16, డిసెంబర్ 2024, సోమవారం

#SGdailyStories @2న్యాయం

 


#SGdailyStories @2న్యాయం

           ‘జరగండి జరగండి జరగండి’ అని నెట్టేసుకుంటూ ఒకర్ని మించి ఒకరు తోసుకుంటూ పరుగెడుతున్నారు, ఆ హడావుడికి బయపడి చెట్టు చాటుకు వచ్చి నిల్చున్నాడు మల్లయ్య. కొంత హడావుడి సద్దుమణిగాక ఏమైందోనని అక్కడున్న లాయర్ని భయం భయంగానే అడిగాడు. మొదట కసరుకున్నా... ఫీజు తీసుకుంటుంది గుర్తొచ్చి మల్లయ్య మొఖంలో ఉన్న కుతూహలం గమనించి ‘ఏం లేదయ్యా... ఆయనో పెద్ద హీరో మొన్నోకాడ సినిమా చూన్నీకి బోతే ఇగో ఇప్పుడు గాలే... గట్ల జనాలు ఎగబడితే ఒకామె సచ్చిపోయ్యిందీ, గందుకే గియ్యాల కోర్టుకు తెచ్చిండ్రు’ అన్నాడు. ‘అయ్యో... సచ్చిపొయ్యిందా... పాపం’ అని కాసేపు ఆగి.

           లాయర్ను బతిమిలాడినట్టుగా... ‘నా కొడుకును ఇయ్యాల ఇడ్సిపెడ్తరా... అయ్యా...’ అని ఆశగా అడిగాడు. ఆమాటల్ని పట్టించుకోకుండానే లాయర్ కూడా హీరోని చూడడానికి పరుగెత్తుకుంటూ వెల్లాడు. పక్కనే ఉన్న గుమస్తా కల్పించుకొని ‘ఏం కేసయ్యా నీది ఎప్పుడూ గీడ జూల్లే’ అడిగిన మాటలకు సమాదానంగా ఆకాశం వంక దీనంగా చూస్తూ చెమ్మగిల్లిన కండ్లను తుడుచుకుంటూ సమాదానం చెప్పడం మొదలెట్టాడు మల్లయ్య.

           ’మాది ఆసిఫాబాద్ దగ్గర గోండు గూడెమండీ... నాకొడుకు అందరిలెక్క గింత వ్యవసాయం చేస్తూ కొంత సర్కారోళ్ల భూమిని పోడు జేసిండని ఏడాదికింద జైళ్ల పెట్టిండ్రు సారూ...మూణ్నెళ్లకోసారి ఆన్ని ఇడుత్తరని చెప్తే పైసా పైసా పోగేసుకొని ఈ కోర్టోనికి గడ్తున్న సారు. ఈడికి ఐదారు సార్లాయే మొదట మా జిల్లా కోర్టుకాడకి బోయిన ఇగో గిప్పుడు గీ పట్నంకు రమ్మన్నారు సారు’ మాట్లాడుతుండగానే... లాయర్ తిరిగొచ్చిండు.

           ‘ఏం చెప్తుండ్రా... పోడు చేస్తే ఖైదు చెసిండ్రనా... ముచ్చట అదే కావచ్చు కానీ కేసు నక్సలైట్ ది, ఏడాదినుంచి రిమాండ్లోనే ఉన్నడు’ అన్నడు. వెంటనే మల్లయ్య కల్పించుకొని ‘ఆ పొద్దు ఊళ్లకు అన్నలొస్తే అందరిలెక్క ఆడున్నడు గంతే సారు’ అని చెప్తుండగానే మల్లీ కోలాహలం, హీరోకు బెయిలొచ్చిందని. వెంటనే మల్లయ్య ‘నా కొడుకును గూడ ఇడిసేత్తరా సారు’ అన్నాడు. ‘ఏంది ఇడిసేది, మూణ్నెళ్లు కేసు వాయిదా వేసిండ్రు, ఇందాక కోర్టులకు పొయి ఆ పేపర్లే తెచ్చిన’ అని వాయిదా పేపర్లు చేతిలో పెట్టి నిట్టూర్చాడు లాయర్. ‘జనం ఎగవడనీకి గీయనే కారణమన్నా ఇడ్సిర్సు, ఉత్తగా ఎదురొచ్చినోన్ని చూసినందుకు నాకొడుకును లోపలేసిండ్రు. నా దగ్గర పైసల్లేవు, ఆళ్లతాన ఉన్నయ్, గందుకే నాకొడుకు లోపల్నే ఉండు. ఇంకెన్నేండ్లు ఉంటడో... ఏం నాయమయ్యా...’ అని బాధతో గుణుక్కుంటూ బస్టాండ్ దిక్కు తోవ్వపట్టిండు మల్లయ్య.

         - Sudheer Gangadi

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి