19, నవంబర్ 2017, ఆదివారం

పోదాం పద మూలాలకి

విలువల వలువలూడుతున్న వేళ
పోదాం పద మూలాలకి
బతుకులు చిరుగుల పడుతున్న వేళ
పోదాం పద మూలాలకి
నాగరికమనాగరికమౌతున్న వేళ
పోదాం పద మూలాలకి
అమ్మానాన్నలు డాడీల గడి దాటువేళ
పోదాం పద మూలాలకి
గతి తప్పిన భవితవ్యపు గమ్యమాగమైన వేళ
పోదాం పద మూలాలకి
జ్వాలలన్ని జోలలై దేబిరించే వేళ
పోదాం పద మూలాలకి
చిన్నారులే కన్నీరులై కలగరుగగ
పోదాం పద మూలాలకి
ఏ జాతి ఖ్యాతిది
దేనినుంచి జారవడ్డది
ఏ వెలుగుల దిక్సూచిది
దిగంతాలకి కూలబడ్డది
మర్మం మరిచిన ఈ చదువుల పయనం
మానసిక పైత్యానికి మరో తిమిరం
పోదాం పద మూలాలకి
వెళ్దాం అసురాంతాలకి
కూల్చేద్దాం కునారిల్లే విద్య అవస్థని
నిర్మిద్దాం చైతన్య స్రవంతిని
భవిష్యత్ వెలుగుల దిశగా
బంగారు భారతి దిశగా......

గడిచిన కాలం చూపిన దోవలు

ఈ రోజు అలా అలా గడిచిపోతుంది
రేపు కూడా అలాగే సాగిపోతుంది 
మరి 
ఈ ప్రశ్నకి అంతం వచ్చినపుడూ.........
ఆలోచించడానికైనా అనుభూతించడానికైనా
నీ దగ్గర ఏమి మిగిలిందనేదే ప్రశ్న
కాలం మిగిల్చే వేదనల్లో నీకోసం తపించిన హృదయాల ఘోష కనబడుతుంది
ఆరోజున వదిలేసిన నీ పైశాచికత్వం కనబడుతుంది
అంతే
ఈ రోజు అలా అలా గడిచిపోతుంది
దాచుకోవడానికి నెమెరేసుకోడానికి చిన్న అనుభూతి లేకుండా
రేపు కూడా అలాగే సాగిపోతూనే ఉంటుంది చితిలో చిటపటలు సర్థుమణిగేదాకా...

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

లెక్కలు తప్పుతున్నాయ్ ఆశలు చెదురుతున్నాయ్ 
గురువా
రెక్కా డొక్కా ఆడించి రొక్కమంతా గుమ్మరించి
చదువుల గోదాలో దించుతున్నాం
ఇరుకిరుకు గదుల్లో బాల్యం బందీ అవుతున్నా
వేటేసే ప్రైవేటులే గురుపూజకి అర్హమౌతున్నాయ్
వేల జీతాలు విశాల ఆవరణలు
మద్యాహ్న భోజనాలు ఇవేవీ మమ్మాకట్టుకోవట్లే
ఏం
లక్షలు ఖర్చౌతున్నా లక్షణం తెలియకపోవడం మా తప్పా
నమ్మకాన్నే నేర్పడం రాని ఈ గురువుల సమర్థత గొప్పా
ప్రైవేట్ పబ్లిక్ ఈ గోలంతా లేని
వసుదైక విద్యా కుటుంబం మా కల
కళలకి కాణాచిగా భవితని రూపొందించడం మీ నేల.
గురువా గద్దించైనా గర్జించైనా నీ ఆస్థిత్వాన్ని నిలుపు
టీచర్ కొలువంటే భుక్తికోసం కాదు
జాతి విముక్తి కోసం అని చాటు
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.
ఓ నిజాము పిశాచమా.....
నిరంకుశ నాజీలా అణిచేసిన రిజ్వీలా
నీ నరహంతక రూపాలు పటాపంచలైన రోజు
పోరాటాల తుది రూపు
అమరుల త్యాగాల గెలుపు
కలగలసి తెలంగానమైన రోజు
ఆపరేషన్ పోలోతో మా పరేషానీ తీర్చిన మహనీయులందరికీ శతకోటి ఉద్యమాభివందనాలు.

రణం మా నినాదం

రణం మా నినాదం
దౌర్జన్యాలపై నిరసనం మా ఇజం
నిర్బంధాలని నిరసించడం మా నైజం
నాటి రజాకార్ నుండి నేటి దోపిడీకోర్ వరకీ ప్రతిఘటన రూపం చూపినోల్లం
సాయుధ పోరాటం నుండి చీరల భాగోతం వరకూ దుమ్ము దులిపినోల్లం
రణం మా నినాదం
బతుకునే ప్రశ్నించీ బానిసగా మార్చాలనే కుతంత్రాన్ని
ఎదురించి బతుకమ్మ ఆడినోల్లం
నిర్బంధించిన గళాల్లోనే ఉయ్యాల పాటల్ని
మార్మోగించిన దీరులం
అందుకే
దౌర్జన్యాలపై నిరసనం మా ఇజం
పోరాట స్ఫూర్తితో పోరు తెలంగాణలో సాగే రేపటి పౌరులం
బతుకమ్మ చూపిన దోవలో బరిగీచి నిలిచే తెలుగోల్లం
నా ఆమ్మలక్కలందరికీ ఉద్యమాబివందనాలతో బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

విజేత-పరాజిత

ఒకానొక రహదారి యాత్రలో సూదూర గమ్యాన్ని చేరాలని
వడివడిగా సాగే నడకలో
చిన్న బొడ్రాయి అడ్డొచ్చి కలల్ని చీల్చేసి 
కష్టాల్ని కావలించి
ఇష్టంగా నిన్ను పాతాలమార్గానికి మల్లిస్తే
దొర్లుకుంటూ జారి అద్రుష్యమయ్యేవాడే పరాజిత
దొరికిన ఆసరాని అందుకొని ద్రుగ్గోచరమయ్యేవాడే విజేత

21, మే 2016, శనివారం

తెలుగు పాటల పూదోట వేటూరి వర్థంతి ప్రత్యేకం

వేటూరి సుందరరామ్మూర్తి, ఈ పేరు వింటే తెలుగు అక్షరం నిలువెల్లా పులకిస్తుంది, ఆ కళం రాల్చిన పదాలు తెలుగు పాటని సుసంపన్నం చేశాయి, మనసు భారమైనప్పుడైనా ఆహ్లదంగా ఉన్నప్పుడైనా  సందర్భమేదైనా వేటూరి పాటలో ఒదిగిపోవాల్సిందే, జాతీయ స్థాయిలో తెలుగు పాటకి కావ్య హోదాని కట్టబెట్టిన మహామహుల్లో వేటూరీ చిరస్మరణీయుడు, ఆ మహనీయుని వర్థంతి మే 22న ఈ సందర్బంగా మరొక్క సారి తెలుగుటీవీ గుర్తు చేసుకుంటూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తుంది.
సాంగ్.శంకరా నదశరీరాపరా
 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించాడు, మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి, కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటని జాతీయ వేదికలపై మోతమోగించిన శ్రీశ్రీ తర్వాత అంతకన్నా హ్యుద్యంగా రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే...అంటూ ఓ తల్లి మనోవేదనని కళ్లకు కట్టాడు.
సాంగ్. రాలిపోయే పువ్వానీకు రాగాలేందుకే.
ఇంతటి ఘన విజయాన్ని కూడా ఆత్మాబిమానానికి సాక్షిగా వదిలేశాడు, తెలుగుభాషకు ప్రాచీన హోదాని నిరాకరించిన కేంద్ర ప్రభుత్వానికి  తన జాతీయ అవార్డుని వెనక్కిచ్చేసిన సాహసి వేటూరి, తన పాటల్లో కూడా అక్షరాలను పాశుపతాస్రాలుగా సందించిన సందర్బాలు కోకొల్లలు,  శంకరాభరణంలో ఆ శివున్నే దిక్కరించిన ఆ కళం ప్రతిఘటన సినిమాలో అసబ్య సమాజపు చెంప చెళ్లుమనిపించాడు.
సాంగ్.ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో,
ఇక ఒకే సినిమాలో విభిన్నపార్శాలున్న పాటలు రాయడం ఒక్క వేటూరికే చెల్లింది, ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్ సినిమా అడవిరాముడులోని సందేశాత్మక గీతం క్రుషి ఉంటే మనుషులు రుషులైతారు అంటూ ఆత్మవిశ్వాసం నింపిన ఆ కళమే ఆకుచాటు పిందెతడితే అంటూ రెండు అర్థాల్ని అత్యంత నైపుణ్యంగా వినిపించింది.
సాంగ్. ఆకుచాటు పిందె తడితే
సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఇలా ఎన్నో సినిమాలు...ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు, తెలుగా తల్లికి ఆయన చేయించిన జూకాలు,
“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.
సాంగ్. నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ
పాటల ప్రయాణంలో అలుపెరగని ఆ బాటసారి బోజనప్రియుడు, కడుపు నిండా తిన్నాక తెలుగువారికి తాంబూలంతో పాటు వేటూరి పాట ఉంటే ఆమజా గురించి చెప్పేదేముంది, 1974లో మెదలైన ఈ పాటల ప్రవాహం, 2011లో ఒంకారేశ్వరీ అంటూ దేవున్ని స్మరిస్తూనే సాగింది. దాదాపు 40దశాభ్దాల తన సినీ గేయ రచనా ప్రయాణంలో ఆయన స్రుష్టించిన ఒక్కో పాట ఒక్కో కావ్యం, కే.విశ్వనాథ్, కే.వీ మహదేవన్, ఇళయరాజా వంటి మహామహులతో కలిసి తెలుగు పాటకి రుదిరదారలతో అర్చన చేశారు వేటూరీ, తెలుగునాట గోదావరి ఎంత సస్యశ్యామలం చేసిందో వేటూరీ పాట కూడా అంత అజరామరం పొందింది.
పాట.ఉప్పొంగెలే గోదావరి
తన పాటలతో అభాలగోపాలాన్ని ఊయలలూపిన ఆ మహాకవి మనల్ని విడిచి వెళ్లి ఆరుసంవత్సరాలు గడిచిపోయాయి, కానీ ఈ ఎడబాటు బౌతికంగా మాత్రమే, వేటూరీ పాట కొమ్మ కొమ్మన పూస్తూ సన్నాయి రాగాలాలాపిస్తుంటే, ప్రతీ తెలుగు హ్రుదయం ఆ రాగసవ్వడిలో అనంతంగా పులకించిపోతూనే ఉంటుంది. వేటూరీ మల్లీ రావా మాకోసం.
పాట. కొమ్మకొమ్మకో సన్నాయి.