ఓటు ప్రజాస్వామ్య
పునాది, ప్రజాస్వామ్య మూలస్థంబం, ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది గత
కొన్నేళ్లుగా ప్రలోబాలతో ఓటును ప్రభావితం చేసే రాజకీయాలు పెచ్చుమీరాయి, డబ్బు,
కులం, మతం, ప్రాంతం, భయం, అవకాశం ఇంకా స్థానికంగా అనేక రకాలుగా ప్రలోబాలు
పెచ్చుమీరి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాయని ఎంతో మంది ప్రజాస్వామ్య
వాదులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందిగ్ధ, సందీ సమయంలో జరిగిన ఉప ఎన్నిక హుజురాబాద్,
ప్రజాస్వామ్య వాదుల ఆందోళనల్ని తొలిగించిన ఫలితమిది, ప్రజాస్వామ్యంపై, ప్రజల
చేతనపై నమ్మకం పెంచిన ఉపఎన్నిక ఇది, ఎన్నో ఎన్నికలు చూసినా దేనికదే
ప్రత్యేకమైనదిగా ఈ హుజురాబాద్ ఉపఎన్నిక మరింత విలక్షణమైనది, స్థూలంగా ఈటెల
రాజేందర్ని కేబినెట్ బర్తరప్ చేసిన దగ్గర్నుండి అతను రాజీనామా చేసి ఉపపోరులో
నిలిచేదాకా ప్రతీ క్షణం ఉత్కంఠతో పాటు ఫలితంపై మీమాంస జరిగేలా చేసింది. కారణాలు
చెప్పడానికి ఎన్నో కన్పిస్తాయి కానీ ఉప ఎన్నికలకు ముందు పూర్వరంగాన్ని కొంత
గమనిస్తే... పూర్తిస్థాయి పాలనకు ముందే ఎన్నికల్లోకి వెల్లి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను
కప్పి పుచ్చుకోవడానికి రైతుబందు పేర తాయిలాన్ని ఆశచూపి 2018లో తిరిగి అధికారంలోకి
రాగలిగింది తెరాసా, నిజానికి ఆ సమయానికి టీఆర్ఎస్ పైనా, కేసీఆర్ పైనా స్థానిక
అభ్యర్థులపైనా అంత సానుకూలంగా ప్రజలు లేరు, ఖచ్చితంగా హంగ్ అసెంబ్లీ వస్తుందా లేక
ప్రభుత్వ పాలన మారుతుందా అనే ఉహాగానాల మద్య టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యాన్ని
సంపాదించింది. అప్పుడు విశ్లేషకులంతా ముందస్థు కేసీఆర్ వ్యూహం ఫలించింది,
దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికలతో వెల్లి ఉంటే పార్లమెంట్లో కోల్పోయిన ఏడు స్థానాల
మాదిరే అసెంబ్లీ ఫలితం తారుమారయ్యేది అన్నారు. ఇక్కడి వరకూ వ్యూహాలేవైనా ఎందుకు
కేసీఆర్ వద్దు అనడానికి సచివాలయానికి రాడు అనే అపవాదు మినహా పెద్ద ప్రతికూలతలు
లేవు. కానీ ఆ తర్వాత కేసీఆర్లోని అపనమ్మకం మరింత పెరిగి పోయింది, ఆపరేషన్ ఆకర్ష్
పేర ప్రతిపక్షాలను లేకుండా చేయాలనే తన వ్యూహానికి పదును పెట్టాడు, నాయకుల్ని
లేకుండా చేయడం ద్వారా టీఆర్ఎస్ మాత్రమే మిగిలుతుందనుకున్నాడు, ఇక్కడే అతను తెలంగాణ
స్వభావాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకోలేకపోయాడు. కేసీఆర్ కి తెలంగాణ స్వభావం
తెలియదా అని మీరనొచ్చు, నిజానికి సాయుద రైతంగ పోరాటానికి ముందునుండి తెలంగాణను చదివి
గమనిస్తున్న వారెవరైనా తెలంగాణ గురించి ఒక్కమాటలో చెప్పమంటే దిక్కార స్వరం అనే
బదులిస్తారు. ఆ దిక్కారం అణువుగాని సమాయాల్లో, గొంతుని బిగపట్టిన అణిచివేతలో సౌండ్
చేయలేకపోవచ్చు కానీ రీసౌండ్ మాత్రం ఖచ్చితంగా చెవులు బద్దలయ్యేలా చేస్తుంది. ఇది
నాటి కాకతీయుల నుండి నైజాంల వరకూ స్వతంత్ర్య భారతంలోనూ సీమాంద్ర పాలనలోనూ
నిరూపితమయింది. తమ నాయకత్వాన్ని ప్రజలే తయారుచేసుకొని మరీ బరిగీసి నిలిచారు,
కొన్ని సందర్భాల్లో ఓడిపోవచ్చు, తొలిదశలో మర్రిచెన్నారెడ్డి రూపంలో నాయకత్వం
వదిలేసి పోవచ్చు కానీ ప్రజలు ఉద్యమాన్ని వీడిన క్షణం లేనేలేదు, ఇందాక
చెప్పుకొన్నట్టు రీసౌండ్ ప్రతీ రోజు ఉండకపోవచ్చు అంతే. ఇక కేసీఆర్ ను గమనిస్తే కేవలం
సీమాంద్ర నాయకత్వానికి నమ్మినబంటుగా ఉంటూ ఏనాడు తెలంగాణ అనని వ్యక్తి పదవుల
పందేరంలో సగటు తెలంగాణ వ్యక్తిగానే చీత్కారానికి గురయ్యే సరికి 2001లో పార్టీని
స్థాపించినా 2014వరకూ ఏ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ప్రభావం చూపిన దాఖలాలు లేవు,
ప్రజల్లో ఉన్న ఉద్యమ ఆకాంక్షల్ని సైతం పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ వైపు
తిప్పలేకపోవడం కేసీఆర్ నాయకత్వ వైఫల్యమే, అయితే ఉప ఎన్నికల ద్వారా ప్రజలు
చేస్తున్న ఉద్యమంలో మేము కూడా ఉన్నామని ప్రతీసారి ఆయనకు ఆయనే భలంగా చెప్తూ కొంత
పార్టీని కాపుడుకుంటూ ఉండేవాడనేది నిర్వివాదాంశం. ఈ మద్యలో తన పై ఓత్తిళ్లకు
తలొగ్గుతూ పొత్తులు కడుతూ ఓసారి, అవకాశం దొరికినప్పుడు ఎగదోస్తూ కొన్ని సార్లు ఇలా
2009లో వైఎస్ మరణానంతరం ఉద్యమం మరో దశకు చేరుకునేవరకూ కొనసాగింది. అదే సమయంలో
భలంగా అణిచేస్తూ వచ్చిన సీమాంద్ర లాబీయింగ్ని మించి తెలంగాణ ప్రజా ఉద్యమం
ఎదిగింది. ఈ దశలో సైతం టీఆర్ఎస్ని ప్రజలేమీ గొప్పగా ఓన్ చేసుకోలేదు, అదీ ఒక రాజకీయ
పార్టీ అన్న చందంగానే చూసారు. ఎప్పుడైతే వారి అంతిమ ఆకాంక్షగా తెలంగాణ ప్రత్యేక
రాష్ట్రంగా ఏర్పడిందో అప్పుడే టీఆర్ఎస్ విజయ ప్రస్థానం ప్రారంభించబడింది. కలలోనైనా
ఊహించని, ఇంకా దానికోసం పోరాటం చేయాల్సిందే అనుకున్న తెలంగాణ సమాజం ఇంత తొందరగా
సర్వశక్తులు ఒడ్డీ దాన్ని సాధించిన తర్వాత కొంత రిలాక్స్ అయింది. అంతకుముందు లాగే
పరిఫాలనలో స్థిరత్వాన్ని అందించే నాయకత్వానికే జై కొట్టింది. నిజానికి టీఆర్ఎస్కు
పరిపాలనా అనుభవం లేకపోయినా, సరైన నాయకత్వం లేని కాంగ్రెస్ ఎంత ప్రమాదకారమో
అనుభవించి ఉన్నారు కాబట్టి బెస్ట్ ఆప్షన్గా టీఆర్ఎస్ని ప్రజలు ఎన్నుకున్నారు, ఇలా
అందివచ్చిన అవకాశాన్ని ప్రజారంజక పాలనగా మార్చే క్రమంలో వారికి అందుబాటులో ఉండి
ఆపదలో, సంపదలో ఉండాలి అనే తెలంగాణ తత్వాన్ని వదిలేసి, పథకాల పేరుతో వైఎస్ చేసిన
దందాను మరింత తీవ్రతరం చేసాడు, అయితే ఇక్కడ చిన్న తేడాని పసిగట్టలేకపోయాడు. వైఎస్
కు ముందు కనీసం అయనలా ఆదరణ ఇచ్చిన వారు లేరు, వరుస కరువులు, అనావ్రుష్టి,
ప్రపంచీకరణ దుష్రభవాలు, విస్త్రుతంగాలేని సాప్ట్ వేర్ రంగం, ఉపాది ఉద్యోగాలలేమి
ఇంతటి సంక్లిష్ట పరిస్థితుల్లో రోగం వస్తే చావే అన్న భయాల్లో ఆరోగ్య శ్రీతో
కార్పోరేట్ వైద్యం కాల్లదగ్గరికి తెచ్చాడు, పీజు రియంబర్మెంట్తో కార్పోరేట్ చదువును
అందజేసాడు, ఇందిరమ్మ ఇంటితో ఆవాసాన్ని అందించాడు, ఆసరాతో 200 పింఛనిచ్చాడు,
మనిషికి కనీస అవసరమైన కూడు, గూడు, గుడ్డతో పాటు విద్య, వైద్యాన్ని అందించాడు వీటి
వెనుక ఉన్న కపట డొల్లతనాలు ఏవైనా ప్రజలకు అవేవీ పట్టనివి, అవసరం లేనివి, ఎవడు
తినడం లేదు మాకింత పెట్టిన వాడుంటే చాలు అని దోపిడీకి లైసెన్స్ ఇచ్చే స్థితికి
ప్రజల్ని తీసుకువచ్చాడు, ఐనా తెలంగాణ ఆత్మ వైఎస్ని పూర్తిగా ఆదరించలేదు ఎందుకంటే
అన్నం పెడుతున్న నెపంతో మా ఆకాంక్షైన ప్రత్యేక తెలంగాణకే సున్నం పెడుతున్నాడనే
ఎరుక ఎన్నటికీ ఈ ప్రజల్ని వదల్లేదు, కానీ కేసీఆర్ సమయానికి ఉన్న పరిస్థితులు అవి
కాదు, గ్లోబలైజేషన్ సత్పలితాలు, పెరిగిన ఉపాధి అవకాశాలు, ప్రక్రుతికరణతో తిండికి
డోకా లేకుండా సాగుతుంది, తెలంగాణ సహజ స్వబావమైన స్వాభిమానం కూడా సిద్దించింది.
కానీ కేసీఆర్ ఈ పరిస్థితుల్ని బేరీజు వేయకుండానే మూసగా ప్రజలకు కావాల్సింది సుఖం
అనే అనుకున్నాడు, అందుకు 200 ఫించన్ని 2000 చేసాడు, వ్యవసాయం పండగైతే చాలు రైతు
ఇంకేం అడగడు అనుకొని రైతుబందు, బీమా తెచ్చాడు, ఇలా ఎన్నో పథకాల్ని అధ్బుతంగా
తీసుకొచ్చాడు, కానీ వ్యక్తి పూజ పెంచుకున్నాడు, ఏ లీడరైనా కేసీఆర్ కు జై అనే
మాట్లాడాలి, తెలంగాణ అంటే కేసీఆర్, ఉద్యమం చేసింది, రాష్ట్రం తెచ్చింది, అసలు
తెలంగాణ ప్రజలకు దిక్కూ, మొక్కు కేవలం కేసీఆరే కావాలి అనుకున్నాడు, అనుకోవడమే కాదు
ఆ దిశగానే కార్యాచరణ ప్రారంభించాడు, కవుల్ని, కళాకారులపై కనపడని ఒత్తిడి పెంచాడు, నై అన్న నోళ్లను
మూయిస్తున్నాడు, ఉద్యోగుల్ని నయానో భయానో మచ్చిక చేసుకోవాలనుకుంటున్నాడు, ఇలా
ప్రతీ వర్గాన్ని ఏదో రూపంలో తన కీర్తీలాలనలో ఊలలూగేలా చేయాలనుకుంటున్నాడు, ఇదే
ఇప్పుడు అతనికి పెద్ద అడ్డంకిగా మారబోతుంది. తెలంగాణ సహాజ దిక్కారానికి మింగుడు
పడకుండా చేస్తుంది. నిజాం లాంటి నియంతల్ని ఎదిరించిన సమాజం కేసీఆర్ని ఉపేక్షించదనే
నిజం ఆకలింపు చేసుకోకపోవడం ఆయన దురద్రుష్టం. ప్రజాసొమ్మును పంచుతున్నావు తప్ప నీ
సొంత సొమ్మేమన్నా ఇస్తున్నావా అనే జాగరుకత పెరిగిన సమాజంలో ఉన్నాం, దీని ఫలితమే
ఓటుకు ఆరువేలు నికరంగా పంచినా ఐదువేల కోట్ల ప్రజాదనాన్ని ఖర్చుపెట్టిన, వందలాది
నేతల్ని దింపినా లక్షా నాలుగువేల ఓట్ల నుండి లక్షా ఏడువేల పైచీలుకు ఓట్లను
సాధించేలా ఈటెలను విజయున్ని చేసింది. ఈ విజయం బీజేపీది కానే కాదు, ఈవిజయంలో ఈటెలది
25 శాతమైతే మిగతా 75 శాతం కేసీఆర్ దే. ఇప్పుడు రాబోయే రోజుల్లో కేసీఆర్ వల్ల దక్కే
75 శాతం విజయం టీఆర్ఎస్ కు కావాలా...? లేక ప్రతిపక్షాలకు చెందాలా.... అనేది
కేసీఆర్ పైనే ఆధారపడి ఉంది. ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలి, ప్రజల మనుషులను
తెలుసుకోవాలి, పాలకున్ని కాదని కేవలం ప్రజల వారసున్నే అనే నిజాన్ని గ్రహించాలి. తెలంగాణ
ఆత్మను ఒడిసిపట్టి వారి తలలో నాలుకలా మసలుకోవాలి. ఇదే విజయాన్ని అందించే
తారకమంత్రం.