పోన్లో
కరోనా మెస్సెజులు చదివి చదివి బోర్తో పాటు భయం కూడా వేస్తోంది, చైనా వణికిపోతుంది,
ఇటలీ ఊడ్చుకుపోతుంది, అమెరికా ఆపలేకపోతుంది వంటి హెడ్డింగులు మరింత
భయపెట్టిస్తున్నాయి, మన దగ్గర ఏం లేకున్నా ఈ ఫార్వర్డ్ మెస్సెజిలు చదివితే రోగం
రావడం మాత్రం ఖాయం అనుకుంటూ.. టైం చూసేసరికి మూడవుతుంది. పోన్లో పడి టైం మర్చేపోయా...
‘సర్, ఎస్సై ఎప్పుడొస్తాడండి, నన్ను పన్నెండింటికే రమ్మన్నారు ఎంత సేపు
వెయిట్ చేయాలి, నేను ఊరెల్లాలి’, అని కొంచెం అసహనంతో అడిగాను కానిస్టేబుల్ని, ‘ఏంటయ్యా
నువ్వు ఊరికూరికే అడిగేతే వచ్చేస్తాడా...నీ ఒక్కపనే ఉంటుందా మాకు, చానా
పన్లుంటాయి, కూసొమన్నా కదా’ అని కానిస్టేబుల్ విసుక్కుంటుడగానే జీపొచ్చి
స్టేషన్ ముందు ఆగింది, లోపలికి వస్తున్న ఎస్సైకి సెల్యూట్ చేసి అతన్తో పాటు రూంలోకెల్లాడు
కానిస్టేబుల్. పది, ఇరవై, ముప్పై నిమిషాలయింది, ఇక ఉండబట్టలేక నేరుగా ఎస్సై
రూంలోకెల్లాను, నన్ను చూస్తూనే కానిస్టేబుల్ ‘కూర్చోమన్నా
కదా...లోపలికెందుకొచ్చావ్’ అంటూ గద్దించాడు, ఇంతలో ఎస్సై కల్పించుకొని ‘ఎవరితను’ అని
అడిగాడు, ‘అదే సార్ ఆ వెంకటాపురం పొలం గొడవ ఉందిగా...ఆ
లక్ష్మణ్’ అన్నాడు. ‘ఏరా
కబ్జాలు చేస్తున్నావా... కేసు బుక్ చేయమంటావా...చూస్తుంటే చదువుకున్నోని లెక్క
ఉన్నవ్, సిగ్గులేదురా’...అంటూ నా పేరు వినగానే తిట్ల దండకం
అందుకున్నాడు ఎస్సై, ‘ఏంటి సర్ నిజమేదో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు,
అది నా పొలమే, మేమే సాగు చేసుకుంటున్నాము, నేను హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీలో
పనిచేస్తాను, అంతేకానీ నేనేం కబ్జాకోరుని కాను’, ‘ఏం ఇన్ప్లూయన్స్
చేస్తున్నావా సినిమా ఇండస్ట్రీ అని, నువ్వెవడైతే నాకేంట్రా... వాడు నీ మీద
కంప్లైంట్ ఇచ్చిండు, సివిల్ మాటరేదన్నా ఉంటే కోర్టులో చూసుకోండి, ఇలా క్రిమినల్
ఆక్టివిటీస్ చేస్తే బొక్కలో ఎయ్యాల్సోస్తుంది’, ‘సర్
మీరొచ్చి ఎంక్వైరీ చేయండి, తప్పు ఎవరిదో తెలుస్తుంది, అంతేగానీ మీ
స్టేషన్కొచ్చినగదాని ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు, నాకూ చట్టం అంటే తెలుసు’, అని
కొంచెం సిరియస్గానే రిప్లై ఇచ్చాను, ‘చట్టం తెలుసుగదరా...మరి బొక్కలో
ఎయ్యిమంటవా... పొ పో ఏం పీక్కుంటవో పీక్కో, మల్లోసారి నీ మీద కంప్లైంటొచ్చిందో
ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా నా కొడకా... పొయి మీ సర్పంచ్తో కూసొని మాట్లాడుకోండ్రి
అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేయకుండ్రి. పో పో’ అంటూ
కసురుకున్నాడు. బయటకి వస్తూనే ఎస్సై అన్న మాటలకి విపరీతమైన కోపం వచ్చింది, ఈ నా
కొడుకులని సినిమాల్లో అందుకే విలన్లుగా చూపిస్తార్రా... డైరెక్టుగా వచ్చి
లోకువయిపోయా. ఏ లోకల్ లీడర్తోనో..ఎమ్మెల్యేతోనో పోన్ చేపిస్తే కానీ రెస్పెక్ట్ ఇవ్వడు
వరస్ట్ నా కొడుకు అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాను, పోన్ రింగవడంతో ఎవరా అని చూస్తే
ప్రొడ్యూసర్ దగ్గర్నుండి పోన్, ‘ఎక్కడున్నారు లక్ష్మణ్, మీరు చెప్పిన స్టోరీ లైన్ చదివాను,
బాగుంది రేపు సండే కదా ఒకసారి రండి కూర్చొని మాట్లాడుకుందాం’.
అన్నాడు. అప్పటివరకున్న కోపమంతా ఆవిరైంది, ప్రోడ్యూసర్ పోన్ చేసి మరీ కథ
చెప్పడానికి పిలిచాడంటే యాబై శాతం పని అయిపోయినట్టే. వెంటనే అమ్మకి పోన్ చేసి ‘హైదరాబాద్
వెళ్తున్నాను, అర్జంట్ పని పడింది, ఈ కేసు సంగతి నేను చూసుకుంటాలే’...
అంటూ హైదరాబాద్ బయల్దేరాను. రేడియోలోని ఎఫ్ ఎంలో పాటలు ఆగిపోయి మోడీ స్పీచ్
మెదలయింది,కరోనా కట్టడి కోసం ఒకరికి ఒకరు దూరంగా ఉండాలని చెపుతూ రేపు జనతా కర్ప్యూ
పాటిద్దామని అనౌన్స్ చేశారు మోడీగారు, ఇంట్లోకెళ్లే సరికి మా ఆవిడ జనతా కర్ప్యూ
సామాన్ల లిస్ట్ రాసుకొని మరీ తెచ్చుకుంది, ‘ఒక్కరోజు
కర్ప్యూకి ఇంత సామానెందుకు’ అని అడిగా... దానికి ‘అదేంటండి
మోడీ చెప్పిన దగ్గర్నుండి వాట్సాప్లో జనతా కర్ప్యూకోసం ఏమోం తెచ్చుకోవాలో
చెప్పారు, చూడలేదా’... అని అడిగింది, ‘సరె
సరె’ అంటూ స్నానం చేసి రేపు ప్రొడ్యూసర్కి వినిపించే స్టోరీనీ మరొక్కసారి
చూసుకున్నాను, ఆదివారం పదింటికల్లా ప్రొడ్యూసర్ ఇంటికి చేరుకుందామని రోడ్డెక్కాను,
జనాలు పలుచగా ఉన్నారు, రోజులో ఉండే ట్రాపిక్లో కనీసం రెండో వంతు కూడా ఎవరూ లేరు,
పన్లో పడి పట్టించుకోలేదు కానీ జనాల్లో కరోనా భయం సిరియస్గానే ఉందని అనిపించింది,
అక్కడక్కడా పోలీసులు నిలబడి ఎవరూ రాకుండా కంట్రోల్ చేస్తున్నారు, నా కార్ని కూడా
ఆపారు, మందులు తెచ్చుకోవాలి, మెడికల్ షాప్ కెల్తున్నా అంటూ సినిమాటిక్ అభద్దం
చెప్పి వాల్లని ఫూల్స్ని చేసి తప్పించుకొన్నాననే ఆనందంతో ప్రొడ్యూసర్ని కలిసి
స్టోరీ మెత్తం డిటైల్డ్ గా డైలాగ్స్ తో సహా చెప్పా. ఆయన కూడా ఇంప్రెస్ అయ్యాడు, అక్కడక్కడా
ఆయన కొన్ని కరెక్షన్స్ చెప్పి నెక్ట్స్ మీటింగ్ ఆపీస్లో టీంతో పెట్టుకుందాం అని
చెప్పాడు, చాలా హాపీగా ఇంటికి బయల్దేరా.. వెల్లేసరికి టీవీలో మల్లీ మోడీ
ప్రత్యక్షమయ్యాడు, ఎప్రిల్ పద్నాలుగు వరకూ దేశాన్ని లాక్ డౌన్ చేస్తున్నాం అని
చెప్పాడు, వెంటనే టీవీల్లో కలకలం చెలరేగింది, కొంపలు మునిగిపోతున్నాయనే రీతిలో
ఉదరగొడుతున్నారు యాంకర్లు, టీవీ కట్టేసి పడుకొన్నాను అప్పటికే అలిసిపోయి ఉండడంతో
మంచి నిద్ర పట్టింది. తర్వాత రెండు మూడ్రోజులు స్ర్కిప్ట్ వర్క్తో చాలా వేగంగా
గడిచాయి, ఎప్పుడూ ఒకటే పనితో ఉండడంతో కొత్త అయిడియాలు తట్టక ఆ పని పక్కన పెట్టి టీవీలో
న్యూస్ పెట్టాను, ఏవో చిన్న చిన్న కారణాలతో రోడ్లపైకి వస్తున్న జనాన్ని వెరైటీ
వెరైటీ శిక్షలతో పోలీసులు కొడ్తున్న ద్రుశ్యాలు చూపించారు, చీ ఈ శాడిస్టులు
అన్నింట్లో ఇంతే, క్రైం సీన్లో నైనా... కామెడీ సీన్లో నైనా కొట్టడమే వీరి పని అని
చీదరించుకున్నా... ఈ లోగా శ్రీమతి వేడివేడిగా మసాలా దోశ ఇవ్వడంతో తీసుకొని
తింటూ... నేషనల్గా ఏం జరుగుతుందోనని ఇంగ్లీష్ చానల్ పెట్టా... రోడ్ల నిండా
కుప్పకుప్పలుగా జనం, పనుల్లేక వందల వేల కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్న ద్రుశ్యాలు
కనిపిస్తున్నాయి, చిన్నచిన్న పిల్లలని మెడల మీద కూర్చోబెట్టుకొని, భుజాలకు సంచులు
తగిలించుకొని, పెళ్లాం పిల్లలతో, తల్లిదండ్రులతో పనులు లేక సొంతూళ్లకు పోతున్న వలస
కూలీలు వాళ్లు. దారిపొడవునా ఎవరైనా దాతలు దయతలిచి పెడితే తింటూ.. లేకుంటే
పస్తులతోనే నడుస్తూ... ఒక్కపూట తిండిలేక ఇంటిల్లిపాది పడుతున్న బాదలు చూస్తుంటే
చేతిలో ఉన్న దోశ తినాలనిపించలేదు, ఈ లోగా మా ఆవిడ చేతిలోని రిమోట్ లాక్కుంటూ, ‘సీఎం
మాట్లాడుతున్నాడంటా లైవ్లో’ అంటూ చానల్ మార్చింది, సిరియళ్లకి తప్పా అంత
ఆత్రంగా నా దగ్గర రిమోట్ తీసుకోని మా ఆవిడ న్యూస్ చానల్ పెట్టిందంటే ఏదో పెద్ద
విశేషమే ఉండి ఉంటుందంటూ ఆసక్తిగా చూశా... గంటసేపు సాగిన సీఎం ప్రసంగం అప్పుడే
అయిపోయిందా అనిపించింది, అంతకుముందు నార్త్ ఇండియాలో చూసిన హ్రుదయవిదారక
ద్రుశ్యాలతో కకావికలం అయిన మనసు, సీఎం దైర్యవచనాలతో కాస్త కుదుటపడింది, అందరికీ
నేనున్నాననే భరోసానిస్తూ...ఉచితంగా డబల్ రేషన్తో పాటు కూరగాయల కోసం అకౌంట్లో
డబ్బులు వేస్తానని చెపుతూ.. మైగ్రేంట్స్ని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాం...
అని దైర్యం ఇస్తుంటే కొంత ఉపశమనం కలిగింది, చివరగా ఆయన అన్న మాటలు నాలో ఆలోచన
రేకెత్తించాయి. సమాజం తన బాద్యత నిర్వర్తించాల్సిన సమయమిది, ఉన్నంతలో మన చుట్టూ
ఉన్న వాళ్ల కనీస అవసరాల్ని చాతనయినంతలో తీర్చమన్న ఆయన మాటలతో మా ఊర్లో బిల్డింగ్
పని చేసే కూలీలు గుర్తొచ్చారు, వెంటనే ఊర్లోవున్న రవిగాడికి పోన్ చేసి
వాల్లెంతమంది ఉన్నారో కనుక్కున్నా... కిరాణా దుకాణం వెంకటేశంకి పోన్ చేశా...ఒక్కొక్క
కుటుంబానికి నెలకి సరిపడే సామాన్లన్నింటినీ మూటలుగా కట్టి ఉంచమని చెప్పి వెంటనే
డబ్బులు ఆన్లైన్లో పంపించా... రవిగాడికి వాటిని తీసుకొని ఆ కూలీల కుటుంబాలకి
అందించమని చెప్పి పోన్ పెట్టేసా... కొంచెం త్రుప్తిగా అనిపించింది, వెంటనే ఈ
సామాను తీసుకుంటున్నప్పుడు వాల్ల కళ్లలో త్రుప్తిని చూడాలనిపించింది, కానీ
పోలీసులని తప్పించికొని వెల్లాలి కాబట్టి అప్పటికప్పుడే ఒ కథ అల్లుకున్నా, అలాగే
వచ్చేటప్పుడు ఊర్లో ఒక్కతే ఉన్న అమ్మని తీసుకురావచ్చని
వెంటనే రెడీ అయి సాయంత్రం వస్తానని శ్రీమతికి చెప్పి బయల్దేరా... మా ఊరు
నేనుంటున్న ఏరియాకి యాబై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా గల్లీలోంచి మెయిన్ రోడ్డెక్కగానే
పోలీసు నా ముందున్న బండిని ఆపాడు, వాడు ఏదో ఆశీర్వాద్ అటాకోసం వచ్చానని చెప్పడంతో
లాఠీతో ఒక్కటిచ్చి వెనక్కి పంపించాడు పోలీసు, నాముందే ఒకణ్ని కొడుతుంటే.. కొట్టే
అదికారం ఎవడిచ్చాడని అడగాలనిపించింది, నా దగ్గరికి రాగానే అలవోకగా అతనికి ముందే
సిద్దం చేసుకున్న అబద్దపు కథ చెప్పి వెల్లబోతూ..’కొట్టడం
ఎందుకండి, చెపితే సరిపోతుందిగా’ అన్నా.. ‘ఎవడింటున్నాడు
సర్ కొట్టకపోతే.. సమస్యని అర్థం చేసుకోకుండా ప్రతోడు ఏదో ఓ రీజన్ చెప్పి
తిరుగుతున్నవాడే, మేం రోడ్లమీద తిండీ తిప్పలు మాని పెండ్లాం పిల్లలని వదిలేసి
ఇరవైనాలుగ్గంటలు కాపాలా కాస్తుంది మాత్రం ఎవరి కోసం సార్, వాల్లకోసమేగా... ఇలా
అడ్డదిడ్డంగా తిరిగి రోగం అంటించుకుంటే వానితో పాటు వాని ఇంటిల్లిపాది మెత్తం
చస్తారు గదా’ అంటూ కుర్చీలో కూర్చోబోతున్నవాడు, ఇంకెవడొ
బండిమీద రావడం చూసి అటువైపెల్లాడు, ముందుకెళ్తుంటే రోడ్డుపై జనం అక్కడక్కడా
ఉన్నారు, కార్ రయ్యిమని దూసుకెళ్తుంది, సర్కిల్ దగ్గరికి రాగానే బారీకేడ్లు
అడ్డంగా ఉన్నాయి, కొంచెం మెల్లగా కారును పోనిచ్చాను, అక్కడో అయిదారుగురు
పోలీసులున్నారు, ఇంకో ముగ్గురు నలుగురు కొంచెం దూరంగా చెట్టుకింద నిలబడే టిఫిన్
తింటున్నారు, బారీకేడ్లు దాటుతుంటే అర్థమయింది, ఆ టిఫిన్ వాల్లు ఇల్లలోంచి
తెచ్చుకుంది కాదని, అక్కడే ఆపిన పోలీసుని అడిగాను, ‘ఇంట్లోంచి
బాక్సులు తెచ్చుకుంటున్నారా సర్’ అని, ‘ఏం బాక్సులయ్యా ఇంటికి పోక వారమయింది, ఎక్కడ
కరోనా అంటిస్తామో అనే భయంతో అసలు పిల్లల్ని కలవాలంటేనే బయమేస్తుంది. కంట్రోల్
రూంనుండే రావడం పోవడం. బోజనం కూడా అక్కడినుండే వస్తుంది, అన్ని ఏరియాలు కవర్ చేయడం
వాల్లకి కూడా కష్టమే కదా... అందుకే ఒక్కోసారి అట్లా ఎవలన్నా దాతలు ఇస్తేనే తినేది’ అంటూ
వాల్లని చూపించాడు, ఎందుకో మెదటిసారి నాకు సిగ్గేసింది, ప్రతీసందర్భంలో పోలీసుల్ని
తిట్టుకునే నాకు తొలిసారి అలా ఆలోచించినందుకు అదోలా అనిపించింది. సొంత పిల్లల్ని
కూడా మన:స్పూర్తిగా హత్తుకోలేని పరిస్థితుల్లో డ్యూటీ చేస్తున్న అసలు సిసలు
వారియర్స్ వాల్లే అనిపించింది. ఇంతలో పెట్రోల్ బంకులోకి పోయి పెట్రోల్
కొట్టిస్తుంటే... బంకు బయట ఒక పోలీసు అక్కడ అడుక్కుంటూ ఉండే ముసలాయనకి పండ్లు,
బ్రెడ్డు ఫాకెట్లిస్తున్నాడు. బంకు పిల్లాన్ని అడిగితే.. ‘ఈ
ముసలోడు ఇక్కడే అడుక్కుంటూ ఆ గుడిసెలో ఉంటాడండీ...ఇప్పుడెవరూ రావడం లేదు కదా..
పాపం ఈ పోలీసుల్లే ఆ ముసలాడికి అప్పుడప్పుడు తినడానికేమైనా ఇస్తుంటారండీ’
అన్నాడు. అలా ముందుకు సాగుతున్న నాకు
ప్రతీ జంక్షన్లో, చెమటలు కక్కుతూ... మాసిపోయి నలిగిపోయిన బట్టలతో కన్పిస్తున్న
పోలీసుల్ని చూసి కళ్లలో నీల్లు తిరిగాయి. యువకుడైన కానిస్టేబుల్ నుండి, పండిపోయిన
హెడ్ కానిస్టేబుల్ వరకూ అందరూ అలా రోడ్లపై గంటలు గంటలు సమాజం బాగుండాలని నిలబడే ఉండడం
చూసి వాల్లకి మనసులోనే సెల్యూట్ చెప్పుకున్నా. ఊర్లో డిస్ట్రిబ్యూషన్ అయ్యాక
అమ్మతో వెజిటబుల్ బిర్యానీ వండించి పాకెట్లలో పాక్ చేసుకొని వస్తూ... కనబడ్డ ప్రతీ
జంక్షన్లో పోలీసులకి వాటిని అందిస్తూ వచ్చా... రేపనేది ఉంటుందనే ఆశతో సమాజంలో
రూపాయి రూపాయి కూడబెట్టుకొని అందులోంచి ఓ పదిరూపాయలు అదే సమాజానికి అందించి ఎంతో
సేవ చేశామని త్రుప్తి పడుతున్నాం మనం. కానీ తమ జీవితాల్నే పణంగా పెట్టి సమాజం కోసం
పనిచేస్తున్న ఈ అసలైన వీరులదే కదా నిజమైన సేవ.
sudheer gangadi9394486053
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి