28, నవంబర్ 2019, గురువారం

ఇగురం - కథ (Namaste Telangana 28.06.2020)ఇగురం

అరేయ్ మల్లిగా నాకెందుకో బుగులైతుందిరా, ఏమైందే గట్లనవడ్తివి, ఏమోరా యవసాయం ఇగురం రాలేదురా మనకూ, పుట్టినకాడ్నుంచి అదేపని జేత్తున్న బతకనీకే గింత గుంజుకుంటున్నం, అసలు మనం సరిగ్గ నేర్చుకొనే పంజేత్తున్నమంటవా, ఏందిరా గీ గోస మనకి, అగో గదేందే యాబై ఏండ్లు దాటినంక  పొద్దు కాట్లో కూచేవేల గట్ల మాట్లాడవడ్తివి, గిన్నేండ్లసొంటి ఎకరాకి పుట్టేడు నుండి పది పుట్లు పంట దీసేదాక అత్తిమి, ఏ పునాసలో పండించుకొనేదగ్గరినుంచి తెల్లటి వరన్నం పండియ్యవడ్తిమి, ఒంటెద్దు నాగలి నుంచి ట్రాక్టర్ తో ఒక్కపూటల్నే ఐదెకరాలు దున్నవడ్తిమి, మోటల తిప్పల నుండి కరెంటు మీటతోనే నీళ్లు పారియ్యవడ్తిమి గివన్ని ఇగురంతోని కాకపోతే ఎట్ల చేసినమే...” “అవ్ రా గివన్నీ పనివరుస ఇగురాలు, కానీ యవసాయంతో బతుకనేర్చిన ఇగురాలే అబ్బలేదురా మనకూ, అసలు యవసాయంతోని బతుకొచ్చంటవారా ,ఒకదిక్కు ప్రపంచకమంతా మస్తు మారిపాయే, టకినాలజంటా అన్నిటితో పాటు మన యవసాయంలోకిగూడా చొచ్చుకచ్చే, మరి మిగితా పనోల్లందరూ మంచిగనే ఉన్నరు రైతుల బతుకులకేమైందిరా గిట్లున్నర్, ఇంకా బట్టకి పొట్టకే ఏడ్వవడ్తిమి, ఏనకటినుంచి పంచుకుంటచ్చే సరికి పదుల ఎకరాలల్ల ఉన్న పొలాలు మన జమానా కొచ్చేసరికి ఒకటి రెండెకరాలకచ్చే ఇంక పోను పోను మన పిల్లలకియ్యనీకి ఏం మిగులుతదిరా... అందరి సంపాదన్లు పెరుగవట్టె మనయేమో తరగవట్టే, దినదినాము అడుక్కుపోవడ్తిమి ఇగురముంటే గిట్లెట్ల బతుకుతమురా, అవునే నువ్వంటుంటే అనిపిత్తుంది, గిన్నేండ్లుసంది పక్కోని కచ్చిన మార్పు మనకెందుకు రాలేదే, ప్రతోడు రైతులకోసమే అన్ని జేత్తున్నం  అనవట్టె, మరి మన బతుకులేమో పెనం మీంచి పొయ్యిలకెట్లవడ్తున్నయే, ఏమో మరి సర్కారోల్లు చేత్తున్నది కూడా గిందుకే గావచ్చు లేకుంటే పెద్ద పెద్ద సదువులు సదివినోల్లు రూపొందించే పథకాలు ఉత్తగనే పోతయా....ఇంతల్నే పక్కనే కూర్చొని వీళ్ల మాటలింటున్న ఈరయ్య అందుకొన్నడు అరే గట్లెట్లనే సర్కారు మనల్ని ముంచనీకి చూత్తదా, నీయవ్వ గమ్మతున్నయి మీ ముచ్చట్లు, మీరు చెప్పినట్టు గిప్పుడు మన కాయానికి కష్టమే తెల్వకపోవట్టే అన్నీ మిషన్లే చేయ్యవట్టె, గివన్నీ సర్కారేం చేయకుండానే అచ్చినయా, అప్పట్ల మన లోన్లన్ని మాఫీచేసిరి, మెన్నటికి మెన్ననే గదనే మనూర్ల ముగ్గురికి టాక్టర్లిచ్చే, నిన్ననేమో ఎకరానికిన్ని పైసలిచ్చె, మనం చస్తే భీమాగూడా రావట్టే గివన్నీ కన్పిత్తలేవాయే మీకూ, ఆ మాటలు విన్న మల్లయ్య ఆలోచనల పడ్డడు పరద్యానంగానే, అవ్ గదా గివ్వన్నీ మన రైతుల కోసమే చేయవట్టే.... గదేరా మల్లిగా నేనూ అంటున్న గిన్ని జేస్తున్నా మన బతుకుల్ల మార్పెందుకు లేదు, ఏడ బోతున్నయి గివన్ని, లోపమేడుంది గిట్ల మాట్లాడుతుండగానే ఈరయ్య కల్పిచ్చుకొని ఏందే ఏమన్న రాజకీయాల్లోకి బోదామనుకుంటున్నావా నీయవ్వ నడువ్ గీ పంచాయితి ఇప్పుడు తేలదు గానీ సక్కగా ఇంటికి పోదాం పండ్రీ పొద్దుపోయింది అనుకుంటూ లేచి వెల్లిపోయాడు, మెల్లిగా ఈరయ్య వెనకాలే ఇంటికి బయల్దేరాడు మల్లయ్య, ఇంకా అక్కడ చేసేదేం లేక ఆలోచనలు కట్టిపెట్టి ఇంటిదారిపట్టాడు రైతు,

        ఇంట్లో ఎల్ఈడీ బల్బు దాని మానాన అది వెలుగుతుంది, 21ఇంచెసే అయినా ఎవరు చూసినా చూడకున్నా ప్లాస్మాటీవీ రంగుల్ని చూపిస్తూనే ఉంది, తాతలు కట్టిన ఇల్లే అయినా మట్టిగోడల్లోంచి తెల్లటి సున్నం నున్నగా కన్పిస్తుంది, చూర్లో అక్కడక్కడ చిల్లులున్నా బెంగుళూరు గూణ సందుల్లో సిమెంట్ ఒద్దికగా అమరింది. ఇంటెనక ఇంపుగా లేకున్నా వానని తట్టుకొనే పైకప్పుతో పాయకానా పదిలంగానే ఉంది, సిమెంట్ జాలేట్లకచ్చి చేరింది. ఇంటిలోపల మట్టి నుండి శాభాష్ బండలలోకి మారింది, కోరినంత కట్నాన్ని ఇచ్చి బిడ్డ పెండ్లిచేసి పంపించి అప్పుని ఇంటికి తెచ్చుకొని జీవితమైతే గడుస్తుంది, గవర్నమెంట్లో కొంత ప్రైవేట్లో కొంత మెత్తమ్మీద కొడుకు పట్నంలో చదువు ముగించుకొని వ్యవసాయాన్ని శాశ్వతంగా వదిలేసి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు, ఈ మార్పులన్నీ చూస్తూ గివన్నీ మా అయ్య జమాన్ల లేవుగదా, నేనే చేపిచ్చిన గదా, మరి మార్పు రాలేదని నాకెందుకన్పిస్తుంది, డెవలప్మెంటంటే ఏంటీ బతుకు సుఖంగా సాగిపోవడానికి ఏర్పడవలసిన బాటే కదా, గుడ్డి దీపం నుండి ఎల్ఈడీ వెలుగు, ఆకాశవాణి నుండి స్టార్ స్పోర్ట్స్, గూనపెంకల నుండి బెంగుళూర్ గూణల మీదినించి దాబాల స్లాబుల దాకా, చెరువు చెట్ల తోపుల నుండి సురక్షిత మరుగుదొడ్డి దాకా ఈ ముప్పై ఏండ్ల కాలంలో మార్పులు బాగానే అచ్చినయి గదా మరి ఇంకా మనసులో నాకేమో తక్కువైంది అని ఎందుకన్పిస్తుంది, ఇది కాదా అభివ్రుద్ది ఇంకేం కావాలని నా మనసు కోరుకుంటుంది. ఒకటే ఆలోచనలు లేనోన్ని చూసి త్రుప్తి పడమని, ఉన్నోన్ని చూసి ఉరకలెయ్యకమని పెద్దోల్లు చెప్పనే చెప్పిరి, మరి నాకెందుకు ఇంకా ఏదో లేని వెలితి కన్పిస్తుంది, వానతోనో, బోరుతోనో  నీల్లున్నప్పుడు మూడెకరాలు లేనప్పుడు ఎకరా అయినా పారుతుంది గదా పంట చేతికైతే వస్తుంది గదా గట్ల వచ్చినందుకే గదా కనీస వసతులన్నా చేయించుకున్నా, గదేందో ప్రణాళికా సంఘమోల్లు చెప్పినట్టు రోజుకి ఇరవై రూపాయలకి పైనే ఖర్చుబెడ్తున్నా, అయితే నేను గరీబోన్నైతే కాదు, మరి నేనెవర్ని ఒవైపు కళ్లు మూతబడ్తున్న మనసు నిదుర పోనియ్యడంలేదు ఎలాగోలా అర్దరాత్రి దాటాక మసక నిద్దురలోకి జారిపోయాడు రైతు.
        తెల్లారగానే కసీరు దగ్గర జనాలు గుమిగూడారు అందరూ ఆ వైపే పరుగుతీస్తున్నారు ఇంతలో ఏమయిందో అనే కుతూహలంతో అక్కడి వెల్లిన రైతుకి గుండె ఆగినంత పనైంది. అక్కడ సర్పంచుతో పాటు ఆ శాఖ ఈ శాఖ అంటూ ఓ ఐదారుగురు అదికార్లు కూసున్నరు, అంతా హడావుడిగా వాల్లని అడుగుతుండ్రు, విషయం ఏంటంటే  గోదారి నీళ్లు మలపనీకి ప్రాజెక్టులు కడుతున్నరంటా... అండ్లనే మన మిడ్ మానేర్ నుంచి మలకపేటలకి నీళ్లు నింపడం కోసం కాలువలు తవ్వుతున్నరంటా.... ఆ కాలువకింద ఎవలెవల పొలాలు పోతయో వాళ్లందరినీ పిలిపిచ్చి మాట్లాడుతున్నరు ఆళ్లు. నీళ్లచ్చుడు ముద్దేనాయె మరి అవి ఎట్ల రావాలే భూమ్మీదికెయ్యే గదా... ఎవలో ఒకలు భూమియ్యకపోతే... వేలెకరాల పోలాలకి నీళ్లేట్ల రావాలే... ఐనా ఎనకటి లెక్క ఏ అడ్డికిపావుషేరో ఇత్త లేదుగదా సర్కార్, న్యాయంగ రావాల్సినన్ని పైసలియ్యనే వట్టే, ఆటితోటి ఇంకోదగ్గర పొలం గొనుకొని సాగు చేసుకొని బతుకుండ్రి, మీ బతుక్కేగదా గివ్వన్ని చేసేది. అంటూ సముదాయిస్తున్నడు ఎవలో పెద్దసారు, గాయిన చెప్పే మాటలు కూడా సబబే అన్పిస్తున్నయ్ కానీ నా పొలం కాలువకింద పోతదా అనే భయమైతే అయితనే ఉంది మనుసుల రైతుకు. గింతల ఏ ఏ సర్వే నంబర్లకెళ్లి కాలువ పోతదో చదివి ఇన్పించ్చిండ్రు... అమ్మయ్య కొంత మనసు నిమ్మలవడ్డది నా భూమైతే లేదు తియి అని గంతల్నే బాదనిపించింది ఇన్నెండ్లు నాతోటి ఎండకు వానకు ఎవసాయం చేసిన తోటి రైతుల భూములు పోవట్టే... అని.  ఏందో అర్థమయితలేదు. జరిగింది మంచికే... జరుగుతోంది మంచికే.... కానీ నాకయిన మంచేందో ఇంకా తెలువకపాయే అని గజిబిజి గట్లనే ఉంది లోపల.
        గిప్పుడు దుబాయ్ పోవుడైతే తగ్గిందిగని పూర్తిగా బందుగాలే... ఎన్నడో ఎనకట ఇరవై ఏండ్ల కింద తనతో ఆడుకున్న నర్సయ్య దుబాయ్ నుంచి తిరిగొచ్చిండని తెలువంగనే మాట్లాడిద్దామని పోయిండు మన రైతు, ఏంరా నర్సి మంచిగున్నవారా... అబ్బ ఎన్నెండ్లయిందిరా నిన్ను చూసి, అప్పట్ల యాడాది రెండేండ్ల కచ్చేటోనివి ఈ తాపా చానా దినాల తర్వాత అచ్చినవురా అని ప్రేమగా దగ్గరికి తీసుకొని అడిగిండు. అవునే అన్నా... ఇగ విసా కాన్షల్ చేయించుకున్ననే... మనూరికి కాలువ అత్తుందట గదా గందుకే గీన్నే యవుసం చేద్దాం అనుకుంటున్న అన్నడు నర్సయ్య. అగో గీ ముచ్చట నీ దాక అచ్చిందారా... గీడ గల్లీల ఏం జరిగిందో సముద్రాల ఆవలున్న మీకు చిటుక్కున తెలువవట్టే భలే అచ్చినయ్రా పోన్లు.  అవన్నా యవుసాయం ఎట్ల నడుస్తుందే అని కష్ట సుఖాలడిగిండు నర్సయ్య. ఏం యవుసమో లేరా... చేన్లు ఎండవట్టే, అమ్మితే దరల్లేవాయే... కొందామంటే అగ్గిపిరమాయే....రైతు చెపుతుండగానే...
పట్నంలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకొన్న నర్సయ్య కొడుకచ్చాడక్కడికి,. గట్లంటవేంది పెదబాపు గిన్నేండ్లు సరిగ్గా నీళ్లులేక పంటలు పండలే... కాలం కలిసొచ్చి పంటలు పండినప్పుడు వాటిని నిలువ చేసి దర అచ్చినపుడు అమ్మడానికి సౌలత్ లేకపాయే కానీ కాలం మారింది బాపు, మన తెలంగాణ మనకొచ్చింది. మెల్ల మెల్లగా ఒక్కొక్కటి మనముందుకత్తయి చూడు. నీ భూమిలకి గొదారమ్మొస్తది. సర్ధాపూర్ల గిడ్డంగిల నీ పంటని మంచిగ దాచుకోవచ్చు, నీ ఇష్టమున్నప్పుడు నీకు నచ్చిన దరచ్చినప్పుడే అమ్ముకోవచ్చు..
నీ మాటలు మంచిగున్నయ్ బిడ్డా ఇనడానికి గా ఆశతోనే బతుకుతున్నం, మారాలే మా బతుకులు గూడ మారాలే.. పంట పండించి పదిమంది కడుపునింపేటోల్లం, మా కడుపులు గూడా నిండాలే.. మాకా వయసయిపోతుంది. నీలాంటి పొట్టేగాళ్లుగూడా యవసాయం చేయనీకి రావాలే బిడ్డా... గా రోజులు రావాలే.. అనుకుంటూ అక్కడ్నుంచి భయల్దేరబోతుంటే... పెద పాలేరు కొమురయ్య ఉరికొచ్చి అన్న జల్డి మీనయ్య కొట్టంకాడికి పాండ్రి... ఆడ మీనయ్య ఉరేసుకున్నాడంటా... అంటూ ఉరికిపోయిండు. అందరం ఒక్కసారిగా కొట్టంకాడికి పరుగులు తీసినం. అందరూ గుమికూడి ఉండ్రు. నేలంతా రక్తపు మరకలు పడిఉన్నాయి. నాలుక వేలాడేసి ఉంది. మబ్బుల్నే ఎడ్లకి గడ్డేత్తా అనొచ్చి కొట్టంలనే ఉరేసుకున్నడు మీనయ్య. మెన్ననే రెండో బిడ్డ పెండ్లి చేసిండి. పాత అప్పులు కొత్త అప్పులు బాగా మీద పడ్డయ్.. ఎప్పుడు కలిసినా పొలాన్ని బేరానికి పెడుతా అనేటోడు, ఇప్పుడు కాలువ పోతుందని తెల్వంగనే బేలగా ఈ పని చేసిండు. గుండంతా బరువెక్కింది. ఆగపడ్డడు మీనిగాడు ఏదో ఓటి ఉన్నది ఇద్దరి బిడ్డలేనాయే పెండ్లిళ్లు కూడా అయిపాయే, గుండె దిటవు చేసుకుంటే సర్కారిచ్చే పైసలతో అప్పులు తీరకపోవునా... ఎంతపని చేసిండు అని బాదేసింది.

        కాలం గడుస్తూనే ఉంది. యవసాయంలో కొంచెం కొంచెం మార్పులొత్తున్నాయ్, సర్కారోల్లే పెట్టుబడి సాయం చేస్తుండ్రు, అవసరాల మేర పైసలు లోన్లత్తున్నయ్, కాలువల్లకి నీళ్లు ఇంకా ఇడువకున్న పైన చెరువుల్ని నింపడంతో బోర్లల్ల నీళ్లు పెరిగినయి, పంట ఎండిపోవుడు తగ్గింది. ప్రైవేటు అప్పులు లేకపోయేసరికి ప్రాణానికి హాయిగుంది. ఈ సాలుకు గిడ్డంగి తెరిచిండ్రు అప్పుల బాద లేదు కాబట్టి రైతు తన పంట పెసర్లని గిడ్డంగిల పెట్టిండు దరత్తదేమోనని. మంచి దరకే అమ్ముతననే నమ్మకం పెరిగింది. మెల్లగా ఆలోచనల్లోకి జారుకుండు రైతు... నిజానికి నా తెలంగాణ అచ్చినంకనే గివ్వన్ని మారినయ్ గదా... ఎంత ఖర్చు అయి ఉండొచ్చు వీటన్నింటికి... ఎప్పుడో ఇరవై ఏండ్ల కింద గీ ఖర్చు పెట్టుంటే మా మీనిగాడు మాతోని ఉండుగదా... గసొంటోల్లంతా పూర్తి కాలం బతుకుదురు గదా... మనుమండ్లు మనుమరాండ్ల జీవితాల్ని చూద్దురు గదా... ఏందో దేవుడు ఎవడేం చూడాల్నో గదే రాసిపెడ్తడు గావొచ్చు, మాగ్గావల్సింది పంట పండించడానికి భూమి, దాన్ని తడిపే నీరు, పంట చేతికొచ్చినంక సరైన దర, గీ మూడు మా చేతుల లేక ఇన్నేండ్లు అరిగోసవడ్డం, ఏ బతుకమ్మ పండుక్కో దసరాకో సంబరవడ్డం, ఇప్పుడిప్పుడే మాకన్ని దినాలు బతుకమ్మ పండుగలే అయితయనే నమ్మకం కలుగుతుంది. దసరాలాగా ప్రతీరోజు సంబురాలే చేసుకుంటమనే దీమా పెరుగుతుంది. సరే అయిపోయిన మా తరంల యవసాయం ఇగురం తెలువలేదనే బాదతో చాలా మంది రాలిపోయిండ్రు. రాబోయే తరంలా యవసాయం ఇలువ తెలుసుకొని బంగారం లెక్క బతుకుతరనే నమ్మకం కలుగుతుంది.
ఏమైందే అన్నా.... అన్న మల్లిగాని పిలుపుతో ఈ లోకంలోకచ్చిండు రైతు.. ఏం లేదురా ఏదో ఆలోచన అన్నడు, రా ఇంటికి పోదాం నా మోటార్ బండెక్కు అంటు ఎక్కించుకున్నాడు,  మల్లిగాడు ముసిముసిగ నవ్వుకుంటనే ఏమే ఇగురం నేర్చినావా లేదా... అని అడిగిండు. ఏమో రా నీ బండిమీద సరిగ్గనే కూసున్ననా నువ్వే చూసి చెప్పాలే ఇగురం అచ్చిందా... లేదా... అని... ఇద్దరూ పెద్దగా నవ్వుకుంటూ... వ్యవసాయం ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంటి దారి పట్టిండ్రు.


2 కామెంట్‌లు: