4, అక్టోబర్ 2018, గురువారం

కొండగట్టు ప్రమాదం

మళ్లొస్తా మరి....
నిజంగానే తిరిగిరాని లోకాలకి వెళ్తారని తెలియదెమో
బిడ్డలకి మంచి చెడులు చెప్పలేదు
తల్లిదండ్రులకి జాగ్రత్తలు చూపలేదు
అన్నలని, అక్కలని,తమ్ముల్లని,చెల్లెల్లని
ఇరుగు పొరుగుని ఎవ్వలనీ తెరిపార జూడలేదు
అఖరికి కొండగట్టు అంజన్ననీ ఆర్తిగా అడగలేదు
ఇంట్లో చెప్పనైతే చెప్పారు మళ్లొస్తా మరి
అంతల్నే మృత్యు దేవత తరిమేసింది
లోయలోకి తోసేసింది
తలరాతనా పాలకుల గీతనా
డొక్కుబస్సులు, కాసుల మూటలు
రోడ్ల గుంతలు, కాంట్రాక్టర్ల పనులు
తుప్పు బ్రేకులు, తుస్సుల టైరులు
డ్రైవర్ల కునుకులు, అధికార్ల ఆశలు
కారాణాలేవైతేనేం
కాలిపోయేది మేమే కదా
మెమంటే మనుషులమయ్యా
ఓటర్లే కాదు
కేవలం ఓటర్లే కాదు
లోకాన్ని చూడని పసిగుడ్డులం
బోసినవ్వులతో ఆడుకోవాలనే పండు ముసల్లం
కాయానికి కష్టాన్ని చేర్చే శ్రమజీవులం
రేపటిపై ఆశలతో నిలిచే మనుషులం
కేవలం మనుషులం
ఎక్స్.గ్రేషియాలు ఓదార్పులు కాదు
మళ్లొస్తా మరి అని చెప్పనీయండి
ఆ భరోసానియ్యండి
రోజుకొక ప్రమాదం మామూలే అని కాదు
మీ మామూల్ల మత్తు వదలండి
పోయేది ప్రాణమే
ఒక్కసారి నీ ఇంట్లో విషాదాన్ని యాజ్జేసుకోండి
పోయేది ప్రాణమే
ఒక్కసారి నీ ఆప్తుల చావు చూడండి
పోయేది ప్రాణమే
ఒక్కసారి బాదితుల రోదన వినండి
మమ్మల్ని కాపాడండి
మనం అంటే మనుషులం
ఓటర్లే కాదు
కేవలం ఓటర్లే కాదు
మళ్లొస్తా మరి అని చెప్పనీయండి
అయ్యే వెళ్లొస్తా అంటే
ఎందుకు పంపానా అని ఎడిపించకండి
దారులు రక్త పిపాసులై
ప్రాణాల్ని దోచేస్తుంటే
దైన్యంగా చూడడం తప్ప
దైర్యవచనాలు చెప్పడం తప్ప
ఇంకేమీ చేయలేని ఈ సామాన్యున్ని క్షమించండి
శాశ్వత నిద్రలో శాంతించండి......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి