#SGdailyStories @1కర్మ
ఎడతెరిపిలేకుండా వస్తున్న దగ్గు ఎంతకూ తగ్గడం లేదు, వంట్లో రోగానికి అతి శీతల చలిగాలులు కూడా తోడై ప్రాణాన్ని ఉపిరితిత్తుల గుండా బయటకు పంపేలా ఉంది. దీనికి తోడు కరోనా అనంతరం టీబీలాంటి బయంకరమైందేదో గాలి ద్వారా వ్యాపిస్తుందని టీవీలు ఒకటే ఊదరగొడ్తున్నాయి. అప్పట్నుండి ఇంట్లో ఓ మూలకు ఉన్న నా మంచం గ్యారేజీలో మూలకు చేరింది. లక్షలకు కోట్లు సంపాదించాను.
కోడళ్లు గంజి పోయరేమోనని చివరి వయసులో తోడుండాలనుకొని రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాను, అమెరికా కొడుకు, ఆస్ట్రేలియా కొడుకు కట్టెకాల్చడానికి కూడా రారేమోనని ఆస్థికలు గంగలో కలిపిన నాడే ఆస్థిమీద హక్కులు దక్కుతాయని విల్లుకూడా రాసాను. అదే ఇప్పుడు మెడకు ఉరితాడులా చుట్టుకుంది, దాన్ని చూసి ఆస్థి లేకపోతే ఈ ముసలి పీనుగు నాకెందుకు అనుకొని అందిన కాడికి దండుకొని వదిలిపోయింది నా ముసలి పెల్లాం, అబ్రాడ్లో ఎంత సంపాదించినా అత్త, మామల ఆస్థిని ఎలా వదిలేస్తామని ఇంట్లో వాలిపోయారు ఇద్దరు కోడళ్లు కొడుకులతో కలిసి.
ఉప్పడిదో... చప్పటిదో... ఓల్డ్ ఏజ్ హోంలో పెట్టిందేదో తింటూ బాగానే గడిచింది, కన్నపేగు అనే బందాన్ని తిరిగి విల్లుతో తెచ్చుకుంటే... వచ్చిన మూడ్నెళ్ల నుండి నేనెప్పుడు పోతానా అన్నట్టు చూస్తున్నారు. ఇప్పట్లో పోనేమోనని విసుగొచ్చి గ్యారేజీలోకి తోసేసారు.
‘ఓరేయ్ రాము కాసిన్ని మంచినీళ్లివ్వరా’ అనే నా ఐదోసారి అరుపులకు విసుక్కుంటూ వచ్చి, ‘అక్కడే ఉన్నాయ్ తాగొచ్చు కదా నాన్నా’ అని కసిరాడు.
‘ఇంత సంపాదించింది మీకే గదరా... కొంచెం మనిషిలా చూడండ్రా...’ దీనంగా అడుక్కున్నాను.‘
హా... సంపాదించావులే... తాత ఇచ్చిన దాన్ని కాపాడావు అంతేగదా...’ ‘ఐనా నువ్వు తాతను దొడ్లో గొడ్ల పక్కన పడేశావుగా... నేనలా చేసానా... ఇక్కడ బెడ్డు మీదే ఉంచానుగా’ అని విసుక్కుంటూ వెల్లిపోయాడు.
అప్పుడు గుర్తొచ్చింది మా నాన్నను నేనెలా చూసానో... యవ్వనం ఇచ్చిన మత్తు, పెళ్లాం మాటల కిక్కుతో ఇంకా ఎప్పుడు చస్తావ్ అని రోజూ అంటూనే ఉండేవాడిని. ఇలా చీదరింపులు, కడుపు మాడ్చడాలు అబ్బో చెప్పడానికి సిగ్గుపడే పనులే అన్నీ... రోజంతా అవే జ్ణాపకాలు, చావు కోసం ప్రార్థిస్తూ... పక్కమీద దొర్లుతూ... ఆయన పడ్డ ఇబ్బందులన్నీ గుర్తొచ్చి కళ్లలోంచి దారలా నీల్లు కారుతూనే ఉన్నాయి.
చీకట్లు ముసురుకుంటుంటే పెరగాల్సిన దగ్గు తగ్గిపోయింది. ఎందుకంటే నాడు నాన్నకు నేను చేసిన మర్యాదలు తల్చుకొని నేడు గొంతు బిగదీసుకుపోయింది. మెల్లిగా క్షమాపణలు చెప్పుకుంటూ శ్వాస కూడా... చూసారా చివరికి చావును సైతం శాంతంగా ఇవ్వగలిగింది కేవలం తల్లిదండ్రులే.
- Sudheer Gangadi
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి