చెవుల్లో ఒకటే రొద, పిల్లల అల్లరికి తోడు టీవీ
సౌండ్కి ఇల్లు టాప్ లేచిపోయేలా ఉంది, అప్పుడప్పుడే నిద్రలోంచి మెలకువొచ్చి ఈ గోల
విన్పించకుండా చెవులకి దిండుని అదిమిపెట్టుకొని పక్కమీదే అటూ ఇటూ దొర్లుతున్నాను,
ఒక్కసారిగా ఇళ్లంతా నిశ్శబ్దం అయింది, ఝుయ్యని సౌండ్ చేస్తూ తిరుగుతున్న ప్యాను
మెల్లగా ఆగిపోయింది. అప్పటి వరకూ చల్లగా ఉన్న మత్తు కాస్తా వదిలిపోయింది, కరెంట్
పోవడంతో మూగబోయిన పిల్ల రాక్షసుల గొంతులు క్షణమైనా గడవకముందే మరింత బీకరంగా ఆన్
అయ్యాయి, అదేంటో మామూలుగా చలికాలం ముసుగేసుకొని పడుకున్న దానికన్నా... ఎండాకాలం
చల్లటిగాలికి అస్సలు లేవాలనిపించట్లేదు, అలా బద్దకంగా లేవాలా, వద్దా అని పక్కపై సణుగులాట
జరుగుతున్నప్పుడే... వంటింట్లోంచి రివ్వున దూసుకొచ్చాయి మాటల తూటాలు, ‘టైం
పదవుతుంది, ఏంటా మెద్దు నిద్ర, ఊరోళ్ల మజ్జంతా నీకొస్తుంది ఇకనైనా లేవు, అయినా..
ఆపీసు లేకపోతే.... ప్రపంచమే లేదనుకుంటున్నావా... ఏంటీ... ఏదో ఆదివారం అలసిపోయి
పడుకున్నావంటే ఒక అర్థం, ఇప్పుడు ప్రతీ రోజు ఆదివారమే అంటే ఎట్లా... లే... లే’...అనే
సుప్రభాతానికి తోడు ఒళ్లంతా చెమట్లు పడుతుండడంతో ఇక లేవక తప్పలేదు, ‘ఏంటీ
గోల పిల్లల అరుపులని మించిపోతుంది నీ లొల్లి, అయినా రోజు ఆదివారం లాగా ఎక్కడే... మెదటి
రోజేమో ఇళ్లంతా సర్దించావు, మరునాడు కార్ క్లీనింగ్ చేయించావు, నిన్నట్నుండు
అంట్లు తోమడం కూడా మెదలెట్టించావు, దీనికన్నా ఆఫీసు ఉంటేనే నయం’ అని ఆవులిస్తూనే
వంటింట్లోకెళ్లా... ‘చీ చీ ఇక్కడినుండి కదలండి ముందు, బాత్రూంకెళ్లి
క్లీనయి రండి’, అని వంటింట్లోంచి నెట్టేస్తూ.. ‘ఇప్పటికైనా
అర్థమయిందా ఆఫీసుకెళ్లి కంప్యూటర్ ముందేసుకొని కుర్చీలో కుర్చునే దానికన్నా ఇక్కడ
ఇంట్లో పని చేయడం ఎంతో కష్టం అని’. ‘సరె సరె ఓ బాగానే ఉందిలే సంబడం... ముందు
కొంచెం బెడ్ కాఫీ ఇస్తావా’... ‘ఏంటీ.. బెడ్ కాఫీ కావాలా... ఓ వైపు ప్రపంచం
మెత్తం కరోనాతో శుచి, శుభ్రత కోసం ఉరకలేస్తుంటే... పాచి మెఖంతో తిని తాగుతా
అనడానికి సిగ్గులేదూ’... అంటూ గదమాయించే సరికి బాత్రూంకి వెల్లక
తప్పలేదు, మెఖం కడుక్కుంటుంటే... సింకు దగ్గర మహా సముద్రాలు పొంగుతున్నాయా
అన్నట్టుగా నీళ్లు పొంగి బాత్రూంలో కొస్తున్నాయి, ఇద్దరు పిల్ల రాక్షసులు హాండ్
వాష్ పేరుతో ఒకర్నొకరు తోసేసుకుంటూ చేతులు కడగడం కన్నా పోటీపడడంలోనే ఆసక్తి
చూపిస్తూ నీళ్లని ఎగజిమ్ముతూ ఆటలాడుతున్నారు, నల్లా కట్టేసి ఇద్దరి చేతులు కడిగి
హాల్లోకి లాక్కొచ్చా...సోపాలో తిన్నగా కూర్చొకుండా టీవీ రిమోట్ని అందుకోవడానికి
ఎగిరి దుంకాడు చిన్నోడు, ఆ కుదుపుకి సోపా రెండడుగులు వెనక్కి జారిపోయింది. కోపంగా
అరుస్తూ.. సోపాని సరిచేసి వాడి చేతుల్లోంచి రిమోట్ లాక్కొని న్యూస్ ఛానల్ పెడుతూ కూర్చున్నా...
అంతే ఒక్కసారిగా వాడి గొంతు వంద డెసిబుల్ల శభ్దంతో భళ్లున తెరుచుకుంది, ఆ
శబ్దానికి వంటింట్లోంచి మా ఆవిడ తెస్తున్న టిఫిన్ గిన్నె అమాంతం గాల్లో ఎగిరి
వచ్చి నా ఒళ్లో వాలిపోయింది. దాన్ని ఒడుపుగా పట్టుకుంటుండగానే... ‘ఏమన్నారు
వాడ్ని, ఇందాకట్నుంచి బుద్దిగా ఆడుకుంటున్న వాల్లతో టీవీ కోసం ఎందుకు గొడవ
పెట్టుకుంటావ్, ముందా రిమోట్ వాడికివ్వండి అని ఆర్డరేసింది.’
టీవీలో ఇక రేపో మాపో ప్రపంచం మునిగిపోతుంది. కరోనా ప్రపంచంలోని మనుషులందర్ని
చంపేస్తుంది అంటూ ఉదరగొడుతున్నారు. ఇప్పటివరకూ మనదేశంలో వివిదకారణాలతో ఇంచుమించు రోజూ
ఇరవైరెండువేల మంది చనిపోతున్నారు, అందులో కరోనా సోకి చచ్చేవాళ్లు కనీసం నలబైమంది
మించి లేరు. కానీ ఈ న్యూస్ చానల్స్ చూస్తే నిజంగానే కరోనాతో ఖచ్చితంగా అందరం
చచ్చిపోతామనే భయమేసింది, వెంటనే రిమోట్ వాడి చేతిలో పెట్టా... అప్పటివరకూ
ట్రాఫిక్లో రోతపెడుతున్న ఫైరింజన్ల అరిచిన వాడు, చటుక్కున కార్టూన్ చానల్ పెట్టి
ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయాడు. ఏంటీ టిఫిను అంటూ ఒళ్లోని గిన్నె తెరచి
చూస్తే.. ఇడ్లీలు కన్పించాయి, ‘ఇవ్వాల్లా ఇడ్లీలేనా... రోజు ఇడ్లీలే తినాలంటే
ఎలా’...లాక్ డౌన్కి ముందు ఉడిపి హోటల్లో తిన్న వెరైటీ వెరైటీ టిఫిన్లు
గుర్తొచ్చి ఇడ్లీలు తినాలంటే సయించలేదు. ‘నిన్ననేగా ఉప్మా చేశా.. మల్లీ రేపు ఏదైనా
వెరైటీ చేస్తాలే.. అయినా ఇప్పుడు చూడాల్సింది టేస్ట్ కాదు హెల్త్’ అంటూ
వడ్డించింది. ‘ఉప్మా, ఇడ్లి, దోశ ఇదేగా నీ రొటేషన్, అయినా ఈ
మూడే కాదు ఇంకా చాలా ఉన్నాయి’, అని లొట్టలేస్తూ... ‘బొండా,
వడ, పెసరట్టు, పాస్తా, శాండ్ విచ్, డోనట్, పిజ్జా, బర్గర్…’ ఇలా
చదువుబోతుంటే... బర్గర్ పేరు వినగానే.. మా చిన్నోడు శోకం మెదలెట్టేశాడు ‘బర్గర్..
బర్గర్’ అంటూ, ‘బుద్దిలేకపోతే సరి, హోటల్లో బేరర్ లా
అన్నీ గుర్తుచేసి పిల్లాడ్ని చెడగొట్టడానికి,’
వాన్ని ఊరడిస్తూనే... ‘అందుకేనా ఇన్ని రోజులు ఇంట్లో ఏం వండినా...
ఆఫీసులో అర్జంట్ పనుంది అక్కడికెల్లి తింటా అని వెల్లిపోయేవారు.. ఇక నుండి
ఇవ్వన్నీ బంద్ ఏదైనా ఇంట్లో చేసిందే తినాలి, ఊ తినండి’ అని
గద్దించేసరికి ఇక చేసేదేం లేక టిఫిన్ చేస్తూనే... ‘మద్యాహ్నం
లంచ్ ఏం వండుతున్నావ్ అన్నా...’ అంతే గయ్యిమని లేచింది. ‘ఇంకా
టిఫినే కాలేదు, అప్పుడే లంచ్ కావాల....’ ‘ఆహా
అది కాదు, ఏంటో తెలుస్తే.... కొంచెం ఉత్సాహంగా ఉంటుంది కదా’ అని
నసిగా... ‘ఆ..అందుకే ఏ పనీ లేకపోతే తిండిమీదే యావ, మీకు
ఉత్సాహం నేను తెప్పిస్తాగా... పద ముందెళ్లి టాంకు శుబ్రం చేద్దాం పద’ అంది... ‘వామ్మో ఇప్పుడా… బయట
చూడు ఎండ ఎలా కొడుతుందో అమ్మో… నేను రాను అన్నా...’ అంతే
మూతి మూడు వంకర్లు తిప్పుతూ... ‘ఎలాగూ వాకింగ్ లేదు, కనీసం ఇలా దాబాపై వల్లు
వంచితేనన్నా ఇంత ఎండతగిలి విటమిన్ డి అందితే మంచిది కదా... మీ ఆరోగ్యం కోసమేగా
నేను చెప్పేది’ అని శోకం తగిలించుకుంది. ‘సరె
సరె వెల్దాంలే... కనీసం కొంచెం చాయ్ అయినా ఇవ్వు తాగి వెల్తా’
అంటున్నా విన్పించుకోకుండా బ్లీచింగ్ పౌడర్ డబ్బాతో పాటు నా రెక్క పట్టుకొని
లాక్కుపోయింది. టాంకు క్లీన్ చేసి కిందకొచ్చేసరికి పన్నెండు దాటింది. వస్తూనే
ప్రిజ్ డోర్ తీయబోతుంటే.. అమాంతం కేకేసింది, ‘బయట్నుండొచ్చాక
హండ్ వాష్ చేయకుండా ఏం ముట్టుకోవద్దని’, ‘అదేంటే..ఇందాక
బ్లీచింగ్తోనేగా క్లీన్ చేసింది. ఇంకా అంతకన్నా వాష్ ఉంటుందా చేతులకీ’
అన్నా..’అవన్నీ ఆపండి ముందు హాండ్ వాష్’ అంటూ
గదిమింది. సింక్ దగ్గర చేతులు కడుక్కుంటూనే.. ‘ఐనా ఇంట్లో ఉండేటోల్లేందుకే… ఊకూకే
హండ్ వాష్ చేసుకోవాలి. మన చేతులకేం కరోనా వైరస్ లేదుగదా’ అని
లాజిక్ తీసా... మా పెద్దోడు ఈ వాషింగ్ గోల వదిలించుకోవాలని నా లాజిక్కి వెంటనే ‘అవును
నాన్నా...ఇంట్లో ఉండే మనమెందుకు పదే పదే హండ్ వాష్ చేసుకోవాలి’. ‘బాగానే
ఉంది మీ వాలకం, కరోనా వైరస్ని కడిగేసుకోవడం ఒకటే కాదు, చేతులు మురిగ్గా ఉంటే ఏదో ఓ
ఇన్పెక్షన్ వస్తుంది, దాంతో రోగనిరోదక శక్తి తగ్గిపోతుంది కరోనా సోకడానికి అవకాశం
ఎక్కువుంటుంది, అందుకు తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలంది’, ఆమె
నాలెడ్జికి ఆశ్చర్యపోతూ... ‘ఇదంతా నీకెవరు చెప్పారు, వాట్సాప్ చూడట్లేదేంటి’ అంది.
ప్రిడ్జ్ ఓపెన్ చేస్తూ.. ‘బ్రెడ్డు అయిపోయినట్టుంది అలా సూపర్ మార్కెట్
కెల్లి తెస్తా’ అన్నా... ‘అవసరం
లేదు కిచెన్లో ఉంది’ అంది. ‘బట్టర్, జామ్ లేనట్టుంది తెస్తా...’
‘అవేం నిత్యావసరాలు కాదు,’ ‘షుగరో,
సాల్టో, ఆయిలో, పప్పో ఎదో ఒకటి తెస్తా అసలే ఈ లాక్ డౌన్ ఎన్నిరోజులుంటుందో
ఏమో...తర్వాత్తర్వాత రేట్లు పెరిగిపోతే... అవి దొరకకపోతే ఏట్లా’
అన్నా... ‘ఏం అవసరం లేదు ఏదో ఓ వంకతో బయటకెళ్లాలనే ఆలోచన
మానేయండి. మీకు వర్క్ ఫ్రం హోం ఇచ్చింది ఇలా మాటి మాటికి ఏదో సాకుతో భయట
తిరగడానికి కాదు, ఇంట్లోనే ఉండి ఎటూ కదలకుండా బుద్దిగా పనిచేసుకోడానికి.’ అని
చురకంటించింది. ఇప్పటికి నాలుగు రోజులైంది రోడ్డు మెఖం చూసి, బోర్ కొడ్తుంది ఏదో
రీజన్ చెప్పి బయటకెళ్దామని చేస్తున్న నా ప్రయత్నాలన్ని విఫల ప్రయత్నాలే
అవుతున్నాయి. టీవీ రిమోట్ మన చేతికి రావాలంటే స్మార్ట్ పోన్ పిల్లల చెతిలోకెళ్లాల్సిందే...
టీవీకన్నా ఇది మరింత ప్రమాదకరం అని భయమేసి, నేనే పోన్లో తలదూర్చా... కాసేపయ్యాక
అదీ బోర్ కొట్టింది. ‘ఏమోయి కొంచెం జంతికలు, కారప్పూసతో పాటు
పల్లిపట్టి తెస్తావా’ అని అడిగా... ‘అబ్బబ్బబ్బా..
ఒక్క క్షణమైనా మీ గిర్నీ నడిపించకుండా ఖాళీగా ఉండలేరా...’ అంటూ
గిన్నె ముందు పెట్టింది, కాసేపు మరాడించాక ‘కొంచెం
టీ పెడ్తావా...’ టీ తీసుకొచ్చి ముందు పెట్టింది. రెండవడంతో లంచ్
కానిచ్చి ఏం పాలుపోక సరసం పైకి మనసు మళ్లి వంటింట్లో పనిచేసుకుంటున్న శ్రీమతి నడుం
చుట్టూ చేయి వేశా, అంతే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఎగిరి దుంకింది, ‘ఏంటీ
పిచ్చిపని వేళా పాళా లేదా, పిల్లలున్నారన్న ద్యాసన్నా ఉండదా...’ అంటూ
పంచమహా పాతకం చేసిన వాడిలా కసురుకుంది. ‘పిల్లలు ఆన్లైన్ క్లాసుల్లో బిజీగా
ఉన్నారులే’ అన్నా... ‘చీ
ముందిక్కడి నుండి నడుస్తారా లేదా... ఈ స్టే హోం ఏమోకానీ మీ గొంతెమ్మ తిండి
కోర్కెలు తీర్చడానికే టైం సరిపోవడం లేదు, ఇంకా...’ అంటూ
మూతి మూడు వంకర్లు తిప్పింది. ఇంకా మన ఆటలు సాగవనుకొని కాసేపు కునుకు తీసా..
అంతలోనే డాం మీదునుంచి దుంకుతున్న జలపాతాల్లా మా పుత్రరత్నాలు నామీంచి గెంతుతూ
ఆటలాడుతున్నారు, కాసేపు వాల్లతో ఆటాడుకొని లేచి చూసే సరికి వంటింట్లో ఏదో
చేస్తున్నట్టుంది. డిస్ట్రబ్ చేయడం ఎందుకులే అని ప్రిడ్జ్ లొంచి ప్రూట్స్ తీసుకొని
ప్లేట్లలో పెట్టుకొని హాల్లో తింటూ...
పిల్లలకిస్తూ...టీవీ చూడటంలో మునిగిపోయా..అలా ఏదో ఓటి నముల్తూ ఉండగానే సాయంత్రం
అయిపోయింది. ‘పదండి ఈ బట్టలన్నీ ఆరేద్దాం’ అంటూ
మల్లీ బిల్డింగ్ ఎక్కించింది. అలా ఓ యాబై రౌండ్లు బిల్డింగ్ పై వాకింగ్ చేశాక
కిందికొచ్చి, కాసేపు టీవీలో తలదూర్చా... మల్లీ పిల్లల గోల మెదలయింది. ‘డాడీ
అన్నయ్య కొడుతున్నాడు’ అంటూ అమాంతం ఎగిరి ఒళ్లోకి దూకాడు చిన్నోడు, ‘ఏయ్
ఆగరా తమ్మున్ని ఆడిపించాల్సింది పోయి ఎందుకు కొడుతున్నావ్రా’ అని
కొంచెం కోపంగానే పెద్దోన్ని మందలిస్తే... ‘ఏంటి డాడీ అసలు ఏం జరిగిందో
తెలుసుకోకుండా నన్ను తిడ్తావ్’ అని బుంగమూతి పెట్టి కోపంగా అటు తిరిగి
కూర్చున్నాడు పెద్దోడు, అయ్యో ఫీలయ్యాడే అని ‘అది
కాదు నాన్నా...’ అంటూ మెల్లగా అనునయించబోయా... ‘వాడు
పో డాడి, వాడేం తప్పుచేసినా ఏం అనవు, నన్ను మాత్రం తప్పులేకుండానే తిడ్తావు’ అంటూ
ఏడుపుమెఖం పెట్టాడు, ‘సరె సరె ఏడవకు, ఇగో ఈ ఫోన్లో కాసేపు ఆడుకో’ అని
వాడికివ్వగానే... చిన్నోడు ఆ... నాకు పోన్ కావాలి అని గోల చేయడం మెదలెట్టాడు,
వాడికి నచ్చచెప్పి రిమోట్ వాడి చేతిలో పెట్టి, ఇక అక్కడుంటే మనవల్ల కాదనుకొని
శ్రీమతి దగ్గరికెళ్లి, ‘వామ్మో ఎలా భరిస్తున్నావే వీళ్లని, ఎప్పుడు
కామ్గా ఉంటారో, ఎప్పుడు ఇళ్లుపీకి పందిరేస్తారో అర్థమవడం లేదు’
అన్నా... ‘మరిప్పుడు అర్థమయిందా ఇళ్ళాలి పనంటే ఎలా
ఉంటుందో... ఇటు ఇంటిని చక్కబెడుతూనే... పిల్లల్ని కంట్రోల్లో ఉంచడం ఎంత కష్టమో...’ ‘వామ్మో
ఏదేమైనా మగమహరాజులం, సంపాదిస్తాం, అనే మా మగాళ్ల ఫిలింగ్ ఎంత తప్పో అర్థమయింది.’
ఆరాదనా భావంతో వంగి మగువా నీకు సలాం అన్నా... దీవిస్తున్నట్టుగా ఫోజిస్తూ... ‘ఈ నిజాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకో భక్తా’ అంది.
మెల్లగా నవ్వుతూ హాల్లోకొస్తూ.... ‘నైట్ డిన్నర్కి చపాతి వద్దు ఏదైనా వెరైటీ
చేసుకుందామా...’ అన్నా... ‘హా
ఇప్పుడే కదా జ్ణానోదయమైంది, అంతలోనే.... మరిచిపోయారా....’ అంది.
ఇద్దరం ఒకేసారి నవ్వేశాం.
Gangadi Sudheer
9394486053
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి