4, ఏప్రిల్ 2020, శనివారం

లాక్ డౌన్ (కథ) 02.02.2020 (sakshi 03.05.2020)



            ఎక్కడ చూసినా నిర్మానుష్యంగా ఉంది, మా సందులోంచి మెయిన్ రోడ్ ఎక్కానో లేదో పోలీస్ కానిస్టేబుల్ ఏం మాట్లాడకుండానే లాఠీ తీసుకొని ఒక్కటిచ్చాడు ముడ్డిపై, అయ్యే... అవ్వా అనుకుంటూనే ఎటునుండొచ్చానో అదే సందులోకి మళ్లీ దూరిపోయాను, ఇంట్లో బుడ్డోడు ఒకటే గోల బిస్కెట్లు కావాలనీ, పక్షమయింది ఇంట్లోంచి బయటకి రాక, సామానంతా అయిపోయింది, ఒక్క బియ్యం, కొంత పప్పు తప్ప మిగతావన్నీఇంచుమించుగా నిండుకున్నాయి, మా గల్లీలోని చిన్నచిన్న దుకాణ్లు ఎందుకొచ్చిన లొల్లని బంజేసుకొని వారమయింది. ఏ ముహూర్తం చూసుకొని వచ్చిందో ఈ మహమ్మారి దేశంలో తిష్టవేసుకొని కూర్చుంది, ఆ మాటకొస్తే దేశంలో ఏంటి మెత్తం దునియానే తన గుప్పిట్లో బందించింది. ఎక్కడ చూసినా లాక్ డౌన్లే, ఏ నోట విన్నా షట్ డౌన్లే, నావల్ కరోనా రక్కసి చేస్తున్న కరాళ న్రుత్యానికి రాజు, బీద అనే తేడా లేదు, కమ్యూనిస్టు, కాఫిటలిస్టు అనే మీమాంస లేదు, ఎక్కడో చైనాలో మెదలయి ఇటలీ మీదుగా అమెరికాతో పాటు ప్రపంచం మెత్తాన్ని కబలించి మన దేశానికి దూసుకొచ్చింది, ఒకప్పుడు నాయనమ్మ మాత్రమే దుశ్శకునం అని చూసే తుమ్ముకి నేడు ప్రపంచం మెత్తం గజ గజ వణుకుతుంది, దగ్గు, తుమ్ము తుంపర్లతో అంటుకుపోయే కరోనా వైరస్ భయటపడి మూడునెలలు దాటిపోయింది, మందు సంగతి దేవుడెరుగు దాన్ని రాకుండా ఆపే యవ్వారం తెలిసినా... ఆపలేక అపసోపాలు పడుతున్నాయి గవర్నమెంట్లు, పదిహేను రోజులు దాటింది లాక్డౌన్ ప్రకటించి, చేద్దామంటే ఉద్యోగం లేదు, తిరుగుదామంటే ఊరులేదు, ఇంట్లో బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీయడం తప్పా మరేం చేసే పరిస్థితి లేదు, పోలీసు కొట్టిన దెబ్బ సుర్రుమంటుంటే ఇంటిదారి పట్టబోయిన నాకు వెంటనే ఇంట్లో తినడానికి బియ్యం తప్ప ఏం లేవని, వంటసామాన్లతో పాటు బుడ్డోడు బిస్కెట్ల కోసం ఏడిస్తేనే బయటకొచ్చానని గుర్తుకొచ్చింది, కానీ దెబ్బ సుర్రుమని మండుతుంటే.. ఇంటికెళ్లి పక్కింటి కాంపౌండర్ రాజు ఎట్లాగూ హాస్పిటల్కి వెళ్తాడు కదా ఆయన్ని సామాను తెమ్మందామనుకొన్నా, కానీ పాపం తన సొంత ఇంట్లోకి చాయి తాగడానికి కూడా రాజు పోవట్లేదు, నిద్రాహారాలు మాని నాలుగురోజులకొకసారి ఇంటికొస్తుండు, ఆయనకే నేను సహాయం చేయాల్సింది పోయి ఆయనని అడగడం సరికాదనిపించి ఎలాగైనా సామాను తీసుకొద్దామని నిర్ణయించుకొని  చూట్టూ చూసా ఏ నరమానవుడూ కంటికి కనబడడం లేదు, ఏం చేయాలో పాలుపోని పరిస్థితి, ఇంతలో బండిపై రయ్యిమని దూసుకొచ్చి నా పక్కకే ఆగాడు ఎవరో... ఎక్కడనుండొస్తున్నారు అని అడిగా... శ్రీనగర్ కాలనీ అన్నాడు, ఏంటీ ఇంత దూరం ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అని అడిగా... ఆశీర్వాద్ గోదుమపిండికోసం పోలీసుల కళ్లుగప్పి వచ్చా అన్నాడు, ఏమన్నాడో కొంచెం సేపు అర్థం కాలేదు, నాకర్థమయ్యేలోపే రయ్యిమని ఎటునుండొచ్చాడో అటు దూసుకుపోయాడు, ఆశీర్వాద్ గోదుమ పిండికోసం వాడు పదికిలోమీటర్లు తిరుగుతుంటే.. నిత్యావసరాల కోసం నేను మా మెయిన్ రోడ్డెక్కలేనా అని నాకు నేనే దైర్యం చెప్పుకొని గల్లీ గల్లీ ల్లోంచి అతికష్టం మీద మెయిన్ రోడ్డుమీది సూపర్ మార్కెట్ దగ్గరకెళ్లా... అక్కడ జనాన్ని చూసి బిత్తరపోయా.. కిక్కిరిసిపోయి ఉన్నారు, ఒక పామిలీ సంవత్సరం మెత్తం తినే తిండి ఒక్కొక్కడే పాక్ చేయించుకొని బిల్లు కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తూ కనబడ్డారు, ఇక రేపట్నుండి ప్రపంచంలో అసలేం దొరకదన్నట్టుగా ఉన్నాయి ఒక్కొక్కడి మొఖాలు, బయటకొస్తున్న వాళ్ల మొఖాలు ప్రపంచ యుద్దంలో విజయం సాదించినట్టుగా ఉన్నాయి. పాపం అక్కడే మెట్ల కింద కూర్చొని అడుక్కుంటున్న అవ్వకి మాత్రం కనీసం తము కొన్నదాంట్లోంచి ఒక పండు కూడా ఒక్కలు తీసివ్వడం లేదు,   అసలు ప్రభుత్వం లాక్ డౌన్ చేసి ఆఫీసులు, సినిమాహాళ్లు, మాల్స్ అన్ని మూసేసి ఒకరికొకరు తాకకుండా.. కలువకుండా ఉండండి అని చెపితే.. ఇక్కడ మాత్రం వారం రోజులు ఇంట్లో కూర్చుని కలువలేకపోయిన వాల్లకి రెండింతలు ఒకలమీద ఒకలు పడిపోయి ఉన్నారు. అందులోకెలితే సామానుతో పాటు కరోనాని కూడా ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తుందని భయమేసి.. పక్కనే ఉన్న కీరాణ కొట్టుకెళ్లి కావాల్సిన సామాన్లు కొనుక్కున్నా... కూరగాయలు కొనుక్కొంటుంటే మా ఆవిడకిష్టమైన పాలకూర కోసం వెతికా.. కన్పించకపోయేసరికి ముందుకు పోదామనుకున్నోన్ని ఇందాకటి దెబ్బదగ్గర నొప్పి గుర్తొచ్చి ఆగిపోయా... వస్తుంటే చెట్టుకింద దీనంగా కూర్చున్న కుటుంబం కన్పించింది, పక్కనే బాగులున్నాయి, ఏంటీ ఇక్కడ కూర్చున్నారు అని అడిగా.. ఊరికోతున్నాం ఎండ బాగ కొడుతుంది గందుకే గీడ కూసున్నాం అన్నారు, ఏ ఊరు అని అడిగా, కన్యాగురం దగ్గర అన్నారు, వాళ్లని చూస్తే జాలేసింది, పాలకులు చెప్పారని చప్పట్లని తపేళాలతో,డ్రమ్ములతో వీదుల్లోకి గుంపులు గుంపులుగా చేరి సమైఖ్యతని తెలిపిన మన ప్రజలు, లైట్లార్పేసి థౌజండ్ వాలాలతో, మినుకుమనే రాకెట్లతో కాండిల్లని మించి వెలుగులు పంచిన మన జనాలు పాపం ఆకలితో చెట్టుకింద కూర్చున్న వీల్లకోసం కదిలిరాకపోవడం చూసి బాదేసింది, చేతిలో ఉన్న కొన్ని పండ్లు, బిస్కెట్లు ఇచ్చి  అక్కడినుండి ఇంటికి వెళ్తుంటే... పోలీసు చెక్ పోస్టు కనబడే సరికి ఇందాకె కొట్టిన దెబ్బగుర్తుకొచ్చి సందులోకి దూరి పోలీసులు ఎప్పుడు పోతారా అని అభ్జర్వ్ చేస్తూ కూర్చున్నా... నిజంగానే చాలామంది పని ఉన్నా లేకున్నా.. ఇంట్లో కూర్చోవడం కష్టమని.. టైం పాస్ కావడం లేదని కరోనా సీరియస్ నెస్ అర్థం చేసుకోకుండా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు, కొట్టేటోల్లని కొడుతుండ్రు, నచ్చచెప్పేటోల్లకి చెపుతుండ్రు, ఫామిలీ వాల్లకి హారతులిచ్చి మరీ కరోనా కష్టాలు చెపుతున్నారు, పాపం పోలీసోల్లకి క్షణం తీరకదొరకడం లేదు, దీనికి తోడు ఎవరికి కరోనా ఉందో తెలీదు, ఎక్కడ అంటుకుంటదో తెల్వదు, పాపం వాళ్లు కొట్టేదాంట్లో కూడా న్యాయముందీ అనిపిస్తుంది, ఎలాగోలా కష్టపడి ఇంటికి పోయేసరికి గుమ్మంలో మూడు రకాల బకెట్లతో ఎదురొచ్చింది మా ఆవిడ, ఒక దాంట్లో సబ్బునీళ్లు, ఇంకో దాంట్లో వేడి నీళ్లు, మరో దాంట్లో ఉప్పునీళ్లు, నా దగ్గర ఉన్న సామాన్లని తీసుకొని వేటిలో కడగాల్సినవి ఆ బకెట్లో పోసేసింది, ఎవరైనా ముస్లీంని కలిశావా అని అడిగింది, అదేంటి వింత ప్రశ్న అన్నట్టుగా మొఖం పెట్టా.. మల్లీ తనే వివరిస్తూ.. మనదగ్గర్నుండి మొన్నే డిల్లీలో మర్కజ్ దర్గాకి ప్రార్థనలకని పోయిన వాల్లకందరికీ వచ్చిందంటగా ఆ మాయదారి రోగం మరి వాల్లలో ఎవరైనా తాకారేమోనని అనేసరికి, కలువలేదన్నట్టుగా తల అడ్డంగా ఊపా..  చివరగా నా ముట్టుమయిలని తీసేస్తున్నట్టుగా బట్టలతోనే నాకు మడీస్నానం చేయించి ఇంట్లోకి రానిచ్చింది, అప్పటికీ మా బుడ్డోడ్ని మంచం కోడుకి కట్టేసింది, ఇంట్లోంచి బిస్కెట్లని ఏడుస్తున్నవాడు బయటకెందుకు రావట్లేదో అప్పుడర్థమయింది, మెత్తానికి ప్రదాని, ముఖ్యమంత్రి, ఇంకా టీవీల వాళ్ల కరోనాయనానికి ఫలితం కన్పిస్తుందనిపించింది, బట్టలు మార్చుకుంటున్నప్పుడు నా ముడ్డిమీంచి నడుము వరకూ కన్పిస్తున్న వాతని చూసి అయ్యే ఏమయిందని కంగారు పడుతూ దగ్గరకొచ్చింది శ్రీమతి, ఆదుర్థా పడుతూనే... టీవీ, సోషల్ మిడియా గాసిప్పులతో మెహం వాచి ఉన్నదేమో నా దెబ్బనుంచి మెదలు బయటి సంగతులన్నీ అదేపనిగా అడుగుతూనే ఉంది, పనిలో పనిగా రేషన్ ఇస్తున్నారేమో కనుక్కోకపోయారా... గవర్నమెంట్ ఇస్తానన్న డబ్బులు చేతికిస్తారా.. బాంకులో వేస్తారా... అంటే చేతికిస్తే డబ్బులతో కూడా కరోనా వస్తుందంటున్నారుగా.. మనం అకౌంట్ ఇచ్చామా రేషన్ కార్డులో...ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం కోసం ముందు వాడి కట్టిప్పి బిస్కెట్ ఇవ్వు వాడికి లేదంటే వాడి అల్లరికి ఓనరోల్లచ్చి లొల్లి లొల్లి చేస్తారు అనేసరికి ఆగిపోయింది, ఇంతలో ఒకటో తారీఖు అయిపోయి మూడ్రోజులయిందన్న విషయం గుర్తుకొచ్చింది, ఇంటి ఓనర్తో పాటు పాలవాడు, కేబుల్, కరెంట్, గ్యాసు ఇలా ఒకరేమిటీ పెద్ద క్యూనే కనిపించేలా ఉంది, పాపం పోపులపెట్టెలో, బియ్యం డబ్బాల్లో దాచుకున్న రెండువేలతో మరో పదిరోజులకి సరిపడా సరుకుల కోసం ఇందాకే ఇచ్చింది తను, ఇక ఎందుకైనా మంచిదని ఇవ్వాల్సిన వాల్లకు ఇవ్వకుండా అకౌంట్లో దాచుకున్న ఐదువేలే మిగిలాయి, అవి కిరాయికి సరిపోతాయి, మిగతా వాళ్ల సంగతేంటో అర్థం కావడం లేదు, జీతం వస్తుందో రాదో ఇంకా క్లారిటీ లేదు, గట్టిగా అడగుతే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనే భయం, హే రామ్, అల్లా, జీసస్ ఏంటీ క్లిష్ట పరిస్థితి, ఈ గండం నుంచి మానవాళి బయటపడదా అనుకుంటూ ఉండగానే.. పిల్లాడి కట్లు విప్పి చేతులు సబ్బుతో కడిగి తీసుకొచ్చి ఒల్లో కూర్చోబెట్టింది, వాన్ని పట్టుకొని రిమోట్తో న్యూస్ ఛానల్ పెట్టా... టీవీలో కుప్పలు కుప్పలుగా వలసపోతున్న కూలీలు కన్పించారు, కూలీ చేయడానికి పని లేకా, ఉండడానికి వసతి లేక, తినడానికి తిండిలేక సొంతూరుకు పయనమైన కూలీలు వాల్లు, వందల, వేల కిలోమీటర్లు ఎర్రటి ఎండలో తినడానికి తిండిలేక, అక్కడక్కడ దాతలు, పోలీసులు అందించే పులిహోర పొట్లాలతో రోజుల తరబడి నడుచుకుంటూ పోతున్నారు, దయనీయంగా కన్పిస్తోంది పరిస్థితి, సోషల్ మిడియాలో చేతులు కడుక్కొండి, సోషల్ డిస్టెన్స్ మెంటేన్ చేయండి అని పదే పదే మొత్తుకునే సెలబ్రిటీలు, గవర్నమెంట్లు లక్షలాది జనం చిన్నా పెద్దా తేడాలేకుండా అలా రోడ్లమీదకొస్తుంటే ఎక్కడి వాళ్లని అక్కడ ఒకచోటకి చేర్చి ఇంత అన్నం ముద్ద పెట్టడానికి ఎందుకు తటపటాయిస్తున్నారో అర్థం కావడం లేదు, అగమేఘాల మీద విదేశాలకి విమానాలని పంపి రోగంతో కూడిన వాళ్లని ఇంపోర్టు చేసుకోవడం మీద చూపిన శ్రధ్ద, కనీసం ఎర్రబస్సులు పెట్టైనా ఈ కూలీ జనాలని సొంతూర్లకి తరలిద్దామనే ద్యాస రాకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది, ఇక్కడ పుట్టని రోగాన్ని జనవరి నుండి ఎక్కడికేల్చో ప్లైటెక్కి తీసుకొచ్చే లక్ష మందిని కంట్రోల్ చేసుంటే ఇవ్వాళ దేశమంతా ఇలా లాక్ డౌన్లోకి పోయే పరిస్థితి వచ్చేదా అని సోషల్ మిడియాలో రాజకీయ నాయకులు చేస్తున్న గోలలో విషయముందీ అనిపిస్తుంది,  ఇంత బాదలో మిశ్రా గుర్తొచ్చాడు, ఒక్క క్షణం నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంబించింది, బీహార్ నుండొచ్చిన మిశ్రా మా కన్ట్రక్షన్ కంపెనీలో కాంట్రాక్ట్ మేస్రీగా పనిచేస్తున్నాడు, చాలా మంచోడు, ఎదుటోని కష్టానికి చలించే మనిషి, ఆయన ఆద్వర్యంలోనే  ఓ పదిమందిదాక పనిచేస్తున్నారు, అందులో అతని భార్య కూడా ఉంది, తనలాగే ఓ చిన్న పాపకూడా ఉంది, పని ఆగిపోవడంతో లాక్ డౌన్కి ముందే అన్నాడు సొంతూరికి వెల్లిపోతానని. ఎక్కడున్నాడో అనిపించింది, వెంటనే ఫోన్ తీస్కొని డయల్ చేశా.. అదేంటో మనకి అదుర్థా ఉన్నప్పుడు పోన్ అస్సలు కలిసి సావదు, అలా కొట్టగా కొట్టగా పోన్ కలిసింది, హలో మిశ్రాజీ ఎక్కడున్నావ్ అని అడిగా.. చాలాసేపు ఏం మాట్లాడలేదు, గొంతు జీరబోయినట్టుగా మెల్లగా తెలంగాణా బార్డర్లో అన్నాడు, ఎలా వెళ్తున్నావ్ అని అడిగా... నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నాడు, నీతో పాటు ఎవరెవరు ఉన్నారు, అందరూ బాగున్నారు కదా... బాగుండడం కాదు జీ ఎందుకు భయల్దేరామా అని భయంగా ఉంది, అసలు మా ఊరుని మా వాల్లని చూస్తామన్న నమ్మకం సన్నగిల్లుతోంది, కరోనాతో కాదు, కడుపుమాడి చచ్చేలా ఉంది పరిస్థితి, వేల మంది జనం, బార్దర్ దాటనీయడం లేదు, ఒక్క వెహికిలూ లేదు,  పులిహోర పొట్లాలతో కడుపునింపుకుంటున్నాం, ఏది కొందామన్నా చాలా రేటుతో అమ్ముతున్నారు, అమ్మాయి పాలకోసం కూడా ఇబ్బంది పడుతున్నాం... మిశ్రాజీ దైర్యం కోల్పోవద్దు, ఏం కాదు అంతా మంచే జరుగుతుంది, మరి ఒకరికొకరు దూరంగా లేకపోతే ఇంకా ఇబ్బందే కదా అని అడిగా... దూరంగా కాదు తాకకుండా ఉండడానికి కూడా జాగాలేదు, పోన్ చార్జింగ్ పెట్టుకోడానికి కూడా కష్టంగా ఉంది,అన్నాడు,  డబ్బులు ఉన్నాయా.. ఏదన్నా వెహికిల్ మాట్లాడుకొని పొరాదు అన్నాను, హా.. జీ నిన్నటి నుండి కొంచెం వెహికిల్స్ తిరుగుతున్నాయి కానీ ఇరవై వేయిలు అడుగుతున్నారు, పోతే పోనీ వెహికిల్ తీసుకొని పోరాదు, చేతిలో అంత డబ్బు లేదు, ముందు డబ్బులిస్తేనే కానీ వెహికిల్లో ఎక్కనివ్వడం లేదు, మిశ్రాజీ మరేం పర్లేదు నా దగ్గర ఉన్న ఐదువేలు పంపిస్తాను సరిపోతాయా... ఇంకా ఏమన్నా అరేంజ్ చేయమంటావా.... సరిపోతాయి జీ.. బతికుంటే ఖచ్చితంగా నీ రుణం తీర్చుకుంటాను అని జీరబోయిన గొంతుతో అన్నాడు, ఒక్కసారిగా కండ్లలోకి నీళ్లొచ్చాయి. పోన్ కట్ చేసి మిశ్రా అకౌంట్లోకి డబ్బులు పంపించి కుర్చిలో అలా జారగిల పడి కూర్చున్నా... ఏంటో మనిషి సంఘజీవి అని పేరుకే కానీ... పక్కోడికి ఆపదొస్తే.. దాన్ని అదనుగా తీసుకొని అడ్డగోలుగా రేట్లు పెంచి సంపాదించుతూనే ఉంటాడు, చివరికి మాయదారి రోగాలు ముసురుకొని చచ్చిపోతానని తెలిసినా... తన దగ్గర ఉన్నదంతా తనే తినాలని చూస్తాడు కానీ, పక్కవాడికి సహాయం చేయడానికి ముందుకురారు, మామూలు అప్పుడు ఎలా ఉన్నా.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ స్పందించనివాన్ని కరోనా తీసుకుపోవడమే న్యాయమేమో..... ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో.. అయిపోయాక నా ఉద్యోగం ఉంటుందో..ఉండదో..అనే దిగులు మనసుని ఆవరించింది, అంతలోనే టీవీలో కితకితల ప్రోగ్రామ్ చూస్తూ పల్లికిలిస్తున్న మా బుడ్డోడి నవ్వులని చూసి ఈలోకంలో కొచ్చా... నేను ఆ ప్రోగ్రాములో లీనమయ్యా....
గంగాడి సుధీర్ (02.04.2020)
9394486053.
అవునూర్, రాజన్న సిరిసిల్ల.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి