28, నవంబర్ 2019, గురువారం

స్వేచ్చే మా రణ నినాదం

అధైర్యం వద్దు
పోరాడటమంటే బతికుండడమే
ఎన్నెన్నో చూసినోల్లు
ఇబ్బందుల్ని ఫాబందీ చేసినోల్లు
ప్రయాణాన్నే మజిలీగా మార్చుకున్నోల్లు
గమ్యం తప్పక చేరతారు
గమనాన్ని ఆపకండి
తప్పో ఒప్పో సత్యానికి ఓటమి లేదు
నీకై నువ్వు మరణ శరణు వేడావంటే..
ఓటమొక్కటే కాదు,
నీ కోరికలోని న్యాయాన్ని నువ్వు ప్రశ్నించడమే?
అధైర్యం వద్దు...
అమరణ రణమే నీ తొలిపొద్దు.


ఇవాళ గెలుపెవరిదో.... 
గాయమెవరికో.....
అనేక బందనాల సంకెళ్లని తెంచుకొని
కలబడి నిలబడిన నా గానం
గొంతునొక్కితే ఆగిపోయే రాగ స్వరం కాదు మాది
స్వేచ్చనాపితే విస్పోటనం చూపే మంద్ర స్వరం వేడిది
ఎవరో విదిల్చితే ఏరుకునే ఎంగిలాకులం కాం
దిక్కార స్వరం తెలిసిన సమర శీలురం మేం
ఏనాటికైనా 
పోరాటమే మా అజెండా
ఆత్మస్థైర్యమే మా జెండా
స్వేచ్చే మా రణ నినాదం
సంఘర్షణే మా మరణ విదానం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి