దున్నే మంచి కల్లు తాగుదాం రాయే దనన్నా అని శ్రీనివాస్ పిలవడంతో కొండాపూర్ తాళ్లల్లకి పోయిండు, ఇద్దరు మంచి కులాసాగా కల్లుతాగుతూనే.. మెత్తానికి ఆర్టీసీ వాల్లకి అన్యాయం జరగలేదు, దేవుడున్నాడు అన్నాడు శ్రీనివాస్, మనకీ ఎంతో కొంత లాబం చేకూరింది, కానీ మనలాంటోల్ల బతుకులు మారాలే శీనా.. యవసాయం ఇంకా లాబసాటిగ మారాలే, అప్పటికప్పుడు అచ్చేటియి కాదు ఏం జేత్తే రైతన్న దేనికి ఎదురు చూడరో గదే చెయ్యాలే అన్నడు దనుంజయ్, నిజమన్నా అదే జరిగితే ఒకరి పొట్ట ఎండుతుంటే పదిమంది నింపనీకొత్తరు, లేకుంటే ఇగో మెన్నటి లెక్కనే ఉంటది, అయినా గిన్ని రోజులు అవసరాల్లల్ల ఉపయోగ పడ్డం మనల్ని గుర్తిస్తే మంచిగుండు, ఏమియ్యకపోని డిపోలకి పిలిచి బోజనాలు పెట్టి ఓ శాలువా కప్పుతే మనం చేసిన సేవకి గుర్తింపుండేది, అయినా అవసరాలైతే తిరినయిగని శీను ఇంకేదో చెప్పబోతుంటే... శీనా ఆశకి అంతుడది కొడకా అనే సరికి ఇద్దరూ ఒకేసారి హాయిగా పెద్దగా నవ్వుకున్నరు.

28, నవంబర్ 2019, గురువారం

ఇగురం - కథఇగురం

అరేయ్ మల్లిగా నాకెందుకో బుగులైతుందిరా, ఏమైందే గట్లనవడ్తివి, ఏమోరా యవసాయం ఇగురం రాలేదురా మనకూ, పుట్టినకాడ్నుంచి అదేపని జేత్తున్న బతకనీకే గింత గుంజుకుంటున్నం, అసలు మనం సరిగ్గ నేర్చుకొనే పంజేత్తున్నమంటవా, ఏందిరా గీ గోస మనకి, అగో గదేందే యాబై ఏండ్లు దాటినంక  పొద్దు కాట్లో కూచేవేల గట్ల మాట్లాడవడ్తివి, గిన్నేండ్లసొంటి ఎకరాకి పుట్టేడు నుండి పది పుట్లు పంట దీసేదాక అత్తిమి, ఏ పునాసలో పండించుకొనేదగ్గరినుంచి తెల్లటి వరన్నం పండియ్యవడ్తిమి, ఒంటెద్దు నాగలి నుంచి ట్రాక్టర్ తో ఒక్కపూటల్నే ఐదెకరాలు దున్నవడ్తిమి, మోటల తిప్పల నుండి కరెంటు మీటతోనే నీళ్లు పారియ్యవడ్తిమి గివన్ని ఇగురంతోని కాకపోతే ఎట్ల చేసినమే...” “అవ్ రా గివన్నీ పనివరుస ఇగురాలు, కానీ యవసాయంతో బతుకనేర్చిన ఇగురాలే అబ్బలేదురా మనకూ, అసలు యవసాయంతోని బతుకొచ్చంటవారా ,ఒకదిక్కు ప్రపంచకమంతా మస్తు మారిపాయే, టకినాలజంటా అన్నిటితో పాటు మన యవసాయంలోకిగూడా చొచ్చుకచ్చే, మరి మిగితా పనోల్లందరూ మంచిగనే ఉన్నరు రైతుల బతుకులకేమైందిరా గిట్లున్నర్, ఇంకా బట్టకి పొట్టకే ఏడ్వవడ్తిమి, ఏనకటినుంచి పంచుకుంటచ్చే సరికి పదుల ఎకరాలల్ల ఉన్న పొలాలు మన జమానా కొచ్చేసరికి ఒకటి రెండెకరాలకచ్చే ఇంక పోను పోను మన పిల్లలకియ్యనీకి ఏం మిగులుతదిరా... అందరి సంపాదన్లు పెరుగవట్టె మనయేమో తరగవట్టే, దినదినాము అడుక్కుపోవడ్తిమి ఇగురముంటే గిట్లెట్ల బతుకుతమురా, అవునే నువ్వంటుంటే అనిపిత్తుంది, గిన్నేండ్లుసంది పక్కోని కచ్చిన మార్పు మనకెందుకు రాలేదే, ప్రతోడు రైతులకోసమే అన్ని జేత్తున్నం  అనవట్టె, మరి మన బతుకులేమో పెనం మీంచి పొయ్యిలకెట్లవడ్తున్నయే, ఏమో మరి సర్కారోల్లు చేత్తున్నది కూడా గిందుకే గావచ్చు లేకుంటే పెద్ద పెద్ద సదువులు సదివినోల్లు రూపొందించే పథకాలు ఉత్తగనే పోతయా....ఇంతల్నే పక్కనే కూర్చొని వీళ్ల మాటలింటున్న ఈరయ్య అందుకొన్నడు అరే గట్లెట్లనే సర్కారు మనల్ని ముంచనీకి చూత్తదా, నీయవ్వ గమ్మతున్నయి మీ ముచ్చట్లు, మీరు చెప్పినట్టు గిప్పుడు మన కాయానికి కష్టమే తెల్వకపోవట్టే అన్నీ మిషన్లే చేయ్యవట్టె, గివన్నీ సర్కారేం చేయకుండానే అచ్చినయా, అప్పట్ల మన లోన్లన్ని మాఫీచేసిరి, మెన్నటికి మెన్ననే గదనే మనూర్ల ముగ్గురికి టాక్టర్లిచ్చే, నిన్ననేమో ఎకరానికిన్ని పైసలిచ్చె, మనం చస్తే భీమాగూడా రావట్టే గివన్నీ కన్పిత్తలేవాయే మీకూ, ఆ మాటలు విన్న మల్లయ్య ఆలోచనల పడ్డడు పరద్యానంగానే, అవ్ గదా గివ్వన్నీ మన రైతుల కోసమే చేయవట్టే.... గదేరా మల్లిగా నేనూ అంటున్న గిన్ని జేస్తున్నా మన బతుకుల్ల మార్పెందుకు లేదు, ఏడ బోతున్నయి గివన్ని, లోపమేడుంది గిట్ల మాట్లాడుతుండగానే ఈరయ్య కల్పిచ్చుకొని ఏందే ఏమన్న రాజకీయాల్లోకి బోదామనుకుంటున్నావా నీయవ్వ నడువ్ గీ పంచాయితి ఇప్పుడు తేలదు గానీ సక్కగా ఇంటికి పోదాం పండ్రీ పొద్దుపోయింది అనుకుంటూ లేచి వెల్లిపోయాడు, మెల్లిగా ఈరయ్య వెనకాలే ఇంటికి బయల్దేరాడు మల్లయ్య, ఇంకా అక్కడ చేసేదేం లేక ఆలోచనలు కట్టిపెట్టి ఇంటిదారిపట్టాడు రైతు,

        ఇంట్లో ఎల్ఈడీ బల్బు దాని మానాన అది వెలుగుతుంది, 21ఇంచెసే అయినా ఎవరు చూసినా చూడకున్నా ప్లాస్మాటీవీ రంగుల్ని చూపిస్తూనే ఉంది, తాతలు కట్టిన ఇల్లే అయినా మట్టిగోడల్లోంచి తెల్లటి సున్నం నున్నగా కన్పిస్తుంది, చూర్లో అక్కడక్కడ చిల్లులున్నా బెంగుళూరు గూణ సందుల్లో సిమెంట్ ఒద్దికగా అమరింది. ఇంటెనక ఇంపుగా లేకున్నా వానని తట్టుకొనే పైకప్పుతో పాయకానా పదిలంగానే ఉంది, సిమెంట్ జాలేట్లకచ్చి చేరింది. ఇంటిలోపల మట్టి నుండి శాభాష్ బండలలోకి మారింది, కోరినంత కట్నాన్ని ఇచ్చి బిడ్డ పెండ్లిచేసి పంపించి అప్పుని ఇంటికి తెచ్చుకొని జీవితమైతే గడుస్తుంది, గవర్నమెంట్లో కొంత ప్రైవేట్‌లో కొంత మెత్తమ్మీద కొడుకు పట్నంలో చదువు ముగించుకొని వ్యవసాయాన్ని శాశ్వతంగా వదిలేసి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు, ఈ మార్పులన్నీ చూస్తూ గివన్నీ మా అయ్య జమాన్ల లేవుగదా, నేనే చేపిచ్చిన గదా, మరి మార్పు రాలేదని నాకెందుకన్పిస్తుంది, డెవలప్మెంటంటే ఏంటీ బతుకు సుఖంగా సాగిపోవడానికి ఏర్పడవలసిన బాటే కదా, గుడ్డి దీపం నుండి ఎల్ఈడీ వెలుగు, ఆకాశవాణి నుండి స్టార్ స్పోర్ట్స్, గూనపెంకల నుండి బెంగుళూర్ గూణల మీదినించి దాబాల స్లాబుల దాకా, చెరువు చెట్ల తోపుల నుండి సురక్షిత మరుగుదొడ్డి దాకా ఈ ముప్పై ఏండ్ల కాలంలో మార్పులు బాగానే అచ్చినయి గదా మరి ఇంకా మనసులో నాకేమో తక్కువైంది అని ఎందుకన్పిస్తుంది, ఇది కాదా అభివ్రుద్ది ఇంకేం కావాలని నా మనసు కోరుకుంటుంది. ఒకటే ఆలోచనలు లేనోన్ని చూసి త్రుప్తి పడమని, ఉన్నోన్ని చూసి ఉరకలెయ్యకమని పెద్దోల్లు చెప్పనే చెప్పిరి, మరి నాకెందుకు ఇంకా ఏదో లేని వెలితి కన్పిస్తుంది, వానతోనో, బోరుతోనో  నీల్లున్నప్పుడు మూడెకరాలు లేనప్పుడు ఎకరా అయినా పారుతుంది గదా పంట చేతికైతే వస్తుంది గదా గట్ల వచ్చినందుకే గదా కనీస వసతులన్నా చేయించుకున్నా, గదేందో ప్రణాళికా సంఘమోల్లు చెప్పినట్టు రోజుకి ఇరవై రూపాయలకి పైనే ఖర్చుబెడ్తున్నా, అయితే నేను గరీబోన్నైతే కాదు, మరి నేనెవర్ని ఒవైపు కళ్లు మూతబడ్తున్న మనసు నిదుర పోనియ్యడంలేదు ఎలాగోలా అర్దరాత్రి దాటాక మసక నిద్దురలోకి జారిపోయాడు రైతు.
        తెల్లారగానే కసీరు దగ్గర జనాలు గుమిగూడారు అందరూ ఆ వైపే పరుగుతీస్తున్నారు ఇంతలో ఏమయిందో అనే కుతూహలంతో అక్కడి వెల్లిన రైతుకి గుండె ఆగినంత పనైంది. అక్కడ సర్పంచుతో పాటు ఆ శాఖ ఈ శాఖ అంటూ ఓ ఐదారుగురు అదికార్లు కూసున్నరు, అంతా హడావుడిగా వాల్లని అడుగుతుండ్రు, విషయం ఏంటంటే  గోదారి నీళ్లు మలపనీకి ప్రాజెక్టులు కడుతున్నరంటా... అండ్లనే మన మిడ్ మానేర్ నుంచి మలకపేటలకి నీళ్లు నింపడం కోసం కాలువలు తవ్వుతున్నరంటా.... ఆ కాలువకింద ఎవలెవల పొలాలు పోతయో వాళ్లందరినీ పిలిపిచ్చి మాట్లాడుతున్నరు ఆళ్లు. నీళ్లచ్చుడు ముద్దేనాయె మరి అవి ఎట్ల రావాలే భూమ్మీదికెయ్యే గదా... ఎవలో ఒకలు భూమియ్యకపోతే... వేలెకరాల పోలాలకి నీళ్లేట్ల రావాలే... ఐనా ఎనకటి లెక్క ఏ అడ్డికిపావుషేరో ఇత్త లేదుగదా సర్కార్, న్యాయంగ రావాల్సినన్ని పైసలియ్యనే వట్టే, ఆటితోటి ఇంకోదగ్గర పొలం గొనుకొని సాగు చేసుకొని బతుకుండ్రి, మీ బతుక్కేగదా గివ్వన్ని చేసేది. అంటూ సముదాయిస్తున్నడు ఎవలో పెద్దసారు, గాయిన చెప్పే మాటలు కూడా సబబే అన్పిస్తున్నయ్ కానీ నా పొలం కాలువకింద పోతదా అనే భయమైతే అయితనే ఉంది మనుసుల రైతుకు. గింతల ఏ ఏ సర్వే నంబర్లకెళ్లి కాలువ పోతదో చదివి ఇన్పించ్చిండ్రు... అమ్మయ్య కొంత మనసు నిమ్మలవడ్డది నా భూమైతే లేదు తియి అని గంతల్నే బాదనిపించింది ఇన్నెండ్లు నాతోటి ఎండకు వానకు ఎవసాయం చేసిన తోటి రైతుల భూములు పోవట్టే... అని.  ఏందో అర్థమయితలేదు. జరిగింది మంచికే... జరుగుతోంది మంచికే.... కానీ నాకయిన మంచేందో ఇంకా తెలువకపాయే అని గజిబిజి గట్లనే ఉంది లోపల.
        గిప్పుడు దుబాయ్ పోవుడైతే తగ్గిందిగని పూర్తిగా బందుగాలే... ఎన్నడో ఎనకట ఇరవై ఏండ్ల కింద తనతో ఆడుకున్న నర్సయ్య దుబాయ్ నుంచి తిరిగొచ్చిండని తెలువంగనే మాట్లాడిద్దామని పోయిండు మన రైతు, ఏంరా నర్సి మంచిగున్నవారా... అబ్బ ఎన్నెండ్లయిందిరా నిన్ను చూసి, అప్పట్ల యాడాది రెండేండ్ల కచ్చేటోనివి ఈ తాపా చానా దినాల తర్వాత అచ్చినవురా అని ప్రేమగా దగ్గరికి తీసుకొని అడిగిండు. అవునే అన్నా... ఇగ విసా కాన్షల్ చేయించుకున్ననే... మనూరికి కాలువ అత్తుందట గదా గందుకే గీన్నే యవుసం చేద్దాం అనుకుంటున్న అన్నడు నర్సయ్య. అగో గీ ముచ్చట నీ దాక అచ్చిందారా... గీడ గల్లీల ఏం జరిగిందో సముద్రాల ఆవలున్న మీకు చిటుక్కున తెలువవట్టే భలే అచ్చినయ్రా పోన్లు.  అవన్నా యవుసాయం ఎట్ల నడుస్తుందే అని కష్ట సుఖాలడిగిండు నర్సయ్య. ఏం యవుసమో లేరా... చేన్లు ఎండవట్టే, అమ్మితే దరల్లేవాయే... కొందామంటే అగ్గిపిరమాయే....రైతు చెపుతుండగానే...
పట్నంలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకొన్న నర్సయ్య కొడుకచ్చాడక్కడికి,. గట్లంటవేంది పెదబాపు గిన్నేండ్లు సరిగ్గా నీళ్లులేక పంటలు పండలే... కాలం కలిసొచ్చి పంటలు పండినప్పుడు వాటిని నిలువ చేసి దర అచ్చినపుడు అమ్మడానికి సౌలత్ లేకపాయే కానీ కాలం మారింది బాపు, మన తెలంగాణ మనకొచ్చింది. మెల్ల మెల్లగా ఒక్కొక్కటి మనముందుకత్తయి చూడు. నీ భూమిలకి గొదారమ్మొస్తది. సర్ధాపూర్ల గిడ్డంగిల నీ పంటని మంచిగ దాచుకోవచ్చు, నీ ఇష్టమున్నప్పుడు నీకు నచ్చిన దరచ్చినప్పుడే అమ్ముకోవచ్చు..
నీ మాటలు మంచిగున్నయ్ బిడ్డా ఇనడానికి గా ఆశతోనే బతుకుతున్నం, మారాలే మా బతుకులు గూడ మారాలే.. పంట పండించి పదిమంది కడుపునింపేటోల్లం, మా కడుపులు గూడా నిండాలే.. మాకా వయసయిపోతుంది. నీలాంటి పొట్టేగాళ్లుగూడా యవసాయం చేయనీకి రావాలే బిడ్డా... గా రోజులు రావాలే.. అనుకుంటూ అక్కడ్నుంచి భయల్దేరబోతుంటే... పెద పాలేరు కొమురయ్య ఉరికొచ్చి అన్న జల్డి మీనయ్య కొట్టంకాడికి పాండ్రి... ఆడ మీనయ్య ఉరేసుకున్నాడంటా... అంటూ ఉరికిపోయిండు. అందరం ఒక్కసారిగా కొట్టంకాడికి పరుగులు తీసినం. అందరూ గుమికూడి ఉండ్రు. నేలంతా రక్తపు మరకలు పడిఉన్నాయి. నాలుక వేలాడేసి ఉంది. మబ్బుల్నే ఎడ్లకి గడ్డేత్తా అనొచ్చి కొట్టంలనే ఉరేసుకున్నడు మీనయ్య. మెన్ననే రెండో బిడ్డ పెండ్లి చేసిండి. పాత అప్పులు కొత్త అప్పులు బాగా మీద పడ్డయ్.. ఎప్పుడు కలిసినా పొలాన్ని బేరానికి పెడుతా అనేటోడు, ఇప్పుడు కాలువ పోతుందని తెల్వంగనే బేలగా ఈ పని చేసిండు. గుండంతా బరువెక్కింది. ఆగపడ్డడు మీనిగాడు ఏదో ఓటి ఉన్నది ఇద్దరి బిడ్డలేనాయే పెండ్లిళ్లు కూడా అయిపాయే, గుండె దిటవు చేసుకుంటే సర్కారిచ్చే పైసలతో అప్పులు తీరకపోవునా... ఎంతపని చేసిండు అని బాదేసింది.

        కాలం గడుస్తూనే ఉంది. యవసాయంలో కొంచెం కొంచెం మార్పులొత్తున్నాయ్, సర్కారోల్లే పెట్టుబడి సాయం చేస్తుండ్రు, అవసరాల మేర పైసలు లోన్లత్తున్నయ్, కాలువల్లకి నీళ్లు ఇంకా ఇడువకున్న పైన చెరువుల్ని నింపడంతో బోర్లల్ల నీళ్లు పెరిగినయి, పంట ఎండిపోవుడు తగ్గింది. ప్రైవేటు అప్పులు లేకపోయేసరికి ప్రాణానికి హాయిగుంది. ఈ సాలుకు గిడ్డంగి తెరిచిండ్రు అప్పుల బాద లేదు కాబట్టి రైతు తన పంట పెసర్లని గిడ్డంగిల పెట్టిండు దరత్తదేమోనని. మంచి దరకే అమ్ముతననే నమ్మకం పెరిగింది. మెల్లగా ఆలోచనల్లోకి జారుకుండు రైతు... నిజానికి నా తెలంగాణ అచ్చినంకనే గివ్వన్ని మారినయ్ గదా... ఎంత ఖర్చు అయి ఉండొచ్చు వీటన్నింటికి... ఎప్పుడో ఇరవై ఏండ్ల కింద గీ ఖర్చు పెట్టుంటే మా మీనిగాడు మాతోని ఉండుగదా... గసొంటోల్లంతా పూర్తి కాలం బతుకుదురు గదా... మనుమండ్లు మనుమరాండ్ల జీవితాల్ని చూద్దురు గదా... ఏందో దేవుడు ఎవడేం చూడాల్నో గదే రాసిపెడ్తడు గావొచ్చు, మాగ్గావల్సింది పంట పండించడానికి భూమి, దాన్ని తడిపే నీరు, పంట చేతికొచ్చినంక సరైన దర, గీ మూడు మా చేతుల లేక ఇన్నేండ్లు అరిగోసవడ్డం, ఏ బతుకమ్మ పండుక్కో దసరాకో సంబరవడ్డం, ఇప్పుడిప్పుడే మాకన్ని దినాలు బతుకమ్మ పండుగలే అయితయనే నమ్మకం కలుగుతుంది. దసరాలాగా ప్రతీరోజు సంబురాలే చేసుకుంటమనే దీమా పెరుగుతుంది. సరే అయిపోయిన మా తరంల యవసాయం ఇగురం తెలువలేదనే బాదతో చాలా మంది రాలిపోయిండ్రు. రాబోయే తరంలా యవసాయం ఇలువ తెలుసుకొని బంగారం లెక్క బతుకుతరనే నమ్మకం కలుగుతుంది.
ఏమైందే అన్నా.... అన్న మల్లిగాని పిలుపుతో ఈ లోకంలోకచ్చిండు రైతు.. ఏం లేదురా ఏదో ఆలోచన అన్నడు, రా ఇంటికి పోదాం నా మోటార్ బండెక్కు అంటు ఎక్కించుకున్నాడు,  మల్లిగాడు ముసిముసిగ నవ్వుకుంటనే ఏమే ఇగురం నేర్చినావా లేదా... అని అడిగిండు. ఏమో రా నీ బండిమీద సరిగ్గనే కూసున్ననా నువ్వే చూసి చెప్పాలే ఇగురం అచ్చిందా... లేదా... అని... ఇద్దరూ పెద్దగా నవ్వుకుంటూ... వ్యవసాయం ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంటి దారి పట్టిండ్రు.

చినుకంటె..... నా ప్రేయసి

చినుకు
చినుకంటె ఒట్టి నీటి చుక్క కాదు
నెర్రెలిచిన నా తెలంగాణా నెలలకి
అమృతం పంచే అమ్మపాలు
కన్నీళ్లలా ఆవిరైన నా రైతు కంటిపాపల్లోకి
సరికొత్తగా పొంగివచ్చే ఆనంద భాష్పాలు
తొలకరి తొండీ చేసినా
ఆషాడాన పుట్టింటికోచ్చిన శ్రావణ మేఘాలకి....
ఎన్ని ప్రేమలేఖలు రాశానో ....
అల్లంత దూరంలోని వెండి మబ్బులకి....
ఎన్ని దారాలు వేసానో....
ఏదైమైతేనేం
ఒక్కటయ్యాయి....
ప్రణయ రాగాలు పాడుకుంటున్నాయి....
చినుకులుగా మొదలై
పిల్లకాలువల్లో సవ్వడై
వాగుల్లో..... వంకల్లో..... ఆ కన్నె పొంగులు
వరద గోదారిలా ఎగసి
కాళేశ్వర హృదయాలపై ఈ సంగమం
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలు బిడ్డలుగా...
తెలంగాణ నెలలపై పచ్చని పరువాల సింగారం
పరువపు ప్రకృతిపై జలసొయగం
అందుకే
చినుకంటె..... నా ప్రేయసి
చినుకంటె.... రేపటి బంగారు తెలంగాణ ఆర్తి.

స్వేచ్చే మా రణ నినాదం

అధైర్యం వద్దు
పోరాడటమంటే బతికుండడమే
ఎన్నెన్నో చూసినోల్లు
ఇబ్బందుల్ని ఫాబందీ చేసినోల్లు
ప్రయాణాన్నే మజిలీగా మార్చుకున్నోల్లు
గమ్యం తప్పక చేరతారు
గమనాన్ని ఆపకండి
తప్పో ఒప్పో సత్యానికి ఓటమి లేదు
నీకై నువ్వు మరణ శరణు వేడావంటే..
ఓటమొక్కటే కాదు,
నీ కోరికలోని న్యాయాన్ని నువ్వు ప్రశ్నించడమే?
అధైర్యం వద్దు...
అమరణ రణమే నీ తొలిపొద్దు.


ఇవాళ గెలుపెవరిదో.... 
గాయమెవరికో.....
అనేక బందనాల సంకెళ్లని తెంచుకొని
కలబడి నిలబడిన నా గానం
గొంతునొక్కితే ఆగిపోయే రాగ స్వరం కాదు మాది
స్వేచ్చనాపితే విస్పోటనం చూపే మంద్ర స్వరం వేడిది
ఎవరో విదిల్చితే ఏరుకునే ఎంగిలాకులం కాం
దిక్కార స్వరం తెలిసిన సమర శీలురం మేం
ఏనాటికైనా 
పోరాటమే మా అజెండా
ఆత్మస్థైర్యమే మా జెండా
స్వేచ్చే మా రణ నినాదం
సంఘర్షణే మా మరణ విదానం 

వరుణా నీ కరుణకావాలి

చిరుజల్లుల తుంపెరల్లో తడుస్తే...కన్నె ప్రేయసి తొలిముద్దులు కురుపిస్తున్నట్టుగా ఉంటుంది
రుతుపవనాల రాకతో... పల్లెం నిండా పరమాన్నం పరుచినట్టే ఉంటుంది
సడులతో సుడులు తిరుగుతూ ఉరకలెత్తే పిల్ల కాలువలు మెదలు
వయ్యారి వంపులతో వన్నెచిన్నెలు చిందే నదుల జలపాతాల వరకూ...
చినుకుతో నా చెలిమి ప్రాణవల్లరి తీగపై పసిడి రాగాల కోయిల బలిమి
ఏ పొద్దు ఆ పొద్దుకే అందమైనది
ఏ కాలం ఆ కాలానికే సొగసైనది
నైరుతిలో రాక నన్నెంత నిరాశ పరిచావో...
కార్తీకమైనా పోక అంతే విసుగు తెప్పిస్తున్నావు
అద్దంలా నను ముద్దుగా చూసుకునే నా హైదరాబాది రోడ్లు...
నీ అన్యాయ గాడ పరిష్వంగనంతో అతలాకుతలమైనాయి...
నీ అదర చుంబన పీడనలతో నొక్కుల పొక్కలు తేలాయి...
ఆవేశమో... మోహావేశమో... అలవికాని వేల నీ మదనతాపమేంటి..
"రేపే" ఇది ఖచ్చితంగా నా రహదారులపై, నా పొలాలపై మైకంతో కమ్మేస్తూ...
నువు చేస్తున్న అత్యాచారమే ఇది
దయచేసి శాంతించు....
మన్మద రాత్రిలో....
పొలాలలో హలాలు తిరుగాడు వేళ
నీ ఉద్రుతమైన మేఘ గర్జనల కౌగిలింతల్ని కప్పుకుందాం...
ఇప్పుడైతే.. ఆషాడ మాస కొత్త జంటవలె కొన్నిరోజులు విశ్రమిద్దాం...

రుణం తీర్చుకుందాంఅమ్మ, పాలతో రంగరించిన మమకారాన్ని మర్చిపోగలమా...
జానెడు పొట్టకి తొలి ఊతాన్నిచ్చిన ఆ స్తన్యాన్ని తలచుకోకుండా ఉండగలమా...
కనులు తెరవక ముందే... కాలాన్ని చూడకముందే...
ముర్రుపాలతో ఈ కలికాలాన్ని ఈదే దైర్యాన్ని ఇవ్వలేదా...
తొమ్మిదినెలల తన బరువుని
మురిపాలు అందిస్తూ మరో తొమ్మిదినెలలూ తన పొత్తిల్లలో పొదగలేదా...
జన్మని మనకిస్తూ పునర్జన్మ తను పొంది
ఉగ్గుపాలతో మన వ్యక్తిత్వానికి నగిషీలి చెక్కలేదూ....
ఆ పాలే అమృతమై మన మార్గాన్ని చూపెడుతున్నాయి.
తల్లిపాలు తాగిన రుణాన్ని తీర్చుకొమ్మని కబురంపుతున్నాయి.
అందమనో...నిస్సత్తువనో..టైంలేదనో...
పసిబిడ్డకి పాలివ్వక పాపాల పాలు కావొద్దని హెచ్చరిస్తున్నాయి
పాలిచ్చి ఇద్దరూ పదికాలాలు పచ్చగా బతకమని దారి చూపుతున్నాయి.
నీ బిడ్డకి పాలిచ్చి నీ తల్లిపాల రుణం కొంత తీర్చుకోమంటున్నాయి....