17, డిసెంబర్ 2024, మంగళవారం

#SGdailyStories @3 టేస్టీ


 

#SGdailyStories @3 టేస్టీ

              ‘ఏంటీ వంట, ఇంత దరిద్రంగా ఉంది, నీతా ఎక్కడా’ అని గట్టిగా అరుస్తూ ప్లేట్ విసిరేసాను, ఆ అరుపులకు ఎదురుగా వస్తున్న నీతా కాళ్లకు అడుగు దూరంలో పడింది ప్లేట్. ‘ఏంటండీ... ఏమైంది, పిచ్చలేసిందా... ఎందుకు తినే ప్లేట్ గిరాటేసారు’ అని ఆమె సైతం గట్టిగా కోప్పడుతూ అరుస్తూ వచ్చేసరికి, నా కోపం నషాలానికెక్కింది, వెంటనే అన్నం, కూరలున్న గిన్నెలను విసిరికొడుతూ ‘ఏం చేస్తున్నావు ఇంట్లో, ఖాలీగా కూర్చోకపోతే పనోళ్లు వంటలెలా చేస్తున్నారనేది కూడా చూడవా...’ అని కోప్పడుతూ సింక్ దగ్గరికి వెల్లి చేయి కడుక్కొని వెల్లిపోయాను.

           ఈ మద్య ప్రతీ చిన్నదానికి విపరీతమైన కోపం వస్తుంది, టవల్ ఎక్కడుందని, సాక్స్ కనబడట్లేదని, కీస్ దొరకలేదని పనోళ్ల మీద, నా భార్య నీతా మీద అరుస్తున్నాను. ఈ విషయం నాక్కూడా అర్థమౌతుంది, కానీ అందుకు తప్పు మాత్రం వాళ్లదే అనిపిస్తుంది, ఓ వైపు బిజినెస్ సక్సెస్ ఫుల్ గా రన్ చేయడంలో ఉండే ఇబ్బందులతో నేను బిజీగా ఉంటే, ఇంట్లో అన్ని కంపర్ట్స్ పొందుతూ నాకు సరైన సేవ చేయట్లేదని నీతాపై, జీతాలు తీసుకుంటూ నాకు కావాల్సినవి చూడట్లేదని పనోళ్లపై తెగ కోపం వస్తుంది, దీనికి తోడు కాంటినెంటల్ ఫుడ్ అలవాటై ఇంటి ఫుడ్ తినాలంటే రుచించడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో ఆసిఫాబాద్ అడవుల్లో పెడ్తున్న ప్యాక్టరీలో ఇబ్బందులను సరిచేయడానికి వారం రోజులు అక్కడే ఉండాల్సి వచ్చి పనిమనిషిని తీసుకొని వెల్లాను.

           మొదటి రెండ్రోజులు ఇక్కడినుండి తీసుకెళ్లిన ఫుడ్ ఉండడం, లోకల్స్ తో మీటింగులు పెట్టి వారిని ఒప్పించే బిజీలో ఉండడంతో అంతగా తేడా అనిపించలేదు, ఇక మూడో రోజు నుండి పనివాడిని రోజూ కొట్టినంత పనిచేస్తున్నాను. ఏంటీ ఫుడ్, ఎలా తినాలంటూ గోల చేస్తున్నా... వాడు కూడా అక్కడ అత్యాధునిక ఒవెన్లు క్యారవాన్లో ఉన్నా కరెంటు లేక, సరైన వసతులు లేక చేయలేకపోతున్నాడు. నేను తినలేక వదిలేసిన ఫుడ్ కోసం బోజన సమయానికి పదుల్లో పిల్లలు వచ్చి చేరుతున్నారు. దీన్ని నేను పనిలో ఉండి గమనించలేకపోయాను.

           ఇంకో రెండ్రోజుల్లో వెల్లిపోతామనగా ఎప్పట్లాగే క్యారేజీ తీసుకొని వచ్చాడు, ఒక్క ముద్ద నోట్లో పెట్టగానే యదాలాపంగా ప్లేట్ గిరాటేసి అరిచేసాను, భయం, భయంగా వాడు వెల్లిపోయాడు, అదే కోపంతో బయటకొచ్చి చెట్టు కింద నిలబడి ఫోన్ సిగ్నల్ కోసం వెతుకుతున్నాను. కాసేపయ్యాక అటు వైపు చూసేసరికి ఐదారుగురు పిల్లలు అక్కడి బండరాళ్లపై కూర్చొని, నేను విసిరేసిన పుడ్ ని ఆకుల్లో ఏరి, అపురూపంగా తింటున్న దృశ్యం కనిపించింది. దాంతో పాటు వాళ్ల నానమ్మలు కావచ్చు వాళ్లు కూడా ప్రేమగా పిల్లలకు తినిపిస్తూ, తామూ ఒక బుక్క పెట్టుకొని ఎంతో మురిసిపోతున్నారు. వాళ్ల డొక్కలు ఎండిపోయినట్టుగా ఉన్నాయి, ఆ ఆహారం తింటుంటే మాత్రం వాళ్ల మొహల్లో ఎంతో ఆనందం కనిపిస్తున్నట్టనిపించింది.

           అంత బాగుందా అని వాళ్లతో పాటు నేనూ కూర్చొని, రెండు బుక్కలు నోట్లో వేసుకున్నాను, ఆ కల్మషం లేని మనుషులతో మాటల్లో పడి నేనూ కడుపునిండా తిన్నాను. అదేంటో నిజంగానే ఫుడ్ చాలా టేస్టీగా ఉంది.

-మీ సుధీర్ గంగాడి.

               

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి