‘నాన్న ఆకలౌతుంది, అన్నం తిందామా’...
అని చేతిని పట్టుకొని ఊపుతూ అడుగుతున్న ఆరేళ్ల కొడుకు శ్రీజన్ మాటలతో ఈ
లోకంలోకొచ్చాడు సుధీర్, ‘ఆ తిందాం బేటా... ఇంకా రెండు కాలేదు కదా... చిన్న
ముళ్లు రెండు మీదికి రాగానే తిందాం’ అంటూ గోడకి వేలాడుతున్న పగిలిపోయిన గడియారం వంకా
చూపిస్తూ చెప్పాడు సుధీర్, ‘ఆకలైతే అన్నం తినాలని చెప్పావు కదా... మరిప్పుడు
రెండింటికి ఎందుకు తిందామంటున్నావు’ అంటూ
గతంలో సుధీర్ చెప్పిన సంగతిని గుర్తుచేసుకుంటూ మల్లీ అడిగాడు శ్రీజన్, ‘హా
అవును బేటా కానీ మన ప్రదానమంత్రి చెప్పాడు కదా రోజుకి రెండు పూటలే తినాలని అందుకే
రెండింటికి తిన్నావనుకో రాత్రిదాకా ఆకలి కాదు’ అని
కొడుక్కి నచ్చచెప్తున్నాడు. కానీ అసలు విషయం ఇంట్లో అన్నీ నిండుకున్నాయి, ఇవాలో
రేపో అన్నట్టుంది సామాన్ల పరిస్థితి అందుకే వాటి ఆయుష్షు రెండురోజులు పెంచుతూనే...
మెల్ల మెల్లగా ఆకలికి తట్టుకునే అలావాటు చేస్తున్నాడు కొడుక్కి. ఎక్కడో కరీంనగర్
జిల్లాలోని మారుమూల పల్లెటూరు ఆవునూర్లో పుట్టిన సుధీర్ పన్నెండో తరగతి వరకి చదివి
ఆ తర్వాత చదివే స్థోమత లేకపోవడంతో, తండ్రి ద్వారా సంక్రమించిన ఎకరా పొలాన్ని
ఆయనకొచ్చిన బిమారీ తగ్గించడానికైన అప్పుల కోసం అమ్మేసి, ఉన్న
ఊల్లో బతుకుదెరువు లేక పెళ్లైన ఏడే హైదరాబాద్ మహానగరంలో భవన నిర్మాణ కార్మికుడిగా
పనికి కుదిరి కాంక్రీట్ మిక్చర్ ఆపరేటర్గా కుదురుకున్నాడు, పెళ్లాం
ఇండ్లలో పాచిపనులు చేస్తూ అసలుకు కొసరు జమచేస్తుంది. పోయిన పొలం తనతో పాటు
తండ్రిని కూడా తీసుకెళ్లింది, ఊర్లోని పెంకుటిల్లుని, తనని నమ్ముకున్న బిడ్డని
వదిలి రానంటూ తల్లి అక్కడే ఉండిపోయింది, ఉన్న ఒక్క చెల్లెలు భర్త దుబాయిలో పనికోసం
పోయి దశాభ్దం దాటిపోయింది, మెదట్లో అరకొరగా పంపిన పైసలు ఐదేళ్లుగా ఆగిపోయాయి,
మనిషి ఉన్నాడో లేడో తెలియదు. ఒకప్పుడు ఎంతో కొంత దాచుకున్న సుధీర్ కుటుంభం ఆర్థిక
సంస్కరణల ఫలితమో... అభ్యున్నత సంఘ నియమమో తెలియదు కానీ రెక్కాడితే కానీ డొక్కాడని
స్థితికి చేరుకుంది, లక్షల కోట్ల బడ్జెట్లు, డజన్ల కొద్ది సంక్షేమ పథకాలు ఏ దిశగా
పనిచేస్తున్నాయో.... యూనివర్శిటీల్లో గొప్ప గొప్ప పరిశోదకులు చూపే సంస్కరణల అంతిమ
లక్ష్యం ఏంటో సుధీర్ లాంటి లక్షలాది కుటుంబాలు నిరూపిస్తున్నాయి. ఏ క్షణం ఎలా
ఉంటుందో తెలియదని ఎందుకైనా మంచిదని దాచుకున్న రెండువేలు కాస్తా కూర్చొని తింటే
కొండలైనా కరిగిపోతాయనే సామెతని నిజం చేస్తూ నెలరోజులకే అయిపోయాయి. కొడుకు పేరు
రేషన్ కార్డులో ఎక్కించమని ఎన్నిసార్లు విజ్ణాపన పత్రాలిచ్చిన పాపం వాడు పుట్టాడనే
సత్యాన్ని నమ్మని అదికారులు ఆ పనిచేయలేదు. కాయకష్టం చేసే శరీరం శ్రమకి తగ్గ
ఆహారాన్ని అందించేంత వరకూ నిద్రపోనిచ్చేది కాదాయే... దాంతో ప్రభుత్వం ఇచ్చే
పన్నెండుకిలోల బియ్యం పన్నెండు రోజులకి సరిపోతే మిగతా ఇరవై కిలోలు రేషన్ షాపు
ముందు నిలబడి మూడువందలకి కొనుక్కొచ్చుకొని తినే పరిస్థితి. పెళ్లాం మెగుడు కష్టపడి
పనిచేసిన కూలీ గుడిసెకి ఎక్కువ ఇంటికి తక్కువ అనేట్టుండే ఇంటి కిరాయికి, ఉప్పు,
పప్పు, నూనెలు కొనేందుకే సరిపోయే, ఇప్పుడు దానికి తోడు కరోనా విరుచుకుపడింది.
బతుకుని దుర్భరం చేసింది. ‘నాన్నా చిన్నముళ్లు రెండుమీదికొచ్చింది’ అంటూ
తండ్రి తలని పట్టుకొని గడియారం వంక తిప్పి చూపాడు కొడుకు, టీవీల్లో చూపిస్తున్న
మాస్కులు తనకూ కావాలని మారం చేస్తున్న కొడుకు కోసం తన చీర కొంగుని చింపి
మాస్కులాగా కుడుతున్న తల్లి గడియారం వంక కళ్లలోని నీటిపోరని చెరిపేస్తూ చూసి
పన్నెండులోని రెండు దగ్గర చిన్న ముళ్లు ఉండడాన్ని గమనించి, ‘మనం
రెండింటికి తిందాంలే... నువు రా బిడ్డా’ అంటూ అన్నం పెట్టడానికి లేచింది. ‘గదిగాదే
గీ కర్ప్యూ గిప్పుడప్పుడే అయేటట్టు లేదు, గిప్పట్నుంచే ఆకలికి ఆపడం అలవాటు చేస్తే’...
అని నసుగుతూ ఆగిపోయాడు సుధీర్, ‘ఆ రోగమేదో మనకొచ్చినా బాగుండు, సర్కారోల్లే రోగం
తగ్గేదాక పుణ్యానికే అన్నం పెడుతారంటా’.. అనుకుంటూ కొడుక్కి అన్నంలోకి చారు
కలిపి చేతికిచ్చింది, ‘అమ్మా ఇయ్యాల పులుసేనా’...
అనుకుంటూనే గబగబ తింటున్నాడు కొడుకు, ‘అన్నం మెత్తగయితుంది బిడ్దా గండ్లకి
పులుసైతేనే కమ్మగుంటది తిను’,’ బయట కూరగాయలు కొనాలంటే ఏసీలల్ల పనిచేసే
ఉద్యోగం ఉన్నోళ్లకే అయ్యేపని గాదు బిడ్డా.... గీ రోగం పోయినంకా పనికిపోయినప్పుడు
పెద్దసారింట్ల కేల్చి మంచి మంచి కూరలు తెత్త తియి బిడ్డా’ అంటూ
తన పన్లో నిమగ్నమయింది. ఇంట్లో ఊరికే కూర్చుంటే రేపట్నుంచి ఆకలిచావు
చావాల్సొస్తుందేమో అని బయమేసి ఎటెళ్లలో తెలియకున్నా ‘మెయిన్
రోడ్డుదాక పొయ్యత్త’ అనుకుంటూ బయటకి బయల్దేరాడు సుధీర్, ‘సరె
సరె గా కాంట్రాక్టర్ దగ్గరికిపోయి అప్పు దొరుకుద్దేమో చూడు, జాగ్రత్త పోలీసులు
కొడుతున్నరంటా దెబ్బలు తాకిచ్చుకొని వచ్చెవ్, గిప్పుడు గోలీలగ్గూడ పైసలు లెవు’ అని
జాగ్రత్తలు చెప్పింది. పెళ్లాం మాటలతో అప్పు దొరుకొచ్చూ అనే ఆశతో ఎటెల్లాలో
నిర్ణయించుకుండు సుధీర్, ఎప్పుడూ లీకయ్యే మోరీలోంచి దుర్గందం బస్తీ మెత్తం
వ్యాపిస్తుంది. మాడు పగలకొట్టే ఎండ, ఎక్కడా ఎవ్వరూ లేరు, అక్కడక్కడ కుక్కలు,
పందులు జాతివైరాన్ని మరిచి డొక్కతేలి సొమ్మసిల్లి పడుకున్నాయి అలా మెల్ల మెల్లగా
నడుచుకుంటూ కాంట్రాక్టర్ ఇంటివైపు నడుస్తున్నాడు, కాలనీలో ఇళ్లు దగదగ
మెరిసిపోతున్నాయి, ఎన్నెన్నో రంగులతో తీరిగ్గా పేర్చినట్టు అందంగా ఉన్నాయి,
వాటన్నింటిని చూస్తూనే ఇంత అందంగా ఇళ్లు కట్టిన మాకు ఇవ్వాళ్ల ఒక్క ఇళ్లు ఆసరా
ఇవ్వకపాయే అనుకుంటూ నడుస్తున్నాడు, అక్కడక్కడా కొన్ని ఇండ్లకి తాళాలు
వేలాడదీసున్నాయి, కాంట్రాక్టర్ ఇంటికి కూడా తాళం వేసుంది, లేబర్ని తీసుకెళ్లె
వ్యానులో మార్చి ఇరవైమూడో తారీఖునే ఊరెల్లాడని పక్కింటోళ్లు చెప్పారు, ఉన్న ఒక్క
ఆశ అడుగంటింది, ఆకలితో పేగులు నకనకలాడుతున్నాయి, ఒక్క పూట ఆలస్యమైతేనే
భరించలేకపోతున్నా అనుకుంటూ వెనుదిరిగి వస్తుంటే... కూడలి వద్ద జనం గుమిగూడి
ఉన్నారు, ఏమయిందో చూద్దామని అటువైపు వెల్లాడు సుధీర్.. అక్కడ అన్నదానం
చేస్తున్నారు, లైన్లో నిలబడ్డాడు సుధీర్, సామాజిక దూరం సంగతి దేవుడెరుగు, లైన్లో
జాగా దొరుకుతే చాలనుకుంటూ దూరుతున్నారు జనం, అందులో సగం మంది తమ బస్తీకి
చెందినవారున్నారు, వాల్ల వాలకం చూస్తూనే తెలిసేలా మిగతా కొంత మంది సుధీర్ లాంటి
వాల్లున్నారు, అయితే అప్పటికే వడ్డించుకొని తింటున్నవాల్లు ఎవరూ తమలాంటి వారు
కాదని తెలుస్తూనే ఉంది సుధీర్కి, మరి వాల్లెవరూ అని అరా తీస్తే... ఆ అన్నదాన
నిర్వాహక సంఘం వారంటా... ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ అన్నదానం చేసినా... ఇండ్లలో
వంట చేసుకోకుండా ముందు ఆ సంఘం వాల్లంతా వనబోజనాల్లా తిన్నతర్వాతే మిగిలిన
దాంట్లోంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారంటా... మెత్తానికి వాల్ల బోజనం
ముగిసింది, అసలు సిసలు అవసరార్థులకి వడ్డించడం మెదలైంది, పావుగంటైనా ఎంతకూ లైన్
కదలడం లేదు, ఏమిటా అని తొంగిచూస్తే... వడ్డించడం కన్నా పోటోలు తీయడం కోసమే ఎక్కువ
సమయం పడుతుంది. ఇప్పుడిదో పాషన్ అయిపోయింది, ఇచ్చేదానికన్నా సోషల్ మిడియాలో
చెప్పడమే ఎక్కువయింది, దానం తీసుకుంటున్నవాడికి అసలు ఆత్మాభిమానమే లేదన్నట్టు,
ఒక్క పూటకి దానం చేసి వాల్లని తరతరాలుగా పోషిస్తున్నట్టుగా చెప్పుకునే వీల్లని
చూస్తే... స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్ అన్న శ్రీశ్రీ మాటలకి
నిలువెత్తు నిదర్శనంలా అనిపించింది ఆ తతంగం, ఎలాగోలా తన కంచంలో అన్నం పడడంతో
ప్రాణం లేచొచ్చింది సుధీర్కి గబ గబా తిని, ఇంట్లో ఆకలితో ఉన్న భార్యా కొడుక్కి
కొంచెం ఏమైనా ఇంటికిస్తారేమోనని అడిగాడు నిర్వాహకుల్ని.. కసురుకుంటూ.. ‘ఎవలున్నా
ఇక్కడికే రమ్మను అంటూ తిట్టాడు’, ఇంతలో అక్కడే ఉన్న చదువుకున్న వ్యక్తి, ‘ఇంకా
జనాలు కూడా ఎవరూ లేరు కదా కొంచెం పెట్టివ్వండి, ఈ సమయంలో బయట తిరగడం ద్వారా కరోనా
వచ్చే అవకాశాలు ఎక్కువ కదా’ అనడంతో... నిర్వాహకుల్లోంచి ఒకడు పెట్టేది
ఒక్కపూటే అయినా... ‘మెత్తం వీడొక్కడి కుటుంబానికే పెడితే ఎట్లా...
అయినా బస్తీల్లో మోరీల పక్కన బతికేవాల్లకి కరోనా అంటినా ఏం కాదంటండీ టీవీల్లో ఎవడో
చెప్తుంటే విన్నా, ఇక్కడికే వచ్చి తీసుకుపోనివ్వండి’.. అని
పళ్లికిలించుకుంటూ నవ్వుతున్నాడు. ఆ మాటలు విన్న సుధీర్కి తన తోటి మనుషుల మీద
వెగటు పుట్టింది. ఒకడి దరిద్రాన్ని చూసి నవ్వుకుంటున్న సమాజంపై తీవ్రమైన ద్వేషం
కలిగింది, ఇన్నాళ్లు దరిద్రాన్ని అనుభవించినా... తన కాయకష్టాన్నే నమ్ముకొని
పనిచేసుకు బతుకుతున్న ఒక సామాన్య కూలీలో తొలిసారి నేనెందుకు ఆకలి చావు చావాలి.
ఇన్నాళ్లు నా శ్రమని దోపిడీ చేసి ఇవ్వాల కనీసం కనికరం కూడా చూపని ఈ సమాజాన్ని
నేనెందుకు దోచేయకూడదు అనే ఆలోచన కలిగింది.
ఇంటివైపు నడుస్తూనే... తాళం వేసిన ఇల్లలోకి ఎలా దూరొచ్చో గమనిస్తున్నాడు. అలా
కోపంతో.. ఆవేశంతో వెళ్తున్న సుధీర్ పక్కగా ఒక ఆటో వచ్చి ఆగింది. అందులోంచి ఓ
నడివయసు వ్యక్తి మూటకట్టిన సామాన్ల సంచిని తన చేతికందిస్తూ... ఇక్కడ రోజూ కూలీలు
చేసుకొనే ప్రజలు ఎక్కడుంటారు, నీకేమన్నా తెలుసా అని అడిగాడు, అప్పటిదాకా మనుషులపై
తీవ్ర ఆవేశంలో ఉన్న సుధీర్కి దేవుడు తనకోసమే ఇతన్ని పంపించాడేమో అనిపించి తన
బస్తీలోకి ఆటోని తీసుకెళ్లాడు, అక్కడ ఆకలితో నకనకలాడుతున్న తనలాంటి
కుటుంబాలకందరికీ పదిహేను రోజులు సరిపడా తిండి దొరికినందుకు చాలా సంతోష పడిపోయాడు.
ఖాళీ ఆటోని తీసుకెలుతూ...మీకిచ్చిన సామాను పక్షం రోజులకి సరిపోతుంది, అప్పటికీ
లాక్ డౌన్ ఎత్తేయకపోతే నేను మల్లీ వస్తా అని చెప్పి త్రుప్తిగా వెల్లిపోయాడు
పెద్దమనిషి, ఇంట్లోకి వెళ్తూనే... ‘లోకంలో మంచితనం బతికే ఉందే...కరోనా రోగం కన్నా భయంకరమైన మనిషిలోని ఆకలి రోగం లేవకముందే
దేవుడు భయపడిపోయాడే అన్నాడు’. ఆ మాటలు అర్థం కాకపోయినా... ‘మంచివాల్లకెప్పుడూ
మంచే జరుగుతుందండి’ అంటూ కొడుక్కి కూర వండడానికి పప్పుని కడుగడంలో
మునిగిపోయింది ఆ ఇల్లాలు.
గంగాడి సుధీర్
9394486053
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి